Jump to content

బోనాలు

వికీపీడియా నుండి
బోనాలు
బోనాలు
బోనాలతో ప్రదక్షిణాలు చేస్తున్న మహిళలు
అధికారిక పేరుబోనాలు
జరుపుకొనేవారుతెలంగాణా ప్రజలు
ప్రారంభంఆషాడ మాసం
ఉత్సవాలుఆదివారాలు జరుగుతాయి
ఆవృత్తిసంవత్సరానికి ఒకసారి

బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.[1] సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.[2]

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.[3][4]

ఆచారాలు

[మార్చు]
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో బోనాల ప్రదర్శన

[ఆషాఢ] మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.[5] image

పోతురాజు

[మార్చు]
బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పోతురాజులు.
బోనాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.[6]

అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.[7] b


విందు సంబరాలు

[మార్చు]

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. [8]

పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం

[మార్చు]

రంగం, పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కోపాన్ని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు (గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.[9]

బోనం

[మార్చు]

బోనాలు : భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వే పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండుగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. [10]

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో[11][12] ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.[13]

లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా సింహ వాహిని మహంకాళి, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

బోనాల పండుగ కు గల శాస్త్రీయ కారణాలు

[మార్చు]

శ్లో|| ఓం సర్వస్వరూపే సర్వేశే  సర్వ శక్తి సమన్వితే|

భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే ||

మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్), లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు  ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు .  బోనాల  పండుగలో  ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి  తెలుసుకుందాము.

బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు

[మార్చు]

*బోనం*

[మార్చు]

బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి  వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనానికి ఇంతపవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక  చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట .  ఇది బోణం యొకా ప్రత్యేకత.

*ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు*

[మార్చు]

మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా,మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు

అసలు పండగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా  ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణ్ణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.

*బలి*

[మార్చు]

బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో  కొంత మంది మాంసాహారం తినరు.

*అమ్మవారి ఊరేగింపు*

[మార్చు]

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి.

*గుగ్గీలం లేదా మైసాచి పొగ*

[మార్చు]

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే.వానా కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి . అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు  .

చిత్రమాల

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. http://www.washingtonpost.com/wp-dyn/content/gallery/2009/06/26/GA2009062602324.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-02-27. Retrieved 2009-08-29.
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  4. {{cite news |last1=Namasthe Telangana |first1= |title=తెలంగాణలో బోనాలు ఎందుకు తీస్తారు..? చారిత్రక పాశస్త్యం ఏంటంటే..? |url=https://www.ntnews.com/telangana/telangana-bonalu-what-is-significance-of-telangana-bonalu-festival-1169276 |accessdate=16 July 2023 |work= |date=16 July 2023 |archiveurl=https://web.archive.org/web/20230716160643/https://www.ntnews.com/telangana/telangana-bonalu-what-is-significance-of-telangana-bonalu-festival-1169276 |archivedate=1
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-02-27. Retrieved 2020-01-07.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-09-23. Retrieved 2009-08-29.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-11. Retrieved 2009-08-29.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-14. Retrieved 2009-08-29.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-07-12. Retrieved 2009-08-29.
  10. http://www.expressbuzz.com/edition/story.aspx?Title=Secunderabad+awash+in+Bonalu+colours&artid=nL%7Co77EMwEg=&SectionID=e7uPP4%7CpSiw=&MainSectionID=fyV9T2jIa4A=&SectionName=EH8HilNJ2uYAot5nzqumeA==&SEO=[permanent dead link]
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2009-08-29.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-24. Retrieved 2009-08-29.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-06. Retrieved 2009-08-29.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బోనాలు&oldid=4353499" నుండి వెలికితీశారు