గోపీనాథ్ మొహంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపీనాథ్ మొహంతి
గోపీనాథ్ మొహంతి
జననం(1914-04-20)1914 ఏప్రిల్ 20
నాగబలి, కటక్
మరణం1991 ఆగస్టు 20(1991-08-20) (వయసు 77)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ.
విద్యాసంస్థరావెన్‌షా కాలేజి
పాట్నా విశ్వవిద్యాలయం
వృత్తిపరిపాలనావేత్త, ఆచార్యుడు
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం
పద్మభూషణ్ పురస్కారం

గోపీనాథ్ మొహంతి (1914-1991), ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఒరిస్సాలో 20వ శతాబ్దంలోని నవలాకారులలో ఫకీర్ మోహన్ సేనాపతి తరువాత గోపీనాథ్ గొప్పవారిగా చెప్పబడ్డారు.

బాల్యం, విద్య

[మార్చు]

గోపీనాథ్ మొహంతి 1914 ఏప్రిల్ 20లో కటక్ జిల్లాలో నాగబలి గ్రామంలో జన్మించాడు. వీరిది సనాతన ఆచారాలపట్ల గట్టి నమ్మకమున్న సంపన్న జమీందారీ కుటుంబం[1]. ఈయన 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి చనిపోగా పాట్నాలో ఉన్న తన అన్న దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ మెట్రిక్ వరకు చదివాడు. ఆ తర్వాత కటక్‌లో రావెన్షా కశాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1936లో ఎం.ఎ డిగ్రీ పట్టా పొందాడు. గోపీనాథే కాక ఇతని కుటుంబంలో కూడా రచయితలున్నారు. ఆయన పెద్ద అన్నయ్య అయిన కహాను చరణ్ మొహంతి, మేనల్లుడు గురుప్రసాద్ మొహంతీ కూడా ఒరియా సాహిత్యంలో విశేష కృషి చేశారు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

ఇతనికి కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేయాలన్న కోరిక ఉండేది. అది నెరవేరకుండానే ఇతడు 1938లో ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపిక అయ్యాడు. ఇతని మొదటి నియామకం జాజ్‌పూర్‌లో జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద వరద వచ్చింది. ప్రభుత్వోద్యోగిగా వరద సహాయ కార్యక్రమాలు చేపట్టే అనుభవం ఇతనికి మొదటిసారిగా అప్పుడు కలిగింది. తర్వాతి కాలంలో 'మాటీ మటాల్' వ్రాసినప్పుడు ఈ అనుభవం ఇతనికి ఎంతగానో తోడ్పడింది. 1940లో ఒరిస్సా దక్షిణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఈ బదిలీ ఒరియా సాహిత్యానికే కాక భారతీయ సాహిత్యానికే ఒక వరంగా మారిందని పలువురు భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా కోరాపుట్ ప్రాంతంలోని ఆదివాసులతో పాటు జీవించి వారి జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. వారి స్థితిగతుల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆదివాసులలో పరజా, కంధ్, గదబా, కోల్హ్, డంబ్ మొదలైన జాతుల ప్రజలతో ఇతడు మమైకమై పోయాడు. తన ఉద్యోగ కాలంలో ఆదివాసులతో ఇతడు ఎంతగా కలిసిపోయాడంటే కోరాపుట్ జిల్లాలోని జమీందారులు, వడ్డీ వ్యాపారులు 1953లో అప్పటి ప్రధానమంత్రికి ఇతనికి విరుద్ధంగా ఒక నివేదిక కూడా పంపారు. మొహంతి తన ఉద్యోగకాలంలో ఒరిస్సాలో చాలా చోట్ల పనిచేసినా కోరాపుట్‌తోను, అక్కడి ఆదివాసులతోను ఇతనికి విడదీయరాని బంధం ఏర్పడింది[1].

అధ్యాపకుడు కావాలన్న తన కోరికను ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఆంగ్ల అధ్యాపకునిగాను, 1986లో అమెరికాలోని సాన్ జోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రంలో అధ్యాపకునిగా పనిచేసి నెరవేర్చుకున్నాడు.

సాహిత్య జీవితం

[మార్చు]

ఇతడు 1936 నుండే వ్రాయడం ప్రారంభించాడు. 1930-38 మధ్యకాలాన్ని రచయితగా ఇతని నిర్మాణకాలంగా పరిగణించవచ్చు. ఇతనిపై ఆ కాలంలో మార్క్స్, రష్యావిప్లవం, ఫ్రాయిడ్ ప్రభావం, గాంధీజీ జాతీయోద్యమ ప్రభావం పడుతూ వచ్చింది. ఇతడు గొప్ప అధ్యయనశీలి. రోమరోలా, గోర్కీ రచనలు చదివి వారికి అభిమానిగా మారాడు. వివిధ సాహిత్య ప్రక్రియల స్వరూపాలలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ ప్రచారంలో ఉన్న రొమాంటిక్ అభిరుచులను బాహాటంగా ఖండించేవాడు. ఇతడు చాలా సాహిత్యప్రక్రియలలో రచనలు చేసినా కథాసాహిత్యమే ప్రముఖ రంగంగా నిలిచింది. ఇతని సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి 1. ఆదివాసులకు సంబంధించిన రచనలు, 2. నగరవాసులకు సంబంధించిన రచనలు, 3. 'మాటీ మటాల్ ' నవల. ఇతడు తన రచనలలో నిరుపేదల, అణగారిన వర్గాల, నిరపాయులైన ఆదివాసుల పక్షాన ఎప్పుడూ నిలిచాడు. శోషణ ఏ రూపంలో ఉన్నా దానిని సహించేవాడు కాదు.

రచనలు

[మార్చు]

ఇతడు మొత్తం 19 నవలలు, 8 కథా సంపుటాలు, 2 నాటకాలు, 1 వ్యాస సంకలనం, 2 జీవిత చరిత్రలు, 8 ఆదివాసుల భాషలకు సంబంధించిన పుస్తకాలు, 4 హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు నుండి అనువదించిన పుస్తకాలు వెలువరించాడు. ఇతనికి ముఖ్యంగా మూడు రచనల వల్ల గొప్ప ఖ్యాతి లభించింది. అవి 'పరజా', 'అమృత సంతాన్', 'మాటీ మటాల్'.

పరజా

ఇది ఒక రకంగా కోరాపుట్ జిల్లాలోని పరజా జాతి ఆదివాసుల జీవితానికి సంబంధించిన సమాజ శాస్త్ర అధ్యయనానికి చెందిన రికార్డు వంటిది. కానీ గోపీనాథ్ మొహంతీ లోని సృజనాత్మకత దీనిని ఒక ఉత్కృష్ట కళాకృతిగా రూపొందించింది. ఈ నవల కారణంగా త్యక్తులు, తిరస్కృతులు అయిన పరజా జాతి వారు నేటివరకు ఆధునిక ఒరియా సాహిత్య లోకంలో అభిన్నమైన అంగాలుగా నిలిచి ఉన్నారు[1].

అమృత సంతాన్

ఇది ఒక గ్రామీణ కుటుంబానికి సంబంధించిన కథ. గ్రామపెద్ద దిఉడూ తన భార్య పియూను వదిలిపెట్టి పిఓటీ అనే మరో స్త్రీతో పాటు నివసించడం మొదలు పెడతాడు. అసహాయురాలైన పియూ తన పుత్రుని వెంట తీసుకుని భర్త ఇల్లు వదిలి వేస్తుంది. కాని ఆమెకు తన జాతి వారి పరంపరాగతమైన నమ్మిక స్థైర్యాన్ని చేకూరుస్తుంది. కంపించే పెదాలతో, కన్నీళ్లతో నిండిన మొఖంతో సూర్యోదయాన్ని చూస్తూ ఆమె తనతో తాను ఇలా చెప్పుకుంటుంది. "జీవితం కేవలం మాధుర్యాన్నిచ్చింది. దుఃఖాన్ని గాని, మృత్యువును గాని ఇవ్వలేదు." కంధ్ జాతి వారి ఈ నమ్మిక అజేయమైన మానవ చైతన్యానికి ప్రతీక. దిఉడూ ఒక సంక్లిష్ట పాత్ర. నవలలో దుష్ట పక్షం ఉంది. కాని అంతే శక్తి కలిగిన సద్గుణ పక్షం కూడా అందులో ఉంది. అది చివరి దాకా క్రియాశీలిగా ఉంటుంది. అందువల్లనే కథ చివర పియూను ఆమె ఒడిలోని పుత్రుడు హకీనాను మెడొన్నా ఒడిలోని జీసస్‌తో పోల్చడం జరిగింది. ఈ బృహత్‌ నవలకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది[1].

మాటీ మటాల్

ఈ నవల ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చి పెట్టింది. ఈ నవల నేపథ్యం ఒరిస్సా గ్రామీణ ప్రాంతం. చదువుకొని, నగరంలో ఉద్యోగం చేయకుండా తన ప్రజలను బాగుచేయాలని స్వంత గ్రామానికి వచ్చి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనేందుకు కృషి చేసిన రవి అనే ఆదర్శ యువకుని కథ ఇందులోణి వస్తువు. ఈ నేపథ్యంలోనే రచయిత రవి, ఛవిమధ్య ఏర్పడిన పరస్పర అనురాగాన్ని కూడా చిత్రించాడు. ఈ నవలలో ఒరిస్సా గ్రామీణ జీవితపు సమగ్ర చిత్రంతో పాటు మానవీయ పరిస్థితుల మనోవైజ్ఞానిక చిత్రణ కూడా కనిపిస్తుంది[1].

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఇతడు 1991, ఆగష్టు 20వ తేదీన తన 77వ సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలోని సాన్‌జోస్లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 జె.లక్ష్మిరెడ్డి (1 January 2006). "పరస్పర రాగానుబంధమే జీవితం" (PDF). మిసిమి. 17 (1): 65–71. Retrieved 29 March 2018.[permanent dead link]
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2016-07-14. Retrieved 2018-03-29.

ఇతర లంకెలు

[మార్చు]