గిరిజ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గిరిజ

జననం (1936-03-03)1936 మార్చి 3
కంకిపాడు
భార్య/భర్త సి. సన్యాసిరాజు
ప్రముఖ పాత్రలు పాతాళభైరవి
గుడిగంటలు
జగదేకవీరుని కథ
ఆరాధన

గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.

గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది. [1]

నేపధ్యము[మార్చు]

1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), ఎన్. టి. రామారావు (మంచి మనసుకు మంచిరోజులు), జగ్గయ్య (అత్తా ఒకింటి కోడలే), శివాజీగణేశన్ (మనోహర), హరనాథ్ (మా ఇంటి మహాలక్ష్మి), చలం (కులదైవం), జె. వి. రమణమూర్తి (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.

వివాహము, వ్యక్తిగత జీవితము[మార్చు]

గిరిజకు 17 యేళ్ళ వయసులో తల్లి మరణించింది. ఈమె వివాహము సి. సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత గిరిజ సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ప్రయత్నించింది. గిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.

ఈమె కూతురు శ్రీరంగ, దాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.

నటించిన సినిమాలు[మార్చు]

  1. నవ్వితే నవరత్నాలు (1951)
  2. పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)
  3. ధర్మదేవత (1952) (వాసంతిగా)
  4. భలేరాముడు (1956)
  5. భలే అమ్మాయిలు (1957)
  6. దొంగల్లో దొర (1957)
  7. ముందడుగు (1958)
  8. రాజనందిని (1958)
  9. అప్పుచేసి పప్పుకూడు (1959)
  10. మనోరమ (1959)
  11. రాజా మలయసింహ (1959)
  12. రేచుక్క పగటిచుక్క (1959)
  13. ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)
  14. దైవబలం (1959)
  15. పెళ్ళికానుక (1960)
  16. భట్టి విక్రమార్క (1960)
  17. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  18. బాగ్దాద్ గజదొంగ (1960)
  19. ఋణానుబంధం (1960)
  20. కులదైవం (1960)
  21. ఇంటికి దీపం ఇల్లాలే (1961)
  22. జగదేకవీరుని కథ (1961)
  23. భార్యాభర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)
  24. వెలుగునీడలు (1961)
  25. సిరిసంపదలు (1962)
  26. ఆరాధన (1962)
  27. పరువు ప్రతిష్ఠ (1963)
  28. బందిపోటు (1963)
  29. ఈడు జోడు (1963)
  30. రాముడు-భీముడు (1964)
  31. కలవారి కోడలు (1964)
  32. ప్రేమించి చూడు (1965)
  33. మంగమ్మ శపథం (1965)
  34. నవరాత్రి (1966)
  35. ఆస్తిపరులు (1966)
  36. రహస్యం (1967)
  37. ఆడదాని అదృష్టం (1974)

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ (2017-07-31). 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 116.