ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగం

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును.

యుగ చరిత్ర ముఖ్యాంశాలు

[మార్చు]
Holy relic sites map of Andhra Pradesh

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉంది. రామాయణంలో దండకారణ్యం ఆంధ్ర-ఒడిషా ప్రాంతాలలోనిదంటారు. పంపా సరస్సు కొల్లేరు సరస్సని ఒక అభిప్రాయము.[1]

క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం. మొదటినుండి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము (అగస్త్యుడు చూపినది), మగధ - కళింగ - గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉంది.

క్రీ.పూ. 700 - 300 కాలంలో ఉత్తరాన మగధ కేంద్రంగా మహా జనపదాల పాలన. నందవంశం ఇందులోదే - క్రీ.పూ.450 మహాపద్మనందుడు కళింగపై దండయాత్ర చేశాడు. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి.

మౌర్యకాలం క్రీ.పూ.322 - 184

[మార్చు]

చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడు. అతని కాలంలోనే, సుమారుగా క్రీ.పూ.310-305 మధ్య చంద్రగుప్తుడు ఆంధ్రదేశంపై అధిపత్యం సంపాదించి ఉంటాడు. క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" ప్రతిష్టానం, పౌదన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, సాతానికోట, భట్టిప్రోలు, ధాన్యకటకం, తాంబ్రావ (చేబ్రోలు), నరసాల, విజయపురి - ఇవి ఆ కోటలలో కొన్ని కావచ్చును. మౌర్యులు నేరుగా కాకుండా స్థానిక రాజుల ద్వారానే పాలన సాగించినట్లనిపిస్తుంది. ఇలా దాదాపు స్వతంత్రంగా పాలిస్తున్న వారిలో శాతవాహనులు ఒకరు.[2]

క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం ఈ కాలందే. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.

శాతవాహనులు - క్రీ.పూ.200 - సా.శ..200

[మార్చు]

శాతవాహనులు ముందుగా మౌర్యుల సామంతులై సంపన్నమైన తీరాంధ్ర ప్రాంత రాజ్యాన్ని పాలించేవారు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మత్స్యపురాణం ప్రకారం 29 మంది శాతవాహన రాజులు రాజ్యమేలారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి సా.శ. 2వ శతాబ్ది వరకు సుమారు 400 సంవత్సరాలు సాగింది. శాతవాహనులను శాలివాహనులు, శాతకర్ణులు, సాతవాహనులు అని కూడా అంటారు.

సుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్) కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. ఇతడు వింధ్య పర్వతాలకు ఆవలిగా (బహుశా గంగానది వరకు) రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని పాలన 56 సంవత్సరాల సుదీర్ఘకాలం సాగింది. తరువాతి కాలంలో 8 మంది ఇతర పాలకుల తరువాత సింహాసనానికి వచ్చిన మొదటి పులొమావి కాలంలో మళ్ళీ వారి సామ్రాజ్యం విస్తరించింది. ఇతని కాలంలోనే క్రీ.పూ.28లో కణ్వుల చివరి రాజైన సుశర్మను జయించి మగధను వశం చేసుకొన్నాడు. ఇలా నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు.

తరువాతి కాలంలో శకుల దండయాత్రల వలన వీరి రాజ్యం తిరిగి ఆంధ్రపధంలోకి మాత్రం పరిమితమయ్యింది. మళ్ళీ సా.శ. 62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. పశ్చిమ క్షత్రపులను ఓడించి అంతకు ముందు కోల్పోయిన పశ్చిమ భూభాగాలను ఇతను తిరిగి చేజిక్కించుకొన్నాడు. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ, వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. సా.శ.86లో ఇతని మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించసాగింది. తరువాత వచ్చిన రెండవ పులొమావి 28 సంవత్సరాలు రాజ్యం చేశాడు. సా.శ. 128లో సింహాసనాన్ని అధిష్టించిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శకసత్రపుల రాజు రుద్రదమనుడు ఇతనిని ఓడించి పశ్చిమ భూభాగాలను తన అదుపులోకి తెచ్చుకొన్నాడు. అయినా యజ్ఞశ్రీశాతకర్ణి రాజ్యం సా.శ.157 వరకు సాగింది.

శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. శాతవాహనులలో 17వ రాజైన హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాధాసప్తశతి ఒక ముఖ్యమైన చారిత్రిక, సాహిత్య గ్రంథం. హాలుని మంత్రి గుణాఢ్యుడు "పైశాచిక" భాషలోబృహత్కథను రచించాడు. సా.శ. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.

ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధించిన మహాయానం. నాగార్జునుడు యజ్ఞశ్రీశాతకర్ణి సమకాలీనుడు. శ్రీపర్వతంలోని గొప్ప బౌద్ధారామంలో బోధిస్తూ మహాయానాన్ని ప్రవర్తిల్లజేశాడు.

కళింగులు క్రీ.పూ. 200 - సా.శ..420

[మార్చు]

(సా.శ.. 5వ శతాబ్దంలో ఏలిన కళింగ గంగులు వేరే వంశం)

మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల తెలుగు, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి. మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం క్రీ.పూ.255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేకొన్నాడు.

తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత సా.శ.. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి స్వతంత్ర కళింగ రాజు ఇతడు. పాటలీ పుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేము - "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట." ఏమయినా తరచు కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుడ నగగరం బహుశా "ప్రతీపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును.

ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. క్రమంగా వారి పాలనను శాతవాహనులు అంతం చేశారు. సముద్రగుప్తుని కాలంలో ఉన్న చిన్న కళింగ రాజ్యాలు - కొత్తూరు, ఏరండపల్లి (ఆమదాలవలస), దేవరాష్ట్రం (ఎలమంచిలి), సింగుపురం (శ్రీకాకుళం, నరసన్న పేటల మధ్య), పిష్ఠపురం (పిఠాపురం).

తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (సా.శ..400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (300-450). మధ్యలో కొంతకాలం ఈ ప్రాంతాన్ని పృథ్వీమూల మహారాజు, అతని మూడు తరాలు పాలించారు. వీరి వంశం తెలియదు కాని వీరిి రాజధాని అయిన గుణపాశపురం ప్రస్తుతం రాజోలు వద్ద అదుర్రు అని తెలుస్తున్నది. ఇతని రాజ్యం పిష్ఠపురం నుండి కొండవీటివరకు విస్తరించింది. వీరు గణనీయమైన విజయాలు సాధించారు. బ్రాహ్మణ మతాన్ని, బౌద్ధాన్ని కూడా విశెషంగా ఆదరించారు. పృథ్వీమూలుని అనంతరం పిష్ఠపురాన్ని రణదుర్జయులు ఆక్రమించి ఉంటారు.

ఇక్ష్వాకులు 225 - 300

[మార్చు]

శాతవాహనుల పతనం తరువాత వారి పూర్వ సామ్రాజ్యం చిన్నచిన్న భాగాలుగా చీలిపోయింది. మహారాష్ట్రలో అభీరులు, కర్ణాటకలో చూటుకులు పాలించారు. తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ముగ్గురు లేదా నలుగురు రాజుల పాలన తెలియవస్తున్నది. వీరు తాము గౌతమ బుద్ధుని వంశానికి, శ్రీరాముని వంశానికి వారసులమని చెప్పుకొన్నారు. ఇక్ష్వాకుల వంశం గురించి పలు అభిప్రాయాలున్నవి. బహుశా వీరు ఇక్షు (చెఱకు) చిహ్నం కలిగిన కృష్ణాతీర స్థానికులు అని ఒక అభిప్రాయం.

ఇక్ష్వాకులు సా.శ..225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ ఛాంతమూలుడు (225-245) గొప్ప వీరుడు. బహుశా శాతవాహనులకు సామంతునిగా ఉండి తరువాత స్వతంత్రుడైయుండవచ్చును. ఇతడు రాజనీతిపరుడు. వివాహ సంబంధాల ద్వారా ఇతర వర్ణాలవారితోను, పొరుగు రాజ్యాలవారితోను స్నేహం పెంచుకొని రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్పబౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాష్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు) లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంథంలో ఉంది.

తరువాత ఎహువల ఛాంతమూలుడు బహుశా పొరుగురాజ్యాలతో యుద్ధాలనెదుర్కొని ఉండవచ్చును. ఇతని శాసనాల్లో సంస్కృతం వాడడం మొదలయ్యింది. బహుశా ఈ కాలంలో బౌద్ధం, నైదికం ప్రాభవానికి పోటీపడిఉండవచ్చును.

ఎహువల ఛాంతమూలుడు (సా.శ.. 239-252) : శ్రీవీరపురుషదత్తుని అనంతరం అతడి కుమారుడు ఎహువల ఛాంతమూలుడు 25 ఏళ్లు పాలించాడు. ఈయన రెండో రాజ్య సంవత్సరంలో బహుశృతీయుల భిక్షువుల కోసం నాగార్జునకొండలో మహాదేవి-భట్టిదేవ దేవీవిహారం నిర్మించారు. ఎహువల ఛాంతమూలుడి సేనాని ఎలిసిరి కార్తికేయుడికి సర్వదేవ ఆలయం నిర్మించాడు. ఇతడి కాలంలోనే నాగార్జునకొండ లోయలో పుష్టభద్రస్వామి, హరీతి, నొడగిరిస్వామి, అష్టభుజస్వామి ఆలయాలు నిర్మించారు. దేశంలో మరెక్కడా కనిపించని యాంఫీ థియేటర్ (క్రీడా వేదిక) అవశేషాలు నాగార్జునకొండలో లభించాయి. ఇక్ష్వాకుల కాలంలో భూమిని ‘నివర్తనాలు’గా పిలిచేవారు.

రుద్ర పురుషదత్తుడు (సా.శ.. 252-254): ఎహువల ఛాంతమూలుడి కుమారుడు రుద్ర పురుషదత్తుడు. ఇతడు చివరి ఇక్ష్వాకు రాజు. నాగార్జునకొండ, గురజాల ప్రాంతాల్లో ఇతడి శాసనాలు లభించాయి. ఇతని కాలంలోనే పల్లవ రాజైన సింహవర్మ ఇక్ష్వాకు రాజ్యాన్ని అంతమొందించినట్లు తెలుస్తోంది. మంచికల్లు గ్రామంలో సింహవర్మ శాసనం లభించింది. ధాన్యకటకం (అమరావతి), శ్రీపర్వతం (నాగార్జునకొండ), గుంటూరు, కృష్ణా ప్రాంతాలు సా.శ.. 300 నాటికి ప్రాచీన పల్లవుల ఆధీనంలోకి వచ్చినట్లు పల్లవ నరసింహవర్మ కుమారుడు శివస్కంధవర్మ వేయించిన మైదవోలు శాసనం విశదీకరిస్తుంది. ఇక్ష్వాకులలో కడపటివాడైన రుద్రపురుషదత్త (290-300) పాలనాకాలంలో పల్లవులు విజయపురిపై దండెత్తి నగరాన్ని నాశనం చేసిఉంటారు. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.

బృహత్పలాయనులు - సా.శ.. 275 ప్రాంతం

[మార్చు]

బృహత్పలాయనులు ఇక్ష్వాకుల పతనాంతరం వారి సామంతులైన బృహత్పలాయనులు తూర్పు ఆంధ్ర దేశాన్ని సా.శ.. 3వ శతాబ్దం ఉత్తరార్థంలో గూడూరు (కోడూరు) రాజధానిగా కృష్ణాజిల్లా ప్రాంతాన్ని పాలించారు. వీరి గురించి తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర శాసనం. దీని ప్రకారం ఈ వంశ స్థాపకుడు జయవర్మన్. ఈ శాసనాన్ని ప్రాకృత భాషలో రాశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉన్న గ్రామం కొండముది. వీరి రాజధాని కూడూరు. గూడూరుగా పేరు సంతరించుకుంది. జయవర్మన్ పల్లవుల చేతిలో ఓడిపోయాడు.

కొండముది శాసనం ఆధారంగా బృహత్పలాయన గోత్రానికి చెందిన జయవర్మ అనేరాజు రాజ్యం చేశాడని అతని రాజధాని "కూడూరా" (గుడివాడ వద్ద కావచ్చును) అని తెలుస్తుంది. ఇతనికి పల్లవులతో (శివస్కంద వర్మతో గాని, అంతకు ముందు రాజుతో గాని) యుద్ధం జరిగినట్లు కూడా తెలుస్తుంది. వీరి వంశం గురించిన ఇతర వివరాలు తెలియడం లేదు.

ఆనంద గోత్రీకులైన రాజుల రాజధాని కందారపురం. ఇది గుంటూరి జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. వీరిలో దామోదరవర్మ (295-315), అత్తివర్మ (395-420), కందారరాజు (615?-620?) అనే ముగ్గురి పేర్లు మాత్రం తెలుస్తున్నాయి. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు.

వీరి రాజధాని కందపురం. వీరిని కందర రాజులని కూడా పిలుస్తారు. ఈ వంశంలో దామోదర వర్మ వేయించిన మట్టిపాడు, అత్తివర్మ వేయించిన గోరంట్ల, కందరుడు వేయించిన చేజెర్ల శాసనాలు ప్రధానమైన ఆధారాలు.

వీరు మొదట బౌద్ధ వంశస్థులు. తర్వాత శైవమతాన్ని స్వీకరించారు. కందరుడే ఆనందగోత్రీయుల వంశ స్థాపకుడు. అత్తివర్మ గోరంట్ల శాసనం, దామోదర వర్మ మట్టిపాడు శాసనాలు, కందరుడు చేజెర్ల శాసనం (శిలా శాసనం) వేయించారు. వీరి కాలంలోనే సుప్రసిద్ధ చేజెర్ల కపోతేశ్వరాలయం నిర్మించారు.

"శాలంకాయన" అనేది గోత్రనామము. సా.శ.. 130లో టాలెమీ వ్రాసిన "మైసోలియా (కృష్ణానది) దేశంలో బెన్‌గొరా (వేంగి) వద్ద ఉన్న సాలెంకీనాయ్" అంటే శాలంకాయనులే అని ఒక అభిప్రాయం ఉంది. శాలంకాయనులు పల్లవులకు సామంతులు కావచ్చును. వీరు ఉత్తరాంధ్రలో రాజ్యాన్ని స్థాపించి వేంగి రాజధానిగా సా.శ.. 300 మంచి 420 వరకు పాలించారు గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రజులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ సా.శ..320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే.

వీరు క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన బ్రాహ్మణులు. విజయదేవవర్మ ఈ రాజ్య స్థాపకుడు. ఈయన ఆనందగోత్రీయులను ఓడించి, కృష్ణానది ఉత్తర భాగాన్ని ఆక్రమించాడు.

శాలంకాయనుల రాజలాంఛనం వృషభం. వీరు చిత్రరధస్వామి భక్తులు. శాలంకాయన రాజుల్లో హస్తివర్మ ప్రసిద్ధుడు. సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రకు వచ్చి హస్తివర్మను ఓడించినట్లు అలహాబాదు స్తంభ శాసనం ద్వారా తెలుస్తోంది. శాలంకాయన రాజుల్లో చివరివాడు విజయస్కంధ వర్మ. వీరి రాజ్యాన్ని విష్ణుకుండినులు ఆక్రమించారు. శాలంకాయనులు సంస్కృత భాషను రాజభాషగా గుర్తించారు. వీరి కాలంలో వేంగీ (పెదవేగి) గొప్ప విద్యా కేంద్రంగా ఆవిర్భవించింది.

వీరిలో చివరి రాజు విజయనందివర్మ. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్ధాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారతదేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.

సా.శ.. 5 నుంచి 7వ శతాబ్దం వరకు విష్ణుకుండినులు ఆంధ్ర దేశాన్ని పాలించారు. మొదటి మాధవ వర్మ రాజ్య స్థాపకుడు. వినుకొండ వీరి జన్మభూమి. వీరి చరిత్రను గోవిందవర్మ వేయించిన ఈపూరు తామ్ర శాసనం, విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన తుండి, చిక్కుళ్లగూడెం శాసనాలు ముఖ్యమైనవి. విష్ణుకుండినులు వైష్ణవ మతాభిమానులు. వీరు శ్రీపర్వతస్వామిని కుల దైవంగా స్వీకరించారు. వీరి లాంఛనం సింహం. అమరపురీశులు, త్రికూట మలయాధిపతులుగా వీరు శాసనాల్లో ప్రకటించుకున్నారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలో చైతన్యపురి వద్ద విష్ణుకుండినుల శాసనం బయల్పడింది.

విష్ణుకుండినులు ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి, భైరవుడి కొండల్లో గుహాలయాలు నిర్మించారు. అష్టభుజనారాయణస్వామి, త్రివిక్రమావతారం మొదలైన శిల్పాలు మొగల్రాజపురం గుహాలయాల్లో తొలిచారు.

వీరు రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రానికి అధిపతి రాష్ట్రీకుడు, విషయానికి అధిపతి విషయాధిపతి. సైన్యంలో హస్తికోశుడు, వీరకోశుడు (పదాతి దళాధిపతి) ఉండేవారు. విష్ణుకుండిన రాజుల్లో చివరివాడు మంచనభట్టారకుడు.

పల్లవులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము
  2. బి.ఎస్.ఎల్._హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర

వనరులు

[మార్చు]
  • విజ్ఞాన సర్వస్వమహ, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • Sir V Ramesam (retired Judge of Madras High Court) - Andra Chronology (90-1800 A.C.) - Published 1946 - [1]
  • Dr. M. Rama Rao - Select Andhra Temples - Published by Govt. of Andhra Pradesh - [2]
  • చిలుకూరి వీరభద్రరావు- ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము - విజ్ఞానచంద్రికా గ్రంథమండలి ప్రచురణ - 1910 - [3]
  • చిలుకూరి వీరభద్రరావు- ఆంధ్రుల చరిత్రము - మూడవ భాగము - ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ప్రచురణ - 1916 - [4]
  • మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతీ స్తూపము - [5]
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - బౌద్ధము-ఆంధ్రము - [6]
  • కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల - [7]
  • Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - [8]
  • ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంథమాల ప్రచురణ - 1950 - [9]

బయటి లింకులు

[మార్చు]