నందమూరి తారక రామారావు
నందమూరి తారక రామారావు | |
---|---|
![]() విశ్వ విఖ్యాత నట సార్వభౌమ
N.T.రామారావు | |
జననం | నందమూరి తారక రామారావు 1923 మే 28 [1] ![]() |
మరణం | జనవరి 18,
1996![]() |
నివాస ప్రాంతం | హైదరాబాదు,తెలంగాణ |
ఇతర పేర్లు | విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు |
వృత్తి | సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు రంగస్థల నటుడు |
ఎత్తు | 5' 10" |
బరువు | 78 |
తర్వాత వారు | చంద్రబాబు నాయుడు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
మతం | హిందూ |
భార్య / భర్త | బసవ రామ తారకం(m.1942-1985)
లక్ష్మీపార్వతి(m.1993-1996) |
పిల్లలు | జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ గారపాటి లోకేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని ఉమామహేశ్వరి[1] |
తండ్రి | లక్ష్మయ్య చౌదరి |
తల్లి | వెంకట్రావమ్మ |
నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.[1]
బాల్యం
నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది.
కుటుంబం
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
చలనచిత్ర జీవితం
రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
1956లో విడుదలైన మాయాబజార్‌లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది.
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు.
1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు.
1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు 'కళాప్రపూర్ణ ' స్వీకరించారు.
రాజకీయ రంగ ప్రవేశం
1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు అతనుకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు. దానిని అతను "చైతన్యరథం" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.
ప్రచార ప్రభంజనం
ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.
ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు అతను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.
1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతను విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి.
రాజకీయ ఉత్థాన పతనాలు
1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే అతను రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది. ఎన్నికల ప్రచారసమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణuల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది. రాజకీయపార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన నెలకొంది.ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. కేంద్రం మిథ్య అనేంతవరకు ఎన్టీఆర్ వెళ్ళాడు.
1983 శాసనసభ ఎన్నికల్లో అతను సాధించిన అపూర్వ విజయం అతను రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు అతనుకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, అతను ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు.
1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. అతను వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో అతను సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి.
1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు.తెలుగు దేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు . అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.
ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. అతను మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన [2] ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.
మహానాడు
మహానాడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతీ సంవత్సరం మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం.[3] 2022లో తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు హైదరాబాదులో మార్చి 29న, మహానాడును విజయవాడలో మే 28న జరగనున్నాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాదిపాటు వేడుకగా జరగనున్నాయి.[4]
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్టీఆర్ విశిష్టత
- సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో అతనుంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు.
- వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే.
- పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు.
- తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
- స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.
- బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం అతనుకు దక్కింది.
- రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
- తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే.
- దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను.
- ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసినవారే.
- “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ సమర్థించటం ఒక విశేషం.
- మదరాసులో అతను వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి అతనును దర్శించుకుని వచ్చేవారు.
- కొన్ని సాహసోపేత నిర్ణయాలు: మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం
- రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది.
- ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు.
- రామారావూ గారి నాయకత్వన జరిగిన కార్యక్రమాల జాబిత: ముఖ్యమంత్రి
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో,ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.
- తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు.
విమర్శలు
- ఏకస్వామ్య పరిపాలన
- వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి అతను వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంతో రాజకీయనేతలు వాడే భాషా స్థాయి మరింత పడిపోయింది.
- ఏ ఇతర నేతకూ లభించని ప్రజాదరణ పొందినా కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారు.
- అతను పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి. అతనుకు ప్రత్యక్ష సంబంధం లేకున్నా, అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు.
సినిమాలు
నటుడిగా
దర్శకునిగా
- సీతారామ కళ్యాణం (1961 సినిమా) (1961)
- గులేబకావళి కథ (1962)
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- వరకట్నం (1969)
- తల్లా పెళ్ళామా (1970)
- తాతమ్మకల (1974)
- దానవీరశూరకర్ణ (1977)
- చాణక్య చంద్రగుప్త (1977)
- అక్బర్ సలీమ్ అనార్కలి (1978)
- శ్రీరామ పట్టాభిషేకం (1978)
- శ్రీమద్విరాటపర్వం (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979)
- చండశాసనుడు (1983)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984)
- బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
- సామ్రాట్ అశోక్ (1992)
నిర్మాతగా
- సామ్రాట్ అశోక్ (1992)]]
- శ్రీనాథ కవిసార్వభౌమ (1993)]]
- దానవీరశూరకర్ణ (1977)]]
- శ్రీమద్విరాటపర్వం (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979)
- చండశాసనుడు (1983)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984)
- బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
రచయితగా
ప్రచురణలు
పుస్తకాలు
పుస్తకం ముఖ చిత్రం | వివరాలు |
---|---|
| |
| |
|
సాంస్కృతిక ప్రపంచంలో స్మరణలు
నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాలు 2019 లో విడుదలయ్యాయి.
వంశవృక్షం
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 "నందమూరి తారక రామారావు". తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు. Archived from the original on 2014-02-12. Retrieved 2014-01-25.
{{cite web}}
: Cite has empty unknown parameter:|2=
(help) - ↑ శ్రీధర్ (2011-01-12). "కార్టూను". ఈనాడు. Archived from the original on 2011-07-18. Retrieved 2014-01-25.
- ↑ Harikrishna (2020-05-26). "రేపటి నుంచే టీడిపి మహానాడు..!ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్న చంద్రబాబు". https://telugu.oneindia.com. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-25.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ "హైదరాబాద్‌లో ఆవిర్భావ వేడుకలు". andhrajyothy. Retrieved 2022-03-04.
వనరులు
- ఆచారం, షణ్ముఖాచారి. "తెలుగుజాతి యుగపురుషుడు...తారక రాముడు". sitara.net. Retrieved 19 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇవికూడా చూడండి
బయటి లింకులు
![]() |
Wikimedia Commons has media related to N. T. Rama Rao. |
- నందమూరి అభిమానుల వెబ్ సైటు (ఆంగ్లం)
- ఎన్.టి.ఆర్ గురించి : N.T. Rama Rao (1923 - 1995): ది హిందూ(ఇంగ్లీష్ పత్రిక)కథనం
- శిరాకదంబం వెబ్ సైటు లో నందమూరి గురించిన వ్యాసం
- తెలుగు దేశం పార్టీ వెబ్ సైటు
- "Working Paper 179 Democratic Process and Electoral Politicsin Andhra Pradesh, India" (PDF). Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2006-01-10.
- "Working Paper 180 Democratic Process and Electoral Politicsin Andhra Pradesh, India" (PDF). Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2006-01-10.
ఇంతకు ముందు ఉన్నవారు: కోట్ల విజయభాస్కరరెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 09/01/1983—16/08/1984 |
తరువాత వచ్చినవారు: నాదెండ్ల భాస్కరరావు |
ఇంతకు ముందు ఉన్నవారు: నాదెండ్ల భాస్కరరావు |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 16/09/1984—03/12/1989 |
తరువాత వచ్చినవారు: మర్రి చెన్నారెడ్డి |
ఇంతకు ముందు ఉన్నవారు: కోట్ల విజయభాస్కరరెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 12/12/1994—01/09/1995 |
తరువాత వచ్చినవారు: నారా చంద్రబాబునాయుడు |
- CS1 errors: empty unknown parameters
- నందమూరి కుటుంబం
- CS1 maint: url-status
- Commons category link is on Wikidata
- విశేషవ్యాసాలు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల నటులు
- 1923 జననాలు
- 1996 మరణాలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- కృష్ణా జిల్లా రంగస్థల నటులు
- రాజకీయాలలో సినీనటులు
- తెలుగుదేశం పార్టీ
- తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు కళాకారులు
- కృష్ణా జిల్లా సినిమా నటులు
- కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు
- కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- అనంతపురం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- కృష్ణా జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు
- కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్యమంత్రులు
- కృష్ణా జిల్లా సినిమా దర్శకులు
- కృష్ణా జిల్లా సినిమా నిర్మాతలు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు