Jump to content

పెళ్లినాటి ప్రమాణాలు

వికీపీడియా నుండి
(పెళ్ళినాటి ప్రమాణాలు నుండి దారిమార్పు చెందింది)
పెళ్ళినాటి ప్రమాణాలు
(1958 తెలుగు సినిమా)

సినిమా విడుదల సందర్భంగా 1959 జనవరి చందమామ లో వచ్చిన సినిమా పోస్టరు
దర్శకత్వం కె.వి.రెడ్డి
రచన పింగళి నాగేంద్రరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జమున,
యస్వీ.రంగారావు,
రాజసులోచన
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెళ్ళినాటి ప్రమాణాలు కె.వి.రెడ్డి దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, జమున, ఎస్.వి.రంగారావు, రాజసులోచన ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.

చదువు పూర్తి చేసుకున్న కృష్ణారావు (నాగేశ్వరరావు) బాబాయి సలహాలరావు (రమణారెడ్డి) సిఫార్సుతో భీమసేనరావు (రంగారావు) ఇంటికి ఉద్యోగానికై వెళ్తాడు. కానీ ఓ ఉత్తరం తారుమారు అవ్వడంతో కృష్ణారావుని ఆ ఇంట్లో వంటవాడుగా భావిస్తారు. అసలు నిజం తెలిపేందుకు సలహాలరావు భీమసేనరావు ఇంటికి వెళ్ళి, అతడి కూతురు రుక్మిణి (జమున)ని కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సిఫార్సు చేస్తాడు. మొదట్లో ఒప్పుకోని భీమసేనరావుని తన కొడుకు ప్రతాప్ (ఆర్. నాగేశ్వరరావు) కృష్ణారావు తన స్నేహితుడేనని, మంచివాడని నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. రుక్మిణికి కూడా కృష్ణారావు నచ్చడంతో వారిద్దరి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి రోజు దంపతులు ఇద్దరు అనేక ప్రమాణాలు చేస్తారు. కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగాక, ఇంటి పనులకే అంకితమైన రుక్మిణి పట్ల విసుగొచ్చిన కృష్ణారావు తన సెక్రటరీ రాధ (రాజ సులోచన)కు దగ్గరవుతాడు. ఇది తెలుసుకున్న సలహాలరావు, ప్రతాప్, రుక్మిణి పట్ల బాధ్యతను కృష్ణారావుకి తెలిసేలా చేసి వారి సంసారాన్ని ఎలా చక్కబెట్టారు అన్నది మిగిలిన కథ.

పాత్రలు

[మార్చు]
పాత్రధారి పాత్ర
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణారావు
జమున రుక్మిణి
ఆర్.నాగేశ్వరరావు ప్రతాప్
రాజసులోచన రాధాదేవి
ఎస్.వి.రంగారావు భీమసేనరావు
రమణారెడ్డి సలహాలరావు
ఛాయదేవి సంసారం - సలహాలరావు భార్య
శివరామకృష్ణయ్య రేపల్లె పరమానందయ్య
అల్లు రామలింగయ్య ప్రకటనలు
సి.హెచ్.కుటుంబరావు అమ్మకాలు
బాలకృష్ణ ఆఫీసు ప్యూను
సురభి కమలాబాయి ఎరుకల సుబ్బి
బొడ్డపాటి పేరయ్య
పేకేటి శివరాం ఎమ్.వి.తేశం

పాటలు

[మార్చు]

ఘంటసాల వేంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని అన్ని పాటలు పింగళి నాగేంద్రరావు రచించారు.

  1. అరణా అణా ఐనా సరసమైన బేరమయా మల్లెపూల దండలయా మళ్ళీ వస్తే - జిక్కి
  2. ఏదో తెలియక పిలిచితినోయీ మీదికి రాకోయీ కృష్ణా వాదుకు రాకోయీ -సుశీల, ఘంటసాల
  3. చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి దేవి చల్లగ చూడాలి మల్లి సుగంధం - ఘంటసాల
  4. నీతోనే లోకము నీతోనే స్వర్గము అదే మన జీవనము అదే మన ఆనందము - ఘంటసాల,పి.లీల
  5. బృందావన చందమామ ఎందుకోయీ తగవు అందమెల్లనీదే ఆనందమె కద - పి.లీల,ఘంటసాల
  6. లాలి మా పాపాయీ ఆనందలాలి దీవించి సురులెల్ల లాలించు లాలి -పి.లీల బృందం
  7. వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో ఈ మాయ ఏమో జాబిలి - ఘంటసాల,పి.లీల
  8. శ్రీమంతురాలివై చెలువొందు మాతా - మమ్ము దీవింపుమా మా ఆంధ్రమాతా (దేశభక్తి గీతం) - పి.లీల బృందం
  9. సుర యక్ష గంధర్వ సుందరీమణులెందరందరిని నేనే పెళ్ళాడినాను (పద్యం) - మాధవపెద్ది

థీమ్స్, ప్రభావాలు

[మార్చు]

సినిమాలో ప్రతాప్(ఆర్.నాగేశ్వరరావ్) పాత్రకి యమ్‌డన్‌ అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని జర్మనీ నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు. అయితే నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ మాత్రం యుద్ధక్షేత్రంలో వేలాది నౌకలతో సమానంగా పోరాడటం కన్నా, ప్రత్యేకంగా యుద్ధానికి దూరంగా ఇంగ్లాండు కాలనీలపై దాడులుచేసి శత్రువులను గందరగోళంలో పడేస్తానన్నాడు. ఒంటరి నౌకతో అన్ని నౌకలను ఎదుర్కోవడం ప్రమాదకరమని, ఐతే అంతటి సాహసముంటే ముందుకువెళ్ళమని అనుమతించారు. ఆ క్రమంలో ఆ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో బ్రిటీష్ నౌకగా భ్రమకల్పిస్తూ బ్రిటీష్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తీరానికి వచ్చి మద్రాసు తీరంలో పెట్రోలుబంకులు పేల్చేసింది. అయితే కెప్టెన్ కి తీరంలోని వలస ప్రజలపై దాడిచేసే ఉద్దేశం లేకపోవడంతో అతితక్కువ జననష్టం, భారీగా ఆస్తినష్టం జరిగాయి. అయినా జరిగిన కల్లోలానికి మద్రాసు ప్రజలు నగరం నుంచి కొన్నాళ్ళు పారిపోయారు, దోపిడీలు జరిగాయి. దాంతో యమ్‌డన్‌ అనే పదానికి శక్తివంతమైన, తీవ్రమైన, పెద్ద అన్న అర్థాలు తమిళ, మలయాళ, సింహళ భాషల్లో చోటుచేసుకున్నాయి. ఈ సినిమాలో ప్రతాప్ పాత్ర సైనికుడు కావడంతో యమ్‌డన్‌ అన్న ఊతపదానికి ఔచిత్యం కూడా కుదిరింది.[1]

మూలాలు

[మార్చు]
  1. యమ్బీయస్, ప్రసాద్. "యమ్‌డన్‌ - 1". గ్రేటాంధ్ర. Retrieved 29 July 2015.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య