పాతాళ భైరవి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాతాళభైరవి
(1951 తెలుగు సినిమా)
Pathala Bhairavi poster.jpg
సినిమా విడుదల పోస్టర్
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం నాగి రెడ్డి &
చక్రపాణి
రచన పింగళి నాగేంద్రరావు,
కమలాకర కామేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
ఎస్వీ రంగారావు ,
కె.మాలతి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
సావిత్రి ,
గిరిజ,
వల్లూరి బాలకృష్ణ,
సురభి కమలాబాయి,
పద్మనాభం,
రేలంగి
సంగీతం ఘంటసాల
విడుదల తేదీ 15 మార్చి 1951
నిడివి 195 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాతాళ భైరవి 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.

మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు.

కథ[మార్చు]

మాంత్రికునిగా ఎస్.వి.రంగారావు, ప్రక్కన ఎన్.టి.ఆర్. [1]

ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు (ఎన్.టి.ఆర్). సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని, మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.

మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది (రేలంగి) పాతాళభైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్ళి పీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు.

తారాగణం[మార్చు]

విశేషాలు[మార్చు]

 • తోట రాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును, మాంత్రికుడు పాత్రకు ముక్కామలను కె.వి.రెడ్డి తీసుకుందామని అనుకున్నాడు. నాగిరెడ్డి-చక్రపాణిల సూచనను మన్నించి కె.వి. ఓసారి ఎన్.టి.రామారావును పరిశీలించడం అతను చూడడానికి వచ్చినప్పుడే టెన్నిస్ మ్యాచ్ అడుతున్న రామారావు రెండు పాయింట్లు కోల్పోవడంతో కోపగించి బ్యాటును బలంగా పట్టుకుని బంతి విసిరికొట్టడంతో ఓ విధమైన జానపద నాయక లక్షణం కనిపించడంతో అతన్నే హీరోగా తీసుకున్నాడు కె.వి.రెడ్డి. హీరోగా పెద్ద ఇమేజీ లేని నటుడిని తీసుకోవడంతో ప్రతినాయకుడు కూడా ప్రఖ్యాతుడైన ముక్కామల కాకుండా కొత్తవాడు అయివుండాలని ఎస్.వి.రంగారావును తీసుకున్నారు.[2]
 • 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ పాతాళ భైరవే.
 • తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.
 • 1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీశారు.[3]
 • ఈ సినిమా ఆధారంగా పాతాళ భైరవి (నాటకం) రూపొందింది.

ముఖ్యమైన డైలాగులు[మార్చు]

 • సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా
 • మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
 • జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
 • జై పాతాళ భైరవి
 • సాష్తాంగ నమస్కారం సెయరా

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
తియ్యని ఊహలు హాయిని గొలిపే పింగళి నాగేంద్రరావు ఘంటసాల పి.లీల
ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
ఇతిహాసం వినరా పింగళి నాగేంద్రరావు ఘంటసాల కమలా చంద్రబాబు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు పింగళి నాగేంద్రరావు ఘంటసాల వి.జె. వర్మ
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు పింగళి నాగేంద్రరావు ఘంటసాల జిక్కి
తాళలేనే నే తాళలేనే పింగళి నాగేంద్రరావు ఘంటసాల రేలంగి
హాయిగా మనమింకా స్వేచ్ఛగా పింగళి నాగేంద్రరావు ఘంటసాల ఘంటసాల, పి.లీల
రానంటే రానే రాను పింగళి నాగేంద్రరావు ఘంటసాల పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి
వినవే బాలా నా ప్రేమ గోలా పింగళి నాగేంద్రరావు ఘంటసాల రేలంగి

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
 2. ఎం.ఎల్., నరసింహం (13 April 2013). "పాతాళభైరవి (1951)". ద హిందూ (in ఇంగ్లీష్). Retrieved 3 February 2019.
 3. రెంటాల జయదేవ ఇష్టపది సినిమా బ్లాగు
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.


కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య