అల్లు రామలింగయ్య
అల్లు రామలింగయ్య | |
---|---|
![]() అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ల | |
జననం | అల్లు రామలింగయ్య అక్టోబర్ 1, 1922 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు |
మరణం | జూలై 31, 2004 |
వృత్తి | నటుడు, నిర్మాత |
జీవిత భాగస్వామి | కనకరత్నం |
పిల్లలు | అల్లు అరవింద్ కొణిదల సురేఖ |
తల్లిదండ్రులు |
|
అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1922 - జూలై 31, 2004) సినీ నటుడు, నిర్మాత. అతను హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. అతను కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతని అల్లుడు.
బాల్యము[మార్చు]
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు.[1] అతను తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. అతను దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. అతను కుమారుడు అల్లు వెంకయ్య మరల వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కుకున్నాడు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్య మూర్తి, నారాయణ మూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్యని పేరు పెట్టుకున్నారు.
రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.[2]
చలనచిత్ర జీవితం[మార్చు]
అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది.
పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు.
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక అతనుకు తీరలేదు. ఆతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ఆమ్యామ్య.. అప్పుం అప్పుం లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
పురస్కారాలు, సన్మానాలు[మార్చు]
యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో ' పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.
2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో అతను విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '
అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతను హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.
నటించిన సినిమాలు[మార్చు]
- కృష్ణ గారడీ (1986)
- ఈనాటి బంధం ఏనాటిదో (1977)[3]
మూలాలు[మార్చు]
- ↑ సి, శ్రీకాంత్ కుమార్ (2010). అల్లు రామలింగయ్య జీవిత చిత్రం. విజయవాడ: ఋషి బుక్ హౌస్. p. 12.
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 98.
- ↑ Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.
బయటి లింకులు[మార్చు]
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- అల్లురామలింగయ్య వంశవృక్షం
- 1922 జననాలు
- 2004 మరణాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల నటులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నిర్మాతలు