సప్తపది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సప్తపది
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం భీమవరపు బుచ్చిరెడ్డి
కథ కె. విశ్వనాధ్
చిత్రానువాదం కె. విశ్వనాధ్
తారాగణం జె.వి. సోమయాజులు,
భమిడిపాటి సవిత,
గిరీష్,
అల్లు రామలింగయ్య,
జె.వి. రమణమూర్తి,
సాక్షి రంగారావు,
డబ్బింగ్ జానకి,
రవికాంత్
సంగీతం కె.వి.మహదేవన్
పుహళేంది (సహాయం)
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్. జానకి,
పి. సుశీల
నృత్యాలు శేషు
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం కస్తూరి
కూర్పు జి.జి.కృష్ణారావు
నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


సప్తపది, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.

కథ[మార్చు]

కృష్ణా నది వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. (జె.వి. సోమయాజులు). ఆయన కొడుకు అవధాని (జె.వి. రమణమూర్తి), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు (అల్లు రామలింగయ్య). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ (డబ్బింగ్ జానకి) మనవడు ఎదురు చెప్పారు.

ఓ పక్క టైటిల్స్ పడుతుండగానే కథ తాలూకు మూడ్ ని క్రియేట్ చేసి, పాత్రలని ప్రవేశ పెడతారు. టైటిల్స్ అయ్యాక వచ్చే రెండో సన్నివేశంలో కథానాయిక 'హేమ' పరిచయం ఉంటుంది. అమ్మవారి ఉత్సవాల్లో ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు రాజుగారు. హేమ ఎవరో కాదు, యాజులు గారి కూతురు జానకి కూతురు. కూతురు ఒక నాట్యాచార్యుడిని పెళ్ళి చేసుకుందని ఆమె అంటే కోపం యాజులు గారికి. కూతురు మరణించాక కూడా అల్లుడితోటీ, మనవరాలితోటీ కూడా మాట్లాడడు ఆయన. మరోపక్క ఆయన కొడుకు, కోడలికి హేమని గౌరీనాధానికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఉంటుంది.

విడిపోయిన రెండు కుటుంబాలనూ కలపాలని రాజుగారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. హేమ పై వచ్చే తొలి సన్నివేశంలోనే ఆమె తన డాన్స్ ట్రూపులో వేణువు ఊదే హరిబాబుతో సన్నిహితంగా ఉండడాన్ని చూపిస్తారు. తన నృత్య ప్రదర్శనతో యాజులు గారిని మెప్పిస్తుంది హేమ. తరువాతి సన్నివేశంలో హేమ, హరిబాబు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నట్టు, మూఢాచారాలు, వింత నమ్మకాలు వాళ్లకి అడ్డుపడుతున్నట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళో ఓ వుయ్యాల కడతారు.

హేమ ప్రదర్శనని మెచ్చుకున్న రాజుగారు, ఆమెని గౌరీనాధానికి ఇచ్చి పెళ్ళి చేయమని యాజులుకి సలహా ఇస్తారు. "నాట్యం చేసే పిల్ల" అని యాజులు అభ్యంతరం చెబితే, నాట్యం వేదాల నుంచి పుట్టిందే కదా అని ఒప్పిస్తారు. హేమని ఆలయానికి పిలిచి, వేదగానానికి నాట్యం చేయమని ఆమెకి పరీక్ష పెట్టి, గౌరీనాధానికి, ఆమెకి పెళ్ళి జరిపిస్తానని ప్రకటిస్తారు యాజులు. పడవలో తన ఊరికి తిరుగు ప్రయాణమైన హేమకి గతం గుర్తొస్తుంది.

ఒక నాట్య ప్రదర్శనలో హరిబాబుతో పరిచయం, అతని చొరవతో అది ప్రేమగా మారడం. ఆమె తన ప్రేమని వ్యక్త పరిచాక. అతను తాను 'హరిజనుణ్ణి' అని చెప్పడం.. హేమ తనని పెళ్ళి చేసుకోడం కుదరని పక్షంలో ఆమె మరెవ్వరి సొత్తూ కాకూడదన్న 'వింత కోరిక' కోరడం జరుగుతాయి. హరిబాబు తన వివరాలు చెప్పకుండా మోసం చేసినందుకు హేమ అతన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది.. కానీ హేమ అతనిపై ప్రేమని పోగొట్టుకోదు.

గౌరీనాధంతో హేమ పెళ్ళి జరిగాక, ఆమె అతనికి తను నిత్యం పూజించే దేవతలా కనిపించడంతో వాళ్ళిద్దరూ 'పరాయి' వాళ్ళుగానే ఉంటారు. హేమకి పిల్లలు కలగపోవడంతో, ఆమెచేత గుళ్ళో చెట్టుకి వుయ్యాల కట్టించే ప్రయత్నం చేస్తారు. గతం గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది హేమ. గుళ్ళో పూలమ్ముకునే అమ్మాయి నుంచి విషయం తెలుసుకున్న గౌరీనాధం, హేమ ద్వారా హరిబాబుని గురించి తెలుసుకుని అతన్ని తీసుకురాడానికి బయలుదేరతాడు. మనవరాలిని ఓ హరిజనుడికి ఎలా ఇవ్వాలన్న యాజులు సంశయాన్ని పోగొడతారు రాజుగారు. ఊరివారందరినీ సమాధాన పరిచి, హేమని హరిబాబుతో పంపడం సినిమా ముగింపు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

విశేషాలు[మార్చు]

ముందుగా చెప్పినట్టుగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బలం అనిపిస్తుంది. రాజుగారి భార్య, కూతురు ఒకేసారి పురిటికి సిద్ధపడడం ఒక్కటే అనవసరపు సన్నివేశం అనిపిస్తుంది. నిజానికి ఈ సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు. విశ్వనాథ్ చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఆపాత మధురాలే. సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాధ్ కే చెల్లింది. 'అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ' 'ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ' లాంటి చమక్కులు చూపారు వేటూరి. 'గోవుల్లు తెల్లన' పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండగలమా? జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు.. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి..[1]

జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది. వర్ణ వ్యవస్థ గురించి సంభాషణలోను, పాటలలోను అనేక తత్వచింతనలు జొప్పించారు. అల్లు రామలింగయ్యకు, సోమయాజులుకు జరిగిన సంభాషణలలో వృత్తి ధర్మం, మనో ధర్మం గురించిన అభిప్రాయాలున్నాయి.

సృష్టి ఆదిలో లేకున్నా మధ్యలో పుట్టుకొచ్చిన వర్ణవ్యవస్థ గురించి వేటూరి పాటలలో చక్కని ప్రశ్నలున్నాయి -

ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడిమంత్రపు మనుషులకే ఈ మాటలు, ఇన్ని మాటలు
.....
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మావాడేలెమ్మంది
....
ఏడు వర్ణాలు కలిసి ఇంద్ర ధనుసౌతాది
అన్ని వర్ణాలకూ ఒకటే ఇహము పరముంటాయి
....
తెల్లావు కడుపున కర్రావులుండవా
కర్రావయ కడుపున ఎర్రావు పుట్టదా

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం[మార్చు]

కత్తి మహేష్ కుమార్ అనే రచయిత నవతరంగం అనే వెబ్ పత్రికలో [2] ఈ సినిమా సమీక్షకు "కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం" అని పేరు పెట్టాడు. ఆ రచన నుండి కొన్ని భాగాలు క్రింద ఇవ్వబడ్డాయి.

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’ (1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది. 1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mechanism లాగా ఏర్పడిన తరుణం అది. ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ, ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు.

ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పెళ్ళికి ముందే ఒక హరిజనుణ్ణి ప్రేమిస్తే, సాంప్రదాయక వివాహానంతరం కూడా ఈ విషయం తెలిసిన భర్త, తాత ఆ అమ్మాయిని తన ప్రేమికుడితో కలపడం అనేది ఈ చిత్రకథ. నాయిక ‘హేమ’ (భమిడిపాటి సబిత), నాయకులు ‘హరిబాబు’ (రవికాంత్) ప్రేమికులుగనక వారినే ప్రముఖపాత్రధారులని చెప్పలేని కథనం ఇది. అందుకే ఈ సినిమాలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ (screen space) కూడా లేని ఆ అమ్మాయి భర్త గౌరీనాధుడు (గిరీష్), శంకరాభరణం శంకరశాస్త్రి పంధాని మరికొంత ముందుకునడిపిన తాత ‘యాజులు’ (జె.వి.సోమయాజులు) ప్రముఖపాత్రలుగా ఉద్భవిస్తారు. వీరి కోణం నుంచీ ప్రేక్షకుడికి సినిమాలో చెప్పదలుచుకున్న సందేశం అందించబడుతుంది. అందుకే, ‘సప్తపది’ ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో చెప్పబడిన కులాంతర వివాహం కథ అని సూత్రీకరించడం జరిగింది.

సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రనిర్మాణ స్ఫూర్తిని గురించి దర్శకుడు విశ్వనాధ్ చెబుతూ, ఆచారవ్యవహారాలన్నవి మనసును క్రమమైన మార్గంలో పెట్టడానికేతప్ప, కులమనే పేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు’ అన్న శంకరాభరణం శంకరశాస్త్రి మాటలే ఈ చిత్రనిర్మాణానికి ప్రేరణ అని చెబుతారు. తను ఇంతకు మునుపు సృష్టించిన ఒక పాత్ర చెప్పిన మాటే ప్రేరణగా, మరో ఆణిముత్యం లాంటి సినిమాకు రూపకల్పన చెయ్యడం, కళాతపస్వి అని పిలువబడే ఈ కళాకారుడికే చెల్లు.

“చిన్నప్పటి నుంచీ, ఏంచేసైనా నేను అనుకున్నది సాధించే తత్వం నాది” అని ప్రశ్నించిన నాయికతో అంటాడు నాయకుడు. దీనికి తోడు తను మోసంతో ఎలా వేదం, సంగీతం నేర్చుకుందీ తప్పుచేసినవాడిలా చెప్పుకొచ్చిన నాయకుడు, చివరిగా “ఇన్నాళ్ళూ అబద్ధాలలోనే బ్రతికాను. ఎవర్నీ అన్యాయం మాత్రం చెయ్యలేదు” అని సత్యం పలుకుతాడు. ఈ వివరణలో బ్రాహ్మణత్వాన్ని ఆశించే ఒక యువకుడు కనబడతాడేతప్ప సమాజానికి ఎదురుతిరిగిన హరిజనుడు కనపడడు. బహుశా, అప్పటికి దళితవాదం ప్రాచుర్యంలో లేకపోవడం వలన కథా రచయితకు (కె.విశ్వనాథ్) హరిజనుడు తిరుగుబాటు చేస్తే ‘బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా చేస్తాడేకానీ, బ్రాహ్మణత్వంకోసం చెయ్యడు’ అన్న విషయం తెలిసుండకపోవచ్చు. లేకపోతే చివరిలో యాజులు చెప్పే “భగవంతుడు గుణగణాల్ని బట్టి నాలుగు కులాలు నిర్ణయించానన్నాడుగానీ, పుట్టుకనిబట్టి కాదు” అనే ఆర్యోక్తికి సరితూగేలా నాయకుణ్ణి ‘కర్మ బ్రాహ్మణున్ని’ చెయ్యడానికి అతని చేత (దొంగతనంగా) వేదం, సంగీతం నేర్పించడానికి పూనుకొనుండోచ్చు.

దీనికి తోడు, నాయకుడితో నాయికను ఒక విచిత్రమైన కోరికని కోరనిచ్చి అతని మీద కలిగే కాస్తోకూస్తో సానుభూతి కాస్తా హరించినట్లనిపిస్తుంది. కులాల పట్టింపులూ, నాయిక యొక్క నాన్నగారి విధివిధానాలను చూసినవాడై, మనసులు ఒకటైనా మనుషులు కలవరనే నిర్ణయానికొచ్చిన నాయకుడు, “నువ్వు ఎవరి సొత్తూ కాకూడదు. నేను కట్టుకునే ఆలయంలో, నువ్వు నాదేవతలా ఉండిపోవాలి. నేనాదేవతని ఆరాధిస్తూ,ఇలా బ్రహ్మచారిగా రాలిపోవాలి” అని నాయికను కోరి ఒప్పిస్తాడు. వినడానికి ఎంత ఉదాత్తంగా అనిపించినా చాలా అసంబద్ధమైన కోరిక అని మాటల రచయితకు తెలిసుకాబట్టే, ఈ కోరిక కోరేముందు “నిన్ను ఒక విచిత్రమైన కోరిక కోరతాను” అని నాయకుడిచేత అనిపిస్తాడు. ఇంకా విచిత్రమేముటంటే, ఈ చిత్రంలో కథానాయకుని పేరు ఒక్క గొల్లపిల్లవాడుతప్ప ఎవ్వరూ ఉచ్చరించరు. కొన్ని సమీక్షల్లోకూడా నాయకుడి పేరు (ఫ్లూట్ వాయిస్తాడుకాబట్టి) ‘మురళి’ అని రాయగా చదివాను. కానీ సినిమాలో అతని పేరు ‘హరిబాబు’.

సహజీవనం చెయ్యడానికి ధైర్యం చెయ్యలేని నాయికా నాయకులు. ప్రేమించినా, పెళ్ళికినోచుకోక ఆరాధిస్తూ బ్రతికేద్దామనుకునే హీరోహీరోయిన్ల ప్రేమకథని ఇలా నడిసంద్రంలో నిలిపి, హేమకు గౌరీనాధుడితో (యాజులు ద్వారా) పెళ్ళి నిశ్చయిస్తాడు దర్శకుడు. ఈ పెళ్ళినిర్ణయానికి ఒక్క సీన్ ముందే, ప్రేమికులని సంతానవృక్షం దిశగా సప్తపది నడిపి, సినిమాకథకు ఒక పీటముడికూడా వేస్తాడు. ఇక్కడినుండి మొదలవుతుంది అసలు నాయకుడు గౌరీనాధుని కథ.

హరిబాబు ఈ పెళ్ళితరువాత తెలియని చోటుకి తన విరహాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతే, హేమ పెళ్ళిని అంగీకరించి గౌరీనాధునికి భార్యగా నిలబడుతుంది. కాకపోతే “పరస్త్రీ తల్లితో సమానమని మనసావాచా నమ్మిన” గౌరీనాధుడికి, శోభనంరోజు రాత్రే హేమ అమ్మవారిలా కనబడుతుంది. హరిబాబు- హేమల ప్రేమ, సంతానవృక్షానికి ఊయలకట్టిన విషయం తెలుసుకున్న గౌరీనాధుడు, ”నీ మనస్సు పరాధీనంలో ఉందికాబట్టి,ఇన్నాళ్ళూ నాకు నేను పూజించే అమ్మవారిలా కనిపించావు” అని చెప్పి, హరిబాబుని తీసుకొచ్చి ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరుతాడు. ఒకవైపు నాయికను అసంబద్ధకోరికను కోరి, పెళ్ళిచేసుకునే ధైర్యంలేని హీరో, పెళ్ళిచేసుకున్న అమ్మాయి ప్రేమ సంగతి తెలిసి, ఇద్దరినీ ఒకటి చెయ్యడానికి బయల్దేరే పాత్ర మరొకవైపు. ఇక ప్రేక్షకుడికి నాయకుడెవరో చెప్పకనే తెలుస్తుంది.

ఈ విషయం విన్న గౌరీనాధుడి తండ్రి (జె.వి.రమణమూర్తి), “పిదపకాలం పిల్లలూ, పిదపకాలం బుద్ధులూ” అని ఈసడిస్తే, అంతవరకూ సాంఫ్రదాయం కట్టుబాట్లూ అని కటువుగా కనిపించిన యాజులు మాత్రం మౌనం వహిస్తాడు. తన మిత్రుడైన రాజుగారితో చర్చిస్తాడు. ఇటు బ్రాహ్మణులకూ, అటు హరిజనులకూ వారధిలా ఉన్న రాజుగారు, ‘శంకర విజయం’లో శంకరాచార్యుడూ,మాలవాడికీ మధ్యజరిగిన ఆత్మ-పరమాత్మల సంవాదం గుర్తుచేసి, “మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం” అని కులాల పట్టింపుల్లోని అర్థరాహిత్యాన్ని గుర్తుచేస్తాడు. దానితోపాటూ నేపథ్యగీతంలా వచ్చే “ఏకులమూ నీదంటే? గోకులమూ నవ్వింది. మాధవుడూ,యాదవుడూ నాకులమే లెమ్మంది” అనే పాటవచ్చి యాజుల మనసుపొరల్లో, కులంగురించి ఏర్పడుతున్న సృష్టతకు ఆద్ధంపడుతుంది. అంతేకాక, “ఆది నుంచి ఆకాశం మూగదీ, అనాదిగా తల్లిధరణి మూగది. నడుమవచ్చి ఉరుముతాయి మబ్బులూ, ఈ నడమంత్రపు మడుసులకే మాటలు. ఇన్ని మాటలు” అని లోకులకు కులం గురించిఉన్న పట్టింపులు ఎంత మూర్ఖమో దర్శకుడు తెలియజెబుతాడు.

పెళ్ళికి శాస్త్రోక్తమైన అర్థం తెలిసిన యాజులు ఈ అంతర్మథనంలో సత్యాన్ని బేరీజుచేసుకుని, హేమను హరిబాబుతో సాగనంపడానికి చీరసారెతో బయల్దేరుతాడు. అప్పటివరకూ చాటుగా చెవులు కొరుక్కున్న జనం, ఇప్పుడు మూకుమ్మడిగా దీనికి వ్యతిరేకంగా కర్రలుపట్టుకుని నిలబడతారు. అప్పుడు వారడిగిన ప్రశ్నలకి శాస్త్రాన్ని ఉదహరిస్తూ యాజులు అందరి (ప్రేక్షకుల) కళ్ళూ తెరిపిస్తాడు. “పెళ్ళంటే ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు. ఇద్దరి మనస్సుల్ని కలపడం”. “త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెబుతోది”. ఇన్నేళ్ళూ కొడుకులా పెంచుకున్న నా కూతురిని నీకొడుకుకి అప్పజెబుతున్నాను. వాళ్ళిద్దరూ స్నేహంగా, సఖ్యతగా ఉండుగాక” అని కన్యాదాత కన్యాదానం చేస్తూ అంటాడని. అయితే “ఆ స్నేహం, సఖ్యత లోపించిన తరువాత” వారు కలిసి ఉండడం మంచిది కాదనీ, అందుకే “ఆ సఖ్యతకు అర్హుడైన” వాడితో అమ్మాయిని పంపిస్తున్నాననీ తెలియజెబుతాడు.

అంతావిన్న ప్రజలు వెనక్కితగ్గితే, గౌరీనాధుడు తీసుకొచ్చిన హరిబాబుతో హేమని స్వయంగా సాగనంపడానికి పడవెక్కుతాడు యాజులు. గౌరీనాధుడు రేవులో నిలబడుండగా పడవ సాగిపోతుంది. సంగీతం, నాట్యం వారికులమనీ, సప్తస్వరాలే వారికి సప్తపది అని ఒక కంఠస్వరం నేపథ్యంలో చెబుతుండగా సినిమా ముగుస్తుంది.

కులాంతర వివాహమనే విషయాన్ని తనదైన కోణంలో ఆవిష్కరించడంలో దర్శకుడు కె.విశ్వనాధ్ చాలా వరకూ సఫలమైనా, కథకుడిగా తనకుగల కొన్ని హద్దుల్ని (limitations) దాటడంలో సఫలం కాలేదు అనిపిస్తుంది. అందుకే తనకు తెలియని/అర్థంకాని కొన్ని పాత్రల్ని అసంపూర్ణంగా వదిలి కథను నడిపించాడు. అంతేకాక గౌరీనాధుడికి హేమ అమ్మవారిలా కనిపించడానికీ, నాయిక సంతానవృక్షానికి ఊయలకడుతున్నప్పుడు నాయకుడు ” మనమిద్దరం ఒకటవ్వడానికి ఈ మూఢాచారాలూ, వింతనమ్మకాలూ అడ్డుపడుతున్నాయి. ఈ చెట్టుకే అంతటి మహిముంటే, పెద్దల మనసుల్ని మార్చి మనల్ని కలుపుతుందేమో చూద్దాం” అన్నదానికీ ఒక సింబాలిక్ లంకె కలిపి, గౌరీనాధుని నిబద్ధతకూ కొంత supernatural గ్రహణం పట్టించినట్లనిపిస్తుంది. తనకుతెలిసిన బ్రాహ్మణదృక్కోణంలో మహత్తరంగా ఈ సమస్యను ఎత్తిచూపినా, ఒక కూలంకష సామాజిక సమస్యగా దీన్ని మలచడంలో దర్శకుడు సఫలుడు కాలేదేమో! అనిపిస్తుంది.

సప్తపది ఒక మంచి సినిమా, విశ్వనాధ్ గారు చాలా మంచి దర్శకులు. కానీ, భారతదేశ సినిమా జగత్తులో “గొప్ప” దర్శకుల జాబితాలో ఈయన చేరకపోవడానికిగల కారణాలు ఈ చిన్నచిన్నలోపాలే అనిపిస్తుంది. He is a very good director who falls short of greatness. మన తెలుగు సీనీమతల్లికి మహత్తరమైన, మంత్రపుష్పాల్లాంటి సినిమాల్ని అందించిన ఈ దర్శకదిగ్గజం మనకుమాత్రం ఎప్పటికీ గొప్పదర్శకుడే!

పాటలు[మార్చు]

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కె.వి.మహదేవన్.

పాటలు
సంఖ్య. పాట సాహిత్యం గానం నిడివి
1. "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం"   వేటూరి సుందరరామమూర్తి పి.సుశీల  
2. "అయిగిరి నందిని" (మహిషాసుర మర్ధిని స్తోత్రం) ఆది శంకరాచార్యుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "ఏ కులము నీదంటే గోకులము నవ్వింది"   వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
4. "ఓం జాతవేదసేసు మరాతి" (శ్రీ దుర్గా సూక్తం)   ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి  
5. "గోవుల్లు తెల్లన గోపన్న నల్లన గోధూళి ఎర్రన ఎందువలన"   వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
6. "నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ" (నెమలి నాట్యం) వేటూరి సుందరరామమూర్తి ఎస్.జానకి  
7. "భామనే సత్యభామనే వయ్యరి ముద్దుల సత్యభామనే"   వేటూరి సుందరరామమూర్తి ఎస్.జానకి  
8. "మరుగేలర ఓ రాఘవ"   త్యాగరాజు ఎస్.జానకి  
9. "వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరసమురళి ఆనందన మురళి ఇదేనా"   వేటూరి సుందరరామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  

ప్రాచుర్యం[మార్చు]

కులమతభేదాలను రంగులతో కవి వేటూరి పోల్చిన విధానం ఈ పాటను కాలంతో సంబంధం లేకుండా నిలబెట్టింది.[3]

బహుమతులు[మార్చు]

Year Nominated work Award Result
1981 కాశీనాధుని విశ్వనాధ్ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా విజేత

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; nemli అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. [1]
  3. ఆలూరు, యశ్వంత్. "గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన – సప్తపది". నవతరంగం.కామ్. Retrieved 30 October 2016. 

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సప్తపది&oldid=2104778" నుండి వెలికితీశారు