Jump to content

ఉమాశంకర్ జోషి

వికీపీడియా నుండి
ఉమాశంకర్ జోషీ
ముంబాయిలో 1960లో జోషి
పుట్టిన తేదీ, స్థలం(1911-07-21)1911 జూలై 21
బమ్నా, శబర్ కాంత, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
మరణం1988 డిసెంబరు 19(1988-12-19) (వయసు 77)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
కలం పేరువాసుకి, శ్రవణ్
వృత్తికవి, నవలాకారుడు, కథా రచయిత
జాతీయతభారతదేశం
పూర్వవిద్యార్థి
  • గుజరాత్ కళాశాల
  • ఎల్ఫిన్ స్టోన్ కళాశాల[1]
కాలంగాంధీ యుగం
పురస్కారాలు
  • రంజిత్ రాం సువర్ణ్ చంద్రక్ (1939)
  • నర్మద్ సువర్ణ్ చంద్రక్ (1943)
  • ఉమా-స్నేహ్ రష్మి బహుమతి (1963-64-65)
  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (1973)
  • జ్ఞానపీఠ్ పురస్కారం

సంతకం

ఉమాశంకర్ జేతాలాల్ జోషి (audio speaker iconpronunciation ) (21 జూలై 1911 – 19 డిసెంబర్ 1988) గుజరాతీ కవి, పండితుడు, రచయిత. గుజరాతీ సాహిత్యానికి అతని రచనల ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా 1967లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాడు.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

బాల్యం

[మార్చు]

ఉమాశంకర్ జోషి నేటి గుజరాత్ రాష్ట్రంలోని ఆరవల్లి జిల్లాలో భిలోడా తాలూకాలోని బమ్నా గ్రామంలో (అప్పట్లో బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది) 1911 జూల్ 21న జన్మించాడు. అతని తండ్రి జేతాలాల్ కమాల్జీ చిన్న జాగీర్లలో కర్భారీ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా పనిచేసేవాడు. జోషికి ఎనిమిదిమంది తోబుట్టువులు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరిలు.[3] ఉమాశంకర్ జోషి తన బాల్యం గడచిన ఈ ప్రాంతంలోని కొండ కోనలతో కూడిన అందమైన పరిసరాలు, పల్లెల్లోని సాంఘిక జీవితం, అక్కడ జరిగే పండుగలు, సంతలు వంటివి రచనలు చేయడానికి ప్రేరణగా నిలిచాయి.[4][5]

విద్యాభ్యాసం

[మార్చు]
Sir Pratap High School of Idar where Joshi studied till 1927

1916లో బమ్నాలోని ప్రాథమిక పాఠశాలలో అతను విద్యాభ్యాసం ప్రారంభించాడు. 1921లో అతని విద్యాభ్యాసం ఇదార్ పట్టణానికి మారింది. అక్కడ ఆ ఏడు నాలుగవ తరగతి పూర్తిచేసుకున్నాడు. ఇదార్ లోని ప్రతాప్ హైస్కూల్ అనే ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో 1927 వరకూ అతని విద్యాభ్యాసం కొనసాగింది.1927లో అహ్మదాబాద్ నగరంలోని ప్రొప్రైటరీ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ చదివాడు. 1928 నుంచి 1930 వరకు అహ్మదాబాద్ లోనే ఉన్న గుజరాత్ కళాశాలలో చదువుకున్నాడు. ముంబైలోని ఎఫిన్ స్టోన్ కళాశాలలో చేరి బి.ఎ. (ఆర్థికశాస్త్రం, చరిత్ర) రెండవ శ్రేణిలో పాస్ అయ్యాడు. తర్వాత గుజరాతీ, సంస్కృతం ప్రధానాంశాలుగా ముంబై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివి తొలి శ్రేణిలో ప్యాసయ్యాడు.[3][5]

జాతీయోద్యమం

[మార్చు]

జోషి గాంధీ నేతృత్వంలోని జాతీయోద్యమంలో పనిచేశాడు.[4] 1929 జనవరిలో ప్రారంభమైన గుజరాత్ కళాశాల విద్యార్థుల 34 రోజుల సమ్మెలో పాల్గొన్నాడు. 1930 ఏప్రిల్లో విరాంగం ఆశ్రమంలో సత్యాగ్రహిగా చేరాడు. నవంబరు నుంచి 14 వారాల పాటు ప్రభుత్వం జోషిని ఖైదు చేసింది. 1931 వరకు సబర్మతీ జైలు, యెరవాడ టెంట్-జైలులో గడిపాడు. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు హాజరయ్యాడు. జూలై నుంచి ఆరు నెలల పాటు గుజరాత్ విద్యాపీఠ్ లో ఉన్నాడు. 1932లో రెండవ మారు జైలుపాలయ్యాడు. ఈసారి సబర్మతీ, విసాపూర్ జైళ్ళలో ఎనిమిది నెలలు గడిపాడు.[3][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1934లో జోషి తండ్రి మరణించాడు. 1937 మే 25న జోషికి జ్యోత్స్నతో ముంబైలో వివాహం అయింది. వారికి నందిని, స్వాతి అని ఇద్దరు కుమార్తెలు. తల్లి 1966లో మరణించింది.[6]

ఉద్యోగ జీవితం (విద్యారంగంలో)

[మార్చు]
1960లో ముంబైలో చునియాలాల్ మాదియాతో ఉమాశంకర్ జోషి (ఎడమవైపు)

1937లో జోషి ముంబైలోని గోక్లిబాయ్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆపై ఎం.ఎ. పట్టా సంపాదించాక ముంబైలోని సైదెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పార్ట్-టైం లెక్చరరుగా 1939 వరకు పనిచేశాడు. గుజరాత్ వెర్నాక్యులర్ సొసైటీ (గుజరాత్ విద్యాసభ)లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్టడీస్ విభాగంలో ఆచార్యునిగా నియమితుడయ్యాడు. అక్కడ 1946లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకునేంతవరకూ అక్కడే పనిచేశాడు. 1953లో బొంబాయి ప్రభుత్వం అతనిని గుజరాతీ పాఠ్యపుస్తక కమిటీలో సభ్యునిగా నియమించింది. 1953లో గుజరాత్లోని భావ్‌నగర్ జిల్లాలోని సనొసరాలో లోక్ భర్తీ శిక్షణ సంస్థ అనే విద్యా సంస్థలో సందర్శక బోధకునిగా పనిచేశాడు. 1954 జూన్ లో గుజరాత్ విశ్వవిద్యాలయంలో గుజరాతీ సాహిత్య ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ విశ్వవిద్యాలయంలోనే భాషా విభాగాధిపతిగానూ బాధ్యతలు స్వీకరించాడు. 1956లో అమెరికా, బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లోని సాధారణ విద్య కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం అమెరికా, ఇంగ్లాండు దేశాలకు పంపిన కమిటీలో ఇతను ఒకడు. 1964లో దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థాపనకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమిటీలో జోషీ సభ్యుడు. ఇతను 1966 నవంబరు 30న గుజరాత్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నాడు. 1972 నవంబరు 17న ఉపకులపతిగానే ఉద్యోగ విరమణ చెందాడు.[7][8]

సాహిత్య, పత్రికా రంగాలు

[మార్చు]

జోషి 1931లో సత్యాగ్రహిగా జైలు జీవితం గడుపుతున్నప్పుడు 20వ ఏట తన తొలి ఖండకావ్యం విశ్వశాంతి రాశాడు. "పశ్చిమానికి గాంధీ ప్రయాణం భారత స్వాతంత్ర్యం కోరుతున్నదే అయినా అది వారికి శాంతినీ ప్రసాదిస్తుందన్న" కవి విశ్వాసాన్ని ఖండకావ్యం ప్రతిబింబించింది. ఉమాశంకర్ జోషి 1930ల తొలి సంవత్సరాల్లో సత్యాగ్రహ పత్రికలో మారుపేరుతోనో, పేరు లేకుండానో రచనలు చేసేవాడు. 1930-1934 మధ్యకాలంలో జాతీయోద్యమంలో తీవ్ర అభినివేశంతో పాల్గొనడంతో పాటుగా గుజరాతీలో కవితలు, కథలు, నవలలు, నాటకాలు అనేకం రచించాడు. 1934లో ముంబైలో బీఎ కోర్సులో కళాశాలలో చేరేనాటికి జోషి రచనలు గుజరాతీ పాఠ్యపుస్తకాల్లో స్థానం సంపాదించుకునే స్థాయికి ప్రాచుర్యం పొందాడు.[9]

Exhibition of Umashankar Joshi's books at Gujarati Sahitya Parishad, July 2018

అతని సాహిత్య రచనల్లో కొన్ని:[10]

మరణం

[మార్చు]

1988లో ముంబైలోని టాటా మొమోరియల్ ఆసుపత్రిలో కాలేయ క్యాన్సర్ సమస్య కారణంగా జోషీని చేర్చారు. అతను క్యాన్సర్ కారణంగా 77 సంవత్సరాల వయసులో 1988 డిసెంబరు 19న ముంబైలో మరణించాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. Modern Gujarati Poetry: A Selection by Rita Kothari. 1998. pp. 82, 85.
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 13 అక్టోబరు 2007. Retrieved 10 జూన్ 2019.
  3. 3.0 3.1 3.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-07. Retrieved 2019-06-10.
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-04. Retrieved 2019-06-10.
  5. 5.0 5.1 5.2 Bholabhai Patel (9 September 2016). "પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી 'વિશ્વશાંતિ'ની રચના કરનારા ૨૦ વર્ષના તરુણ કવિ ઉમાશંકરની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે". Divya Bhaskar (in గుజరాతి). Retrieved 19 September 2016.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; umashankarjoshi.in3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; umashankarjoshi.in2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Divya Bhaskar 20162 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. చౌధురి, ఇంద్రనాథ్; తలపాత్ర, గార్గి (2012). "ఉమాశంకర్ జోషి: ద స్టార్ ఆఫ్ ద డార్క్ నైట్". ఇండియన్ లిటరేచర్. 56 (2 (268)): 45–54. ISSN 0019-5804. Retrieved 2019-06-12.
  10. C. D. Narasimhaiah (1 January 1994). East West Poetics at Work: Papers Presented at the Seminar on Indian and Western Poetics at Work, Dhvanyaloka, Mysore, January 1991. Sahitya Akademi. pp. 257–258. ISBN 978-81-7201-385-1.
  11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; umashankarjoshi.in4 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బాహ్య లంకెలు

[మార్చు]