ఓణం
ఓణం | |
---|---|
అధికారిక పేరు | మలయాళం: ഓണം |
రకం | పంటల ఫలితం ఇంటికొచ్చే రోజు |
ప్రాముఖ్యత | తిరుఓణం నాడు మహాబలి అనే రాజు ప్రతి ఒక్క మలయాళీ కుటుంబాన్ని వచ్చి కలుసుకుంటాడని ప్రజల విశ్వాసం |
జరుపుకొనే రోజు | Onam Nakshatra in the month of Chingam |
వేడుకలు | Sadya, Thiruvathira Kali, Puli Kali, Pookalam, Ona-thallu[1] |
ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ.[2] ఇది మలయాళీ కాలగణనములో (calendar) మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది. ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అంటారు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు. ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారములు, సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజున ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా, ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ, రవికె ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ.
ప్రాముఖ్యత
[మార్చు]ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ, వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా, సిరిసంపదలతో ఉన్నారు. ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితోపాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.
మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు.[3] [4] [5] ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు.
కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో, ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్థములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది. ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.
ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం వల్లంకలి అనబడే సర్పాకారపు పడవల పందెము. ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.
ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది. ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు, కయ్యంకలి, అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి, తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి.
మహాబలి యొక్క పరిపాలన కేరళలో స్వర్ణ యుగంగా భావించబడుతుంది. ఈ క్రింది పాట ఓణం రోజు ఎక్కువగా పాడబడుతుంది: (అనువాదం)
“ | When Maveli, our King, ruled the land,
All the people had equality. |
” |
పురాణం
[మార్చు]మహాబలి ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ, విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువుపైన ప్రేమను, భక్తిని అలవరుచుకున్నాడు.
మహాబలి ముల్లోకములను జయించుట
[మార్చు]కశ్యపుడుకి ఇద్దరు భార్యలు, దితి, అదితి. వీరు రాక్షసులు, దేవతల (అసురులు, దేవతలు) తల్లితండ్రులు. తపస్సు చేసుకోవటానికి హిమాలయములకు వెళ్ళిన కశ్యపుడు, తిరిగి వచ్చి అదితి శోకిస్తూ ఉండటాన్ని కనుగొంటాడు. దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమును కనుగొంటాడు. ఈ ప్రపంచములో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదనీ, ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెపుతూ ఆయన, ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. ఆయన, ఆమెకు విష్ణునును పూజించమని చెపుతూ పయోవ్రతమును బోధించాడు. ఇది కార్తీక మాసము యొక్క శుక్ల పక్షములో పన్నెండవ రోజు (శుక్ల-పక్ష ద్వాదశి) నుండి చేయవలసిన క్రతువు. అదితి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించటం వలన, విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు తెలియజేస్తాడు.
ఇంకొక ప్రక్క, దేవతలను ఓడించి మహాబలి ముల్లోకములకు పాలకుడు అవటంతో దేవతలందరూ చాలా చిరాకు పడ్డారు. దేవతలు హింసించబడ్డారు.[6] దేవతలు విష్ణువును కలిసి సహాయం అర్థిస్తారు. మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు, అతను సురుడు (దేవుడు) అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్పాడు. దేవతలారా మీరు దీని గురించి ఈర్ష్య చెందకండి. అసూయ మిమ్ములను అసురులుగా చేస్తుంది. విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.
అదే సమయంలో, మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేథ యాగం[7] నిర్వర్తిస్తున్నాడు. ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు.
వామనుడు మహాబలిని కలుస్తాడు
[మార్చు]ఆ యాగమును, మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకుని, వామనుడు (మహావిష్ణువు బ్రాహ్మణుడిగా మారువేషంలో) ఆ యాగశాల వద్దకు వచ్చాడు. అతను వారిని సమీపించగానే, అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపిల్లవాని యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు. మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించి, ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనములో కూర్చుండబెట్టాడు. సహాయం కోరుతూ వచ్చిన ప్రజలకు ఇచ్చే సాధారణ మర్యాదతో మహాబలి, వామనునితో ఆయన రాకతో తనను పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు. వామనుడు ఏది కోరుకుంటే, అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు. వామనుడు చిరునవ్వు నవ్వి ఈవిధంగా చెప్పాడు: "నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు. నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు" .
అతని మాటలు విని, భవిష్యత్తును చూడగలిగిన, మహాబలి యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు అనే బ్రాహ్మణుడు (ఒక దైత్య గురువు), మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చిన వాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెప్పాడు. ఆ పిల్లవానికి ఏమీ వాగ్దానం చేయవద్దని ఆయన మహాబలికి సలహా ఇచ్చాడు. కానీ మహాబలి ఎప్పుడూ ఆడిన మాట తప్పే రాజు కాదు, అలా చేయటం పాపమని ఆయన ఉద్దేశం. వామనుని కోరికలను తీర్చకూడదని, ఎందుకనగా వామనుడు అతని సంపదనంతటినీ హరించివేస్తాడని శుక్రాచార్యుడు గట్టిగా చెప్పాడు.
వామనుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి, తన గురువు మాటను మన్నించనందుకు ఆయనను క్షమాపణ కోరుకున్నాడు. పూర్వం, మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళుతున్నప్పుడు, తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసాడు, ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగమును ప్రారంభించాడు, దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు. కేవలం శుక్రాచార్యుని సహాయం వలనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు. మహాబలి తిరస్కారం శుక్రాచార్యునికి ఆగ్రహం తెప్పించింది. ఆయన మహాబలిని ఈవిధంగా శపించాడు: 'నీ గురువు మాటలను లక్ష్య పెట్టనందుకు, నీవు బూడిద అయిపోతావు'. మహాబలి దృఢంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'నేను ఏ విధమైన పరిణామములను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను'.
మహాబలి యొక్క ఏలుబడి ముగుస్తుంది
[మార్చు]ఆ విధంగా చెపుతూ, అతను వామనుడుని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు. మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతిఒక్కరినీ దేవునిగానే మహాబలి భావించాడు, వారు కోరినది ఏదీ అతను కాదనలేదు. మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్పాడు: "ప్రాణము (జీవం) , మానము (మర్యాద) అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి. ప్రాణం పోయినా, మానం రక్షించబడాలి. ఇప్పుడు వచ్చిన వాడు దేవుడే అని తెలుసుకుంటే, మానవులకు అన్నీ ఇచ్చే భగవంతుడు, నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే, నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను. " ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే, తను తప్పకుండా దానిని తీరుస్తానని కూడా మహాబలి గొప్పగా చెప్పాడు.[8]
వామనుడు ఆకాశము కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు. ఒక్క అడుగుతో, అతను భూమినంతటినీ కొలిచాడు. రెండవదానితో ఆకాశమును కొలిచాడు. మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలి ఉంది. వేరే దారి లేకపోవటంతో, మూడవ అడుగు భూమిగా ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందని మహాబలి వామనుడిని అభ్యర్థించాడు. వామనుడు అదే విధంగా చేస్తూ, అతనిని పాతాళానికి తొక్కి వేసాడు (భూమి క్రింద ఉన్న రాజ్యం).
విష్ణువు యొక్క దీవెనలు
[మార్చు]రాక్షసుడు అయిన మహాబలి భక్తికి మెచ్చి, విష్ణువు (వామనుడు) అతనికి పాతాళమును పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్టించే వరం కూడా ఇచ్చాడు, ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు (ప్రతి మన్వంతరమునకు ఒకసారి ఇంద్ర పదవిని కొత్తవారు అధిష్టిస్తారు).
ఆఖరి వరంగా, మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు. ఆవిధంగా, తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్థం కేరళ ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట ("సత్యము") కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్థకం చేసుకున్నాడు.మహాబలి అనగా గొప్ప త్యాగము అని అర్థం.
ఓణం సమయంలో, విందు, చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండుగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలోని ప్రజల సుసంపన్నమైన, నిజాయితీ కల జీవితానికి స్మృతిగా భావిస్తారు. ఓణం సమయంలో ప్రజలు కొత్త దుస్తులు (వస్త్రములు) ధరిస్తారు. 'వస్త్రము' అనగా హృదయము అని కూడా అర్థం. ఆవిధంగా చెడ్డ ఆలోచనలను, చెడ్డ భావములను తొలగించి హృదయమును నూతనముగా చేయటమే, కొత్త వస్త్రములు ధరించటం యొక్క ప్రాముఖ్యత. వారి మత అభిమానములను ప్రక్కన పెట్టి, ప్రజలందరూ కలిసికట్టుగా పవిత్రమైన 'తిరుఓణం' దినానికి స్వాగతం చెపుతారు.
నైతిక ప్రశ్నలు
[మార్చు]తన తాత (ప్రహ్లాదుడు) లాగా, విష్ణువుకు గొప్ప భక్తులలో ఒకడు, సత్యసంధుడైన ఒక గొప్ప రాజు అయిన మహాబలిని, విష్ణువు శిక్షించటం అన్యాయముగా అనిపించవచ్చు. అయినప్పటికీ, విష్ణువు మహాబలిని శిక్షించినట్లు కాదు. ఎందుకనగా అతను విష్ణువు నుండి వరములు పొందాడు. ఓణం రూపంలో అతను శాశ్వతంగా గుర్తుంచుకోబడతాడు. ఇంకా అతనికి తన తలను విష్ణువు పాదముల క్రింద ఉంచే అవకాశం దొరికింది. దీనితో అతని పాపములు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి.
ఇంకా, విష్ణువు ఇచ్చిన వరం వలన, మహాబలి ఎనిమిదవ మనువు, సావర్ణి మనువు సమయంలో, కాబోయే (ఎనిమిదవ) ఇంద్రుడు. పురందరుడు ప్రస్తుత ఇంద్రుడు.[9]
తన రాజ్యమును విష్ణువుకు త్యాగం చేయటం ద్వారా మహాబలి భూమండలంలో అతి గొప్ప విష్ణు భక్తుడు అయినాడని నమ్మకం.
సురులు అనగా మంచివారు, అసురులు అనగా చెడ్డవారు అని అర్థం. హిందూమతం ప్రకారం, చెడ్డ పనులు చేయటం ద్వారా సురులు అసురులు అవవచ్చు, మంచి పనులు చేయటం ద్వారా అసురులు సురులు అవవచ్చు. అసురుడైన మహాబలి, సురుడు అవాలని కోరుకున్నాడు. దాని కొరకు, అతను తన ప్రజలకు మంచి పనులు చేసాడు. మహాబలి యొక్క పరోపకారమును, దాతృత్వమును పరీక్షించటానికి మహావిష్ణువు వామనుని రూపంలో వచ్చి అతనిని పాతాళమునకు పంపివేసాడు. దీనిని మహాబలి ఆనందముగా స్వీకరించాడు. ఆవిధంగా, మహాబలి సురుడు లేదా దేవుడు అయినాడు. ఓణం హిందూమతం యొక్క అద్వైత సిద్ధాంతమును దృష్టాంతపరుస్తోంది.
పది రోజుల వేడుక - అతం పత్తిను పొన్నోనం
[మార్చు]ఓణం వేడుకలు ఓణానికి పదిరోజుల ముందు అతం (హస్త) దినమున ప్రారంభమవుతాయి. మహాబలి, వామనుడుకి (విష్ణువు యొక్క ఒక అవతారము) ప్రతీకలుగా చతురస్రాకారపు పిరమిడ్ల వంటి మట్టి దిబ్బలను, పేడతో అలికిన ఇంటి ముంగిళ్ళలో ఉంచి పూవులతో అందముగా అలంకరిస్తారు. ‘ఓణపూక్కలం’గా ప్రసిద్ధమైన ఈ ఆకృతి, వివిధ రకముల పూలతో , భిన్న రంగులతో కూడిన రెండు మూడు రకముల ఆకులతో వేయబడుతుంది, ఈ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ రంగవల్లికలో అలంకరిస్తారు.[10] ఇది గొప్ప కళాత్మక భావములను సునిశితమైన దృష్టితో మిళితం చేసి రూపొందించిన ఒక అందమైన కళాకృతి. (ఇదే విధంగా ఉత్తర భారతీయులు రంగురంగుల పొడులతో "రంగోలి"ని రూపొందిస్తారు). అది వేయటం పూర్తి అవగానే, చిన్న చిన్న తోరణములు వేలాడదీసిన ఒక చిన్న పందిరి నిలబెడతారు.
ఈ పండుగ యొక్క ముఖ్య పర్వం కొన్ని ప్రాంతములలో తిరువోణం నాడు ప్రారంభమవుతుంది. ఇతర ప్రాంతములలో ఉత్రదం అనబడే తరువాతి రోజున ప్రారంభమవుతుంది. తిరుఓణం రోజు, రాజా మహాబలి ప్రతి మలయాళీ ఇంటికీ వెళ్లి తన ప్రజలను కలుసుకుంటాడని నమ్మిక. ఇండ్లు శుభ్రం చేసి పువ్వులతో , సాంప్రదాయక దీపములతో అలంకరిస్తారు. తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతమును ఒక యదార్థమైన అద్భుతలోకంగా (fairy land) మార్చివేస్తుంది. ప్రతి ఇంటిలోనూ ఘనమైన విందు భోజనములు తయారుచేస్తారు. ప్రతి ఇంటిపెద్ద ఆ కుటుంబములోని సభ్యులందరికీ కొత్త దుస్తులు అందజేస్తాడు. కటిక దరిద్రుడు కూడా ఏదో రకముగా తనకు చేతనైన రీతిలో ఆ రాష్ట్రీయ పండుగను జరుపుకుంటాడు.
రాజా మహాబలికి స్వాగతం పలకటానికి ప్రజలు వారి ఇంటి ముంగిట్లో పువ్వుల రంగవల్లులు దిద్దుతారు. ఈ పువ్వుల రంగవల్లులు దిద్దటంలో పోటీలు జరుగుతాయి. ప్రపంచములో ఉన్న కేరళీయులు అందరూ ఈ పది రోజుల పండుగను అంగరంగ వైభవముగా, ఉల్లాసముగా జరుపుకుంటారు. వారు కొత్త దుస్తులు ధరించి, వారు సందర్శించగలిగినన్ని దేవాలయములను సందర్శిస్తారు. తిరువధిరకలి తుంబి తుల్లాల్ వంటి నృత్యములను అభినయిస్తారు. రెండవ ఓణంగా పిలవబడే తిరుఓణం రోజున జరిగే గొప్ప విందు చాలా ముఖ్యమైనది. ఏది జరిగినా వారు ఆ గొప్ప విందును (సద్య ) వదులుకునేవారు కాదు. మలయాళంలో ఒక సామెత ఉంది "కనం విట్టుం ఓణం ఉన్ననం", దీని అర్థం "మా ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చినా కూడా మేము తిరుఓణం విందును ఆరగించవలసిందే" అని. ఇది తిరుఓణం నాడు జరిగే గొప్ప విందు యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
వేర్వేరు ప్రాంతములలోని వేర్వేరు ఆచార వ్యవహారములకు అనుగుణంగా ఓణం పండుగ జరుపుకుంటారు. అతచామయం- అనబడే ఒక సాంప్రదాయ ఉత్సవం ఎర్నాకులం-కోచి సమీపంలో ఉన్న తృప్పూణిత్తుర అనే రాచనగరిలో, చింగం యొక్క ఆఖరి దినమున జరుగుతుంది. ఇది ఓణం వేడుకలకు ప్రారంభ సూచిక కూడా. త్రిక్కకర లోని వామనమూర్తి దేవాలయము వద్ద జరిగే వార్షిక ఉత్సవము కూడా, ఓణం సమయములోనే జరుగుతుంది. ఇది వామనుడి దేవాలయము. ఓణం యొక్క పౌరాణిక నేపథ్యముతో దీనికి సంబంధం ఉంది.
"ఓణ పూక్కలం" (ఓణపు ముగ్గు) ను లౌకికత్వానికి చిహ్నముగా పరిగణిస్తారు. వివిధ రకముల పువ్వులన్నీ కలిసి అద్భుతముగా అగుపించే పూక్కలమును రూపొందుతాయి. కావున, ఇది మహాబలి సమయములోని పూర్వపు మంచి రోజులను ప్రతిబింబించాలి. అతం నుండి తిరుఓణం వరకు పూక్కలం రూపొందించటం కేరళలోని ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ఆనందదాయకం.
మలయాళ నూతన సంవత్సరమునకు పక్షం రోజులలోనే వేడుకలు ప్రారంభమవుతాయి. పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఆఖరి రోజైన తిరుఓణం చాలా ముఖ్యమైనది. కొత్త దుస్తులు, సాంప్రదాయ వంటలు, నృత్యము, సంగీతములతో పాటు రాష్ట్రమంతటా పాటించే ఆచారములు, ఈ వ్యవసాయ పండుగకు చిహ్నములు.
వల్లువనాడ్ (ముఖ్యముగా ఒట్టపలం, షొర్నూర్ ప్రాంతములు) వద్ద, అద్భుతమైన దుస్తులు ధరించిన కథాకళి నర్తకులు పురాణములను అభినయిస్తారు. అలంకరించబడిన ఏనుగుల యొక్క అద్భుతమైన ఊరేగింపు త్రిస్సూర్ వద్ద బయటకు వస్తుంది. ఇక్కడే ముసుగులు ధరించిన నర్తకులు అందమైన కుమ్మట్టికలి నృత్యమును అభినయిస్తూ ఇంటింటికీ వెళతారు. కథాకళి నర్తకులు అభినయిస్తున్న పురాణములు, జానపద కథలలోని సన్నివేశములను చూడటానికి చెరుతురుతి వద్ద ప్రజలు గుమిగూడుతారు. కడువకలిగా కూడా ప్రసిద్ధమైన పులికలి ఓణం సమయంలో సాధారణంగా కనిపించే దృశ్యం. ప్రకాశవంతమైన పసుపు, ఎరుపు, నలుపు రంగులు పూసుకున్న నర్తకులు ఉడుక్కు, తకిల్ వంటి వాయిద్యములకు అనుగుణంగా నృత్యం చేస్తారు.
ఓణ రోజులలో అరంముల వద్ద, ప్రఖ్యాత అరంముల వల్లం కలి నిర్వహించబడుతుంది.
ఊయల ఓణం వేడుకలలో మరియొక అంతర్భాగం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతములలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అందముగా ముస్తాబైన యువతీ యువకులు ఒనప్పాట్ట్, లేదా ఓణం పాటలు పాడుతారు. ఎత్తైన కొమ్మల నుండి వేలాడగట్టిన ఊయలలో ఒకరిని ఒకరు ఊపుకుంటారు.
ఓణం కార్యక్రమములు
[మార్చు]ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు, ఓణం సద్య, అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్థములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు, అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు, చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది. దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి.
ఓణం సమయంలో, ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు, దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇవి సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక, సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి.
వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల పడవ పందెం, నెహ్రూ ట్రోఫీ పడవ పందెం ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి, అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు. ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి, దూర ప్రాంతముల నుండి కూడా అనేకులు వస్తారు. తంపనూరు వద్దనున్న వెల్లయాని సరస్సులో ఈ పందెంలను నిర్వహిస్తారు.
వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా, ఓణం సమయంలో కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు.
కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో, ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, ఈనాడు ఈ పండుగను హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు.
ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి.[11] దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి, దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు.[11] త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.[11]
ఇది కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ M. Nazeer (2010-08-10). "The abiding lore and spirit of Onam". The Hindu. Retrieved 2013-09-26.
- ↑ Chopra, Prabha (1988). Encyclopaedia of India. p. 285.
Onam — Most important and grandest Hindu festival of Kerala; held in Chingam (August-September)
- ↑ "Flowers, pookkalam and Onam". The Hindu. 2013-09-13. Retrieved 2013-09-17.
- ↑ "Thiruvonam celebrated with enthusiasm". The Hindu. 2011-09-11. Retrieved 2013-09-17.
- ↑ "Grandeur marks Onam celebrations at Thrikkakkara temple". The Hindu. 2011-09-11. Retrieved 2013-09-17.
- ↑ P. 161 Many Ramayanas: The Diversity of a Narrative Tradition in South Asia By Paula Richman
- ↑ P. 368 Śrīmadbhāgavatam =: Srimad Bhagavata, the Holy Book of God By Tapasyananda
- ↑ P. 66 Path to the Soul By Ashok Bedi
- ↑ P. 30 Know the Puranas By Pustak Mahal
- ↑ "'Athappookalam' losing traditional verve". The Hindu. 2009-09-01. Retrieved 2013-09-17.
- ↑ 11.0 11.1 11.2 P. 179 Genealogy Of The South Indian Deities By Bartholomaeus Ziegenbalg, Daniel Jeyaraj