Jump to content

మీమాంస

వికీపీడియా నుండి

సంస్కృత ఆస్తిక విద్యావిధానములలో మీమాంస ఒక పద్ధతి. వైదిక శాస్త్ర పద్ధతులలో ధర్మాన్ని విశ్లేషించు ప్రధానమైన పద్ధతి మీమాంస.[1] వైదిక సంప్రదాయము పెంపొందుటకు మూలభూతమైన ఒకానొక పద్ధతి మీమాంస.[2]

మీమాంస రెండు విధములు:

  1. పూర్వ మీమాంస (దీనినే కర్మ మీమాంస అంటారు)
  2. ఉత్తర మీమాంస (దీనిని జ్ఞాన మీమాంస అని కూడా అంటారు)

[3]

మీమాంస గురించి వివిధ ప్రతిపాదనలు ఉన్నాయి. అందు ప్రధానమైనవి రెండు:

  1. ప్రభాకర ప్రతిపాదన: ప్రభాకర మిశ్ర జ్ఞానసముపార్జనకు పంచవిధ విధానములను ప్రతిపాదించారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థపత్తి, శబ్ద[4]
  1. భట్ట ప్రతిపాదన: శ్రీఆదిశంకర భాగవత్పాదాచార్యుల శిష్యులైన కుమారిల భట్టు జ్ఞాన సముపార్జనకు పైని ఐదు విధానములతో పాటుగా అనుపలబ్ధి అను విధానమును జోడించారు.[4]

మీమాంస ఆస్తిక, నాస్తిక విధానములు రెంటినీ పరిగణిస్తుంది. మీమాంస ప్రకారము ఆత్మ నిత్యమూ, సర్వవ్యాపకమూ అయ్యి సమస్త జీవకోటి అంతఃకరణము అయ్యి ధర్మాధర్మ విచక్షణ పైన దృష్టి సారిస్తుంది. మీమాంస ప్రకారము ధర్మమన్నది కర్మజనీయమే కానీ దేవతా సంబంధమైనది కాదు. దేవతలు కల్పితములు కానీ ధర్మము సార్వజనీనము. వేదాలు అపౌరుషేయాలనీ, వైదిక విధులు అనుల్లంఘనీయములు అనీ మీమాంస పరిగణిస్తుంది. మీమాంసలో వైదిక కర్మలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు.

వేదాంతులు వేదాంగములైన ఉపనిషత్తులను ఎక్కువ తలిస్తే మీమాంసకులు భాషాపరిజ్ఞానము యొక్క పరమార్థము శబ్దసంపద జ్ఞాన సముపార్జనకు, మంచిని చెడు నుండి వేరుపరచుటకు ఉపయోగించవలెనని భావిస్తారు. న్యాయమైన, ఋజుప్రవర్తన జీవిత పరమార్థమని మీమాంసకుల వాదన.[5]

మీమాంసలో ముఖ్యమైన పుస్తకము జైమిని మహర్షి రచించిన "మీమాంస సూత్రములు"[5][6]

మీమాంస

[మార్చు]

మీమాంస అను సంస్కృత పదమునకు వివిధ అర్థములు గలవు. "పరిగణన, పరిశోధన, చర్చ" అని మీమాంసకు గల నిఘంటార్థములు[7]. వైదిక పాఠ పరిశీలనను కూడా మీమాంస అని చెప్పవచ్చును. మీమాంసలోని పూర్వోత్తర మీమాంసలు వైదిక పాఠములోని కర్మకాండ, జ్ఞానకాండలను అనుసరించి విభజింపబడినాయి. వైదిక వాజ్ఞ్మయములోని సంహిత, బ్రాహ్మణములలో, మీమాంసకు సంబంధించిన సూత్రములు ఎక్కువగా బ్రాహ్మణపాఠముపైననే ఆధారపడి ఉంటాయి.[3]

హేతుబద్దత

[మార్చు]

హేతువాదానికి, వైదిక పాఠ హేతుబద్దతకు మీమాంస అతి ముఖ్యమైనది. న్యాయ, వైశేషిక రంగముల మాదిరి కాక మీమాంస ఆరు ముఖ్యమైన విధానాలను ప్రతిపాదించింది. అందులో ప్రభాకర మిశ్ర ప్రతిపాదించినవి మొదటి అయిదు కాగా, కుమారిల భట్టు మిగిలిన ఒక్కటిని ప్రతిపాదించారు.

ప్రత్యక్ష విధానము

[మార్చు]

ప్రత్యక్ష విధానమనగా గోచరమైనది. ఇవి రెండు విధములు, అంతఃగోచరములు; బాహ్యగోచరములు.

బాహ్యగోచరము అనగా పంచేంద్రియముల చేత కానీ ఇతర ప్రాపంచిక పదార్థములచేత కానీ ధ్రువీకరించదగినటువంటిది.

అంతఃగోచరము మనస్సుచేత, బుద్ధిచేత తెలుసుకోదగిన విషయము.

బాహ్యగోచరము క్రింది నియమములకు ఒడబడి ఉంటుంది.

  1. ఇంద్రియార్థసన్నికర్ష (పరిశీలిస్తున్న పదార్థము యొక్క గుణగణాలను ప్రత్యక్ష్యముగా పంచేంద్రియముల (వాఙ్గ్మనస్చక్షు శ్రోత్రత్వగ్) ద్వారా తెలుసుకోగలగడం)
  2. అవ్యాపదేశ్య (వాగేతర పరిశీలన; ఇతరులు చెప్పింది మాత్రమే నమ్మక తన స్వబుద్ధితో నిర్ణయించగలిగిన స్టితి)
  3. అవ్యభిచార (పరిపూర్ణ సంకల్ప సిద్ధి కలిగి, దృష్టి మరలకుండా ఉన్నట్టి స్టితి)
  4. వ్యవసాయాత్మక (పూర్ణత; నిజము తెలుసుకొనుటకు స్వయముగా శ్రమ పడగలిగినటువంటి స్టితి)

అదే విధముగా అంతఃగోచరావస్థ కొన్ని నియమములకు ఒడబడి ఉంటుంది. అవి:

  1. ప్రతిభ (గ్రాహకుడి స్వయం ప్రతిభ)
  2. సామాన్యలక్షణప్రత్యక్ష (సామాన్య విషయముల పట్ల ఉన్న అవగాహనను పరీక్షా వస్తువు మీదికి ప్రసరించుట)
  3. జ్ఞానలక్షణప్రత్యక్ష (తన పూర్వ జ్ఞానమును ఉపయోగించి పరీక్షించుట

ఇవే కాక, సందేహాత్మకమైన విషయమును ప్రత్యక్షప్రమాణమును మాదిరి కాక అంగీకరింపవలసినప్పుడు అది నిర్ణయానుసారమా (నిర్ణయాత్మకమైన విషయాంగీకారమా) లేక అనధ్యవసాయమా (అనుమానాత్మక విషయాంగీకారమా) అని నిర్ణయించేందుకు వేర్వేరు పద్ధతులను మీమాంసా శాస్త్రము నియమించింది.

అనుమానము

[మార్చు]

ఒక విషయమును లేదా కొన్ని విషయములను పరిగ్రహించి దానికి ఒక కారణమును ఆపాదించి తద్వారా ఒక నిర్ణయమునకు రావడము అనుమానము.

- పొగ రావడము చూసి నిప్పును శంకించుట ఒక ఉదాహరణ

అనుమానము మూడు విధములుగా విభజించవచ్చును

  • ప్రతిజ్ఞ
  • హేతువు
  • దృష్టాంతము

ఈ అనుమానము మరి రెండు విధములు:

  • సాధ్యము - సాధ్యమనగా ఒక విషయ వస్తువు నిరూపింపదగినట్టిదా కదా అని తెలుసుకోవడము
  • పక్షము - సాధ్యత యే విధముగా చేకూరునో దాని మార్గము పక్షము. ఇది నిరూపింపదగినట్టిదైతే అది సపక్షము, లేనిచో విపక్షము.

సపక్ష విపక్షములు ఎంత వరకు వాదనను బల (నిర్వీర్య) పరుస్తాయో అది వ్యాప్తి అనబడుతుంది. ఈ విధముగా వ్యాప్తి కలిగిన వాదనలతో నిరూపింపబదినటువంటి విషయమును నిగామానము అని వాక్రుచ్చెదరు.

ఉపమానమనగా సామ్యము. దీనికి ఉదాహరణగా ఒక విషయమును చెప్పుకోవచ్చును. ఒక బాటసారి ఒక దూరదేశమునకేగి అందు ఒక మృగమును చూచెనని భావించెదము. అప్పుడు ఆతను తిరిగి వచ్చి "నేను బహు దూరమున ఒక మృగము చూచితిని అది గోవువలె నడచుచున్నది. గోవువలె మేయుచున్నది. గోవువలె కన్పడుచున్నది. కాని గోవు కాదు" అని తన స్నేహితునికి చెప్పగా ఆ స్నేహితునికి ఆ మృగము మీద ఒక అభిప్రాయము వచ్చి ఉండును. ఇక్కడ ఉపమాన వస్తువు "గోవు". ఈ వివరణ ద్వారా ఆ మృగమును తదుపరి కనుగొనుటకు వీలు కలుగును. పైని ఉదాహరణలో గోవు ఉపమానము కాగా, మృగము ఉపమేయము, వాటి మధ్య గల సామ్యము సామాన్యము. ౭వ శతాబ్దపు భట్టకవి పరివిధములైన ఉపమానములను చెప్పి ఉన్నాడు.

అర్థపత్తి

[మార్చు]

అర్థపత్తి అనగా ముందున్న పరిస్థితులను బట్టి ప్రతిపాదించుట. ఒక ఉదాహరణ: దేవదత్తుడు లావుగా ఉన్నాడు అనునది నిజము, ప్రత్యక్షప్రమాణము అనుకొందము. మరి ఒక విషయమేమన, దేవదత్తుడు దినమునందు భుజింపడు అనునది మనకు తెలిసిన మరియొక్క విషయము. ఇప్పుడు ఈ రెండు వాక్యములు కలిపి చదివిన చదువరికి అర్థమగునది ఏమనగా - దేవదత్తుడు రాత్రివేళలయందు భుజించును అని. దీనిని అర్థపత్తి అంటారు. మీమాంసకులు అర్థపత్తిని బలమైనదిగా పరిగణించరు. ఏలన, రెండు వాక్యముల ద్వారా మూడవ వాక్యమును ధ్రువీకరించుట కష్టసాధ్యమైన పని. పై ఉదాహరణను తీసుకున్న, దేవదత్తుడు లావుగా ఉన్నందులకు మరి ఏదైనా కారణము ఉండవచ్చును. ఆతడు కేవలము రాత్రి భోజనము చేయుట మాత్రమే కాకపోవచ్చును.

కావున కేవలము అర్థపత్తియే ఆధారముగా విషయనిర్ధారణ చేయకుండుట మేలని మీమాంసకుల అభిప్రాయము.

అనుపలబ్ది

[మార్చు]

పైని అయిదు వాదనలను ప్రభాకర మిశ్ర ప్రతిపాదించగా, ఈ ఆరవ వాదనను శ్రీఆదిశంకర భగవత్పాదాచార్యుల శిష్యులైన కుమారిల భట్టు ప్రతిపాదించారు. అనుపలబ్ధి అనగా లేని పదార్ధమును లేదు అని చెప్పుట ఒక నాణ్యమైన జ్ఞానము. ఉదాహరణకు ఒక గదిలో ఒక మరచెంబు లేదు అని చూచి చెప్పుట సరియైనదే. ఒక విషయము ఉపలబ్ధము కానిదని కానీ అసాధ్యమని కానీ తెలుసుకొనుట ఒక జ్ఞానమే, ఏలన ఆ విషయము అసాధ్యమని ముందు గ్రాహకునికి తెలియదు కావున. ఈ అనుపలబ్ధి సద్రూపము కానీ అసద్రూపము గానీ కావచ్చును.

అనుపలబ్ధి నాలుగు విధములుగా విభజింపవచ్చును:

  1. కర్మానుపలబ్ధి
  2. క్రియానుపలబ్ధి
  3. వస్తోనుపలబ్ధి
  4. అనంగీకారానుపలబ్ధి

శబ్దము

[మార్చు]

శబ్దము అనగా ప్రాచీన లేక ప్రస్తుత నిపుణుల వాక్కు మీద ఆధారపడటము. ఒక విషయము మీద అత్యంత పరిణతి కలిగి మిక్కిలి విషయ పరిజ్ఞానము కలిగి ఉన్న వ్యక్తి యొక్క అభిప్రాయమును స్వీకరించి వాదనను సమర్థించుకొనుటను శబ్దము అని అంటారు.[8] సమయాభావమున్న సందర్భమునందు పెద్దల, నిపుణులు, పూర్వీకులు, గురువుల యొక్క అభిప్రాయము మీద ఆధారపడి నిర్య్నయము తీసుకొనుట మీమాంసకులకు అంగీకృతమే. చార్వాక సంప్రదాయానుసారము శబ్దము నిర్ణయాత్మకమైన వాదన కాదు.[8][9]

మీమాంస ప్రకారము వేదములు స్వతః ప్రమాణములు. దీనినే స్వతఃప్రమాణ్యవాదము అని అంటారు. భారతీయ సంప్రదాయానుసారముగా వేదములు అత్యున్నత స్థానమును అధిరోహించినాయి. కావున ఏదైనా విషయము వేదప్రమాణము అనిన, దానికి మరలా మీమాంస, తర్క వాదములు వర్తించవు.

మీమాంస వాదనలు

[మార్చు]

మీమాంస ప్రకారము ధర్మాచరణ అతి ముఖ్యమైన విధి. ధర్మావలంబనకు అవసరమైన కర్మ, జ్ఞానావసరముల యొక్క నిబద్దతను మీమాంసలోని వాదనలు బలపరుస్తాయి

భగవంతుడు లేడన్న నాస్తిక వాదనను మీమాంస పూర్తిగా సమర్థించింది. అదే విధముగా ఆ వాదనలలోని బలమును పూర్తిగా అంగీకరించదు. భగవంతుని ఉనికిని బలపరుచుట అనవసరము, ఏలన - వేదములు అపౌరుషేయములని, వాటి రచన మానవసంబంధము కాదని వేదవాక్కు. అదే విధముగా,వేదమే భగవత్స్వరూపమైనప్పుడు అందులోని మంత్రములు ఉదహరించిన దేవతామూర్తులకు ప్రాధాన్యత లేదని, ధర్మము సర్వంసహా అధికారి అని మీమాంసకుల వాదన.

ధర్మమును వేదార్థములో మీమాంస పరిగణిస్తుంది. వేదార్థము మిగిలిన అన్ని అర్థములనూ మించినది కావున, తతిమ్మా అర్థవివరణలు అవసరము లేదని మీమాంసకుల వాదన.[10] ధర్మము యొక్క పరమార్థము వేదవచనములైన సంహిత, బ్రాహ్మణములలోని కర్మల సరియైన పాలన. ఇదే అత్యున్నత ధర్మమని మీమాంసకుల వాదన.[10]

మీమాంస గ్రంథములు

[మార్చు]

మీమాంస యొక్క అతి ముఖ్యమైన గ్రంథము జైమిని మహర్షి వ్రాసిన "జైమిని భారతము" లేక "జైమిని మీమాంస సూత్రములు". ఈ సూత్రములకు శబరుడు "మీమాంససూత్రభాష్యము" అని ఒక భాష్యము రాసియున్నారు.

దీనిపైన పలువిధములైన భాష్యములను వివిధ భాష్యకారులు రచించియున్నారు. అందు ముఖ్యమైనవారు:

  • ప్రభాకర మిశ్రుడు - బృహతి (శబర సూత్రముల మీద ఆధారము)
  • కుమారిల భట్టు
    • వీరు మీమాంస సూత్రముల పైన, శబర భాష్యము పైన భాష్యములు రాసినారు. కుమారిల భట్టు భాష్యములను మూడు విధములుగా విభజించవచ్చును.
      • శ్లోకవార్తిక
      • తంత్రవార్తిక
      • తుప్తీక
  • మండన మిశ్రుడు
    • కుమారిల భట్టు రాసిన సూత్రముల ఆధారముగా రాసిన వీరి భాష్యములు రెండు విధములుగా విభజింపవచ్చును
      • విధివివేక
      • మీమాంసానుక్రమణి
  • పార్థసారథి మిశ్రుడు - న్యాయరత్నాకరము (శ్లోకవార్తిక ఆధారము), శాస్త్రదీపిక,
  • సుచరిత మిశ్రుడు - కాశికా భాష్యము (ఇది కుమారిల భట్టు శ్లోకవార్తిక మీద వ్రాసినది)
  • సోమేశ్వర భట్టు - న్యాయసుధా (తంత్రవార్తిక మీది భాష్యము)
  • భావనాథుడు - న్యాయవివేక
  • ఆపదేవుడు - ఆపదేవి మఱియు మీమాంసన్యాయప్రకాశము
  • రామకృష్ణ భట్టు
  • మాధవ సుభోధిని
  • శంకర భట్టు
  • కృష్ణయజ్వనుడు
  • అనంతదేవుడు
  • గాగ భట్టు
  • రాఘవేంద్ర తీర్థ
  • విజయేంద్ర తీర్థ
  • అప్పయ్య దీక్షితులు
  • పరుతియుర్ కృష్ణ శాస్త్రి
  • రామసుబ్బశాస్త్రి
  • వెంకట సుబ్బాశాస్త్రి
  • చిన్నస్వామి శాస్త్రి
  • సేంగాలిపురం వైద్యనాథ దీక్షితులు
  • వెంకట దీక్షితులు (వార్తికాభరణ్యము - తుప్తిక ఆధారము)

ఇంకా వివరములకు

[మార్చు]

సూచిక

[మార్చు]
  1. http://www.merriam-webster.com/dictionary/Mimamsa
  2. http://www.britannica.com/EBchecked/topic/383181/Mimamsa
  3. 3.0 3.1 Oliver Leaman (2006), Shruti, in Encyclopaedia of Asian Philosophy, Routledge, ISBN 978-0415862530, page 503
  4. 4.0 4.1 DPS Bhawuk (2011), Spirituality and Indian Psychology (Editor: Anthony Marsella), Springer, ISBN 978-1-4419-8109-7, page 172
  5. 5.0 5.1 Chris Bartley (2013), Purva Mimamsa, in Encyclopaedia of Asian Philosophy (Editor: Oliver Leaman), Routledge, 978-0415862530, page 443-445
  6. M. Hiriyanna (1993), Outlines of Indian Philosophy, Motilal Banarsidass, ISBN 978-8120810860, page 298-335
  7. http://www.sanskrit-lexicon.uni-koeln.de/scans/MWScan/tamil/index.html
  8. 8.0 8.1 Eliott Deutsche (2000), in Philosophy of Religion : Indian Philosophy Vol 4 (Editor: Roy Perrett), Routledge, ISBN 978-0815336112, pages 245-248
  9. M. Hiriyanna (2000), The Essentials of Indian Philosophy, Motilal Banarsidass, ISBN 978-8120813304, page 43
  10. 10.0 10.1 https://books.google.com/books?id=LkE_8uch5P0C
"https://te.wikipedia.org/w/index.php?title=మీమాంస&oldid=4010916" నుండి వెలికితీశారు