Jump to content

సింగిరెడ్డి నారాయణరెడ్డి

వికీపీడియా నుండి
(సినారె నుండి దారిమార్పు చెందింది)
సింగిరెడ్డి నారాయణరెడ్డి
జననంసింగిరెడ్డి నారాయణరెడ్డి
1931 జూలై 29
భారతదేశం హనుమాజీపేట్, రాజన్న సిరిసిల్ల
మరణం2017 జూన్ 12(2017-06-12) (వయసు 85)[1]
హైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుసినారె
వృత్తికవి, గేయరచయిత,
సాహితీవేత్త
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు (1973), పద్మ శ్రీ (1977), కళాప్రపూర్ణ (1978), జ్ఞానపీఠ్ అవార్డు (1988), పద్మ భూషణ్ (1992), సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)
సంతకం
వెబ్‌సైటు
http://drcnarayanareddy.com/

సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

బాల్యం - విద్యాభ్యాసం

[మార్చు]

సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో జన్మించాడు. త# డ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదు లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.

ఉద్యోగం - రచనా ప్రస్థానం

[మార్చు]

ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి, అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, బహుమతులు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు అతనే. విశ్వంభర కావ్యానికి ఈ అవార్డు లభించింది.

అతను ప్రధానంగా కవి అయినప్పటికీ ఆ కాలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అతను పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. అతనుే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియా లోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

రచనారంగమే కాక అతను తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.[2]

పురస్కారాలు

[మార్చు]
  1. 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం
  4. భారతీయా భాషా పరిషత్ పురస్కారం
  5. రాజలక్ష్మీ పురస్కారం
  6. సోవియట్-నెహ్రూ పురస్కారం
  7. అసాన్ పురస్కారం
  8. పద్మశ్రీ పురస్కారం
  9. పద్మభూషణ్ పురస్కారం
  10. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ
  11. ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
  12. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
  13. డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)[3]

ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. [4]

-: పదవులు :- విద్యారంగంలోనూ, పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించాడు.

  1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
  3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
  4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
  5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు

భారత రాష్ట్రపతి అతన్ని 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు.

రచనలు

[మార్చు]

కవిత్వం:

వ్యాసాలు:

  • పరిణత వాణి

గేయనాటికలు:

  • అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.[5]
  • వెన్నెలవాడ

డా॥సి.నారాయణరెడ్డి రచనలు :-

  1. నవ్వనిపువ్వు.(గేయనాటికలు)
  2. జలపాతం(పద్య గేయ సంపుటి)
  3. విశ్వగీతి (దీర్ఘగీతం)
  4. అజంతాసుందరి (గేయనాటికలు)
  5. స్వప్నభంగం (గేయకావ్యం)
  6. నారాయణరెడ్డి గేయాలు (కవితాసంపుటి)
  7. నాగార్జునసాగరం (గేయకావ్యం)
  8. వెన్నెలవాడ (గేయనాటికలు)
  9. కర్పూర వసంతరాయలు (గేయకావ్యం)
  10. రామప్ప (రేడియో రూపకం)
  11. విశ్వనాథనాయకుడు (గేయకావ్యం)
  12. దివ్వెలమువ్వలు (కవితాసంపుటి)
  13. సమదర్శనం (గేయసూక్తులు)
  14. ఋతుచక్రం (గేయకావ్యం)
  15. వ్యాసవాహిని (సాహిత్యవ్యాసాలు)
  16. అక్షరాలగవాక్షాలు (కవితాసంపుటి)
  17. జాతిరత్నం (గేయకావ్యం)
  18. ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు ప్రయోగములు (పరిశోధన గ్రంథం ph.d)
  19. మధ్యతరగతి మందహాసం (వచనకవితా సంపుటి)
  20. గాంధీయం (గేయసూక్తులు)
  21. మరోహరివిల్లు (కవితా సంపుటి)
  22. మంటలూ-మానవుడూ (వచనకవితా సంపుటి)
  23. ముఖాముఖి (వచనకవితా సంపుటి)
  24. మనిషి-చిలక (వచనకవితా సంపుటి)
  25. ఉదయం నా హృదయం (వచనకవితా సంపుటి)
  26. మందారమకరందాలు (వ్యాఖ్యానం)
  27. మార్పు నా తీర్పు (కవితాసంపుటి)
  28. తేజస్సు నా తపస్సు (కవితా సంపుటి)
  29. తరతరాల తెలుగు వెలుగు (నృత్యగేయరూపకం)
  30. ఇంటి పేరు చైతన్యం (కవితా సంపుటి)
  31. పగలే వెన్నెల (సినీగీతాల సంకలనం)
  32. భూమిక (కావ్యం)
  33. మధనం (కావ్యం)
  34. నారాయణరెడ్డి నాటికలు
  35. ముత్యాల కోకిల (సరోజినీనాయుడు ఆంగ్లకవితలకు అనువాదం)
  36. మృత్యువు నుంచి (సుదీర్ఘకవిత-మరికొన్ని కవితలు)
  37. మా ఊరు మాట్లాడింది (వ్యాసాల,పాటల సంపుటి)
  38. సోవియట్ రష్యాలో పదిరోజులు (యాత్రాచరిత్ర)
  39. విశ్వంభర (వచనకవితలో సమగ్ర కావ్యం)
  40. సమీక్షణం (వ్యాససంకలనం)
  41. అమరవీరుడు భగత్ సింగ్ (బుర్రకథ)
  42. రెక్కలు (కవితా సంపుటి)
  43. నడక నా తల్లి (కవితా సంపుటి)
  44. కాలం అంచుమీద (కవితా సంపుటి)
  45. కవిత నా చిరునామా (కవితా సంపుటి)
  46. ఆరోహణ(కవితా సంపుటి )
  47. దృక్పథం (కవితా సంపుటి)
  48. 48)భూగోళమంత మనిషి బొమ్మ(కవితా సంపుటి)
  49. గదిలో సముద్రం (గజళ్లు ,వచనకవితలు)
  50. తెలుగు గజళ్లు
  51. పాశ్చాత్య దేశాల్ల్ యభై రోజులు (యాత్రా చరిత్ర)
  52. వ్యక్తిత్వం (కవితా సంపుటి)
  53. సినారె గజళ్లు
  54. మట్టి మనిషి ఆకాశం (కావ్యం)
  55. తెలుగు కవిత లయాత్మకత (పరిశోధన గ్రంథం)
  56. సప్తతి ఒక లిప్తగా (కవితా సంపుటి)
  57. రెక్కల సంతకాలు (కవితా సంపుటి)
  58. కొనగోటి మీద జీవితం (కవితా సంపుటి)
  59. మనిషిగా ప్రవహించాలని(కవితా సంపుటి)
  60. జ్వాలగా జీవించాలని
  61. నా చూపు రేపటి వైపు
  62. ఏవీ ఆ జీవనిధులు
  63. కలిసి నడిచే కాలం
  64. సమూహం వైపు
  65. లేత కిరణాలు
  66. వచనకవిత (సినీకవి మనస్ నివాళి )
  67. మూవింగ్ స్పిరిట్ (ఆంగ్ల కవితలు)
  68. విశ్వం నాలో ఉన్నపుడు
  69. సినారె గీతాలు
  70. సినారె గేయనాటికలు
  71. దట్స్ వాట్ ఐ సెడ్ (ఆంగ్ల కవితలు)
  72. కలం సాక్షిగా (ద్విపదులు)
  73. తేనె పాటలు (లలితగీతాలు)
  74. ప్రపంచ పదులు
  75. మీరాబాయి (మీరాపదాలకు తెలుగు అనువాదం)
  76. ముచ్చటగా మూడువరాలు
  77. పాటలో ఏముంది నా మాటలో ఏముంది-1(స్వీయసినీగీత చరిత్ర)
  78. పాటలో ఏముంది నా మాటలో ఏముంది-2
  79. నింగికెగిరిన చెట్లు (కవితాసంపుటి)
  80. జాతికి ఊపిరి స్వాతంత్ర్యం
  81. శిఖరాలు లోయలు (అనువాద కవితలు)
  82. దూరాలను దూసుకొచ్చి (కవితా సంపుటి)
  83. వాక్కుకు వయసు లేదు
  84. క్షేత్రబంధం
  85. అలలెత్తే అడుగులు
  86. నా రణం మరణం పైనే!

87. కలం అలిగింది (కవితా సంపుటి)

పై రచనల్లో 60 రచనలను "విశ్వంభర విజన్ పబ్లికేషన్స్ "వారు 18 సంపుటాలుగా వేశారు..మిగితా రచనలన్ని విడివిడిగా దొరుకుతున్నవి..

సినీ ప్రస్థానం

[మార్చు]

సినిమా పాటలు

[మార్చు]

సి. నారాయణ రెడ్డి 1962 లో గులేబకావళి కథ లోని పాటద్వారా సినిమా రంగం లోకి అడుగు పెట్టారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో పేరుపొందారు.[6] తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశాడు.[7]

సంవత్సరం సినిమా సినిమా పాట
1962 ఆత్మబంధువు అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి,
చదువురాని వాడవని దిగులు చెందకు
1962 గులేబకావళి కథ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
1962 కులగోత్రాలు చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా,
చిలిపి కనుల తీయని చెలికాడా
1962 రక్త సంబంధం ఎవరో నను కవ్వించి పోయేదెవరో
1963 బందిపోటు వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
1963 చదువుకున్న అమ్మాయిలు కిల కిల నవ్వులు చిలికిన
1963 కర్ణ గాలికి కులమేది నేలకు కులమేది
1963 లక్షాధికారి దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే, మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది
1963 పునర్జన్మ నీ కోసం నా గానం నా ప్రాణం
1963 తిరుపతమ్మ కథ పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా బేలా
1964 అమరశిల్పి జక్కన ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
1964 గుడి గంటలు నీలి కన్నుల నీడల లోనా
1964 మంచి మనిషి అంతగా నను చూడకు మాటాడకు, వింతగా గురిచూడకు వేటాడకు
1964 మురళీకృష్ణ కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను,
ఊ అను ఊహూ అను ఔనను ఔనౌనను నా వలపంతా నీదని
1964 రాముడు భీముడు తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే
1965 మంగమ్మ శపథం కనులీవేళ చిలిపిగ నవ్వెను
1966 పరమానందయ్య శిష్యుల కథ నాలోని రాగమీవె నడయాడు తీగవీవె
1968 బందిపోటు దొంగలు విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
1968 బంగారు గాజులు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
చెల్లాయి పెళ్ళికూతురాయెనె పాలవెల్లులే నాలో పొంగిపోయెనే
1968 వరకట్నం ఇదేనా మన సాంప్రదాయమిదేనా
1969 ఏకవీర కృష్ణా నీ పేరు తలచినా చాలు
1970 ధర్మదాత ఓ నాన్నా నీ మనసే వెన్న
1970 కోడలు దిద్దిన కాపురం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
1970 లక్ష్మీ కటాక్షం రా వెన్నెల దొరా కన్నియను చేరా
1971 చెల్లెలి కాపురం కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
1971 మట్టిలో మాణిక్యం రింఝిం రింఝిం హైదరబాద్
1972 బాలమిత్రుల కథ గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయీ
1972 మానవుడు దానవుడు అణువూ అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపింప రావా
1972 తాత మనవడు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
1973 అందాల రాముడు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
1973 శారద శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా
1974 అల్లూరి సీతారామరాజు వస్తాడు నా రాజు ఈ రోజు
1974 కృష్ణవేణి కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలివేణి
1974 "నిప్పులాంటి మనిషి" స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం
1974 ఓ సీత కథ మల్లెకన్న తెల్లన మా సీత మనసు
1975 అందమైన అనుబంధం ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే
1975 బలిపీఠం మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి
1975 ముత్యాల ముగ్గు గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ
1976 తూర్పు పడమర శివరంజనీ నవరాగినీ వినినంతనే నా
నవ్వుతారూ పకపకమని నవ్వుతారు
1978 శివరంజని అభినవ తారవో నా అభిమాన తారవో
జోరుమీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా
1980 ప్రేమ తరంగాలు కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా
ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు
1984 మంగమ్మగారి మనవడు చందురుడు నిన్ను చూసి
శ్రీ సూర్యనారాయణా మేలుకో
1985 స్వాతిముత్యం లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి
1986 రేపటి పౌరులు రేపటి పౌరులం
1989 సూత్రధారులు జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల
1990 20వ శతాబ్దం 20వ శతాబ్దం ఇది
, అమ్మను మించి దైవమున్నదా
1997 ఒసే రాములమ్మా
2001 ప్రేమించు కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
2003 సీతయ్య ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ
2009 అరుంధతి జేజమ్మా జేజమ్మా
2011 ఇంకెన్నాళ్లు ఏమి వెలుతురూ

ప్రశంసలు

[మార్చు]

డా.సి. నారాయణరెడ్డి గురించి ప్రముఖుల ప్రశంసలను చీకోలు సుందరయ్య ఇలా ఉదహరించాడు [8]

  • చేరా - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
  • ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
  • సాహితీ చరిత్ర రచయిత డాక్టర్‌ జి.నాగయ్య - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు. నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి... కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని అతను గురజాడకు కైమోడ్పు ఘటించాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు
  • వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు - "నారాయణరెడ్డి తిలక్‌లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడు"

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి, హైదరాబాద్‌ లోని కేర్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ 2017, జూన్ 12 సోమవారం రోజున ఉదయం తుదిశ్వాస విడిచాడు.[1]

ఇవికూడా చూడండి

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సాక్షి. "ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి కన్నుమూత". Retrieved 12 June 2017.
  2. "స్రవంతి (సాహిత్య మాసపత్రిక) (ఆగస్టు, 1981)". స్రవంతి సాహిత్య మాసపత్రిక (ఆగస్టు). 1981. Retrieved 9 December 2014.
  3. "నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం". Archived from the original on 2014-09-20. Retrieved 2014-09-21.
  4. చతుర, మార్చి 11, 2011(పుట 86) లో గోవిందరాజు రామకృష్ణా రావు రాసిన జ్ఞానపీఠాలు శీర్షిక నుంచి
  5. అజంతాసుందరి:ముందుమాట:సినారె
  6. http://www.idlebrain.com/celeb/jewels/cnarayanareddy.html
  7. Cinare Cine Hits, Compiled and Conceptualised by M. Sanjay Kishore, Sangam Akademy, Hyderabad, 2006.
  8. "ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2010-06-12. Retrieved 2009-05-18.

బయటి లింకులు

[మార్చు]