Jump to content

కాకతీయులు

వికీపీడియా నుండి
కాకతీయ సామ్రాజ్యం

750–1323
స్థాయిసామ్రాజ్యం
రాజధానిఓరుగల్లు (వరంగల్లు)
సామాన్య భాషలుతెలుగు
మతం
హిందూ మతం (జైన మతం నుండి రూపాంతరం చెందింది.)[1]
ప్రభుత్వంరాజరికము
చక్రవర్తి 
చరిత్ర 
• స్థాపన
750
• పతనం
1323
Preceded by
Succeeded by
దస్త్రం:Goff పశ్చిమ చాళుక్యులు
తూర్పు చాళుక్యులు
దక్కను సుల్తానులు
విజయనగర సామ్రాజ్యము
ముసునూరి నాయకులు
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323.[2] వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము.[3] క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు.[4] శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.[5]

కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[6] ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది[ఆధారం చూపాలి].[7]

వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).

పూర్వ రంగం

[మార్చు]

నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు[ఆధారం చూపాలి] తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల 'ప్రభావం' క్షీణదశలో ఉంది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ (బాదామి) చాళుక్యులకు సోదర సమానులు. కాని క్రమంగా దక్షిణాపథం నుండి విస్తరిస్తున్న చోళులు తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకొన్నారు. ఆలా క్రీ. శ. 1076నుండి తీరాంధ్రంలో చాళుక్య చోళ యుగం ప్రారంభమై క్రీ. శ. 1200 వరకు సాగింది. వారికి, సత్యదేవుని నాయకత్వంలోని పశ్చిమ చాళుక్యులకు తరచు యుద్ధాలు జరిగాయి. దక్షిణ తీరాంధ్రంలో 11, 12 శతాబ్దాలలో వెలనాటి చోడులు, గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు. క్రీ. శ. 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా పరాజితులై ఆంధ్ర ప్రాంతంనుండి పూర్తిగా వైదొలగారు. తరువాత వెలనాటి చోళులు దక్షిణ తీరాంధ్రంలో దాదాపు స్వతంత్రులుగా పాలించారు.

తరువాత ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేనాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు,, ధరణికోటను కోటవారు, కొండవీడు వెలనాటి దుర్జయ చోడులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి మత సంప్రదాయాల మధ్య (శైవులు, వైష్ణవులు), కులాల మధ్య, జ్ఞాతుల మధ్య (నలగామరాజు, మలిదేవరాజు) జరిగిన పెద్ద పోరు. దాదాపు అందరు రాజులూ ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాలు పంచుకొన్నారు. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. అరాచకాన్ని అంతం చేసే ప్రభువులకు అది అదనైన సమయం. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

ప్రస్తుత తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళుక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణాలోని[ఆధారం చూపాలి] వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది.[ఆధారం చూపాలి]

క్రీ. శ. 950 - 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు, లేదా పశ్చిమ చాళుక్యులకు లేదా తూర్పు చాళుక్యులకు (దశలను బట్టి) సామంతులుగా, ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ. శ. 934-945 మధ్య నందిగామ, ముక్త్యాల, మాంగల్లు, మధిర, మానుకోటలను పాలించిన కాకత్య గుండన రాష్ట్రకూటులకు వంశం అని హైహయ దుర్జయ వంశం అని శాసనాలు దొరికాయి.

రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది.

రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్థులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది.

కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

శాసనాధారాలను బట్టి కాకతీయుల కులదేవత ‘కాకతి’ అనీ, మొదట వారు కాకతి ఆరాధకులు కాబట్టి కాకతీయులయ్యారనీ, ఆ తర్వాత స్వయంభూదేవుని ఆరాధకులయ్యారనీ చారిత్రక సమాచారం ఉంది. కాజీపేట శాసనాన్ని బట్టి వీరు గుమ్మడమ్మ సంప్రదాయానికి (తీగకు) చెందిన వారని తెలుస్తోంది. జైన దేవత గుమ్మడమ్మ (కుషాండిని) కి మరోపేరు కాకతి. ఈమె జీవుల్ని అనారోగ్యం నుండి కాపాడే జైన ఆరోగ్య దేవత. కాకతీయులు తమను తాము ‘దుర్జయుల’మని చెప్పుకున్నారు. అంటే హైహయ వంశం వారు అని అర్థం. కాకలు తీరిన వీరులుగా వీరు కాకతిని యుద్ధదేవతగా కొలిచారు. ‘కాకతికి సైదోడు ఏకవీర’ అనే నానుడి ఆ రోజుల్లో ప్రచారంలో ఉంది. ఏకవీరాదేవి ఆలయం ఓరుగల్లు సమీపంలోని మొగిలిచర్లలో ఉంది. కొన్ని శాసనాల్లో ‘కాకతి’ వీరి కులపురమని చెప్పబడింది. అయితే, ఆ గ్రామం లేదా పట్టణం ఎక్కడ ఉందో గుర్తించటం ఇప్పుడు కష్టంగా ఉంది. [ఆధారం చూపాలి]

"కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. హైహయ వంశం దుర్జయులే కాకతీయ రాజుల శాసనాలలో వీరు అని, కొమ్మజనులు అని వర్ణించబడింది. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది.[8] కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది.[8] రుద్రమ దేవి భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన.[9][10] చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు అని తేల్చారు.

చేబ్రోలు శాసనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జాయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరీమణులైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి,గణపాంబ . గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన వీరభద్రుడు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె గణపాంబ కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు.

కాకతీయుల అచ్చతెలుగు పేర్లు

[మార్చు]

కాకతీయులు గరుడాంక చిహ్నం కలిగిన రాష్ట్రకూటులు కాబట్టి, వారు రాష్ట్రకూట వంశస్థులని, మహారాష్ట్ర ప్రాంతం నుండి త్రిలింగదేశానికి వలన వచ్చిన వారని గుండయ, ఎరియల పేర్ల చివర ఉన్న రాష్ట్రకూట శబ్ధమే ఇందుకు తార్కాణమని కొందరు అభివూపాయపడ్డారు. శాసనాలు దొరికాయి .చాళుక్య శాసనాల్లోనూ ఉంది. రాష్ట్రకూటుల వద్ద సైనిక వృత్తిలో ఉన్నమాట వాస్తవమే, కానీ, రాష్ట్ర కూటుల ఆక్రమిత ప్రాంతాలైన ఆంధ్రదేశంలోనే వారున్నారు పైగా వారి పేర్లన్నీ ‘గుండయ’ పేరు దానికి సంబంధించిందే.

  • బేతరాజు పేరు పోతరాజు నుండి వచ్చిందే. ఈ పేరు పంటలకు చీడపీడలు రాకుండా పూజింపబడే దేవుడిదే.పోతరాజు అనేది అచ్చమైన ద్రవిడ సంస్కృతిలో నుంచి వచ్చిన పేరు. మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన ఏడుగురు గ్రామ దేవతలకు ఒకే ఒక్క సోదరుడు. ఇప్పటికీ తెలంగాణలో బోనాల దగ్గర ముందు నడిచేవాడు ఈ పోతరాజే.
  • ప్రోలయ నూర్పిడి సమయంలో పూజింపబడే దేవత ప్రోచేరాజుగా పోలరాజు) శివుడు కూడా పూజితుడయ్యాడు.
  • బ (వ) య్యలమ్మ (చదువుల తల్లి),
  • మైలమ (భూదేవి) కుందమ్మ (వ్వ), మేడలమ్మ, రుయ్యమ్మ, ముమ్మడమ్మ (ముగ్గురమ్మల మూలపుటమ్మ) ముప్పమ మొదలైన కాకతీయ కుటుంబీకుల పేర్లు అచ్చ తెలుగు పదాలతో కూడినవి. రుద్రదేవునితోనే సంస్కృత పేర్లతో కాకతీయ ప్రభువులు కనిపిస్తారు

మూడు దశలు

[మార్చు]

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి.

  • క్రీ. శ. 1000- 1158 - తెలంగాణ విమోచన:[ఆధారం చూపాలి] ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకత్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్రము నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగా ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. ప్రజలలో పుట్టి, కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్ర్యముతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్య నీటివనరులు.
  • క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం: ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ, తీరాంధ్ర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి.
  • ఖ్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్థులైన ప్రభువులు, యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.

కాకతీయ సామ్రాజ్య క్రమం

[మార్చు]

ఆరంభ దశ

[మార్చు]

క్రీ. శ. 934-945 మధ్యకాలంలో గుండయ రాష్ట్రకూటుల ప్రతినిధి (సామంత రాజు) గా మధిర, మానుకోట తాలూకాలను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునకు, వేంగి రాజు మొదటి చాళుక్య భీమునకు యుద్ధాలు జరుగుతున్న సమయం. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గుండయ మరణించాడు. బెజవాడను పట్టుకోవడంలో గుండన చూపిన సాహసానికి కృతజ్ఞతాపూర్వకముగా రెండవ కృష్ణుడు గుండయ కుమారుడు ఎరియను ఓరుగల్లు దగ్గరలోని కురవాడికి అధిపతిగా చేశాడు. తూర్పుననున్న ముదిగొండ చాళుక్యులను నివారించుటకు ఇది ఉపయోగపడింది.[11] ఎరియ ఓరుగల్లు (కాకతీపురము) ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఇతని మనుమడు కాకత్య గుండ్యన (ఎరియ కొడుకు బేతన కాలంలో బహుశా మళ్ళీ కురవాడిని చాళుక్యులు ఆక్రమించి ఉండవచ్చును).

దానార్ణవునికి, ఆతని సోదరుడు రెండవ అమ్మరాజునకు జరిగిన ఘర్షణలో, మూడవ కృష్ణుని ప్రోద్బలముతో, దానార్ణవుడు వేంగీ సింహాసనము చేజిక్కించుకొనుటకు గుండ్యన సాయపడ్డాడు. ఆ రాజ్యాలలో చెలరేగిన కల్లోలాలను అదునుగా తీసికొని, మళ్ళీ కురవాడిని తన అధీనంలోకి తెచ్చుకొని ఉండవచ్చును. అయితే ముదిగొండ చాళుక్యులకు చెందిన "విరియాల ఎర్ర భూపతి" ఒక యుద్ధంలో గుండ్యనను వధించాడు. గుండ్యన కొడుకు గరుడ బేతన చిన్న వయసులో రాజ్యం కోల్పోయి నిస్సహాయుడైనాడు. ఎర్ర భూపతి భార్య కామసాని ఆ పిల్లవానిపై జాలిగొని ఓరుగల్లు రాజ్యం ఇప్పించింది. ముందు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న కాకతీయులు ఇలా విరియాల వారి సౌహార్ద్రత్వంతో చాళుక్యుల సామంతులుగా ఓరుగల్లులో నెలకొన్నారు. బేతన క్రీ. శ. 1052 వరకు రాజ్యం చేశాడు.

బేతరాజు కుమారుడు మొదటి ప్రోలుడు (క్రీ. శ. 1052 - 1076) చాళుక్య యువరాజు ఆరవ విక్రమాదిత్యునికి సహాయపడ్డాడు. స్థానిక ప్రభువులైన అన్నయ్య, గొన్నయ్యలను నిర్జించాడు. ఈతనికి "అరికేసరి" అనే బిరుదు ఉంది. ఇతను అనుమకొండ (హనుమకొండ) ను సోమేశ్వరుడినుండి పొందాడు. ప్రోలుని కుమారుడు రెండవ బేతరాజు (క్రీ. శ. 1076 - 1108) హనుమకొండ రాజధానిగా పాలించాడు. రాష్ట్రకూటులను జయించి కొరవి మండలం, హనుమకొండ విషయం, సబ్బిరాయి మండలాలను కలిపి కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు.

ఈతని తమ్ముడు రెండవ ప్రోలరాజు (క్రీ. శ.1116 - 1157) మిక్కిలి గొప్పవాడు. చాళుక్యులు బలహీనపడిన సమయములో స్వాతంత్ర్యము ప్రకటించుకొని, తెలంగాణ ప్రాంతం అంతా రాజ్యవిస్తరణ చేశాడు. పశ్చిమ చాళుక్యుల సామంతులైన తైలప దేవుడు (మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రాంతం), గోవిందరాజు (వరంగల్ జిల్లా వేలకొండపల్లి ప్రాంతం), గుండరాజు (మంథెన ప్రాంతం), జగద్దేవుడు (వేములవాడ ప్రాంతం) అనే నలుగురు రాజులను జయించి తెలంగాణంలో చాళుక్యుల పాలనను అంతం చేశాడు. ఇతడు కళ్యాణిని పాలిస్తున్న బిజ్జలుని సమకాలికుడు. బిజ్జలునికి సహకారంగా తన సేనను పంపి, అతడు కళ్యాణి నగరాన్ని పశ్చిమ చాళుక్యులనుండి వశం చేసుకోవడానికి సాయపడ్డాడు. కాకతీయులు మొదట జైనులు. అప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో జైన మతం బలంగా ఉంది. కాని కళ్యాణిలో బసవని నేతృత్వంలో వీరశైవం విజృంభించి ఆంధ్రదేశంలో బలం పుంజుకోసాగింది. ఉప్పెనలా వస్తున్న వీరశైవానికి తలవంచి రెండవ ప్రోలరాజు శైవాన్ని స్వీకరించాడు. ఈ సమయానుకూల చతురత వల్ల కాకతీయుల రాజ్యం మరో రెండు శతాబ్దాలు కొనసాగగలిగింది. తరువాత రెండవ ప్రోలుడు కృష్ణానదిని దాటి తీరాంధ్ర చోళులను జయించాలని యత్నించాడు. మంత్రకూటమును (నూజివీడు మండలం) పాలించుచున్న గుండని నిర్జించి, తన రాజ్యములో కలుపుకున్నాడు. క్రీ. శ. 1158 లో వెలనాటిపై చేసిన యుద్ధములో రాజేంద్ర చోడుని చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో కాకతీయుల చరిత్ర మలుపు తిరిగింది.[12]

రుద్రదేవుడు (1158 - 1195)

[మార్చు]

ప్రసిద్ధులైన కాకతీయులలో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమ శాలి. రాజనీతి చతురుడు. ఇతనినే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతని అనేక శాసనాలలో అనుమకొండ శాసనం (వేయి స్తంభాలగుడి) ప్రసిద్ధమైన చారిత్రకాధారము. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. ప్రోలరాజు మొదలుపెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకు తీసుకెళ్ళాడు. పశ్చిమ చాళుక్యుల సార్వభౌమత్వానికి వారసుడుగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మరో ప్రక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు. అసమానమైన రాజనీతితో వీరందరిని ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాడు.

మేడరాజు, దొమ్మరాజు, మైలగి దేవుడు, చోడోదయుడు వంటి చిన్న చిన్న స్థానిక రాజులను జయించాడు. తరువాత తీరాంధ్రంవైపు దృష్టి సారించాడు. క్రీ. శ. 1162 లో వెలనాటిపై దండయాత్ర చేసి శ్రీశైలం, త్రిపురాంతకం ఆక్రమించుకొన్నాడు. పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సాయంగా పెద్ద దళాన్ని పంపాడు. పల్నాటి యుద్ధంలో వెలనాటి చోళులు బలహీనపడిన తరువాత క్రీ. శ. 1186 లో రుద్రదేవుడు ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని రెండవ ప్రోలుని మరణానికి ప్రతీకారం తీర్చుకొన్నాడు. తరువాత దేవగిరి రాజైన yadava జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. రుద్రదేవుడు ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా నిర్మించడం మొదలుపెట్టాడు. అనుమకొండలో దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడు భాషాభిమాని. స్వయంగా కవి.

మహాదేవుడు (క్రీ. శ. 1195 - 1199)

[మార్చు]

రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగసాధించవలెనని ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతిదేవుని దత్తత తీసికొన్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించినపుడే గణపతిదేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కి ఉంటాడు. అతనిని విడిపించే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి, ఆ యుద్ధంలో (ఏనుగు మీద ఉండి యుధ్ధాన్ని నడిపిస్తూ) మరణించాడు. మహాదేవుడు శైవ మతాభిమాని. ధ్రువేశహవర పండితుడు అతని దీక్షా గురువు. మహాదేవుని మరణానంతరం క్రీ. శ. 1198లో మహాదేవుని కొడుకు (రుద్రదేవుని దత్తపుత్రుడు) గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు.

గణపతిదేవుడు (క్రీ. శ. 1199 - 1262)

[మార్చు]

గణపతి దేవుడు రాజ్యానికి రావడానికి ముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవులకు బందీగా ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడు అనే విశ్వాసపాత్రుడైన సేనాని అణచి, రాజ్యాన్ని గణపతిదేవునికి అప్పగించాడు. గణపతిదేవుడు మహావీరుడు. దూరదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హొయసల, యాదవ రాజులు, ఉత్తరదేశంలో తురుష్కులు బలవంతులై తెలుగుప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాగల ప్రమాదాన్ని గుర్తించిన గణపతిదేవుడు త్రిలింగదేశాన్ని ఐక్యము చేయడానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని, వారి సామంత ప్రతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా నిలిచారు.

గణపతిదేవుడు క్రీ. శ. 1212 - 1213 కాలంలో తూర్పు తీరంపై దండెత్తి కృష్ణా, గోదావరి, గుంటూరు ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నాడు. నిడదవోలు పాలకుడైన వేంగి చాళుక్య వీరభద్రునికి (క్షత్రియుడు) తన కుమార్తె రుద్రమ్మను ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండవ కుమార్తె గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు, సోదరి మేలాంబికను మధిర పాలకుడు రుద్రరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. జాయపసేవాని ఇద్దరు చెల్లెళ్ళను (పిన్నచోడుని కుమార్తెలైన నారమ్మ, పేరమ్మ) గణపతిదేవుడు వివాహం చేసుకొన్నాడు. కమ్మ జాయపసేనానిని (జాయప నాయుడు) తన గజసైన్యాధ్యక్షునిగా ఓరుగల్లు తీసుకెళ్ళాడు. నెల్లూరు ప్రాంతాన్ని జయించి, అక్కడి పూర్వపాలకుడైన మనుమసిద్ధికి ఇచ్చాడు. రాయలసీమ ప్రాంతాన్నంతా జయించి, గంగయ సాహిణి అనే సామంత పాలకునికి అధికారం అప్పజెప్పాడు. తర్వాత కళింగ దేశంలోని గంజాం జిల్లా ఆస్కావరకు జయించాడు.

అప్పటికి కుల వ్యవస్థ, కులాల మధ్య అంతరాలు బలపడుతున్నాయి. కాని గణపతిదేవుడు అన్ని కులాల వారితో సంబంధ బాంధవ్యాలు నెరపుకొంటూ ఈ కుల భేదాలు అంతఃకలహాలుగా మారకుండా జాగ్రత్త పడ్డాడు. జాయప కమ్మ వంశస్థుడు. చాళుక్య వీరభద్రుడు క్షత్రియుడు. నెల్లూరుకు చెందిన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్ళి గణపతిదేవుని ఆస్థానంలో తన మహాభారత రచన పూర్తి చేశాడు.

నెల్లూరు రాజ్యంలో కాకతీయుల జోక్యం వలన వారికి పాండ్యులతో వైరం ఏర్పడింది. పాండ్యులు రెండు సైన్యాలను పంపారు. కొప్పెరుంజింగలి నాయకత్వంలోని ఒక సైన్యం కాకతీయులతో యుద్ధంలో ఓడిపోయింది. పాండ్యుల రెండవ సైన్యం జటావర్మ నాయకత్వంలో నెల్లూరు పై దాడిచేసింది. క్రీ. శ. 1263లో ముత్తుకూరు వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ-శేవుణ సైన్యాలు ఓడిపోయాయి. ఈ యుద్ధంలో మనుమసిద్ధి మరణించాడు. నెల్లూరు రాజ్యం పాండ్యుల వశమయ్యంది. ఇది కాకతీయులకు ఘోర పరాజయం. ఇదొక్కటే గణపతిదేవుడు యుద్ధాలలో చవి చూసిన ఓటమి. అప్పటికే గణపతిదేవుడు బాగా వృద్ధుడై యున్నాడు. తరువాత ప్రతాపరుద్రుని కాలం వరకు నెల్లూరును కాకతీయులు వశపరచుకోలేకపోయారు.

గణపతిదేవుని కాలంలో ఓరుగల్లు పెక్కు తటాకాల, ఆలయాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిశాయి. విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. మోటుపల్లి రేవు ప్రసిద్ధిగాంచింది. శిల్ప వాస్తువు ప్రభవించింది. రామప్ప దేవాలయనిర్మాణం ఈ కాలంలో జరిగినదే.

రుద్రమదేవి (1269 - 1289)

[మార్చు]
రాణి రుద్రమ దేవి

గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. త్రిలింగదేశమంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్ధవంతంగా పాలించడం వలన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో ముఖ్యమైనది.

రుద్రమదేవి పాలనకాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. రుద్రమదేవికి ముందుగా స్త్రీ పరిపాలన సహించని సామంతులనుండి, దాయాదులనుండి ప్రతిఘటన ఎదురయ్యింది. అదే సమయంలో దేవగిరి యాదవరాజు అయినా మహదేవ దండెత్తి వచ్చాడు. ఈ రెండు విపత్తులనూ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ పోరాటాలలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వారిలో కొందరు - గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు (వెలమ), రుద్రనాయకుడు (కమ్మ), జన్నిగదేవుడు (కాయస్థుడు), త్రిపురాంతకుడు (కాయస్థుడు), బెండపూడి అన్నయ్య (బ్రాహ్మణుడు).

తరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని (క్రీ. శ. 1262లో) ఆక్రమించాడు. కాని పోతినాయక, ప్రోలినాయకులు వారిని ఓడించి సా.శ. 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారం నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతనిని ఓడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది. దక్షిణాదిన నెల్లూరు ప్రాంతంలో పాండ్యులు విజృంభించసాగారు. వారిని ఓడించిననూ అక్కడ కాకతీయాధికారం ఎంతో కాలం నిలువలేదు. పాండ్యుల సామంతులైన తెలుగు చోడులు మళ్ళీ నెల్లూరును ఆక్రమించారు. వల్లూరు రాజ్యం మాత్రం పాండ్యులనుండి కాకతీయుల వశమైంది. దానిని జన్నిగదేవుడు, తరువాత త్రిపురారి కాకతీయుల సామంతులుగా ఏలారు. అయితే త్రిపురారి తరువాత వచ్చిన అంబదేవుడు తిరుగుబాటు చేసి స్వతంత్రరాజ్యం స్థాపించ ప్రయత్నించాడు. అంబయతో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది (క్రీ. శ. 1289).

నిరంతరం యుద్ధాలలో ఉన్నాగాని, రుద్రమదేవి చాలా సమర్థవంతంగా పాలన నిర్వహించింది. ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా బలపరచింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలోనే వెనిస్ యాత్రికుడు మోటుపల్లి రేవులో దిగాడు. దేశంలో పాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయని వర్ణించాడు.

రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు. వీరికి ముగ్గుర్ కుమార్తెలు, కుమారులు కలగలేదు. పెద్ద కూతురు ముమ్మడామ్మను కాకతి మహాదేవుడు వివాహమాడెను. వారి తనయుడే ప్రతాపరుద్రుడు. రుద్రమ దేవి తరువాత కాకతీయ సామ్రాట్టు అయినాడు. రుద్రమ చిన్న నాదే అతనిని దత్తత తీసుకొని తన తదనంతరం వారసుడిని యువరాజ్య పట్టాభిషేక మొనర్చింది.

ప్రతాపరుద్రుడు (1289 - 1323)

[మార్చు]

ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈతనిని వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. క్రీ. శ. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది. అంబదేవుని, నెల్లూరులో మనుమగండుని, కర్ణాట రాజులను జయించి రాజ్యము కట్టుదిట్టము చేశాడు. ఇంతలో ఉత్తర దేశమునుండి కొత్త ఉపద్రవము ముంచుకొచ్చింది. సా.శ. 1303,1309, 1318, 1320 లో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడు.[13] క్రీ. శ. 1323 లో జరిగిన నాలుగవ యుద్ధములో ప్రతాపరుద్రునికి అపజయము సంభవించింది.[14]

ముసునూరి నాయకులు

[మార్చు]

ప్రతాపరుద్రుని పరాజయము తరువాత త్రిలింగదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ముసునూరి ప్రోలయ నాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి, కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా కమ్మ కులానికి చెందిన ముసునూరి ప్రోలయ నాయకుడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ముసునూరి ప్రోలయ నాయకుడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1325 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో కమ్మవారు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ముసునూరి ప్రోలయ నాయకుని వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.[15]

కాకతీయ సామంతులు

[మార్చు]

కాకతీయుల కాలమున సామంతులు, మహా సామంతాధిపతులు, మహా మాత్యులు, దండనాయకులు, వంశ పాలకులు అమేయమైన శక్తిప్రపత్తులతో రాజ భక్తితో దేశ భక్తితో చాలా చక్కని పాత్రని పోషించారు. వంశ పాలకులు అనగా స్వజాతి కుటుంబ పాలకులు. యుద్ధములలో వీరు చాలా ఎన్న దగిన పాత్ర పోషించారు. అటువంటి కాకతి వంశ సామంతులలో ఎన్నదగినవారు[16][17]

  1. రేచర్ల రుద్ర వంశం
  2. రేచెర్ల పద్మనాయకులు
  3. గోన వంశీయులు
  4. కందూరి చోడులు
  5. చెరుకు వంశీయులు
  6. మల్యాల వంశీయులు
  7. విరియాల వంశీయులు
  8. పొలవాస పాలకులు
  9. వావిలాల వంశీయులు
  10. యాదవ రాజులు
  11. త్యాగి వంశీయులు
  12. నతవాడి వంశం
  13. కోట వంశం
  14. కాయస్థ వంశం
  15. ఇందులూరి వంశీయులు
  16. ముసునూరి నాయకులు
  17. బాణ వంశం
  18. నాగ వంశీయులు
  19. వైదుంబులు


చిత్రమాలిక

[మార్చు]

ఆర్ధిక రంగం

[మార్చు]

ఈ కాలంలో కాకతీయ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. వ్యవసాయమే నాడు తెలంగాణ ప్రాంతానికి ప్రధాన వృత్తి [ఆధారం చూపాలి]. వ్యవసాయం చాలావరకు వర్షాధారమే, అయితే కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద చెరువులు, కాలువలు త్రవ్వించి, నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. రామప్పచెరువు, కేసరి సముద్రం, పాకాల చెరువు, కాటసముద్రం, చౌడ సముద్రం, సబ్బి సముద్రం, జగత్కేసరి సముద్రం ఉదాహరణలు. ఇంకా నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతాల్లోని అడవులు నాశనం చేసి, పంట పొలాలు ఏర్పాటు చేసి క్రొత్త గ్రామాలు సృష్టించారు. దేశం పలు ప్రాంతాల్లో గోధుమలు, వరి, కొర్రెలు, పెసలు, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు వంటివి ఎక్కువగా పండించేవారు. దేశమంతా కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుకూరగాయల తోటలు ఉండేవి. పంచదార, బెల్లం, నూనె పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. పశుసంపద చాలా ఎక్కువగా ఉండేది. పాలు, పెరుగు, నెయ్యి పుష్కలంగా లభించేది. వ్యవసాయంతో పాటు పెక్కు పరిశ్రమలు వృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి చేసేది. రత్నకంబళాలు, ముఖమల్ వస్త్రాలు, పంచలోహాలతో పలురకాల వస్తువులు తయారయ్యేవి. ఇంకా లక్కబొమ్మలు, ఆటవస్తువులు, ఆయుధాలు, వంటివి తయారయ్యేయి. తోలుబొమ్మలాటకు కావలసిన బొమ్మలకు రంగులు వెయ్యటం పెద్ద పరిశ్రమ. నిర్మల్ కత్తులు జగత్ర్పసిద్ది. వజ్రాల గనులు ఉండేవి. దేశీ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రసిద్ధి. అక్కడ ప్రతి వారము మడిసంత, మైల సంత జరిగేవి. మంథెన, పానగల్లు, అలంపురం, మాచెర్ల, వేల్పూరు, యనమదల, తంగెడ, త్రిపురాంతకం, లేబాక, కొచ్చర్లకోట, నందలూరు, నెల్లారు, పెద గంజాం, ఘంటశాల ఇతర వాణిజ్య కేంద్రాలు. ఇంకా మోటుపల్లి, మచిలీపట్టణం వంటి రేవుపట్టణాల ద్వారా విదేశీ వ్యాపారం జరిగేది.

వ్యవసాయం

[మార్చు]

కాకతీయుల కాలంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వ్యవసాయ సంస్కరణల ద్వారా చెన్నూరు, పాలంపేట, పాకాల, మంథని, ఏటూరు నాగారం, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వచ్చింది, ఫలితంగా ఆ ప్రాంతాలలో వందల గ్రామాలు ఏర్పడ్డాయి. ఇందుకోసం రెండు ప్రధానమైన మార్గాలు అనుసరించారు - ఒకటి వ్యవసాయానికి సాగునీటి ఏర్పాటు, రెండు అడవులు కొట్టించడం ద్వారానూ, సాగులో లేని బీడు భూముల సాగుకు ప్రోత్సాహకాలు అందించడం;[18] సాగునీటికి జలాశయాలు ఏర్పాటు

వేయిస్తంభాల గుడి వద్ద కాకతీయులు నిర్మించిన చెరువు

వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం కావడంతో సాగునీటి వనరుల పెంపుకు వర్షపునీటిని నిల్వచేసుకునే లక్ష్యంతో కాకతీయుల కాలపు నిర్మాణాలు సాగాయి. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన జలాశయాలు నాలుగు విధాలుగా విభజించవచ్చు: సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు. ప్రతీ ఊరికీ అనుబంధంగా, ఆలయానికి ఈశాన్యంగా ఒక చెరువు నిర్మాణం చేసేవారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన పొలాలు ఉండేలా జాగ్రత్తపడడంతో ఊరిలో పడిన వాననీరు చెరువును నింపడంతోపాటు ఊరికి వరదల ముప్పు కూడా ఉండేది కాదు. వర్షపు నీటిని నిలువ చేయడం మాత్రమే కాక సమీపంలోని భారీ జలాశయానికి దీన్ని అనుసంధానించేవారు. 1052 నుంచి చాళుక్యుల సామంతునిగా రాజ్యపాలన చేసిన కాకతీయ పాలకుడు మొదటి ప్రోలయరాజు నిర్మించిన కేసీయసముద్రం సరస్సుతో కాకతీయుల చెరువుల నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత్తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకున్న కాకతీయులు చెరువుల నిర్మాణం కొనసాగించారు. రెండవ బేతరాజు అనుమకొండలో చెరువును కట్టించాడు. ఆపైన గణపతిదేవుడు నెల్లూరు, ఎల్లూరు, గణపురం, గంగాపురం వగైరా చెరువులను నిర్మించి ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు.[18]

వ్యవసాయ భూముల పెంపు

సాగునీటి వనరుల పెంపుతోపాటు సాగుభూములను విస్తరించుకుంటూ పోయారు. ఈ క్రమంలో పలు చర్యలు తీసుకున్నారు: అడవులను నరికించి సాగులోకి తీసుకువచ్చి వందలాది గ్రామాలను నిర్మించారు. [నోట్ 1] నిరుపయోగంగా ఉన్న బీడు భూములను సాగులోకి తీసుకువచ్చినవారికి ఆ సాగుపై పన్నులో రాయితీలు కల్పించారు. గ్రామాలకు దూరంగా సాగులోలేని భూములను బ్రాహ్మణులు, పండితులు, వృత్తులవారికి, అధికారులకు, దేవాలయాలకు కానుకలుగా, అగ్రహారాలుగా ఇవ్వడం ద్వారా సాగులోకి తీసుకువచ్చారు. వ్యవసాయం పెంపొందిద్దామని అడపగట్టు అనే పద్ధతిలో రాచభూములను సగం ఆదాయాన్ని ప్రభుత్వానికి జమకట్టడానికి ఇష్టపడేవారికి కౌలుకు ఇచ్చేవారు. ఈ విధానాలు వ్యవసాయానికి, కాకతీయుల ఆర్థిక స్థితికి సాయం చేశాయి.[18]

జీవనం

[మార్చు]

శిల్పం, సాహిత్యం, కళలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. ఉదాహరణకు నేటి కర్నూలు ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు స్వయంగా విడిసి ఈ పనిని చేపట్టినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.

మూలములు

[మార్చు]
  1. Sastry, Putcha Vasudeva Parabrahma (1978). The Kākatiyas of Warangal (in ఇంగ్లీష్). Government of Andhra Pradesh. p. 25.
  2. డా. మామిడి, హరికృష్ణ (2023-10-19). "Rise and fall of Kakatiyas, turning point in Indian history". Telangana Today. Archived from the original on 2023-10-19. Retrieved 2023-10-30.
  3. Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London
  4. కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad
  5. Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur
  6. తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ
  7. ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు
  8. 8.0 8.1 Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.
  9. Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi Krishnamoorthy
  10. Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
  11. Altekar, A.S. The Rashtrakutas and Their Times, Oriental series No. 36, Oriental Book Agency, Poona, 1934
  12. Rao, M.R. Glimpses of Dakkan History, Orient Longmans Limited, Madras, 1951
  13. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము, సి. వి. రామచంద్ర రావు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాదు
  14. Pre-colonial India in Practice, Cynthia Talbot, 2001, Oxford University Press, pp.177-182, ISBN 0195136616
  15. Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair
  16. "కాకతీయ సామంతులు".
  17. "కాకతీయ సామంత పాలకులు". Archived from the original on 2021-01-25. Retrieved 2020-08-26.
  18. 18.0 18.1 18.2 కట్టా, శ్రీనివాసరావు (2015). "Wikisource link to గంగాదేవి చెరువు". Wikisource link to కూసుమంచి గణపేశ్వరాలయం. లోచన అధ్యయన వేదిక. వికీసోర్స్. 

వనరులు

[మార్చు]
  • Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942
  • A History of India, H. Kulke and D. Rothermund, 1998, Routledge, p. 160, ISBN 0415154820
  • A Social History of the Deccan: 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, pp. 16–20, ISBN 0521254841
  • ఆంధ్రుల చరిత్ర - డాక్టర్ బి యస్ యల్ హనుమంతరావు

బయటి లింకులు

[మార్చు]