Jump to content

స్వాతిముత్యం

వికీపీడియా నుండి
స్వాతిముత్యం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె .విశ్వనాథ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
కథ కె. విశ్వనాధ్
చిత్రానువాదం కె.విశ్వనాథ్
తారాగణం కమల్ హాసన్ , రాధిక, దీప, నిర్మలమ్మ, శరత్ బాబు, జె.వి. సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు, డబ్బింగ్ జానకి, మల్లికార్జునరావు, ఏడిద శ్రీరామ్, వై.విజయ, విద్యాసాగర్, వరలక్ష్మి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల
గీతరచన సినారె, ఆత్రేయ,సిరివెన్నెల
సంభాషణలు సాయినాధ్ ఆకెళ్ళ
ఛాయాగ్రహణం ఎమ్.వి.రఘు
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ 27 మార్చి 1985 (1985-03-27)
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

స్వాతి ముత్యం లేదా స్వాతిముత్యం 1985 లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్నపరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితము లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం, ఇది స్థూలంగా కథ.

సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది. శివయ్య (కమలహాసన్) కొడుకులు, తమ కుటుంబాలతో తల్లి, తండ్రి దగ్గరకు వస్తారు. లలిత (రాధిక) ఆరోగ్యము బాగుండదు. శివయ్య మనవరాలు కథ రాయటానికి తండ్రి సహాయము కోరగా, తాతగారి కథను రాయమంటాడు.

పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్న లలిత భర్తని పోగొట్టుకుని, సోదరుడైన చలపతి (శరత్ బాబు), కొడుకులతో కలిసి అత్తగారింటికి వెడుతుంది. కోటీశ్వరుడైన మామగారు లోపలికి రానివ్వకుండా, బయటికి గెంటేస్తాడు. అన్నగారింటికి చేరిన లలితకి వదినగారి (వై.విజయ) సాధింపులు మొదలు అవుతాయి. వారు వున్న ఇంటి లోగిలిలోనే శివయ్య తన నాయనమ్మ (నిర్మలమ్మ) తో కలిసి ఉంటుంటాడు. చిన్నపిల్లవాడి మనస్తత్వము గల అమాయకుడు శివయ్య. లలిత పడుతున్న బాధలని తీర్చడానికి తన వంతు సహాయము చేద్దామని అనుకుంటాడు. ఆమెని పెళ్ళి చేసుకుని కొత్త జీవితము ఇవ్వటమే ఎవరైన ఆమెకు చేయగలిగే సహాయము అన్న నాయనమ్మ మాటలకి స్పందించి, శ్రీరామ నవమి పందిళ్ళప్పుడు ఆమె మెడలో తాళి కడతాడు.

నాయనమ్మ మరణం తరువాత, శివయ్య లలితని, కొడుకును తీసుకుని పట్నము వెళ్ళిపోతాడు. అక్కడ వారు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని (గొల్లపూడి మారుతీరావు) లలిత మీద కన్నువేసి, శివయ్యని మగవాడు అన్నాక అడుక్కుని అయినా భార్యను పోషించాలి అన్న మాటకు, ఉద్యోగ నిమిత్తము లలిత బయటికి వెళ్ళినప్పుడు, కొడుకుతో బిచ్చానికి వెళతాడు. అక్కడ తారసపడ్డ లలిత గురువు (జె.వి. సోమయాజులు) గారి ద్వారా గుడిలో ఉద్యోగము సంపాదిస్తాడు.

మరణ శయ్య మీద ఉన్న భార్య కోసము తనని, కొడుకుని తీసుకుని వెళ్ళి, శివయ్యను అవమానించి పంపించివేసిన మామగారిని ఎదిరించి, భర్త దగ్గరకు చేరుతుంది లలిత. లలిత మరణం తో, కొడుకులతో కలిసి ఆమె పూజించిన తులసికోటను కూడా తీసుకుని బయల్దేరుతాడు శివయ్య. కథ పూర్తి చేసిన మనవరాలు దానికి "స్వాతిముత్యం" అని పేరు పెడుతుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

సాగరసంగమం సినిమా 511 రోజుల ఫంక్షన్ నిమిత్తం బెంగళూరు వెళ్ళినప్పుడు హోటల్ రూములో స్వాతిముత్యం చిత్రబృందం పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా కె.విశ్వనాథ్ వయస్సు పెరిగినా, మేధస్సు ఎదగని ఒక వ్యక్తి పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్ర చుట్టూ ఈ కథను అభివృద్ధి చేశారు. అప్పటికి సితార సినిమాకు పనిచేసిన సాయినాథ్, సిరివెన్నెల రచన చేసిన ఆకెళ్ళ స్వాతిముత్యం మాటల రచయితలుగా పనిచేశారు. ఈ సినిమాలో అమాయకుడైన శివయ్య పాత్రలో నటించేందుకు కమల్ హాసన్ అంగీకరించారు.[1]

చిత్రీకరణ

[మార్చు]

రాజమండ్రి, తొర్రేడు, పట్టిసీమ, తాడికొండ, చెన్నై, మైసూర్ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.[1]

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]
Untitled

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఇళయరాజా.

పాటలు
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 
2."ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 
3."పట్టుసీర తెస్తానని"ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 
4."మనసు పలికే మౌనగీతం మమతలోలికే స్వాతిముత్యం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 
5."రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా" (హరికథ)ఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 
6."వటపత్రశాయికి వరహాల లాలి"సినారెపి.సుశీల 
7."సువ్వి సువ్వి సువ్వాలమ్మా"సినారెఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 

అవార్డులు / ఎంట్రీలు

[మార్చు]
  • 1986 ఆస్కార్ పురస్కరాలకు భారతదేశము తరుపున ఎంట్రీ
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1986 కె.విశ్వనాథ్ జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం గెలుపు
నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ (బంగారు) నంది గెలుపు
ఫిల్మఫేర్ పురస్కరాలు - ఉత్తమ తెలుగు దర్శకులు గెలుపు
కమల్ హాసన్ నంది ఉత్తమ నటులు గెలుపు

విశేషాలు

[మార్చు]
  1. ఈ చిత్రాన్ని తమిళములో సిప్పికుల్ ముత్తుగా అనువదించారు.
  2. హిందీలో ఈశ్వర్ పేరుతో, 1987లో అనిల్ కపూర్, విజయశాంతిలతో నిర్మించారు.
  3. కన్నడంలో స్వాతిముత్తుగా 2003లో సుదీప్, మీనాలతో నిర్మించారు.
  4. ఈ చిత్రములో కమలహాసన్, సుత్తివీరభద్రరావు కొట్టుకునే సన్నివేశములో ఇద్దరికీ నిజంగానే కొన్ని దెబ్బలు తగిలాయి.

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ (1 April 2005). "తెలుగు సినిమా ప్రతిష్ట పెంచిన స్వాతిముత్యం". సంతోషం: 16. Retrieved 26 September 2017.[permanent dead link]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

[మార్చు]