Jump to content

జయదేవుడు

వికీపీడియా నుండి
విష్ణువును పూజిస్తున్న జయదేవుడు

జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. ఈయన 12 వ శతాబ్దమునకు చెందినవాడు. అతడు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, గీత గోవిందం హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది.

జీవితం

[మార్చు]
ఒరిస్సా, కెందుబొల్వ లోని జయదేవ పీఠంలో జయదేవుని విగ్రహం

జయదేవుడు ఒడిషా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్న కెందుళి (బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కెందుళి సాసన్ ( ఇప్పుడిలా పిలువబడుతోంది ) గ్రామం, పూరీకి సమీపంలో ఉంటుంది. కెందులి పట్నము, కెందులి దౌళి, కెందులి సాసనము మూడు గ్రామములలో కలసిన ప్రదేశము. ఇవి ప్రాచీనది ఒడ్డున ఉన్నాయి. ఈనది పరమ పవిత్రమైననది. కెందులి గ్రామసీమ నుండి రెండుమైళ్ళ దూరంలో ఖుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసేచోటును జనం త్రివేణీసంగమ మని వ్యవహరిస్తారు. కెదులి గ్రామములో వాసుదేవ విగ్రహాలు నారాయణ నామంతో అనేకం కనిపిస్తున్నాయి. అందువల్ల జయదేవుని జన్మగ్రామం ఒరిస్సాలోని ప్రాచీనది ఒడ్డున ఉన్న కెందులి అని చరిత్రకారులు నిర్ణయించారు.

తన జనన స్థలాన్ని జయదేవుడు 7 వ అష్టపదిలో "కిందుబిల్వ సముద్ర సంభవ" అని పేర్కొనెను. జయదేవుడి తల్లిదండ్రులు, భోజదేవుడు, రమాదేవి లు. జయదేవుడు జన్మించినప్పుడు ఒడిశా, చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటకలో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడాడు. ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించాడు. బీద బ్రాహ్మణుడైన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినట్లు తెలుస్తోంది. ఈయన.1090-1153 మధ్యకాలంలో జీవించినట్లు తెలుస్తోంది. జయదేవుడు సా.శ. 1116 నుంచి 1160 వరకూ గౌడదేశాన్ని పాలించిన లక్షణసేనుని ఆస్థానంలో ఉండేవాడు.[1]

బెంగాలులోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని ఆస్థానమున సా.శ. 1116 లో జయదేవుడు ఒక పండితుడిగా నున్నట్లు అక్కడున్న ఆధారాలను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై "గోవర్థనుడు, పారణ, జయదేవుడు" అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కారు.

వివాహ కథ

[మార్చు]

జయదేవుని వివాహము పద్మావతితో జరుగుటకు ఒక ముఖ్య కారణము ఉంది. ఆ గ్రామములోనే దేవశర్మ యను మరియొక బ్రాహ్మణుడు ఉండెడివాడు. దేవశర్మ తన మొదటి సంతానమును శ్రీ పురుషోత్తమ స్వాములకు అర్పించునటుల మ్రొక్కుకొనెను. ఆ విధముగా దేవశర్మ భార్య విమలాంబకు ఒక ఆడ శిశువు జన్మించగా ఆ శిశువునకు 'పద్మావతి' అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు వచ్చిన పిదప ఆమెను శ్రీ పురుషోత్తమ స్వామికి అర్పించి దేవశర్మ యింటికి వెడలిపోయెను. ఆ రాత్రి దేవస్థానములోని పూజారులకు శ్రీ పురుషోత్తమ స్వామి కలలో కనబడి "ఆ బాలికను జయదేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి, అతనికి ఇచ్చి వివాహము చేయమని" చెప్పినాడట. మరునాడు ఉదయము వారు దేవశర్మను, ఆ బాలికను జయదేవుల సమక్షమునకు గొనిపోయి దేవశర్మ యొక్క మ్రొక్కుబడిని గూర్చి, స్వప్నమున శ్రీ స్వామి చెప్పిన విషయములన్నియు విశదీకరించిరి. కాని జయదేవుడు దేవశర్మతో " ఈ కూటికి గతిలేని బీద బ్రాహ్మణుని అల్లునిగా ఏల ఎంచుకున్నావయ్యా" అని తన దారిద్ర్యమును గూర్చి చెప్పి నిరాకరించెను. కాని దేవశర్మ పద్మావతిని అచటనే విడచి వెళ్ళిపోయెను. కొంతకాలము తరువాత పద్మావతి తన పట్ల చూపుతున్న శ్రద్ధకు, సేవలకు ముగ్ధుడై ఆమెను శాస్త్రోక్తముగా వివాహమాడెను. జయదేవుడు శ్రీ పురుషోత్తమ స్వామి అంశయేనని అంటారు. తరువాత వీరిద్దరూ అన్యోన్యానురాగములతో దాంపత్య జీవితమును గడుపుచూ, కృష్ణుని మహిమలను గానము చేయుచూ జీవితమును గడిపిరి.పద్మావతీదేవి పాతివ్రత్యమును పరీక్షింప నొకమారు సాత్యకిరాజు స్వామి ఇంటలేని సమయమునందు విచ్చేసి "మీభర్త దుర్జనులచే హతమైనాడని" ఒక యళీకవార్త వినిపింప నామె ఆత్మహత్య చేసుకొనగా జయదేవస్వామి తిరిగివచ్చి కృష్ణస్ంకీర్తన మొనర్పగా ఆమె "సుప్తిబోధిత" వలె మేల్కొని నట్లు మరియొక జనశ్రుతి వినవచ్చుచున్నది.

జయదేవుడు ఉపాస్యదేవత అయిన నారాయణమూర్తి కైంకర్యంకోసం ధనార్జన చేయటానికి బృందావనం, జయపురం మొదలయిన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చోరులు అయిన ధనాన్ని అపహరించి కాళ్ళూ చేతులు విరుగగొట్టి పోయినారట! ఒక ప్రభువు వేటకు వచ్చి ఆయన దుర్దశను చూచి రాజధానికి తీసుకొనిపోయి చికిత్సచేయించి స్వాస్థ్యం చేకూర్చిన తరువాత పద్మావతితో ఆకవి అక్కడనే కాపురం చేస్తూ ఉన్నాడు. యతివేషాలు వేసుకొని వెనుకటి చోరులు ఆరాజధానికి వచ్చినా తెలుసుకొనికూడా వారికి జయదేవుడు శిక్షచెప్పించలేదట!

సాహిత్యం

[మార్చు]

జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, దశకృతికృతే, కృష్ణుడు మూడు ముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, త్రిభంగి అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. జయదేవుని రెండు అష్టపదులు సిక్కుల మతగ్రంథమైన గురు గ్రంథ సాహిబ్లో కనబడతాయి. దీనిని బట్టి, జయదేవుని రచనలు గురునానక్ మీద, అతడు పూరీని సందర్శించినప్పుడు, ఎంత ప్రభావం చూపాయో అర్థమౌతుంది.

గీత గోవిందం

[మార్చు]
గీత గోవిందం-కృష్ణుడు గోపికలు
బాహ్‌సోలి పెయింటింగ్-రాధాకృష్ణులు

గీత గోవిందం జయదేవుని గొప్ప కావ్యం. రాధాకృష్ణుల ప్రేమ తత్వమును గూర్చి అష్టపదులుగా రచించిన మహానుభావుడు. అది 12 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపదలు ఉంటాయి. వీటినే అష్టపదులు అంటారు. ఈ గ్రంథము 24 అష్టపదులు, 80 కి పైగా శ్లోకములు కలిగి, 12 సర్గలతో వ్రాయబడెను. గోవిందుని గూర్చి రచింపబడిన గేయ ప్రబంధమగుటచే దీనికి "గీతగోవిందం" అని పేరిడిరి. ఈ అష్టపదులు నాయకా, నాయకీ, నటులచే పాడబడినట్లు రచింపబడెను. దీనిలో 19 వ అష్టపది "దర్శనాష్టపది" అనియు " సంజీవనీ అష్టపది" అనియు చెప్పబడింది. ఇది రాధాకృష్ణుల ప్రణయతత్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి యున్నకావ్యం.నవవిధ భక్తి మార్గాలలో - 1. పిత్రాపుత్ర 2. రక్ష్య రక్షక 3. ఆధారధేయ 4. శరీరాత్మ 5. జ్ఞాతజ్ఞయ 6. భోక్తృభోగ్య 7.స్వస్వామి 8.భార్యాభర్తృ 9.శెషశేషి అను భార్యాభర్తృ భక్తిమార్గం గీతగోవిందంలో జయదేవుడు నిరుపించాడు. ఇందులో సర్గనామములు సాభిప్రాయములు-సామోద దామోదరము, క్లేశ కేశవము, ముగ్ధ మధుసూదనము ఇత్యాదులు పలు సర్గలు. రసము శృంగారము, ఏకాదశ ద్వాదశ సర్గలలోని శృంగారము, సంభోగము. నాయకుడు గోవిందుడు. నాయిక రాధ.జయదేవ కవి రాధ ఇంద్రాణి అయినట్లు జయదేవ స్వామి చరిత్రలో ఇలా ఉంది. 'తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్య రమమైన ఇంద్రాణి వైకుంఠధాముని దర్శించటానికి వెళ్ళి ఆతని నవమన్మధ మన్మధాకృతిని దర్శించి నంత మాత్రాన మోహబాణ పాతాలకు పాలై స్వామిని చూచి "ఓ దీనమూర్తి హరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే" అని ప్రార్థించింది. భగవంతుడు ఆమెను చూచి "నేను సాధుసంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోధసిద్ధి పొందుదువుగాక." అని అనుగ్రహించాడు.

సర్ విలియమ్ జోన్స్ 1792 లో, తొలిసారిగా గీత గోవిందాన్నీఆంగ్లంలోకి అనువదించాడు. తరువాత ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయబడింది. గీత గోవిందం సంస్కృత కావ్యాలలోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది.

గీత గోవింద సారాంశం

[మార్చు]

జయదేవుడు శ్రీ కృష్ణుని పరబ్రహ్మ స్వరూపముగా పూజించెను. ఈ గీత గోవిందమును శృంగార రసముతో, మధుర భక్తితో, నాయకా, నాయకీ భావముతో స్తుతించెను. ఇందు రాధ నాయకి-జీవాత్మ, కృష్ణుడు నాయకుడు-పరమాత్మ, సఖి - ఈ సఖి జీవాత్మను ముక్తి పథములో నడిపించి పరమాత్మలో లీనము చేయుటకు తోడ్పడును. ఇదియే గీత గోవిందములోని సారాంశము.

దర్శన అష్టపది

[మార్చు]

జయదేవుడు గీత గోవిందమును మిక్కిలి ఉత్సాహముతో, దీక్షతో, భక్తితో వ్రాయుచుండెను. 10 వ సర్గలో గల 19 వ అష్టపదిలో 7 వ చరణమును రచించుచున్న సమయములో తన భావనాకల్పన అతి విచిత్రముగా నుండెనట. కృష్ణుడు రాధతో...

స్మరగళ ఖండన మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం.....

"రాధా! ప్రేమ అను విషము నా తలకెక్కి యున్నది. అందువలన నీ కోమలమైన పాద పద్మములను నా శిరస్సు పై నిడుము. అపుడు ఆ విషమంతయు దిగును." అను అర్థము వచ్చునటుల వ్రాసినాడట. కాని వెంటనే "ఏమీ! రాధ తన పాదమును కృష్ణ పరమాత్మ తలపై నుంచుటయా? ఇది మహాఘోరమైన పని. ఇట్లు వ్రాయుట మహాపచారము" అని తలచి ఆ పంక్తులను కొట్టివేసి, జయదేవుడు లేచి, అభ్యంగన స్నానమునకు నూనె ఒంటికి, తలకు రాసుకొని నదికి వెళ్ళినాడట.

కొంత సేపటికి ఆ స్వామి జయదేవుని రూపమున తిరిగి వచ్చి ఆ వ్రాతప్రతిని తెమ్మని పద్మావతిని ఆడిగి, ఆ కొట్టివేసిన పంక్తులనే మరల వ్రాసి వెళ్ళిపోయెనట. స్నానము చేసి వచ్చిన జయదేవ కవికి తాను కొట్టివేసిన పంక్తులు మరల వ్రాసి యుండుట చూసి, ఆశ్చర్యపడి ఎవరు వ్రాసినారని పద్మావతిని అడిగెనట. ఆమె "స్వామీ! మీరే కదా మరల వచ్చి వ్రాసి పోయితిరి. నూనె బొట్లు కూడా ఆ ప్రతిమీద నున్నవే" అని చెప్పగా సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మయే వచ్చినాడని తెలుసుకొని, పద్మావతి పుణ్యమును వేనోళ్ళ కొనియాడుచూ శ్రీ కృష్ణుడు తన భార్య పద్మావతికి దర్శనమిచ్చినందున ఆ అష్టపదికి "దర్శనాష్టపది" అని నామకరణం చేసెను. ఈ అష్టపది యొక్క ఎనిమిదవ చరణమున.

జయతు పద్మావతీ రమణ జయదేవకవి
భారతీఫణీత మితిగీతం

అని తనపేరుకు ముందుగా ఆమె పేరు పెట్టెనట.

సంజీవని అష్టపది

[మార్చు]

జయదేవ కవి, భార్యయగు పద్మావతితో శ్రీ లక్షనసేన మహారాజుచే గొప్పగా గౌరవింపబడుచుండెను. అది సహించలేని రాజుగారి భార్య రాణి తగిన సదవకాశము నకై వేచియుండెను. ఒకనాడు రాజు పరివారముతో కూడి జయదేవకవితో కలసి వేటకై వెళ్ళినాడట. రాణిగారు పద్మావతికి జయదేవ కవికి వైపరీత్యము జరిగినట్లు అబద్ధపు సమాచారమును తెల్పెనట. అంత పద్మావతి దుఃఖ సముద్రమున మునిగి అసువులు బాసెనట. ఇటువంటి విషాద సంఘటన జరుగునని రాణి ఈషణ్మాత్రమైనా యోచించలేదు. రాణి భయముచే ఒణికి పోసాగెను. కొంత సమయము తరువాత రాజు, జయదేవుడు వేట నుండి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన చూచి, ఏమిచేయవలెనో తెలియక దిగులుపడిరి. అపుడు జయదేవుడు "తన మరణవార్త విన్నందువల్ల చనిపోయినది కాని ఇప్పుడు తాను బ్రతికే ఉన్నాను కదా" అని చెప్పి 19 వ అష్టపది అయిన "పదసీయతి" పాడి ముఖముపై నీళ్లు చల్లగా, ఆమె నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి కూర్చుండినదట. ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్తములతో వ్రాసిన పంక్తులు ఉన్నాయి. కనుక ఆమె మరల పునరుజ్జీవము పొందినది. అందువల్ల ఈ అష్టపదికి "సంజీవని అష్టపది" అని పేరు కలిగినది.

జయదేవుడు స్వయముగా దేవాలయములలో అష్టపదులను పాడుతున్నప్పుడు పద్మావతి వాటికి నాట్యము చేసేదట. 21 వ అష్టపదిలో పద్మావతితో నున్నట్లు వ్రాయబడింది. ఉదా:

విహిత పద్మావతి సుఖసమాజే
భణతి జయదేవకవి రాజరాజే

మొదటి శ్లోకములోనే "పద్మావతీ చరణ చారణ చక్రవర్తి" అని జయదేవ కవి వ్రాసినాడు

జయదేవపురం

[మార్చు]

ఒడిషా రాజైన పురుషోత్తదేవునకు జయదేవునిపై ఎడతెగని ఈర్ష్య. అందువలన జయదేవుని "గీత గోవిందము"ను పోలి ఉన్న 'అభినవ గీత గోవిందం" అను గ్రంథమును రచించెను. తన గ్రంథములోని రచనలనే పాడవలెనని ప్రజలను నిర్బంధించెను. కాని ప్రజలు గీతగోవిందము నే పాడుచుండిరి. అందుకు ఇష్టపడక తన గ్రంథము గొప్పదో లేక జయదేవుని "గీతగోవిందం" గొప్పదో పరిశీలించుటకు ఇద్దరి గ్రంథములను శ్రీ జగన్నాధస్వామి యొద్ద పెట్టి తలుపులు మూసివేసిరి. మరునాడు ప్రాతః కాలమున తలుపులు తెరచి చూచుసరికి జయదేవుని గ్రంథము శ్రీ స్వామి చేతిలోనూ, రాజుగారి గ్రంథము గర్భగుడిలో ఒకమూల నుండుటను గమనించి, రాజు ఖిన్నుడై "గీత గోవిందము" శ్రేష్టతను కొనియాడెను. ఈ అష్టపదులు రచింపబడిన స్థలము నాటి నుండి జయదేవపురముగా పిలువబడుచున్నది.

పీయూష లహరి

[మార్చు]

పీయూష లహరి జయదేవుడు రచించిన ప్రముఖ సంస్కృత గోష్ఠీ రూపకము. దీనికి కథావస్తువు గీత గోవిందంలోని కథా వస్తువైన రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపడము కథాంశము. అందువలన పీయూష లహరిని గీత గోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడ్డాడు.ప్రాచీన కాలంలో జగన్నాధస్వామి ఆలయంలో అనేకములైన ఏకాంకనాటికలను ప్రదర్సించేవారు. పీయూషలహరిని కూడా అటువంటి నాటకసమాజంతో కలిసి జయదేవుడు దీనిని ప్రదర్సించినట్లు పీయూషలహరి లోని "గోష్ఠి శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే నర్తితుమ్" అన్న వాక్యంవల్ల వ్యక్తమౌతున్నది.

జయదేవుడు గీతగోవిందంలోనూ, పీయూషలహరిలోనూ నిరూపించిన 'రాసలీల' భాగవతం పురాణాన్ని అనుసరించింది కాదు. భాగవత రాసలీల శరత్తులో జరుగుతుంది. జయదేవునికి మూలం బ్రహ్మవైవర్తము.ఈ రాసలీల మూడు దినాలు. భాగవత రాసలీల పంచదశద్రాత్రులు. జయదేవుని తరువాత జన్మించిన అనేక వైష్ణవ కవులు కూడా ఈ బ్రహ్మవైవర్త రాసమే అనువదించారు.జయదేవుని గీతగోవిందం, పీయూషలహరి అర్ధంచేసుకోవటానికి ఒరిస్సా వైష్ణవాన్ని గురించిన విజ్ఞానం కొత అవసరం. కళింగదేశంలో సా.శ. 8 వ శతాబ్దములో ప్రవేశించిన మహాయాన బౌద్ధం క్రమంగా వజ్రయాన, సహజయానాలుగా రూపొందింది. సా.శ.729 నాటి ఒరియారాజు ఇంద్రభూతి, చెల్లెలు లక్షింకర వల్ల సహజయానం ఆదేశంలో ప్రవేశించిందని ప్రతీతి. ఇంద్రభూతి జ్ఞానసిద్ధిలో జగన్నాధుడుని బుద్ధదేవునిగా స్తుతించాడు. సహజయానం ప్రచారం చేసినవారు కౌపదాదులు ఔఢ్రదేశీయులు.వజ్రయానము, సహజయానము వైష్ణవాలు కలిసి ఔఢ్రదేశంలో నూతన వైష్ణవానికి దారితీసి ఉంటవి. దానికి ముఖ్యమైన ప్రవక్తలు- జయదేవుడు, రామాసంద రాయలు. సహజయాన పాంధేయులు జయదేవుణ్ణి ప్రథమ ప్రవక్తగానూ, నవరసికుల్లో ఒకడినిగాను ప్రకటిస్తారు.సా.శ. 15, 16,17వ శతాబ్దాల్లోని ఔఢ్రరచయితలు సరళదాసు, బలరామదాసు, అచ్యుతానందులు, పీతాంబరుడు మొదలైన కవులు సహజయానాన్ని అనేక గీతాల్లో ప్రశంసించారు.

రామానుజుడు, మధ్వాచార్యుడు ఇరువురూ పూరీ జగన్నాధానికి వెళ్ళి వైష్ణవమతాన్ని ప్రచరం చేసారు.తరువాతి వాడైన జయదేవుడు వారిప్రభావంవల్లనూ అనాదునుంచి వస్తూన్న ఇంద్రభూతి చెల్లెలు తెచ్చి పెట్టిన సహజయాన బౌద్ధ ప్రభావం వల్లనూ నూతన రాధాతత్వాన్ని సాధించి ప్రబోధించాడు. దానిని స్వీకరించిన అద్వైతాచార్యుడు, ఈశ్వపూరీ లకు గురువైన మహేంద్రపూరి వంగదేశంలో ప్రవేశపెట్టినాడు.ఆయన శిష్యుడైన ఈశ్వపూరీ చైతన్య మహాప్రభువు శిష్యుడు.చైతన్య ప్రభువు జయదేవుని భక్తిజ్యోతిని అందుకొని వంగవైష్ణవ ప్రపంచాన్ని ఉద్యోతితం చేసాడు. అందువల్ల వంగవైష్ణవానికి ప్రథమ ప్రవక్త జయదేవుడే అని చెప్పుకోవాలి.

గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు, 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు. అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులు ఉండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి, కామ శృంగార ప్రధానం.

పీయూష లహరి పై మొదటగా భారతి పత్రికలో వావిలాల సోమయాజులు ఒక సుదీర్ఘ వ్యాసం రచించాడు. తరువాత తెలుగు అనువాదాన్ని, సంస్కృత మూలంతో సహా తెలుగు విశ్వవిద్యాలయం 1990 సంవత్సరంలో ముద్రించింది.

కైవల్యం

[మార్చు]

జయదేవుడు 1153, డిసెంబరు 28 న శ్రీముఖనామ సంవత్సర మర్గశిర బహుళ ఏకాదశి దినమున కైవల్యము పొందెను.

ఇవి కూడా

[మార్చు]

వనరులు

[మార్చు]
  • బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియాలో జయదేవుడు
  • గురునానక్ పూరి సందర్శన
  • పీయూష లహరి, శ్రీ జయదేవ కవి విరచిత సంస్కృత గోష్ఠీ రూపకానికి శ్రీ వావిలాల సోమయాజుల తెలుగు అనువాదం, మూల సహితంగా ముద్రితం, సంపాదకుడు: డా. వి.వి.యల్.నరసింహారావు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1990.
  • 1951 భారతి మాస పత్రిక.వ్యాస కర్త శ్రీ. వావిలాల సోమయాజులు. వ్యాసము - జయదేవుడు- పీయూషలహరి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 14.
"https://te.wikipedia.org/w/index.php?title=జయదేవుడు&oldid=4309469" నుండి వెలికితీశారు