సాగర సంగమం

వికీపీడియా నుండి
(సాగరసంగమం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సాగర సంగమం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
రచన కె. విశ్వనాథ్
తారాగణం కమల్ హాసన్,
జయప్రద,
శరత్ బాబు,
ఎస్.పి. శైలజ
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
ఎస్.పి.శైలజ
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
ఛాయాగ్రహణం పి.ఎస్. నివాస్
నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
నిడివి 160 నిముషాలు
భాష తెలుగు

సాగరసంగమం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 3 జూన్ 1983న విడుదలైన తెలుగు సినిమా. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు. ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు.

ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో సలంగై ఒలి (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.[1]

ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది.[2] రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది.[1]

చిత్రంలోని సన్నివేశం

కథ[మార్చు]

నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది. బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రావీణ్యుడవుతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి (డబ్బింగ్ జానకి) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి అంతకు మునుపే పెళ్ళయివుంటుంది. వీరి ప్రేమగురించి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు. అతను సమర్ధించినప్పటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పెడతాడు. తల్లి మరణం, ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనతభావంతో బాలకృష్ణ తాగుబోతు అవుతాడు.

తరువాతి భాగంలో మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు. ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పొంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

కథా చర్చలు[మార్చు]

సప్తపది సినిమా తరువాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో కమల్ హాసన్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు దర్శకుడు కె.విశ్వనాథ్. దానికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వి.వి.శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎం. ఎస్. విశ్వనాథన్ ని ఎంపిక చేసుకొని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. సీతాకోకచిలుక తరువాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్. కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు.[3]

ఈ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలను రచించాడు. సీతాకోకచిలుక సినిమాకు ముందు అనుకున్న "సాగర సంగమం" అనే పేరుని ఈ సినిమాకు పెట్టుకున్నారు.[3]

నటీనటుల ఎంపిక[మార్చు]

కథానాయకుడి పాత్రకు కమల్ హాసన్ ని సంప్రదించగా అతడు నిరాకరించాడు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత అలంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన "కడల్ మీన్గళ్" అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో హాసన్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది. ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించాడు. కథానాయికగా ముందుగా జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు. అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు.[3] శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది.[1]

చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమాను మద్రాసు, విశాఖపట్నం, హైదరాబాదు, ఊటీలో చిత్రీకరించారు. "వేవేల గోపెమ్మలా" పాటను విశాఖపట్నంలోని భీమిలి బీచులోనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారు.[3] జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, "మౌనమేలనోయి" పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాల్నీ విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. "ఓం నమఃశివాయ" పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని ఈనాడు కార్యాలయంలో చిత్రీకరించారు. మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై కమల్ హాసన్ నాట్యం చేసే "తకిట తథిమి" పాటను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. "నాదవినోదము" పాటను ఊటీలో తీశారు. వి. శాంతారాం తీసిన ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపికృష్ణ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించాడు. అతడు ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చాడు.[4] పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాట చిత్రీకరణకు ముందు కమల్ కు ఓ హిందీ సినిమా షూటింగులో కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో, నెలరోజులపాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు. ఆ తరువాత విడుదలకు ఆలస్యమవుతుందని పునః ప్రారంభించారు. అయితే, అప్పటికీ కమల్ ఇంకా కోలుకోలేదు. అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడతడు. అయినప్పటికీ నృత్యం చేయడానికి పూనుకున్నాడు. "షాట్" అనగానే నృత్యం చేయడం, "కట్" అనగానే క్రింద పడిపోవడం. అలా, ఆ పాట పూర్తయింది.[5]

చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్టులో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు కమల్ నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు విశ్వనాథ్ కి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా పండిట్ రవిశంకర్ మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు కమల్ విశ్వనాథ్ కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించాడు కమల్.[4] జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని కమల్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం. అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని కమల్ కు సైగ చేశాడు. అలా చెప్పిన వెంటనే కమల్ ఏడుపులోంచి నవ్వులోకి మారిపోతాడు ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.[5]

నిర్మాణానంతర పనులు[మార్చు]

శరత్ బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్ కు డబ్బింగ్ చెప్పాడు.[5] జయప్రద భర్త పాత్ర పోషించిన మోహన్ శర్మకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పాడు. "వేవేల గోపెమ్మలా" పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పాడు.[1]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1983 కె.విశ్వనాథ్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుని పురస్కారం - తెలుగు గెలుపు
కమల్ హాసన్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం - తెలుగు గెలుపు
జయప్రద ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం - తెలుగు గెలుపు
1984 ఇళయరాజా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు గెలుపు
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయకుడు గెలుపు

పురస్కారాలు[మార్చు]

పాటలు[మార్చు]

All music is composed by ఇళయరాజా.

పాటలు
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."ఓం నమశ్శివాయ"వేటూరి సుందరరామమూర్తిఎస్.జానకి 
2."తకిట తధిమి తకిట తధిమి తందాన"వేటూరి సుందరరామమూర్తిబాలసుబ్రహ్మణ్యం 
3."నాద వినోదము నాట్యవిలాసము"వేటూరి సుందరరామమూర్తిబాలసుబ్రహ్మణ్యం 
4."బాలా కనకమయ చేల"త్యాగరాజఎస్.జానకి 
5."మౌనమేలనోయి ఈ మరపురాని రేయి"వేటూరి సుందరరామమూర్తిఎస్.జానకి, బాలసుబ్రహ్మణ్యం 
6."వేదం అణువణువున నాదం"వేటూరి సుందరరామమూర్తిబాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ 
7."వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి.శైలజ 

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రంలో దర్శకుడు నటుల హవభావాల ద్వారా,సన్నివేశాల్లో చుట్టూ వున్న పరిస్థితుల ద్వారా భావాన్ని వ్యక్తపరిచారు.
  • రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం ఇది.[6]
  • ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ గాయని ఎస్.పి. శైలజ తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్ళీ నటించలేదు.[6]

ఆధార గ్రంథాలు[మార్చు]

పులగం చిన్నారాయణ (2009). సినీ పూర్ణోదయం. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్.

మూలాలు, వనరులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 సినీ పూర్ణోదయం 2009, p. 113సాగర సంగమం
  2. సినీ పూర్ణోదయం 2009, p. 120సాగర సంగమం
  3. 3.0 3.1 3.2 3.3 సినీ పూర్ణోదయం 2009, p. 105సాగర సంగమం
  4. 4.0 4.1 సినీ పూర్ణోదయం 2009, p. 106సాగర సంగమం
  5. 5.0 5.1 5.2 సినీ పూర్ణోదయం 2009, p. 111సాగర సంగమం
  6. 6.0 6.1 "సాక్షి దిన పత్రిక". ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక: 18. మార్చి 28, 2010.

బయటి లింకులు[మార్చు]