వినాయక చవితి

వికీపీడియా నుండి
(వినాయకచవితి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వినాయక చవితి
{{{holiday_name}}}
పూజా మందిరంలో కొలువైన గణేశుడు
అధికారిక పేరుచతుర్/వినాయక చతుర్థి/వినాయక చవితి
యితర పేర్లుచవితి, చౌతి, గణేశోత్సవ్
జరుపుకొనేవారుహిందువులు
రకంహిందూ ధర్మఆచారం
ప్రారంభంభాద్రపద శుక్ల చతుర్థి
ముగింపు11 వ రోజు
జరుపుకొనే రోజుభాద్రపద మాసం (ఆగస్టుసెప్టెంబరు)
ఉత్సవాలుహిందూధర్మశాస్త్రాలు ప్రతిరోజూ వేద శ్లోకాలు , ప్రార్థనలు, పూజలు జరుగుతాయి. చివరి రోజు: ఊరేగింపులు, విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.
ఆవృత్తిసంవత్సరానికి ఒకసారి.

వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.[1] భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

చరిత్ర

1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్, బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు.[2] భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం.

పూజా విశేషాలు

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.[3][4]

  1. మాచీ పత్రం/మాచిపత్రి -
  2. బృహతీ పత్రం/ములక
  3. బిల్వ పత్రం/మారేడు
  4. దూర్వా పత్రం/గరిక
  5. దత్తూర పత్రం/ఉమ్మెత్త
  6. బదరీ పత్రం/రేగు
  7. అపామార్గ పత్రం/ఉత్తరేణి
  8. తులసీ పత్రం/తులసి
  9. చూత పత్రం/మామిడి
  10. కరవీర పత్రం/గన్నేరు
  11. విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం
  12. దాడిమీ పత్రం/దానిమ్మ
  13. దేవదారు పత్రం/దేవదారు
  14. మరువక పత్రం/ధవనం, మరువం
  15. సింధువార పత్రం/వావిలి
  16. జాజి పత్రం/జాజిమల్లి
  17. గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు)
  18. శమీ పత్రం/జమ్మి
  19. అశ్వత్థ పత్రం/ రావి
  20. అర్జున పత్రం/ తెల్ల మద్ది
  21. అర్క పత్రం/జిల్లేడు.

విఘ్నేశ్వరుని కథ

  • సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
  • పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు.
  • కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
  • శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు.
  • అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థానమయ్యాడు

వినాయక జననం

కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహా బలశాలి.

విఘ్నేశాధిపత్యం

ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో, వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
"సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'
కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండి పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండీ' అన్నాడు.

ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడ పప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా? పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వస్తాయి.
పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'

ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట

ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వేసారు. దీనికి కారణం, వారు చంద్రుని చూడటమే!

దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనాన్ని కలుగ చేసింది. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది.

శ్యమంతకోపాఖ్యానం

ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.
కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శ్యమంతక మణి ఉంది. అది సూర్యవరం వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.
ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.
అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.
ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే, నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శ్యమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.
తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శ్యమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె, సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి, మణిని మృదువుగా తిరస్కరించాడు.
ఒక శుభముహుర్తాన శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో 'స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి?' అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశాన చంద్ర దర్శనం అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి, శ్యమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక' అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.
కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్యం

వినాయక నిమజ్జనం

భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.

వినాయక చతుర్థి- జ్యోతిర్వేదం

సూర్యుడు అస్తమించగానే తూర్పున కొన్ని చుక్కలు ఉదయించును. ఆ చుక్కలు రాత్రియంతయు ఆకాశాన మెరసి, సూర్యోదయమగు వేళకు పడమట అస్తమించును. అదేవేళకు మరికొన్ని చుక్కలు తూర్పున ఉదయించును. పున్నమినాడు సూర్యుడస్తమించే వేళకే చంద్రుడు తూర్పున ఉదయించును. అవేళ చంద్రోదయమప్పుడు తూర్పున ఏచుక్క ఉదయించునో ఆచుక్కను బట్టి ఆనెలకు పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆయామాసములనుబట్టియు, కాలగతులనుబట్టియు చుక్కలు మన భూమిచుట్టును తిరుగుచున్నట్లు కనబడును. ఈ పరిభ్రమణ సందర్భాలలో కొన్ని చుక్కలు సుమారు రెండు వారాల కాలం సూర్యునితోనే ఉదయించి, సూర్యునితోనే అస్తమించుచూ, రాత్రులు ఏ వేళప్పుడు చూచినను మనకు కనబడవు. ఆ దినాలు ఆ నక్షత్రమునకు '''కార్తె''' దినం అందురు. సూర్యాస్తమైన తరువాత సూర్యోదయమగువరకును, రాత్రి ఏ వేళ చూచినను ఏ నక్షత్రపు కార్తెలో ఆనక్షత్రం మనకు కనబడదు. గ్రహముల విషయంలో ఈ కాలంను '''మూఢం''' అంటారు. మూఢం పోగానే ఇవి మరలా కనబడును.

ఏనుగు తొండం, లంబోదరం, ఎలుక వాహనంతో కూడిన నక్షత్రస్వరూపుడగు విఘ్నరాజు ఉత్తరాకాశాన ఆనాడు సూర్యోదయ పూర్వం తూర్పున ఉదయించును. తొలినాడు విఘ్నేశ్వర చవితి. మరునాడే ఋషిపంచమి. కాబట్టి సప్త ఋషులు ప్రక్కనే మనం విఘ్నేశ్వర నక్షత్రాలను చూడగలం. సప్త ఋషులు ఏడు కొంగలు ఎగురుచున్నట్లు కనబడునని భాసుడు వర్ణించాడు. పడమటి దేశాలవారు ఇవి నాగలి వలె ఉన్నవందురు. మరి కొందరు భల్లూకం-పెద్ద ఎలుగుబంటి (The Great Bear or Ursa Major) రూపంలో ఉన్నాయంటారు. ఈ విఘ్నేశ్వర నక్షత్రాలు (ఎలుక-ఏనుగు) కనిపిస్తున్నవని పలు శాస్త్రకారులు నిరూపించారు. Grimaldi రచించిన Catalogue of Zodiacs and Planispheres Etc. అనే గ్రంథంలో 31 పుటలో చీనా నక్షత్రటలముల పట్టికలో నెం146 రు నమోదులో ఎలుక రూపం గ్రంథస్థము చేయబడింది.

భూభ్రమణం మొదలగు అనేక కారణములవలన ఒకనాటి సూర్యోదయానికు ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు నాలుగు నిముషాల ముందు ఉదయించును. పదునైదు దినాలలో 15 X 4 =60 నిముషాలు, అనగా ఒక గంటకు ముందు ఉదయించును. నెలరోజులలో రెండుగంటలు ముందు ఉదయించును. 6 నెలలో 12 గంటలముందు ఉదయించును. అనగా సూర్యస్తమానం వేళకు తూర్పున ఉదయించును. కాగా, భాద్రపద శుద్ధచవితినాడు సూర్యోదయానికు ముందు తూర్పున ఉదయించిన విఘ్నేశ్వర నక్షత్రం చైత్రశుద్ధ చవితినాడు సూర్యాస్తమైన తరువాత తూర్పున కనబడును. కాబట్టి ఆనాడు వేదాలలో గణేశపూజ చేయమని చెప్పబడింది.

మాఘశుద్ధ చతుర్థి

లెక్క ప్రకారం చైత్రశుద్ధ చవితినాడే వినాయక నక్షత్రం సూర్యాస్తమయం కాగానే తూర్పున లభించవలసింది. కానీ విఘ్నేశ్వర నక్షత్రాలు, సప్తఋషులును ధ్రువసమీపాన కానవస్తారు. ధ్రువునకును, ధ్రువుని చుట్టు అతిసమీపంలో ప్రదిస్ఖిణం చేయు లఘుఋక్షపు చుక్కలకును ఉదయాస్తమానాలు లేవు. ఆ నక్షత్రాలకు సప్తఋషులును, విఘ్నేశ్వరనక్షత్రములును ఎంతో దూరమందు లేవు. క్రాంతి వృత్త స్థలమగు అశ్విని, భరణి, కృత్తిక మొదలగు నక్షత్రాలవలె తూర్పున ఉషఃకాల ప్రథమ దర్శనం మొదలు సాయం సమయ ప్రథమదర్శనంనకు మధ్య ఈ విఘ్నేశ్వరనక్షత్రంలకు 6 నెలలు గడిచిపోనక్కర్లేదు; సప్తఋషులు మఘనక్షత్రంతోనే ఉదయమగుదురు. ఆ ప్రక్కనున్న విఘ్నేశ్వరుడు అంతకుముందే ఉదయమగును. కనుక మాఘశుద్ధ చతుర్థి నాటికే ప్రత్యక్షంగా విఘ్నేశ్వరుని సాయంకాలాన సూర్యాస్తమానం కాగానే చూడగలుగుదుం. ఈ కారణం చేతనే మన పంచాంగకర్తలు గతానుగతకంగా మాఘశుద్ధ చతుర్థినాడు గణేశపూజ విధించారు. కీ.శే. జ్యోతిశ్శాస్త్రపండితులు డి.స్వామికణ్ణుపిళ్ళై- దివాన్ బహుదూర్ ఈ మాఘశుద్ధ చవుతి గణేశచతుర్థియని రాసారు

ఖగోళదృశ్యాలలో విఘ్నేశ్వరుని కథ

ఖగోళంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు మూడును నాగవీధి అనియు, రోహిణి, మృగశిర, ఆర్ద్రనక్షత్రాలు గజవీధి అనియు పురాణాలన్నియూ తెలుపుచున్నవి. కాబట్టి ఆర్ద్రనక్షత్రం రుద్రుడు-ఈశ్వరుడు. ఈశ్వరుడు గజవీధిలో అనగా గజునిలో ఇరుకుకొని ఉండవలసి వచ్చింది. పిమ్మట రాశీవిభాగం వచ్చింది. మొదటి మూడురాసులును మేషం, వృషభం, మిథునం. అందు మేషం అశ్విని+భరణి+ కృత్తిక1/4; వృషభం కృత్తిక 3/4 + రోహిణి + మృగశిర 1/2. ఈ వృషభరాశియే నంది. ఈ వృషభం వచ్చి నందిని చంపింది. కాగా మృగరాశిలో సగం; ఆర్ద్రనక్షత్రం పూర్తిగాను, పునర్వసులో 3/4-అవి మిథునం లోనికి పోయినవి. గజవీధినుండి -అనగా గజనిలో నుండి ఆర్ద్రం వెలికితీసి, వృషభం ఆర్ద్రకు వాహనంను, ధ్వజాన్ని నై ఆర్ద్రను మిధునంలో చేర్చుటకు తోడ్పడింది. అంతకుముందు గజుని మూలముగా వేరైన పార్వతీపరమేశ్వర మిథునమిపుడేకం కాగల్గింది. గజచర్మ రూపాన్ని స్ఫురింపజేయు చిన్న చుక్కలు అనేకంగా ఆరుద్ర సమీపాన మీదుగా ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులకు ముద్దుబిడ్డడై, గజముఖుడై, పునర్వసుచుక్కలకు సమీపంలో సప్తఋషుల పక్కనే విఘ్నేశ్వరడున్నాడు. శివకేశవులందు భక్తిభావము గలవారికి విఘ్నేశ్వరుడు ప్రథమపూజ్యుడై ఖగోళములో సంబంధము కలుపుచున్నాడు. శివాలయాలలో నందులు Zodiacal Bull (వృషభరాశి) సంౙ్కములై ఉన్నాయి.

శ్యమంతకోపాఖ్యానం

మఘ+పుబ్బ+ఉత్తర 1/4- సింహరాశి. సప్తఋషులు మఘనక్షత్రముతో ఉదహరింతురు. సప్తఋషులకు సంస్కృతంలో బృహదృక్షం, అనగా పెద్ద ఎలుగుబంటి అని పేరు. అదే ఈ కథలో జాంబవంతుడు.సప్తఋషులలో పడమటి చుక్కలు రెండును ఇటు మఘ, అంగా సింహంను, అటు ధ్రువుని చూపును. ధ్రువుడు చిన్న ఎలుగుబంటి అనే లఘుఋక్షంలోనివాడు. చిన్న ఎలుగుబంటే జాంబవంతుని కుమారుడు.శ్యమంతకమణి ఆకాశాన నుండి సింహరాశిని, సప్తర్షిమందలమును, లఘుఋక్షమును దాటి పడిన ఒక వజ్రమని ఊహించవచ్చును. విశిష్టమైన తేజస్సు (Radio Activity) చురుకు గలిగినదై నీచలోహలను అపరిమితంగా బంగారము క్రింద మార్చగలిగిన శక్తి ఉందని ఊహించవచ్చు. లేక సూర్యునినే మణిక్రింద వర్ణించిరో? ఆమణికి రాశితోడను, సప్తర్షిమండలంతోను, లఘుఋక్షంతోను ఎదో సంబంధం కలిగి ఉన్నట్లు కనబడుతుంది. విఘ్నేశ్వరచవితినాడు సాధారణంగా హస్తనక్షత్రంతో చంద్రుడు కూడి ఉండును. అనగా ఆవేళ నక్షత్రం హస్త. హస్తి అనగా ఏనుగు తొండం గల జంతువు. విఘ్నేశ్వరునికి ఏనుగు తొండముంది. హస్త నక్షత్రానికి సవితృ అభిదేవత. సవితృ అనగా సూర్యుడని అర్థం. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి శ్యమంతకమణిని సంపాదించెనని పురాణాలు చెపుతున్నాయి. ఇక్కడ మరికొన్ని విషయాలు తెలియవలసి ఉన్నాయి. ఈ నక్షత్రాలకు శ్యమంతకోపాఖ్యానమునకు గల వివరాలు మరికొంత పరిశీలించవలసి ఉంది.

ఇవీకూడా చూడండి

మూలాలు

  1. "Ganesh Chaturthi | Hindu festival". Encyclopedia Britannica. Retrieved 2021-09-08.
  2. "లోకమాన్య తిలక్.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత". Samayam Telugu. Retrieved 2021-09-08.
  3. "Vinaya Chavithi Pooja: వినాయక చవితి వ్రత కథ, పూజా విధానం". Samayam Telugu. Retrieved 2021-09-08.
  4. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". andhrajyothy. Archived from the original on 2021-10-04. Retrieved 2021-09-09.

వెలుపలి లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.