గుంటూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?గుంటూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E / 16.3008; 80.4428
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 168.41 కి.మీ² (65 చ.మై)[1]
జిల్లా(లు) గుంటూరు జిల్లా
జనాభా
జనసాంద్రత
7,43,354[2] (2011 నాటికి)
• 4,414/కి.మీ² (11,432/చ.మై)
భాష(లు) తెలుగు
ప్రణాళికా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము
పురపాలక సంఘం గుంటూరు నగర పాలక సంస్థ


గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుతో గల గుంటూరు జిల్లాకు పరిపాలనా కేంద్రము. ఈ నగరం 7, 43, 354 జనాభాతో రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరము.[3] భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము గుంటూరు - మంగళగిరి మధ్యలో ఉంది.గుంటూరు రాష్ట్ర రాజధాని అయిన తుళ్ళూరు మండలానికి జిల్లా కేంద్రం. గుంటూరు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒక నగరం.

చరిత్ర

గుంటూరు బస్ స్టేషను దృశ్యము
అన్నమయ్య పార్కులోని ఒక దృశ్యము

క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. క్రీస్తు శకం 8 వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకూ ధరణికోటను రాజధానిగా చేసుకుని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్తులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉంది. అదే పేరుతోనున్న జిల్లా, రెవెన్యూ విభాగం, మండలానికి ఈ పట్టణం కేంద్రము. 1866లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రం లోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, 1788లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది. 1995లో నగరపాలక సంస్థగా [4] మార్చ బడింది. ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన రామచంద్రాపురము అగ్రహారము అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్తంభంపైనున్న 1296 నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.

సీఆర్‌డీఏ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[5]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

నగర పరిధి

అన్నమయ్య పార్కులో ఒక దృశ్యము

గుంటూరు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయనున్నారు.విలీనానికి ప్రతిపాదించబడిన గ్రామాలు:పెదకాకాని, వెనిగండ్ల, అగతవరప్పాడు, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, ఏటుకూరు, దాసరిపాలెం, నల్లపాడు, రెడ్డిపాలెం, అడవితక్కెళ్ళపాడు, అంకిరెడ్డిపాలెం, గోరంట్ల, లాం, బుడంపాడు.పెదకాకాని, నల్లపాడు గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామపంచాయితీలు గ్రేటర్ లో కలవటానికి అంగీకరించాయి. నగర జనాభా 6 లక్షలు. 52 డివిజన్లు. సమీప పంచాయతీల విలీనం జరిగితే జనాభా 8 లక్షలకు చేరుతుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ నగర నవీకరణ పథకం (JNNURM) కింద నిధులు పొందటానికి వీలుంది.

జీవన శైలి

ఇక్కడ నగరంలో నివసించే నగర వాసిని గుంటురియన్ అని అంటారు. ఇక్కడ ఎక్కువగా రాష్ట్ర వాసులే కాకుండా అంతరాష్ట్ర వాసులు కూడా నివసిస్తూ ఉంటారు. పక్క దేశాల నుంచి చదువుకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు.

నగర పాలన సంస్థ

అన్నమయ్య పార్కులో ఒక దృశ్యము

నగర పాలక సంస్థకు వార్డు సభ్యులను, మేయర్ ను ప్రజలు ఎన్నుకుంటారు. వీరి ఆధ్వర్యంలో నడిచే నగర పాలన సంస్థకి అత్యున్నత అధికారి కమీషనర్. వీరికి సహాయంగా అదనపు కమీషనర్, ఖాతాపరీక్షకుడు, ఉప కమీషనర్, పురపాలక ఇంజనీర్, అరోగ్య అధికారి, జీవశాస్త్రవేత్త, ఉప నగర ప్రణాళిక అధికారి వుంటారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ విశాఖ తరువాత అంత పెద్ద నగరపాలక సంస్థని కలిగి గ్రేటర్ గుంటూరుగా మార్పుచెందిన మరో నగరం గుంటూరు మహా నగరం.

ప్రస్తుతం గుంటూరు మహా నగరపాలక సంస్థ అధికారిగా k. కన్నా బాబు గారు (ఐఏఎస్) గారు నియమితులయ్యారు.

Panoramic view of Guntur

గుంటూరు లోని ముఖ్య ప్రదేశాలు

 • ఇస్కాన్ మందిరము.
 • బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం.
 • శంకరవిలాస్
 • సింగపూర్ షాపింగ్ మాల్
 • మిర్చి యార్డు
 • జిన్నా టవర్

రవాణా

గుంటూరు మహానగరమునకు బస్సు సౌకర్యము, రైల్వే సౌకర్యములు ఉన్నాయి.

రోడ్డు సౌకర్యం

నగరమునకు రాష్ట్రము నుండి ఏ కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా సౌకర్యం ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి వంటి ప్రముఖ నగరములకు చేరుకోవటానికి వీలుగా రాష్ట్రము మధ్యలో ఉన్న ఏకైక నగరం గుంటూరు.

 • జా.ర.-5: విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా కొలకత్తా
 • జా.ర.-5: చిలకలూరిపేట, నెల్లూరు మీదుగా చెన్నై
 • ఇన్నర్ రింగ్ రోడ్డు ఫిరంగిపురం వరకు
 • అమరావతి రోడ్డు
 • డొంక రోడ్డు
 • నరసరావుపేట - కడప - బెంగళూరు

గుంటూరు నుండి విజయవాడకు దాదాపు ప్రతి పావుగంటకు ఒక బస్సు ఉంటుంది. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి.ఎన్టీఆర్ బస్ స్టేషను ప్రముఖమైన ఒక బస్ స్టేషను. రాష్ట్రంలో 3వ పెద్ద బస్ స్టేషను. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు (మోటారు సైకిళ్ళు, కారులు, సైకిళ్ళు వంటివి) అధికంగా వాడుతారు. సరకుల రవాణాకు లారీలు సప్లై చేసే కంపెనీలు నగరంలో చాలా ఎక్కువ ఉన్నాయి.

రైలు సౌకర్యం

గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను. విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉంది. గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్‌ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్‌ లైన్‌ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు-విజయవాడ నగరాల మధ్య మెట్రో మరియు సబర్బన్ రైళ్ళు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విమాన సౌకర్యం

గుంటూరు నగరానికి దగ్గరలోని విమానాశ్రయం విజయవాడ దేశీయ విమానాశ్రయం. దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు నగరానికి దగ్గరలో ఒక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

విద్యాకేంద్రం

ఆర్.వి.ఆర్. & జె.సి. ఇంజనీరింగు కళాశాల

గుంటూరు ప్రముఖ విద్యా కేంద్రము మరియు వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. భారత పొగాకు నియంత్రణ బోర్డు కూడా గుంటూరులో ఉంది.గుంటూరు నగరములో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉంది.

విద్యా సంస్థలు

రాజకీయాలు

గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలత మరియు పరిపక్వత గలవారు. ఇక్కడి మేజర్ రాజకీయపార్టీలు తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ మరియు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు. క్రితంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.ఈ నగరంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ.గుంటూరుకు ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.

ప్రముఖులు

దర్శనీయ ప్రదేశాలు

అమరావతి

Dhyana Buddha at Amaravati
 • ఇది గుంటూరుకు 30 కీ.మీ.ల దూరములో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణము. అమరావతి దక్షిణభారతదేశములోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధారామం. క్రీ.పూ. మూడు లేదా రెండవ శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు మరియు కోల్‌కతాలలో ఉన్న మ్యూజియములలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియము ఉంది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షము యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.
 • గుంటూరులో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాభాకి వినోదానికి కొదవలేదు.

గుంటూరు ప్రత్యేకతలు

 • కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి (క్రీ.శ. 13 వ శతాబ్దం) తన తండ్రియైన కొట్టరువు కొమ్మన గురించి "గుంటూరి విభుడు" అని అభివర్ణించాడు. అందువలన ఆయన గుంటూరు ఒక చిన్న గ్రామంగా ఉన్న రోజులలో దానికి గ్రామాధికారిగా ఉండేవాడని తెలుస్తోంది.
 • 1868, ఆగష్టు 18 న గుంటూరులో నుండి సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియర్ జాన్సన్ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు. అప్పటి సూర్యగ్రహణం అసాధారణంగా 10 నిముషాల సేపు వచ్చి, ఎందరో శాస్త్రవేత్తలను ఆకర్షించింది.
 • మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరుకు సంబంధించింది.
 • పాకిస్తాన్ ఏర్పాటుకు కర్త అయిన మొహమ్మదు ఆలీ జిన్నా పేరిట గుంటూరులో ఒక స్థూపం ఉంది. (హిందూ పత్రికలోని ఈ వ్యాసం దీని ప్రత్యేకతను వివరిస్తుంది)
 • గుంటూరు యొక్క ప్రాచీన నామము గర్తపురి.
 • గుంటూరు నగరంలోనిరామచంద్రాపుర అగ్రహారం అతిపురాతనమైన ప్రాంతం.12వ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంత రాజు ఈ అగ్రహారాన్ని ఈనాంగా ఇస్తే ఆయన ఇక్కడి నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకుని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేశాడట.ప్రస్తుతం ఆర్‌ అగ్రహారంలో ఉన్న ఓ శిలాఫలకంపై ఆ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినటు లిఖించి ఉంది. దీన్ని బట్టి గుంటూరు కన్నా ఈ రామచంద్రాపురం అగ్రహారం ఎంతో పురాతనమైనదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆర్‌ అగ్రహారం అని, ఏడు సందుల వీధి అని పిలుస్తారు.ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి. దీనికి అనుకుని ఉన్న చెరువు కాల క్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది. ఇక్కడ చెరువు ఉందని, ఈ ప్రాంతంలోని రామనామ క్షేత్రంలోని రాముల వారి తెప్పోత్సవం ఇక్కడి చెరువులోనే జరిపించే వారట.
 • గుంటూరు నగరానికి విద్య, ఆరోగ్య రంగాలలో మంచి గుర్తింపు గలదు.
 • కేంద్రీయ వ్యవసాయ పరిశోధన కేంద్రము గుంటూరు సమీపములోని ' లాం ' వద్ద ఉంది. ఇచ్చట వివిధ వ్యవసాయ ఉత్పత్తులలో సరిక్రొత్త వంగడాలను కనుగొనడానికి పరిశోధోన జరుగును.
 • గుంటూరు పొగాకు వ్యాపారానికి మరియు మిర్చి, ప్రత్తి ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి చెందినది.
 • మిర్చి శీతల గిడ్డంగులు ( కోల్డ్ స్తోరేజేస్ ) ఎక్కువగా ఉన్నప్రదేశాలలో గుంటూరు ఆసియాలో నే రెండవ స్థానంలో ఉంది.
 • అభ్రకము (మైకా) 2200 సంవత్చరాల క్రితము మొదట గుంటూరు ప్రాంతములోనే కనుగొనబడింది.
 • తొలి భారత కళాశాలలో ఒకటైన ఆంధ్ర క్రైస్తవ కళాశాల 1885లో గుంటూరులో స్థాపించబడింది.
 • మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు.

రహదారి దూరము

విజయవాడ నగరం నుండి భారత దేశము లోని ప్రధాన (కొన్ని) ప్రాంతాల మధ్యన దూరం (.కిలోమీటర్లలో) [1]

నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.) నగరం /పట్టణము దూరము (కి.మీ.)
అగర్తలా 2830 ఆగ్రా 1606 అహ్మదాబాదు 1433 ఐజ్వాల్ 2776
అకోలా 774 అలహాబాదు 1403 అమృతసర్ 2319 బెంగుళూరు 623
కలకత్తా 1252 అజ్మీర్ 1610 ఢిల్లీ 1815 గయ 1409
ముంబై 987 మైసూరు 803 వారణాసి 1451 విశాఖపట్నం 382
హైదరాబాదు 267 కాకినాడ 247 నాగపూర్ 765 తిరుపతి 375
పూణే 840 చెన్నై 415 చండీగఢ్ 2065 ఊటీ 888

మూలాలు

 1. "The Case of Guntur, India" (PDF). DReAMS – Development of Resources and Access to Municipal Services. p. 1. Retrieved 15 June 2015. 
 2. "Guntur city population is 7,43,354 as per 2011 Census". The Hindu. 26 May 2013. Retrieved 12 October 2014. 
 3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; population అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. గుంటూరు నగరపాలక సంస్థ జాలస్థలము
 5. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx

బయటి లింకులు

మూసలు, వర్గాలు
"https://te.wikipedia.org/w/index.php?title=గుంటూరు&oldid=2109996" నుండి వెలికితీశారు