Jump to content

నాల్గవ గుండయ

వికీపీడియా నుండి

బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి...

  • చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు...
  • దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి ( నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం ) కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది.
  • రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.
  • ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు.

కాకర్త్య గుండన. 940-995

 ఇతడు ఎఱియ రాష్ట్రకూటుని మనవడు. ఏ కారణం చేతనో బయ్యారం శాసనం ఇతని తండ్రి బేతయ్యను విస్మరిస్తుంది. బహుశా అతను అసమర్థుడు కావడంవల్ల ముదిగొండ చాళుక్యులు అతనిని కొరివి సీమ నుంచి వెళ్ళగొట్టి ఉండవచ్చు లేదా చిన్నతనంలోనే మరణించి ఉండవచ్చు. బేతయ తరువాత కాకర్త్య గుండన కుర్రవాడికి పాలకుడయ్యాడు. ఇదే సమయంలో వేంగిలో రెండవ చాళుక్య భీముని మరణానంతరం అతని పుత్రులైన దానార్ణుడు రెండవ అమ్మరాజుల మధ్య వారసత్వ యుద్ధం సంభవించింది 944లో రెండవ అమ్మరాజు రాజ్యాభిషేకం చేసుకున్నాడు. జ్యేష్ఠ పుత్రుడైన దానార్ణవుడు రాష్ట్రకూట మూడవ కృష్ణుని సహాయం అర్ధించాడు. అతడు తన దండనాయకుడైన కాకర్త్య గుండనను దానార్ణవుడికి సాయంగా పంపాడు. రాష్ట్ర కూటుల సహాయంతో దానార్ణవుడు 955లో వేంగి సింహాసనం అధీష్టంచాడు. ఈ ప్రక్రియలో తనకు సహాయపడిన కాకర్త్య గుండన కోరికపై దొమ్మన అనే బ్రాహ్మణునికి మాంగల్లు గ్రామాన్ని దానం చేసాడు. ఈ విషయాలు దానార్ణవుని 956 నాటి మాంగల్లు శాసనంలో ఉన్నాయి. అనంతరం కాకర్త్య గుండన తిరిగి కుర్రవాడికి వచ్చి 3వ కృష్ణుడి సామంతునిగా కొనసాగాడు.973లో రాష్ట్రకూట సామ్రాజ్య పతనం వరకు గుండన రాష్ట్రకూట సామంతునిగానే ఉన్నాడు.

973లో రెండో తైలపుడు రాష్ట్రకూట వంశాన్ని తొలగించి చాళుక్య సామ్రాజ్యన్ని పునరుద్దరించాడు. వేంగిలో జాటాచోడ భీముడు దానర్ణవుని వధించి వేంగి సింహాసనం అధిష్టించాడు. ఈ కల్లోల పరిస్థితులు ఆసరాగా తీసుకొని కాకర్త్య గుండన కొరివి సీమ పై దండెత్తి ముదిగొండ చాళుక్యుడైన బొట్టు బేతని ఓడించి పారద్రోలాడు 1124లో విరియాల మల్లుడు వేయించిన గూడూరు శాసనం ఆనాటి రాజకీయాలను విపులంగా వివరిస్తుంది. విరియాల మల్లుని ముత్తాత విరియాల ఎఱ్ఱయ ముదిగొండ చాళుక్యుడైన బొట్టు బేతని శత్రువును సంహరించి బొట్టు బేతని కొరివి సీమలో నిలబెట్టాడు అని చెబుతుంది. ఈ బొట్టు బేతయ్య శత్రువు కాకర్త్య గుండన. రాష్ట్రకూట రాజ్యం పతనం అయిన తర్వాత గుండన కొత్త రాజైన తైలపుని సమర్ధించాలా లేక స్వతంత్రించాలా అనే సందిగ్ధంలో ఉన్నాడు. ముదిగొండ చాళుక్యులు రెండవ తైలపుని సామ్రాట్ గా అంగీకరించి అతనికి సామంతులయ్యారు. మారిన పరిస్థితులను ఆసరాగా తీసుకొని గుండన కొరివి సీమపై దండెత్తి బొట్టు బేతని రాజ్యభష్టుని చేశాడు. అతడు తన సామ్రాట్ అయిన రెండవ తైలపుని లేదా సత్యాశ్రయుని ఆశ్రయించి తనకు న్యాయం చేయమని కోరాడు. అతడు దానికి అంగీకరించి తన సేనాని అయిన విరియాల ఎఱ్ఱయ్యకు ఆ కార్యాన్ని అప్పగించాడు. విరియాల ఎఱ్ఱయ్య కాకర్త్య గుండనను చంపి బొట్టు బేతని కొరివిలో ప్రతిష్టించాడు.

మూలాలు

[మార్చు]
  • ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
  • ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి ప్రచురణ
కాకతీయులు...పి.వి.పరబ్రహ్మశాస్త్రి