ముదిగంటి సుజాతారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముదిగంటి సుజాతారెడ్డి
జననంమిట్టా సుజాతారెడ్డి
ఆకారం,నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ India
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిఅధ్యాపకురాలు
మతంహిందూ మతం
భార్య / భర్తముదిగంటి గోపాలరెడ్డి
పిల్లలువాసవిక (కుమార్తె), ఉదయన(కుమారుడు)
తండ్రిమిట్టా రాంరెడ్డి
తల్లివెంకటమ్మ

ముదిగంటి సుజాతారెడ్డి, ప్రఖ్యాత రచయిత్రి. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం,[1] 2022లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి విశిష్ట పురస్కారం - 2020 అందుకున్నది.

విశేషాలు

[మార్చు]

ఈమె నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, ఆకారం గ్రామంలో వెంకటమ్మ, రాంరెడ్డి దంపతులకు దొరల కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్న వయసులో కమ్యూనిస్టు పోరాట ఉద్యమ ప్రభావం వల్ల ఈమె కుటుంబం ఆంధ్రప్రాంతాలకు వలస వెళ్ళింది. కొన్నాళ్ళు గుంటూరు జిల్లా అద్దంకిలోనూ, ఆ తర్వాత నరసరావుపేటలోనూ ఈమె కుటుంబం నివసించింది[2].

తెలంగాణా విమోచనం జరిగి, కమ్యూనిస్టు పోరాటం ఉధృతం తగ్గాక ఈమె కుటుంబం తమ ప్రాంతానికి తిరిగి వచ్చి నల్గొండలో స్థిరపడింది. సుజాత 1950లో నల్లగొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరింది. అప్పుడే ‘వెల్లోడి’ ప్రభుత్వంలో స్కూళ్ళలో ఉర్దూ బదులు తెలుగు మాధ్యమం వచ్చింది. హెచెస్‌సి (పదవ తరగతి) పాస్ అయ్యాక అతి కష్టం మీద కాలేజీలో చేరటానికి ఇంట్లో అంగీకరించారు. 1956లో హైదరాబాదులోని రాజబహద్దరు వెంకట రామారెడ్డి మహిళాకళాశాల (ఆర్‌బివీఅర్ఆర్ ఉమెన్స్ కాలేజ్)లో పియుసీలో చేరింది. అక్కడే రెడ్డి హాస్టల్‌లో వసతి. ఇంగ్లీషు మాధ్యమంతోనూ, నగర సంస్కృతితోనూ ఇబ్బందులు ఎదుర్కొని పియుసీ పూర్తి చేసింది. పియుసీ అయేటప్పటికి నల్గొండలో నాగార్జున కాలేజీ ఏర్పడింది. అక్కడ బి.ఏ మొదటి సంవత్సరం చదివాక గోపాల్ రెడ్డితో 1959లో వివాహమైంది. ఈ దంపతులకు వాసవిక, ఉదయన అనే పిల్లలు కలిగారు.

పెళ్ళైన తర్వాత సుజాత ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో బి.ఏ రెండో సంవత్సరంలో చేరింది. అక్కడే ఎం.ఏ పూర్తి చేసింది. నృపతుంగ మల్టిపర్పస్‌స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పని చేయడం మొదలు పెట్టింది. 1966లో జర్మనీలో ట్యుబింగెన్ విశ్వవిద్యాలయంలో జర్మన్‌భాషలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయటానికి భర్త గోపాల్రెడ్డికి స్కాలర్షిప్ వచ్చింది. అతనితో పాటు ఈమె కూడా అక్కడకు వెళ్ళింది. అక్కడ టుబింగన్ విశ్వవిద్యాలయం గ్రంథాలయం లోని ఓరియంటల్ విభాగంలో భారతాధ్యయన గ్రంథాలను ‘సబ్జెక్టు క్యాటలాగ్’ చేయడంలో సహకారం అందించింది. అప్పడు సేకరించిన సమాచారంతోనే “సంస్కృత సాహిత్య చరిత్ర”ను వ్రాసింది. 1969లో జర్మనీ నుంచి తిరిగివచ్చాక కొన్నాళ్ళు మేక్స్‌మ్యుల్లర్ భవనంలో లైబ్రేరియన్‌గా పని చేసింది. తాను పియుసీ చదువుకున్న ఆర్‌బివీఅర్ఆర్ వుమెన్స్ కాలేజ్‌లోనే పార్ట్‌టైం లెక్చరర్ ఉద్యోగం వస్తే, ఉపాధ్యాయవృత్తి మీద ఆసక్తితో జీతం తక్కువైనా చేరింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం” అనే సిద్ధాంత వ్యాసానికి 1976లో పి.హెచ్.డి పట్టా పొందింది. ఈమె 2000లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యింది. ఈమె భర్త గోపాలరెడ్డి ఆర్ట్స్‌కాలేజ్ ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశాక కొన్నాళ్ళకు హృదయ సంబంధమైన శస్త్రచికిత్స కాంప్లికేషన్స్ వల్ల మరణించాడు. ఈమె ప్రామాణికంగా 6 సాహిత్య విమర్శ గ్రంథాల్ని, 3 నవలల్ని 4 కథా సంపుటాల్ని, 4 సాహిత్య చరిత్ర గ్రంథాల్ని, 2 యాత్రా కథన రచనల్ని, మరిన్ని స్త్రీలకు, తెలుగు సాహిత్యానికి, మానవ సంబంధిత గ్రంథాలను వెలువరించింది.ఈమె తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సిలబస్ కమిటీలో సలహాదారుగా, పాఠశాల టెక్ట్‌బుక్ కమిటీలో సభ్యు రాలిగా, తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉపాధ్యక్షురాలుగా ఉంటూ సాహిత్య కృషి చేస్తున్నది. ఇప్పటికి ఆమె రచనలపై ఒక పి.హెచ్.డి, రెండు ఎం.ఫిల్. గ్రంథాలు వచ్చాయి. ఇంకా ఎందరో పరిశోధకులు ఆమె కథలు, నవలలపై పరిశోధనలు సాగిస్తున్నారు[3].

సాహిత్యసేవ

[మార్చు]

కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఎన్నో కథలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలల్లో ప్రచురితాలైనాయి. ఈమె నవలలు, కథలు హిందీ, ఇంగ్లీషు భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. ఈమె తన రచనలలో తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, రైతుల, సామాన్య జనుల, ఛిద్రజీవితాలను చిత్రించింది. సాఫ్ట్‌వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లుతున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవస్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టేటట్లు తన కథలలో వర్ణించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో మహిళగా ఈమె అగ్రస్థానంలో ఉంది. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాంతాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించింది.

రచనలు

[మార్చు]
  1. సంస్కృతి సాహిత్య చరిత్ర
  2. శ్రీనాథుని కవితాసౌందర్యం
  3. మను వసుచరిత్రల తులనాత్మక పరిశీలన
  4. తెలుగు నవలానుశీలనం
  5. చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్యచరిత్ర
  6. సంకెళ్లుగా తెగాయి (నవల)
  7. మలుపు తిరగిన రథచక్రాలు (నవల)
  8. ఆకాశంలో విభజన రేఖల్లేవు (నవల)
  9. విసుర్రాయి (కథాసంకలనం)
  10. మింగుతున్న పట్నం (కథాసంకలనం)
  11. తొలినాటి కథలు (సంపాదకత్వం - సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి)
  12. నూరేండ్ల తెలుగు కథలు (సంపాదకత్వం - సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి)
  13. అలంకారశాస్త్ర గ్రంథాలు - సంస్కృత సాహిత్యచరిత్ర (ముదిగంటి గోపాలరెడ్డితో కలిసి)
  14. బాణుని కాదంబరి పరిశీలనం (ముదిగంటి గోపాలరెడ్డితో కలిసి)
  15. ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర
  16. రసచర్చ ఆధునికత
  17. వేమన-నాథ సంప్రదాయం
  18. ముద్దెర (వ్యాస సంకలనం)
  19. ముసురు (ఆత్మకథ)

పురస్కారాలు

[మార్చు]
  1. చాసో పురస్కారం
  2. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం -2007
  3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలలో ప్రభుత్వ విశిష్ట ప్రతిభా పురస్కారం -2016
  4. తెలుగు విశ్వవిద్యాలయం నుండి విశిష్ట పురస్కారం - 2020[4]

మూలాలు

[మార్చు]
  1. Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
  2. జంపాల, చౌదరి. "ముసురు – ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ". పుస్తకం.నెట్. Archived from the original on 23 మార్చి 2016. Retrieved 10 April 2017.
  3. సంపాదకుడు (13 Jun 2016). "అనుపమ అక్షర కృషీవలురు తెలంగాణ తేజాలు". మన తెలంగాణ. Retrieved 10 April 2017.[permanent dead link]
  4. telugu, NT News (2022-12-02). "ఘనంగా తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-12-03. Retrieved 2022-12-06.