భవభూతి
భవభూతి (Sanskrit: भवभूति) సా.శ 8 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ సంస్కృత కవి. నాటక కర్త. కనోజ్ పాలకుడు యశోవర్మ ఆస్థానకవులలో ఒకడు. ఉత్తర రామాయణాన్ని ఇతివృత్తాంతంగా తీసుకొని, కరుణ రసాభివ్యంజనతో ఇతను రాసిన ఉత్తర రామ చరిత్ర అనే నాటకం సంస్కృత సాహిత్యంలో అమర కృతిగా (Masterpiece) కీర్తిని పొందింది.[1] అద్వితీయమైన ఈ నాటక రచనతో భవభూతి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తరువాత అంతటివాడుగా కీర్తి గడించాడు.[2]
జీవిత సంగ్రహం
[మార్చు]భవభూతి సుమారుగా సా.శ 680-750 మధ్య ప్రాంతంలో నివసించి ఉండవచ్చని నిర్ణయించబడింది. ఇతని జన్మస్థలం విదర్భ దేశంలోని పద్మాపురం [3]. ఇది మహారాష్ట్రలో (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతం) గోండియా జిల్లాలోని ఆమ్‌గావ్ సమీప ప్రాంతంలో ఉంది. భవభూతి కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖీయుడు. కాశ్యప గోత్రీయుడు. ఉదుంబర బ్రాహ్మణుడు. ఇతని తండ్రి నీలకంఠుడు, తల్లి జతుకర్ణి. మాలతీ మాధవం నాటకంలో ప్రస్తావనను బట్టి ఇతను వేదాలు, సాంఖ్య, యోగాలను అధ్యయనం చేసాడని వ్యాకరణ, మీమాంస, న్యాయ దర్శనాలయందు ఇతనికి మంచి ప్రవేశం కలదని తెలిస్తుంది.[2] భవభూతి తన గురువు పేరు జ్ఞాననిధి అని స్వయంగా పేర్కొన్నాడు. ఉన్నత విద్యాభ్యాసంకోసం, తన అదృష్టాన్ని వెతుక్కోవడం కోసం స్వస్థలాన్ని విడిచి ఉజ్జయిని చేరుకొన్నాడు.[2] యమునా నది ఒడ్డున గల కల్పి (Kalpi) (కాలప్రియ క్షేత్రం) అనే ప్రాంతంలో భవభూతి తన చారిత్రాత్మక నాటకాలను వ్రాయటానికి ప్రేరణ పొందాడని తెలుస్తుంది.[3][4] తన నాటకాలను కాలప్రియనాధోత్సవం సందర్భంలోనే ప్రదర్శింపచేసాడు. తన మూడు నాటకాలను రాసిన తరువాతనే వృద్ధాప్యంలో కనోజ్ రాజాస్థానాన్ని ఆశ్రయించాడని విమర్శకులు అభిప్రాయపడ్డారు.[5] భవభూతి కనోజ్ రాజ్యపాలకుడైన యశోవర్మ అస్థానకవులలో ఒకడు. మరొక ఆస్థాన కవి వాక్పతికి సమకాలికుడు. భవభూతి, వాక్పతి ఇరువురు యశోవర్మ ఆస్థాన కవులని క్రీ. శ. 12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర కవి కల్హణుడు తన సుప్రసిద్ధ చారిత్రిక గ్రంథం 'రాజతరంగిణి'లో పేర్కొన్నాడు.[2]
రచనలు
[మార్చు]భవభూతి మూడు సంస్కృత నాటకాలు మాత్రమే రాసాడు. అవి
- మహావీరచరిత్ర
- మాలతీమాధవం
- ఉత్తరరామచరిత్ర
మహావీరచరిత్ర: కావ్య నిర్మాణ పరంగా మహావీరచరిత్ర బలహీనంగా వుండటంతో దీనిని భవభూతి తొలి నాటక రచనగా భావిస్తారు.[1] పూర్వ రామాయణ కథను ఇతివృత్తాంతంగా తీసుకొని, రాముని ఒక మహావీరునిగా చిత్రీకరిస్తూ భవభూతి ఈ సంస్కృత నాటకాన్ని రచించాడు. అయితే ఈ నాటకం ప్రౌఢశైలిలో వుండటం చేత ప్రజాదరణ పొందలేకపోయింది.
మాలతీమాధవం: తొలి కృతికి జనాదరణ లేకపోవడంతో నిరాశకులోనైన భవభూతి ఒక కల్పిత కథను ఇతివృత్తాంతంగా గ్రహించి మాలతీమాధవం అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. ఈ నాటకంలో పద్మావతి పుర మంత్రి కూతురు అయిన 'మాలతి', 'మాధవుడు' అనే వ్యక్తిని ప్రేమించడం, వారు కలుసుకొనే సందర్భంలో అనూహ్యంగా ఒక పులి ఎదురవ్వడం, దానిని సంహరించిన 'మకరంధుడు' (మాధవుని మిత్రుడు), మాలతి సఖి అయిన 'మదయంతిక'ను ప్రేమించడం, ఒక కాపాలికుడు మాలతిని అపహరించడం, మాధవుడు అతనిని చంపి మాలతిని రక్షించడం ఇత్యాది అనేకానేక అత్భుత సంఘటనలతో నాటకం కొనసాగుతుంది. ఈ నాటకంలో మాలతీ-మాధవులు, మదయంతిక-మకరందుల రెండు ప్రేమకథలు సమాంతరంగా సమతూకంతో నడుస్తాయి. అనేక అత్భుత సంఘటనలనంతరం రెండు జంటలు ఏకం కావడంతో నాటకం పరిసమాప్తమవుతుంది. అయితే ఈ నాటకం కూడా కొంతమేరకు జనాదరణ పొందిందని సాంప్రదాయికంగా చెపుతారు.
ఉత్తరరామచరిత్ర: తన రెండవ కృతికి వచ్చిన ఆదరణతో భవభూతి నిండైన ఆత్మవిశ్వాసంతో భవభూతి ఉత్తరరామచరిత్ర నాటకాన్ని రాసాడంటారు. ఉత్తర రామాయణ కథను ఇతివృత్తాంతంగా గ్రహించి, దానికి తనదైన రీతిలో మార్పులు, చేర్పులు చేసి కరుణరసాత్మకంగా ఉత్తరరామచరిత్ర సంస్కృత నాటకాన్ని సృజించాడు. సీతామరణంతో దుఃఖాంతమైన వాల్మీకి రామాయణ కథను భవభూతి తన నాటకంలో సీతారాములను కలపడం ద్వారా సుఖాంతం చేసాడు.[6] ఈ ఒక్క నాటక రచనా కౌశల ప్రతిభతోనే భవభూతి సంస్కృత సాహిత్యంలో మహాకవి కాళిదాసు సరసన నిలబెట్టదదగిన వాడయ్యాడు అని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ సంస్కృత నాటకం భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది.
భవభూతి నాటకాలలో ముఖ్యంగా మహావీరచరిత్ర, మాలతీమాధవం లలో కౌటిల్యుని అర్ధశాస్త్ర భావజాలం, పద ప్రయోగాలు కనిపిస్తాయని సంస్కృత పండితులు తెలియచేసారు. చరిత్ర పరిశోధకులు దశరథ శర్మ ప్రకారం భవభూతి నాటకంలో రావణుని మంత్రి మలయవనుడు అనుసరించిన విధానాలకు, అర్ధశాస్త్రంలో కౌటిల్యుడు సూచించిన విధానాలకు మధ్య కొట్టచ్చినట్లు పోలికలు కనిపిస్తాయి. ఆ మేరకు భవభూతి కౌటిల్యునకు ఋణపడివున్నారని చెబుతారు.[3]
భవభూతి కవిత్వ శైలి
[మార్చు]భవభూతి కవిత్వం ప్రౌఢ గంభీరమైన శైలిలో కొనసాగుతుంది. ఇతని కవిత్వంలో కళాత్మక ప్రదర్శన కన్నా భావావేశ ప్రకటనకు ప్రాధాన్యం కనిపిస్తుంది. భావతీవ్రత, భావావేశం, నిసర్గతలు అధికంగా కనిపిస్తుంది. అనితర సాధ్యమైన శబ్ధ విన్యాస పద ప్రయోగం ద్వారా తన భావాన్ని స్పురింపచేయడం భవభూతికి కరతలామలకమైన విద్య. రౌద్ర, బీభత్స రస పోషణలో క్లిష్ట పదభూయిష్టమైన దీర్ఘ సమాసాలను, శక్తివంతమైన పదావళిని ప్రయోగిస్తూ సన్నివేశాలను ప్రౌఢంగా వర్ణిస్తాడు.
భవభూతి కవిత్వం గౌడీరీతి ప్రధానమైనది. దీర్ఘ సమాసాలు, క్లిష్ట పదాలతో కూడినది. ఓజో గుణ ప్రధానమైనది. యుద్ధ సన్నివేశ వర్ణనలోను, వీర, రౌద్ర రస పుష్టికై ఇతని కవిత్వఝురి గౌడీరీతిలో సాగుతుంది. అయితే పాత్రోచితంగా, రసానుకూలంగా గౌడీరీతినే కాక వైధర్భీరీతిని సైతం సందర్భానుసారం భవభూతి ప్రయోగించాడు.
భవభూతి కవిత్వం వాచ్యార్ధ ప్రధానమైనది. తన నాటకాలలో ఒక దృశ్యాన్ని వర్ణించేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ శబ్దాలను ప్రయోగిస్తాడు. తన కవిత్వంలో ఒక భావాన్ని చెప్పడంలో క్లుప్తత కన్నా విస్తారతకే అధిక ప్రాధాన్యం ఇస్తాడు. అంటే ఒక భావాన్ని సంక్షిప్తంగా చెప్పడం కన్నా విస్తారంగా చెప్పడమే అతనికి ఇష్టం. దానికోసం ఎక్కువ శబ్దాలను ఉపయోగించడం ఇతని కవిత్వంలో కనిపిస్తుంది.[7]
భవభూతి కవిత్వంలో దృశ్య వర్ణనలు యధాతధంగా, సహజంగా వుంటాయి. కల్పనీయత అతి తక్కువగా కనిపిస్తుంది. అందువలనే ఒక దృశ్యాన్ని వర్ణించేటప్పుడు భవభూతి అలంకారాలను, వ్యంగార్ధాలను, చమత్కారాలను ఎక్కువగా ఆశ్రయించడు. ఆ దృశ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా యధాతధ పద్ధతిలోనే వర్ణిస్తాడు.
భవభూతి అభిమాన రసం కరుణ రసం. తన మూడు నాటకాలలోను వీర, కరుణ, శృంగార రసాలను పోషించడంలో అనితరమైన ప్రతిభను చూపాడు. వీర రస ప్రధానంగా మహావీరచరిత్రను, శృంగార రసం ప్రధానంగా రౌద్ర, బీభత్స తదితర రసపోషణతో మాలతీమాధవాన్ని, కరుణరసాత్మకంగా ఉత్తరరామచరిత్రను పోషించాడు. అయితే ఒక్క హాస్య రసం తప్ప మిగిలిన అన్ని రసాలను తన నాటకాలలో పోషించాడు.
సముచిత చందఃప్రయోగ కౌశలం భవభూతికి కొట్టినపిండి. భవభూతి తను చెప్పదలుచుకొన్న విషయానికనుగుణంగా, అందలి భావానికనుకూలంగా వివిధ ఛందస్సులను ఎంచుకొంటాడు. ఉదాహరణకు లలితభావ వ్యక్తీకరణకు అనుష్టపు ఛందస్సును, శృంగార చిత్రణలో మాలిని, ఇంద్ర వ్రజ, ఉపేంద్ర వ్రజ ఛందస్సులను, రౌద్ర, బీభత్స అభివ్యక్తీకరణకు శార్దూల, విక్రీడిత, స్రగ్ధర ఛందస్సులను ఉపయోగిస్తాడు.[8] భవభూతికి శిఖరిణీ వృత్తం అభిమాన వృత్తం.[8] తన కవిత్వంలో కరుణరసాభివ్యక్తికి శిఖరిణీ వృత్తాన్నే ఎక్కువగా ప్రయోగించాడు.
భవభూతి చిత్రణలు
[మార్చు]ఒక దృశ్యాన్ని లేదా భావాన్ని చిత్రీకరించడంలో భవభూతి అద్వితీయమైన నేర్పును కనపరుస్తాడు. అయితే భవభూతికి ముందుతరం కవులందరూ ఏదైనా ఒక దృశ్యాన్ని లేదా భావాన్ని ఒక సంప్రదాయ దృక్కోణం నుండే వీక్షించారు.ఆస్వాదించారు. ఆ పార్శ్వం నుండే చూసిన వారు దానినే కడు రమ్యంగా వర్ణించగలిగారు. అవతలి పార్శ్వాన్ని చూసినా అథవా వర్ణించినా భవభూతి వలె అంత సహజసిద్ధంగా మరెవరూ వర్ణించలేకపోయారు.
దృశ్య చిత్రణ
[మార్చు]ఒక దృశ్యాన్ని వర్ణించేటప్పుడు భవభూతి దానిని సహజంగా, వున్నది ఉన్నట్లుగానే వర్ణిస్తాడు. అందుకు తగ్గట్లుగా అలంకారాలను, వ్యంగార్ధాలను అతి తక్కువగా ప్రయోగించడం వలన భవభూతి దృశ్య వర్ణనలు పాఠకుల మనస్సుపై చిత్రాలవలె నిలిచిపోతాయి. ఉదాహరణకు ప్రకృతి దృశ్య చిత్రణలో ప్రకృతి కోమల రూపాన్ని మనోహరంగా చిత్రించడంతో సరిపెట్టకుండా ప్రకృతి యొక్క ప్రచండ భీకర రూపాన్ని చిత్రించడంలో సైతం భవభూతి అమోఘమైన కౌశలం ప్రదర్శిస్తాడు.
ప్రకృతి చిత్రణ
[మార్చు]సంస్కృత సాహిత్యంలో కవులు ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆదినుండి ప్రకృతి యొక్క శోభాయమైన కోమల సుందర రూపాన్నే తీసుకొని దృశ్య చిత్రణ చేస్తూ వచ్చారు. వారి దృష్టి ప్రకృతి యొక్క భయావహమైన కోణం వైపుకు ఎన్నడూ ప్రసరించలేదు. అడపాదడపా కొందరు కవులు ప్రకృతి యొక్క భయంకర రూపాన్ని వర్ణించినా భవభూతి అంత సహజంగా ఎవరూ వర్ణించలేదు. ఆతను వర్ణించిన ప్రకృతి దృశ్యాలు వున్నది వున్నట్లుగా పాఠకుల మనోఫలకాలపై చిత్రపటాల వలె ముద్రితమై పోతాయి. దండకారుణ్య వర్ణనలో, శ్మశాన వర్ణనలో భయావహమైన ప్రకృతి యొక్క ప్రచండ భీకర రూపాన్ని భవభూతి పఠితుల ఒళ్ళు జలదరించేటట్లుగా వర్ణిస్తాడు.
భావ చిత్రణ
[మార్చు]దృశ్య చిత్రణ కన్నా ఒక కొత్త భావాన్ని పాఠకుల మనస్సులకు హత్తుకొనేటట్లు చిత్రించడం ఆరితేరిన సుకవికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులోను తన ముందరి కవులు చూపిన ఒరవడిలో కొట్టుకుపోకుండా వారికి భిన్నంగా ఒక కొత్త భావానికి గాని సందేశానికి గాని ప్రాధాన్యమిస్తూ దాన్ని కౌశలంగా చిత్రించడంలో భవభూతి మార్గం భవ్యమైనది. ఉదాహరణకు ప్రణయ చిత్రణలో భవభూతి చూపిన మార్గం అతని పూర్వ కవుల మార్గానికి భిన్నమైనది, ఆదర్శనీయయమైనది.
ప్రణయ చిత్రణ
[మార్చు]సంస్కృత సాహిత్యంలో ప్రాచీన కవులు సాధారణంగా ప్రణయ భావాన్ని చిత్రించేటప్పుడు అవధులు లేని కామాతురతమైన ప్రేమను ఆలంబనగా చేసుకొని తమ తమ కావ్యాలలో ప్రణయ వర్ణణ చేస్తూ వచ్చారు. కేవలం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యమిచ్చే వీరు ప్రణయ చిత్రణలో స్త్రీ బాహ్య సౌందర్యానికి అందులోను అంగాంగ సౌష్టవాన్ని వర్ణిస్తూ ఒక రకమైన విశృంఖలమైన స్వేచ్ఛా ప్రణయ భావానికి మార్గం వేసారు. ప్రణయంలో విరహవేదనను స్త్రీలలో మాత్రమే చూడగలిగిన వీరికి పురుషులలో విరహవేదనను గుర్తించే అవసరం కలుగలేదు. తన పూర్వ కవులు ఏర్పరిచిన ఇటువంటి సంప్రదాయమార్గంలో పయనించకుండా, భవభూతి తన కవిత్వంలో ప్రణయ భావ చిత్రణకు స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రణయాన్ని ఆలంబనగా చేసుకొన్నాడు. ఇతని ప్రణయ వర్ణనలో కామాతురతమైన ప్రేమ కన్నా వైవాహిక బంధానికి దారితీసే ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వబడింది. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యానికే మొగ్గు చూపబడింది. అతని నాటకాలలో ఎక్కడా స్త్రీ అంగాంగ సౌష్టవ వర్ణన కనిపించదు. ప్రణయ చిత్రణలో పరిపక్వమైన దాంపత్య ప్రేమను భవభూతి చిత్రించినంత ఆదర్శంగా మరేతర కవులూ చిత్రించలేకపోయారు. భవభూతి రామునిలో కలిగిన విరహ వేదనను పాఠకుల హృదయాలను కదిలించేటట్లుగా సహజంగా చిత్రించి, విరహ వేదన అనేది స్త్రీలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని తెలియపరుస్తాడు.
భవభూతి నాటక రచనలో నవ్యత
[మార్చు]భవభూతి ముందుకాలం వరకు నాటక రచనారంగంలో కొత్త మార్పులు పెద్దగా చోటుచేసుకోలేదు. నాటి కవులందరూ తమ పూర్వ కవులేర్పరిచిన మార్గాన్నే అనుసరిస్తూ, ప్రాచీన నాటక లక్షణాలకు అనుగుణంగానే తమ తమ నాటకాలను రచించారు. నాటక కృతులలోని కవితాస్థాయిని అంచనా వేయడానికి, కృతికర్త ప్రతిభను పరీక్షించడానికి విమర్శకులు గీటురాయిగా ప్రాచీన నాటక లక్షణాలను, లాక్షణికుల లక్షణాలను పట్టుకొని వ్రేలాడుతూ వుండేవారు. భవభూతి కాలం నాటికి ఈ ధోరణి మరింతగా బిగిసుకుపోయి వుండేది. ఇటువంటి సాహితీ నేపథ్యంలో భవభూతి తన నాటక రచనలో తన పూర్వ కవుల మార్గం అనుసరించకుండా కొత్త పధాన్ని అవలంబించాడు. తన నాటకాలలో మూల కథకు మార్పులు చేరుస్తూ కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ వచ్చాడు. ఆలంకారికులు కూడదన్న లక్షణాలను ఎన్నింటినో తన నాటకాలలో చొప్పించాడు. అయితే కావ్య విమర్శకులు అతని కృతులలోని కావ్య సౌందర్యం కన్నా కావ్య లక్షణాలను మీరడాన్నే ఎక్కువగా విమర్శించారు.
వాల్మీకి, కాళిదాసుల రామాయణ కథలకు భిన్నమైన రీతిలో భవభూతి మహావీర చరిత్ర నాటక కథను నడిపించినప్పటికీ, ఆ కొత్తదనాన్ని ఆస్వాదించే సహృదయత ఆనాటి సామాజికులలోను, అలంకారికులలోను కరువైంది. తను ప్రవేశపెట్టిన నూతన మార్పులు సరైన ఆదరణ పొందకపోవడంతో తన తరువాయి నాటకం మాలతీమాధవం యొక్క ప్రస్తావనలో “ ఏ నామ కేచీ దిహ ..... ” అనే ప్రముఖ శ్లోకంలో ఇలా పేర్కొంటాడు.
ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां
जानन्ति ते किमपि तान्प्रति नैष यत्नः ।
उत्पत्स्यते तु मम कोऽपि समानधर्मा
कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ ----మాలతీమాధవం - భవభూతి
Those who deride or ignore my work -
let them know: my efforts are not for them.
There will come along someone who shares my spirit:
the world is vast, and time endless.
“నా కృతులను అవహేళన చేసేవారు, విస్మరించేవారు ఎవరైనా కావచ్చు.
వారికి తెలియ చేయండి, నా ప్రయత్నం వారికోసం కాదని,
కాలం అంతులేనిది, ప్రపంచం విశాలమైనది.
ఏదో ఒక రోజు నా భావాలతో ఏకీభవించే వ్యక్తి ఎక్కడో ఒక చోట ఉంటాడు.”
ఈ శ్లోకం ద్వారా భవభూతి ఏదో ఒక నాటికి, ఎక్కడో ఒకచోటైనా తన ప్రతిభకు గుర్తింపు, ఆదరణ లభిస్తాయనే ఆశను వ్యక్తం చేసాడు. ఈ శ్లోకంలో భవభూతి అహంభావం కనిపిస్తున్నట్లున్ననప్పటికీ, కవిత్వంలో కొత్తదనాన్ని ప్రయోగించే వారికి భవభూతిలో నిండైన ఆత్మవిశ్వాసమే కనిపిస్తుంది. ఈ శ్లోకం తరువాయి తరం కవులనెందరికో స్ఫూర్తి నిచ్చింది. భవభూతి పరచిన మార్గంలో అనేక మంది కవులు పయనించారు. అనంతర కవులనేకం మంది భవభూతి వలె తాము కూడా మూల రామాయణంలో విన్నూతన మార్పులు ప్రవేశపెడుతూ, కొత్త ఘట్టాలను పరికల్పిస్తూ, మూలకథకు భిన్నమైన రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను సృజించారు.
ప్రభావం
[మార్చు]- భవభూతి రచించిన రామాయణ నాటకాలను ఆదర్శంగా తీసుకొన్న తరువాత తరం కవులు భవభూతి వలె మూల రామాయణంలో మార్పులు చేరుస్తూ, కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను కొల్లలుగా రాయడం ప్రారంభించారు. వీరిలో శక్తి భద్రుడు (ఆశ్చర్యచూడామణి), మురారి (అనర్ఘ రాఘవం), మాయురాజు (ఉదాత్త రాఘవం), రాజశేఖరుడు (బాల రామాయణం), దిజ్ఞాగుడు (కుందమాల), పిల్ల మురారిగా ప్రసిద్ధుడైన జయదేవుడు (ప్రసన్నరాఘవం) మొదలైనవారు ముఖ్యులు. అయితే భవభూతి పెట్టిన ఒరవడిలో అనుకరిస్తూ వచ్చిన తదనంతర రామాయణ నాటకాలు అంతగా ప్రజాదరణను పొందలేకపోయాయి.
విమర్శ
[మార్చు]- భవభూతి హాస్యరస పోషణలో విఫలుడయ్యాడని విమర్శకుల అభిప్రాయం. ఆతను రాసిన మూడు నాటకాలలోను విదూషకుని పాత్ర లేదు.[1] మాలతీమాధవం నాటకంలో హాస్యరస పోషణకు అవకాశం వున్నా భవభూతి ఎందుకనో విదూషక పాత్రను ప్రవేశ పెట్టలేదు. మొత్తం మీద ఒక్క హాస్య రసం తప్ప మిగిలిన అన్ని రసాలను తన నాటకాలలో పోషించాడు.[8]
- భవభూతి తన నాటకాలలో 'నాటక లక్షణాల'కు విరుద్ధమైన పెక్కు విషయాలను ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు మాలతీమాధవంలో రంగస్థలం మీదకు పులి రావడం, శ్మశాన దృశ్యాలు, మనుష్య మాంసం అమ్మటం మొదలైనవి.[9]
- భవభూతి కరుణ రసాన్ని ప్రధానంగా (అంగిరసం) చేసుకొని ఉత్తరరామచరిత్రను రాసాడు. ఇది ఆలంకారిక శాస్త్రానికి విరుద్ధం. సంప్రదాయానికి విరుద్ధంగా పోయినప్పటికీ కరుణరసాప్లావితమైన ఉత్తరరామచరిత్ర నాటకం సంస్కృత సాహిత్యంలో అజరామమైన కీర్తిని సంపాదించుకొన్నది.
- * భవభూతి నాటకాలు రంగస్థల ప్రదర్శనకు అంత యోగ్యంగా ఉండవనే ఒక విమర్శ ఉంది. ఈ విమర్శకుల దృష్టిలో ఉత్తరరామచరిత్రలో సీత పాతాళ ప్రవేశం, కుశలవుల యుద్ధాలు వంటివి సంక్లిష్ట ఘట్టాలని, అవి పఠన యోగ్యతకే తప్ప రంగ స్థల ప్రదర్శనకు అంత అనువుగా ఉండవని భావిస్తారు.[10]
సంస్కృత సాహిత్య చరిత్రలో భవభూతి స్థానం
[మార్చు]సంస్కృత సాహిత్య చరిత్రలో భవభూతిని (8వ శతాబ్దం) సాధారణంగా మహాకవి కాళిదాసుతో (5వ శతాబ్దం) పోలుస్తూ వుంటారు. కాళిదాస, భవభూతు లిరువురూ సంస్కృత సాహిత్యంలో మహాకవులు. ఇరువురి కావ్యాలను పరిశిలించి చూస్తే, కాళిదాసు సంస్కృత సాహిత్యపు వినీలాకాశంలో ధ్రువతార వంటివాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. సంస్కృత భాషపై అద్భుతమైన పట్టుగల అతనికి సరైన పదాన్ని ప్రయోగించి సిసలైన భావాన్ని ఒలికించి తద్వారా పాఠకుల మనస్సును ఆకట్టుకోవడం బాగా తెలుసు.[11] ఇతివృత్త ప్రణాళికలోని, పాత్ర చిత్రణలోనూ, సెంటిమెంటును ఒలికించడంలోనూ అతని నాటకాలు దాదాపుగా దోషరహితాలుగా కనిపిస్తాయి.[12] అందుకనే ప్రాచీన కావ్య రసజ్ఞులు కాళిదాసును కవికుల గురువుగా ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది.[12] ఇకపోతే భవభూతి కూడా తనదైన మార్గంలో దిగ్గజ కవే. అయితే అతని కథా ప్రణాళికలో కొన్ని చిన్న చిన్న లోపాలు కనిపిస్తాయి. కావ్యంలో సుదీర్ఘోపన్యాసాలు, వర్ణనలో కొద్దిపాటి కృత్తిమత్వం కనిపిస్తాయి.[12] సంస్కత భాషపై సాధికారత గల భవభూతి విభిన్న సెంటిమెంట్లు పండించడంలో సిద్ధహస్తుడు. పాత్ర చిత్రీకరణలో వైవిధ్యత, మనో విశ్లేషణలో నిశిత పరిజ్ఞానం అతనికి కొట్టిన పిండి. భావోద్వేగ ప్రదర్శనలో అతను చూపిన కౌశలం అనన్య సామాన్యం. ఇక కరుణ రసాభివ్యక్తీకరణలో అతనికతనే సాటి. వీటికి తోడు అతని నాటకాలలో అభివర్ణితమైన రాజకీయ, సాంఘిక, కుటుంబ జీవిత ఉన్నతాదర్శాలు అతనికి సంస్కృత సాహితీలోకంలో అమరమైన కీర్తిని చేకూర్చాయి.[12] ఒక ఆధునిక సాహిత్య విమర్శకుడు పేర్కొన్నట్లు "కాళిదాసు, భవభూతుల సరసన నిలబడగల మూడవ కవి సంస్కృత సాహితీ జగత్తులో లేడు.[12] వీరిరువురూ ప్రాచీన భారతీయ కవులందరికంటే అగ్రాసనంలో వున్నారు. సంస్కృత భాషలో అసాధారణ ప్రతిభాసంపన్నులు, అమర కవితా స్రష్టలు అయిన వీరు తమ కవితా వైదుష్యంతో శతాబ్దాలుగా పాఠకులను ఆకట్టుకోవడంలో ఆశ్యర్యం లేదు." [12]ఆ విధంగా భవభూతి గొప్పతనాన్ని అతని సమకాలికులు గుర్తించనప్పటికి, ఆత్మవిశ్వాసంతో నిండిన అతని నమ్మకాన్ని కాలం కూడా సమర్ధించింది.[12]
వీటిని కూడా చూడండి
[మార్చు]గ్రంథసూచిక
[మార్చు]- C RAMANATHAN. BHAVABHUTI A BRIEF SKETCH OF LIFE & WORKS (PDF) (1985 ed.). Bangalore: INDIAN INSTITUTE OF WORLD CULTURE. Archived from the original (PDF) on 13 జూలై 2017. Retrieved 4 August 2017.
- Mudiganti Gopala Reddy; Mudiganti Sujatha Reddy. Sanskrita Saahitya Charitra (Telugu) (2002 ed.). Hyderabad: Potti Sreeramulu Telugu University .
- Malladi Suryanarayana Shastry. Samscrutha Vangmaya Charitra Loukika Vangmayamu (Vol 2)(Telugu) (1961 ed.). Hyderabad: Andhra Saraswata parishattu.
- V.V. Mirashi. Bhavabhuti (1996 ed.). Motilal Banarsidass. ISBN 8120811801.
- SV Dixit, Bhavabhuti: His life & Literature, Belgaum, 1958
- Mirashi, Vasudev Vishnu. Bhavabhūti (1974 ed.). Delhi: Motilal Banarsidass. ISBN 8120811801.
బయటి లింకులు
[మార్చు]- Meera S. Sashital. "Bhavabhuti – The Great Dramatist". The Free Press Journal (Dec 27, 2015). Retrieved 4 August 2017.
- tlayt. "Bhavabhuti". TLAYT (Dec 21, 2016). Retrieved 4 August 2017.[permanent dead link]
- "Bhavabhuti". Encyclopædia Britannica. Retrieved 4 August 2017.
- "Bhavabhuti, Indian Sanskrit Dramatist". India Netzone. Jupiter Infomedia Ltd. Retrieved 4 August 2017.
- C RAMANATHAN. BHAVABHUTI A BRIEF SKETCH OF LIFE & WORKS (PDF) (1985 ed.). Bangalore: INDIAN INSTITUTE OF WORLD CULTURE. Archived from the original (PDF) on 13 జూలై 2017. Retrieved 4 August 2017.
- [1] Archived 2019-07-09 at the Wayback Machine BHAVABHUTI; H RODRIGUES 26 April 2016
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 C RAMANATHAN 1985, p. 2.
- ↑ 2.0 2.1 2.2 2.3 C RAMANATHAN 1985, p. 1.
- ↑ 3.0 3.1 3.2 Meera S. Sashital.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 412.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 415.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 419.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 447.
- ↑ 8.0 8.1 8.2 Mudiganti Gopalareddy 2002, p. 441.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 449.
- ↑ Mudiganti Gopalareddy 2002, p. 437.
- ↑ Vasudev Vishnu Mirashi, p. 396.
- ↑ 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 Vasudev Vishnu Mirashi, p. 397.