ఉగాది
తెలుగు ప్రజల క్రొత్త సంవత్సరం |official_name = యుగాది |observedby = తెలుగు ప్రజలు |begins = చైత్ర శుద్ధ పాడ్యమి |season = వసంత ఋతువు ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, సంక్రాంతి, గురుపూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవ్ గా ఉన్నాయి.
ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
[మార్చు]వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'
శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి.[1] ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం.
గోదావరి జిల్లాలో ఉగాది పచ్చడి చేసే విధానం
[మార్చు]గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగా మగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారం-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయ, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు- అరకప్పు.చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
యుగయుగాల ఉగాది
[మార్చు]రామాయణంలో చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి ఆగ్రహాయణికః అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది- అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. ( యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా?
ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు.ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునిబట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు వసంతం.భారతకాలంలో విషువత్ చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది.కనుకనే విష్ణుపురాణం మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా!! నేడు మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది.చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపచిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే విషువత్ మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైన ప్రాహ్మణాలకాలంలో వసంత విషుత్కాలం కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము.నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.
వరాహమిహిరుడు వసంత విషువత్తునుబట్టి ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించాడు.కాని అప్పటినుంచి వసంత విషువత్ 23 డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.
మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు:
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని,
శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి.
చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. అని సమాధానం చెప్పాడు. ఇది ఇలా ఉంచితే మన దేశంలో పుష్య-మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలం. ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కట్టెదుట చూస్తూ పొంగి పోతారు.ఇదే మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం.ఇది మార్గశిర-పుష్య-మాఘమాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ సరిసమానంగా ఉండే కాలం.సమరాంత్రిందివే కాలే విషువత్ అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు రెండు.మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది.
ఈవిషువత్ నిర్ణయంలోనూ మత బేధం ఉంది.కటకం నుంచి- కటక విషువత్ నుంచి- దక్షిణాయనం, మకర విషువత్ నుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతాయని నేటి సాంప్రదాయం.కానిపూర్వం ఆశ్లేషారధం నుంచి దక్షిణాయనం, ధనిష్థా ప్రథమపాదం నుంచి అంటే అభిజిత్తుతో సహా లెక్కపెడితే కుంభం నుంచి ఉత్తరాయణం, సింహంనుంచి దక్షిణాయనం ఉండేవని ఇప్పుడు అవి కటకాలకు మారాయని వరాహమిహిరుడు బృహత్సంహితలో తెలిపాడు.
మనకొక సంవత్సరమైతే దేవతలకొక దినం. వారి దినం మేషంతో ప్రారంభమౌతోంది; తులతో రాత్రి. కనుక నేడు మకర కటకాలనుంచి ఉత్తర దక్షిణాయనాలు చెబుతారు అని శ్రీ పత్యాచార్యుడు అన్నాడు.
మనం ఉత్తరధ్రువ ప్రాంతం నుంచి బయలుదేరామనువాదం నిజమైతే, మేషవిషువత్తునుంచి మనకు దినం ప్రారంభం కావడం -6 నెలలు చీకటి 6 నెలలు వెలుతురు ఉండేదినం మొదలుకావడం నిజం. మనం ఉత్త్రార్ధగోళం వారం కనుక మేషంలోనే మనకు సూర్యోదయం.భూమధ్య రేఖపై సూర్యుడుండే దినం విషువత్.మానవుడు ఋతువులు తన లెక్కలకు ముందు వెనుకలుగా రావడం చూచి, సూర్యచారాన్ని తక్కిన గ్రహాల చారాన్ని లెక్కలు కట్టసాగాడు.సూర్యుడు విషువత్తులో ప్రవేశించిన నాటినుంచి లెక్కకట్టి రాసులు విభజించాడు. ఈవిధంగా నభో మండలం- 12 భాగాలు అయినది.ఆరాసులతోనే మాస సంకేతం చేసుకున్నాడు.సూర్యుడు ఒక రాశినుంచి మరొకరాశికి ప్రవేశించడానికి దాదాపు 30, 31 దినాలవుతుంది. కాని చంద్రుని వృద్ధిక్షయాలతో ఏర్పడిన నెలకు, తర్వాత సూర్యమానపు నెలకూ క్రమంగా నెలవారా రావడం మొదలైంది. చంద్రమానానికి 19 సం.లకు ఏడు అదనపు నెలలు చేర్చి రెండు మానాలను సర్దుకోవలసి వచ్చించి.కనుకనే ప్రతి మూడోఏటా చంద్రమాన సం.లో ఒక అధిక మాసం వస్తూవుంటుంది.
నిజానికి చంద్రమానమే వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నదేమో!! సౌరమానం వ్యవహారంలో ఉన్న ప్రాంతాలలోనూ వైదిక కర్మలకు చంద్రమానాన్ని అనుసరించడమే దీని ప్రాచీనతకు ప్రమాణం. అగ్ని పూజకులైన ఫార్సీలు ఎప్పుడో మననుంచి విడిపోయినవారు. వారి సంవత్సరాది నౌరోజ్. అది కూడా వసంతమాసంలో దాదాపు ఉగాదిదరిదాపులలోనే రావడం కూడా చంద్రమానం ప్రాచీనతకు నిదర్శనం, ముస్లింలు ఏదేశం వారైనా పూర్తిగా చంద్రమానాన్ని వాడేవారే.కనుకనే వారి పండుగలు ఒకసారి చైత్రంలో, మరొకసారి వైశాఖంలో మారుతూఉంటాయి.చాళుక్యుల కాలంలో మాత్రం సూర్యమానం ఆంధ్రదేశంలో అధికవ్యాప్తిలో ఉండేదట.ఇప్పుడు మనదేశంలో సౌరమానాన్ని వంగ, తమిళ, కేరళ, పంజాబు, సింధు, అస్సాం వారు అనుసరిస్తున్నారు.
మేషవిషువత్తే దైవతదినానికి - అంటే సంవత్సరార్ధానికి-ప్రారంభమైనప్పుడు; భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు లంకానగరంలో వసంతఋతువు శుక్లపక్ష ప్రతిపత్తునాడు ఉదయించడంవల్ల (భూ మధ్య రేఖపై ఉండడాన్ని బట్టి) అనాడే ఉగాది అనడంవల్ల; సంవత్సరం వసంతర్తుతో ప్రారంభిస్తుందని యజుర్వేదం ఒకవైపు ఘోషిస్తుండగను; ధర్మసింధు, నిర్ణయసింధు కారులు ఈ ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అనడం మాత్రమేకాక, నిర్ణయసింధుకారుడు శుద్ధపాడ్యమి నుంచి అమావాస్య వరకుగల కాలమే నెల అని నిర్ణయించినప్పుడూ; వివిధ విధాల సంవత్సరాదులేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాని ఋతునిర్ణయం లోను, సంవత్సరాది నిర్ణయంలోనూ ప్రాచీనకాలంలో వివిధాచారాలున్నాయనడమే దానికి సమాధానం.ఒకప్పుడు కార్తులను బట్టి ఋతు నిర్ణయం జరిగేది. వేదాంగ జ్యోతిష్ కాలంలో ధనిష్ఠా కార్తితో ప్రారంభమైన శిశిర ఋతువుతో- మాఘపూర్ణిమనుండి రెండు నెలలతో మొదటి ఋతువు- సంవత్సరం ప్రారంభమయ్యేది.ఇది ఉత్తరాయణ ప్రవేశ కాలం కూడాను. ఇది పరాశరుడు మతం.
సంవత్సరాది పండుగమాట సరే!! ఉగాది అనే మాట ఏమిటి? యుగమంటే కాలం. తదాది యుగాది. మనతోడివారైన కన్నడులు నేడూ యుగాది అని యకారాదిగానే దీనిని వ్యవహరిస్తారు.యకారాది పదాలు తెలుగుభాష సంప్రదాయం కాదు గనుక ఉగాది అయి ఉంటుంది.
ద్రావిడ మూలాలు
[మార్చు]ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.”ఉగాది”,, “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
ఉగాది అచారాలు
[మార్చు]ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. [1]
ఇవీ చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 నేదునూరి గంగాధరం (1956). "పండుగలు పరమార్థములు (పల్లెటూరి పాటలతోబాటు)". p. 8.