అట్లతద్ది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆశ్వయుజ బహుళ తదియనాడు పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరు ఉయ్యాల పండుగ అనీ,గోరింటాకు పండుగ అనీ అంటారు.గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.

అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.[1]

వ్రతవిధానము[మార్చు]

అట్లతద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు.అట్లతద్ది రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు.ఇంటిలో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసిన గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరము తిరిగి గౌరీపూజ చేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు.ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.[2][3]

అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్

చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు

అట్లతద్ది కథ[మార్చు]

పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది. అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమార్తే, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతి రోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్లతద్ది వచ్చింది.రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు. పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నిరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి, అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని, విశ్రాంతి తీసుకోమని చెబుతాడు.

అన్న మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుని చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమా వ్రతం అనే పేరు వచ్చింది. చంద్రుని చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకోని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి, ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలి వాడితో ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా! ఇలా ఎందుకు జరిగిందని? ఆలోచిస్తూ, బాధపడుతూ, దేవత మూర్తి అయిన పార్వతీ, పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది.

అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు అశ్వయుజ బహుళ తదియ ఉన్నది. ఆ రోజున చంద్రోదయ ఉమా వ్రతం చేసి, గౌరీమాతను భక్తిశ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు. అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకుని అక్షింతలు తెచ్చి భర్త పై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు. పెళ్లయిన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు.సృష్టికి, స్థితిగతులకు, లయలకు కారణమైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరి భార్యలైన సరస్వతీ, లక్ష్మీ,పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసేది అశ్వయుజ మాసం. అందువల్ల ఈ అట్లతద్ది పండుగను చేస్తారు. అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం. కనుక యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడిన, పాడిన వాళ్లంతా అమ్మవారిని సేవిస్తున్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి.

అట్లతద్ది అంతరార్ధం[మార్చు]

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది. దీనినే ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు, పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ,విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నేల పొడవునా ఉత్సాహం సాగే మాసం ఈ ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు.

మూలాలు[మార్చు]

  1. "అట్లతద్ది నోము (Atla Taddi Nomu)". TeluguOne Devotional (in english). 2020-01-21. Archived from the original on 2019-11-24. Retrieved 2020-01-22.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "అట్లతద్ది నోము ఎవరు చేయాలి? ఎలా జరుపుకోవాలి?". www.10tv.in (in ఇంగ్లీష్). Retrieved 2020-01-22.[permanent dead link]
  3. "సౌభాగ్య సిద్ధి.. ఆటపాటల అట్లతద్ది". EENADU. Archived from the original on 2021-10-23. Retrieved 2021-10-23.

4. అట్లతద్ది విశిష్టత తెలుసా? Archived 2022-10-12 at the Wayback Machine Telugu.thefinexpress.com (in Telugu) Revised 2022-10-12.