పెద్దాపురం
పెద్దాపురం పట్టణం, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రసిద్ధ పురాతన మునిసిపల్ పట్టణం.
భౌగోళికం[మార్చు]
పెద్దాపురం పట్టణం17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
జనాభా[మార్చు]
2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం పట్టణ జనాభా 45,174. ఇందులో 49% మగవారు 51% ఆడవారు ఉన్నారు. పెద్దాపురం పట్టణంలో అక్షరాస్యతా శాతం 63%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 66%,, స్త్రీల అక్షరాస్యతా శాతం 59%. 6 సం.ల లోపు ఉన్న పిల్లల శాతం 11%.
కాశీయాత్ర చరిత్రలో[మార్చు]
ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీయాత్ర చరిత్రలో పెద్దాపురము గ్రామ ప్రస్తావన ఉంది. ఆ పుస్తకంలో పెద్దాపురం గురించి ఆయన ఇలా రాసారు:
"పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. 100 బ్రాహ్మణుల యిండ్లు ఉన్నాయి. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా 3 లక్షలది. అంగళ్ళు ఉన్నాయి. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో 3 సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని ఒక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను."
మొత్తము | |
---|---|
మొత్తము జనాభా: | 45,174 |
పురుషులు: | 22,308 |
స్త్రీలు: | 22,866 |
6 సం. లోపు పిల్లలు: | 4,815 |
6 సం. లోపు మగ పిల్లలు: | 2,453 |
6 సం. లోపు ఆడ పిల్లలు: | 2,362 |
మొత్తము అక్షరాస్యులు: | 28,271 |
మొత్తము నిరక్షరాస్యులు: | 16,903 |
ప్రాశస్త్యము[మార్చు]
పెద్దాపురం ఒక సాంస్కృతిక, చరిత్రక పురాతన పట్టణం. పెద్దాపురం పట్టణంనకు మునిసిపాలిటి హొదా 1915 లోనే ఇవ్వబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భీమునిపట్టణం తరువాత రెండవ అతి పురాతన మునిసిపాలిటి.
పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ తల్లి దేవాలయం[1][permanent dead link] ఉంది. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసములోఒక నెల పాటు జాతర జరుపబడును. ఈ ఆషాఢ మాసము మొత్తం పెద్దాపురం పట్టణంలో పండుగ వాతావరణము కనపడును. ప్రతీ ఆదివారం పట్టణంలోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరము జరుపుదురు.
- పెద్దాపురం సిల్కు.[permanent dead link] చీరలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.
పెద్దాపురం పట్టణంలో ప్రతి ఆదివారం జరిగే *పెద్దాపురం సంత[permanent dead link] ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. బ్రిటిషువారి కాలం నుండి ఇక్కడ అనాదిగా వర్తకము జరుగుచున్నది. చుట్టు ప్రక్కల గ్రామంల వారు ఈ సంతలో వస్తువులు కొనుగోలు చేయుదురు.
పెద్దాపురానికి సామర్లకోట అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను.
పెద్దాపురం పట్టణంలో *జనాబ్ మదీనా పాష్ఛా ఔలియా ( తొమ్మిది మూరల సాహెబ్ ) దర్గా[permanent dead link] ఉంది. ప్రతీ సంవత్సరం జనవరి నెల 20వ తారీఖున గందోత్సవము (ఉరుసు) జరుగును. కుల, మత తారతమ్యం లేకుండా అన్ని మతములవారు ఈ ఉత్సవములో పాల్గొందురు.ఈ ప్రదేశము దర్గా సెంటర్ అని ప్రసిద్ధి చెందినది.
ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రాగి, కర్ర పెండలం మీద పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం పరిధిలోకి వస్తుంది.
19వ శతాబ్దములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే *లూధరన్ హై స్కూల్[permanent dead link] స్థాపించబడింది.
పెద్దాపురం పట్టణంలో బహుళ ప్రాశస్త్యము పొందిన రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల ఉంది. దీనిని 1967 లో అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్ష్యులు బలుసు పి.బి.కే. సత్యనారాయణ రావు, పెద్దాపురం సంస్థానం మహారాణి బుచ్చి సీతయమ్మ గారి జ్ఞాపకార్ధము ప్రారంబించారు.
7వ పంచవర్ష ప్రణాళికా కాలంలో .పి.వి.నరసింహారావు గారి చొరవతో, ప్రతిభ గల గ్రామీణ ప్రాంతమునకు చెందిన విద్యార్థులకు మంచి విద్యను అందించుటకు, ప్రతీ జిల్లాకు ఒక్కటి చొప్పున, *జవహర్ నవోదయ విద్యాలయ[permanent dead link] ప్రారంబించారు.అందున పెద్దాపురం పట్టణం ఎన్నిక కాబడింది. పెద్దాపురం పట్టణంలో గల *పాండవుల మెట్ట[permanent dead link] మీద గల జవహర్ నవోదయ విద్యాలయ దేశంలోనే మొదటి 10 స్థానములలో ఒకటి.
పెద్దాపురంలో గల పాండవుల మెట్టకు పౌరాణిక కథనం ఉంది. ఇచ్చట భీముడు (పాండవులు) యొక్క పాద ముద్రలు, పురాతన గుహలు చూడవచ్చు.
పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గము[మార్చు]
పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు
ఈ నియోజక వర్గం నుండి ఎన్నికైన వ్యక్తులు:
- 1955 - దూర్వాసుల వెంకట సుబ్బారావు(సి.పి.ఐ)[permanent dead link]
- 1962 - పంతం పద్మనాభం (కాంగ్రెస్)
- 1967 - వుండవల్లి నారాయణ మూర్తి (సి.పి.ఐ)
- 1972 - కొండపల్లి కృష్ణమూర్తి (కాంగ్రెస్)
- 1978 - వుండవల్లి నారాయణ మూర్తి (కాంగ్రెస్ (ఐ) )
- 1983 - బలుసు రామారావు (తెలుగు దేశం)
- 1985 - బలుసు రామారావు (తెలుగు దేశం)
- 1989 - పంతం పద్మనాభం (కాంగ్రెస్)
- 1994 - బొడ్డు భాస్కర రామారావు (తెలుగు దేశం)
- 1999 - బొడ్డు భాస్కర రామారావు (తెలుగు దేశం)
- 2004 - తోట గోపాలకృష్ణ (కాంగ్రెస్)
- 2009 - పంతం గాంధీ మోహన్ (ప్రజా రాజ్యం)
- 2014 - నిమ్మకాయల చినరాజప్ప (తెలుగుదేశం)
విద్యా సౌకర్యాలు[మార్చు]
భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే పెద్దాపురం విద్యాపురంగా బాసిల్లింది. రాజరిక కాలంలో అక్షరాస్యత విషయంలో వెనుకబడిన పెద్దాపురం సంస్థానం బ్రిటిష్ పరిపాలన సమయంలో ఊపందుకుంది. 1891లో ఎడ్వర్డ్ ఇమ్మానుయేల్ మహాశయుడు స్థాపించిన లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురంలో పేరెన్నికగన్న విద్యాలయం. తదనంతరం అనేక పాఠశాలలు నెలకొల్పబడి నేటి పెద్దాపురం విద్యాకేంద్రంగా బాసిల్లుతోంది.
- లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం
- జవహర్ లాల్ నెహ్రు మునిసిపల్ ఉన్నత పాఠశాల
- ముప్పన వీర్రాజు ఉన్నత పాఠశాల
- బాలికోన్నత పాఠశాల
- రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల, పెద్దాపురం
- జవహర్ నవోదయ విద్యాలయం, పెద్దాపురం
పెద్దాపురం మునిసిపాలిటీ[మార్చు]
పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురాన్ని ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురాన్ని రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902 లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915 లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీగా పెద్దాపురం ఆవిర్భవించబడింది. శ్రీ. వి. కే అనంత కృష్ణ అయ్యర్, శ్రీ. అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్ మెన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్
- పింగళి కృష్ణారావు పంతులు (1918 – 1921)
- గోలి పెద కొండయ్య (1921 – 1924) పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు
- గుర్రాల కృష్ణా రావు (1924-1926)
- ముప్పన చిన వీర్రాజు (1926-1928)
- చల్లా దొరయ్య (1928-1931)
- జనాబ్ ఇస్మాయిల్ ఖాన్ సాహెబ్ (1931-1933)
- నియోగి వెంకట సుబ్బారావు (1933-1934)
- గొల్లకోట వెంకట రత్నం (1934-1936)
- జనాబ్ M.A కరీం సాహెబ్ (1938-1941)
- ముప్పన చిన అంకయ్య (1943-1947)
- ముప్పన పెద వీరభద్ర రావు (1947-1952)
- చల్లా వెంకట రావు (1952-1956)
- ముప్పన రామారావు (1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
- తాళ్ళూరి గంగా భవాని (1987-1992)
- బచ్చు శ్రీదేవి (1995-2000)
- ముప్పన శ్యామలాంబ (2005-2010)
- రాజా వత్సవాయ సూరిబాబు రాజు (2000 – 2005 & 2014 - ) రెండవ సారి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు
పట్టణ ప్రముఖులు[మార్చు]
పెద్దాపురంలో జన్మించి ఇతరప్రాంతాలు, విదేశాలలో రాణించిన వారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు అలాగే ఎక్కడో జన్మించి నప్పటికీ ఇక్కడ నివసించినత్రమాత్రం చేత పెద్దాపురాన్ని తమ జన్మస్థలంగా గర్వంగా చెప్పుకుంటారు. వారిలో కొందరి జాబితా ఇది:
- టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు,, రచయిత.
- విస్సా అప్పారావు
- దూర్వాసుల వెంకట శాస్త్రి
- బచ్చు కోటేశ్వరరావు
- డేనియల్ నెజర్స్
- మొక్కపాటి సుబ్బారాయుడు
- భావరాజు సర్వేశ్వరరావు
కళాకారులు[మార్చు]
భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా పెద్దాపురం నాటక రంగానికి ప్రసిద్ధి పెద్దాపురంలో ఒకనొకప్పుడు 21 నాటక సమాజాలు వెల్లువిరిసాయి ఇక్కడి నుండి కళాకారులు నాటక ప్రదర్శనలివ్వడానికి ఇతర ప్రాంతాలకు తీసుకు వెల్లబడేవారు, తరువాతి కాలంలో ఇక్కడ నుండి చాలా మంది సినీ రంగ ప్రవేశం కూడా చేశారు వారిలో కొందరు ప్రముఖుల వివరాలు
- అంజలీదేవి
- డబ్బింగ్ జానకి
- గోకిన రామారావు
- ఆర్.నారాయణమూర్తి
- ఈశ్వరీ రావు
- మేడిశెట్టి శివ గణేష్ బాబు
చూడదగిన ప్రదేశాలు[మార్చు]
పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో దర్శించవలసిన ప్రదేశాలు[మార్చు]

- మరిడమ్మ తల్లి దేవాలయం
- సామర్లకోట చాళుక్య కుమరారామ మందిరం (భీమేశ్వరాలయం), ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
- పెద్దాపురంపాండవులమెట్ట, పాండవగుహలు
- ముప్పన వారి బంగ్లా గాలి బంగ్లా - కార్తీక మాసంలో జరుగు వనభోజనములకు ప్రసిద్ధి
- హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔలియా దర్గా తొమ్మిది మూరల సాహెబ్ దర్గా
- కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
- తిరుపతి (పెద్దాపురం) శృంగార వల్లభస్వామి వారి దేవాలయం
- వాలుతిమ్మాపురం ఆంజనేయ స్వామి వారి దేవాలయం
- పాండవుల మెట్ట మీద గల సూర్యనారాయణ స్వామి దేవాలయం.
- పరమేశ్వర, వెంకటేశ్వర, అయ్యప్ప స్వామి దేవాలయాలు.
- చంద్రబాబు శతాబ్ది పార్కు
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2008-06-27.