Jump to content

వైశేషిక దర్శనం

వికీపీడియా నుండి
(వైశేషిక దర్శనము నుండి దారిమార్పు చెందింది)

సృష్టికర్త అంటూ ఎవరూ లేరని, సృష్టి సమస్తం అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త కణాద మహర్షి. ఈయనను కణభక్షకుడు, కణభోజి అనికూడా పేర్లు, అసలు మొదటి పేరు కశ్యపుడు. కణాదుని సూత్రాలలో సృష్టి కర్త, ఈశ్వరుని ప్రసక్తి ఎక్కడా లేదు. అందుచేత ఇది నిరీశ్వర దర్శనం. వైశేషిక దర్శనం ఈశ్వరుడిని అంగీకరించకపోయినా వేద ప్రమాణ్యాన్ని, ఆత్మను, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష సిద్ధిని అంగీకరిస్తుంది. ఈ శాస్త్రమునకు తర్కశాస్త్రము అని కూడా పేరు.

కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.

నాలుగు పురుషార్థాలు

[మార్చు]

'అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామ:' అని వైశేషిక దర్శనం ప్రారంభమవుతుంది. అంటే 'ఇపుడు ధర్మం గురించి వ్యాఖ్యానిస్తాము' అని. దేనివల్ల అభ్యుదయం, నిశ్శ్రేయసం సిద్ధిస్తాయో అదే ధర్మం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థాలు. ధర్మం వల్ల అర్థకామాలు (అభ్యుదయం) చివరిదైన మోక్షం (నిశ్శ్రేయసం) లభిస్తాయి. ధర్మంవల్ల తత్త్వజ్ఞానం, దానివల్ల అభ్యుదయ, నిశ్శ్రేయసాలు సిద్ధిస్తాయి. పదార్థ జ్ఞానమే తత్త్వజ్ఞానం. అంటే పదార్థాల గురించి తెలుసుకుంటే తత్త్వం బోధపడుతుంది.

షట్పదార్ధ సిద్ధాంతం

[మార్చు]

పదార్ధాలు ఆరు విధాలని వైశేషిక సిద్ధాంతం. అవి ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం.

  • తదుపరి వచ్చిన వైశేషికులు అభావమును కూడా చేర్చి మొత్తము ఏడు అని అన్నారు.
  • ఇక్కడ పదార్థము అనగా ఒక పదము యొక్క అర్థము తెలుసుకొనుట.

ద్రవ్యం

[మార్చు]
  • ద్రవ్యము తొమ్మిది విధాలుగా ఉంటుంది. అవి ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
  • ద్రవ్యములు రెండు విధములు. ఒకటి మూర్త ద్రవ్యములు, రెండు అమూర్త ద్రవ్యములు.

మూర్త ద్రవ్యములు

[మార్చు]
  • వీటిలో ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు అను నాలుగు మూర్త ద్రవ్యాలు అనగా కంటికి కనిపించునవి.

అమూర్త ద్రవ్యములు

[మార్చు]
  • మిగిలినవి అనగా ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. అనేవి అమూర్త ద్రవ్యములు. అంటే కనిపించనివి.
  • ద్రవ్యములు రెండు విధములు. ఒకటి సావయవములు, రెండు నిరవయవములు
సావయవములు
[మార్చు]
  • ఇవి ఉత్పత్తి వినాశములు, స్వతంత్రము లేనివి, ఒకదానిపై ఆధారపడినవి, అనిత్యములు. అవి:
  • ఫృథ్వి, జలం, అగ్ని.
నిరవయవములు
[మార్చు]
  • స్వతంత్రము కలవి, నిత్యములు, పరమార్థములు.
  • వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనేవి మహాప్రళయము వరకు ఉంటాయి.
  • ఆత్మ అనునది పరమార్థ నిత్యము. ఈశ్వరుడును నమ్మిన మతములో పరమార్థ నిత్యము కలవాడు ఈశ్వరుడు.
  • మనస్సు అనేది మోక్షము వరకు ఉంటుంది.

ఆత్మ అనేది జీవాత్మ. అది అనాది, అనంతం, సర్వవ్యాపి, అనేకం. అయితే జడం, అచేతనం. మనస్సు అంతరింద్రియం. అది ఆలోచిస్తుంది. ఆత్మ మనస్సుతో కలవడంవల్ల చేతనం అవుతుంది. దానికి గ్రహణ శక్తి కలుగుతుంది. సుఖం, దు:ఖం మొదలైనవి పొందుతుంది.

గుణం

[మార్చు]
  • ఇది స్వతంత్రంగా ఉండలేదు. ద్రవ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది పదిహేడు విధాలు. రూపం (రంగు), రసం (రుచి), గంథం (వాసన), స్పర్శ, సంఖ్య, పరిమాణం, పృథక్త్వం (ప్రత్యేకత), సంయోగం (కలయిక), విభాగం (వేర్పాటు), పరత్వం (ముందు), అపరత్వం (వెనుక), బుద్ధి, సుఖం, దు:ఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం.
  • గుణపద వాచ్యములు మరి ఏడు అయిన, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము, శబ్దము కలిపి మొత్తము ఇరువదినాలుగు (24).
  • ఈ ఇరువదినాలుగు (24) గుణములకు మరి యొకటి లఘుత్వము చేర్చిన మొత్తము ఇరువదిఅయిదు (25).

కర్మ

[మార్చు]

కర్మ అయిదు విధాలుగా ఉంటుంది. కర్మ అంటే ఇక్కడ చలనం అని అర్థం. అవి - ఉత్ క్షేపణం (పైకి పోవడం), అవక్షేపణం (కిందికి పోవడం), ఆకుంచనం (ముకుళనం, ముడుచుకొనడం), ప్రసారణం (వ్యాకోచించడం, విస్తరించడం), గమనం (వెళ్ళడం). ద్రవ్యం లేనిదే కర్మ లేదు.

సామాన్యం

[మార్చు]

అనేక వస్తువులలో ఒక సమాన లక్షణం ఉండడమే సామాన్యం. ఇది ద్రవ్య, గుణ, కర్మలతో శాశ్వతంగా ఉంటుంది. ఒకచోట అనేక గోవులను చూస్తాం. గోత్వం వాటి సామాన్య లక్షణం. గోవు అంటే గోజాతి అంతా స్ఫురిస్తుంది. అలాగే వృక్షత్వం, ఘటత్వం ఇత్యాది. సామాన్యం అనేది ఊహకల్పితం కాదు. అది యథార్థంగా వస్తువులలో ఉంటుంది.

విశేషం

[మార్చు]

సామాన్యానికి వ్యతిరేకమయింది విశేషం. దీని ద్వారానే వస్తువుల మధ్య భేదాన్ని గుర్తిస్తాం. ఇది కూడా యథార్థ పదార్ధమే. ఊహాత్మకమైనది కాదు.

సమవాయం

[మార్చు]

వస్తువు, గుణాల మధ్య ఉండే అవినాభావ సంబంధమే సమవాయం. ఒక వస్తువు, దాని గుణాలు వేరు కావు. వస్తువు లేకుండా గుణాలుండవు. గుణాలు లేకుండా వస్తువు ఉండదు. అలాగే అవయవి, అవయవాలు; చలనం, చలించే వస్తువు; కారణం, కార్యం - ఒకదానిలో ఒకటి విడదీయరానిదిగా ఉండటమే సమవాయం.

ఒక వస్తువును అంతకంతకూ చిన్న భాగాలుగా చేస్తూ పొతే చివరకి ఇక విభజన సాధ్యంకాని స్థితి వస్తుంది. ఆ స్థితిలో మిగిలే సూక్ష్మాతిసూక్ష్మ వస్తువే అణువు. అది నిరవయవి. అంటే దానిలో భాగాలుండవు. అది అచ్ఛేద్యం.

కిటికీ సందులోనుంచి గదిలోకి వచ్చే సూర్య రశ్మిలో సూక్ష్మమైన నలకలు తేలుతూ, చలిస్తూ ఉంటాయి. వాటిని త్రస రేణువులంటారు. ప్రతీ త్రస రేణువు త్ర్యణుకం. అంటే అది మూడు ద్వ్యణుకాలతో ఏర్పడుతుంది. ప్రతి ద్వ్యణుకం రెండు అణువులతో ఏర్పడుతుంది. అణువు కంటే సూక్ష్మ వస్తువు లేదు. అణువులలో ఫృథ్వీ అణువులు, జలాణువులు, అగ్ని అణువులు, వాయవ్యాణువులు ఇలా భిన్నాణువులుంటాయి. అణువుల సంయోగంవల్ల ప్రపంచం ఏర్పడింది. అణువులను ఎవరూ ఉత్పత్తి చేయలేదు. అవి అనాదిసిద్ధమయినవి, నిత్యమయినవి, శాశ్వతమయినవి.

వైశేషికులది అసత్కార్యవాదం. అంటే కారణం వేరు, కార్యం వేరు. ప్రతి కార్యానికీ కారణం ఉన్నప్పటికీ కారణంలో కార్యం మొదటినుంచీ ఉండదు. కార్యం అనేది కొత్తగా పుట్టుకువస్తుంది. కార్యంలో కనబడే లక్షణాలు ఏవీ కారణంలో కనబడవు. మట్టిలోనుంచి కుండ తయారయినా, మట్టి లక్షణాలు వేరు, కుండ లక్షణాలు వేరు. కుండ ఆకారం మట్టిలో ఉండదు. విత్తనం పగలగొట్టి చూస్తే సూక్ష్మ రూపంలో చెట్టు కనిపిస్తుందా? నూలు దారాలలో వస్త్రలక్షణాలు ఎక్కడ ఉన్నాయి? నిజానికి చెట్టు, కుండ, వస్త్రం ఇవన్నీ కొత్తగా పుట్టుకువచ్చిన కార్యాలు.

ప్రశస్తపాదుని సిద్ధాంతము

[మార్చు]

ప్రశస్త పాదుడు పదార్ధముల తత్వజ్ఞానమే మోక్షకారణమని వచించెను. ' తచ్చ ఈశ్వరనోదనాభి వ్యక్తాత్ ధర్మామేవ '- అత్మజ్ఞానమ ఈశ్వరప్రేరిత ధర్మమునుండి జనించునది అని చెప్పినారు. ఇక్కడ ధర్మ శబ్దమునకు నిష్కామ కర్మ అని నిర్వచింపవచ్చును. మహేశ్వరునికి సంహారేచ్చ జన్మించినపుడు పరమాణు పుంజ సంఘాతమున (Big bang/Collision) ) జనించిన శరీరేంద్రియాదుల క్రమముగా విశ్లిష్టమై (dis-joined, disunited), వినిష్ఠమై (destroy) పోవును. అప్పుడు చతుర్విధ పరమాణువులు (atoms) మాత్రమే మిగిలియుండును. ప్రళయానంతరము జీవుని భోగాదృష్టముల పూరణకై మహేశ్వరునకు మరల సృష్టినొనర్ప ఇచ్చకలుగును. అప్పుడు మొట్టమొదట వాయుపరమాణువున అదృష్ట వశత: స్పందనము కలుగును. అప్పుడు వాయు పరమాణువుల సంయోగమువలన వాయువు ఉత్పన్నమై ఆకాశమున ప్రహహించుచుండును. ఇట్లే తైజస (radioisotopes), జలీయ (water), పార్ధివ పరమాణువుల నుండి స్థూల భూతములు (Planets) జనించును. తరువాత మహేశ్వరుని సంకల్పవశమున బ్రహ్మాండము (Universe) సృష్టియగును. బ్రహ్మకూడా ఉధవించి మిగిలనవి సృష్టించును.