నోము

వికీపీడియా నుండి
(వ్రతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే వ్రతము అని కూడా అంటారు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి. తెలుగు భాషా ప్రాంతాలలో స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉంది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు ఉన్నాయి.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా ఉన్నాయి. త్రిలోక సంచారియైన నారదుడు చెప్పినవి కొన్ని ఉన్నాయి. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..

కొన్ని నోములు

[మార్చు]

వ్రత కథలు

[మార్చు]

చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు వ్రత కథలు పుస్తకాన్ని రచించి దీని మొదటి ముద్రణను చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అండ్ సన్సు ద్వారా 1952 లో ముద్రించారు.[1] దీనిలో సుమారు 11 ప్రసిద్ధిచెందిన వ్రతకథల్ని పద్యరూపంలో పొందుపరిచారు.

  • శ్రీ సత్యనారాయణ వ్రతము
  • శ్రీ మంగళగౌరీ వ్రతము
  • శ్రీ వినాయకచతుర్థీ వ్రతము
  • శ్రీ కేదారేశ్వర వ్రతము
  • శ్రీ కార్తీకసోమవార వ్రతము
  • శ్రీ స్కందషష్టీ వ్రతము
  • శ్రీ సావిత్రీగౌరీ వ్రతము
  • శ్రీ శివరాత్రి వ్రతము
  • శ్రీ నందికేశ్వర వ్రతము
  • శ్రీ కులాచారావన వ్రతము
  • శ్రీ ఏకపత్నీ వ్రతము

మూలాలు

[మార్చు]
  • నోములు, డి.హలేఖ్య సప్తగిరి సచిత్ర మాసపత్రిక మే 2008 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=నోము&oldid=3154686" నుండి వెలికితీశారు