Jump to content

యజ్ఞం

వికీపీడియా నుండి
(యజ్ఞము నుండి దారిమార్పు చెందింది)

యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయి.

యజ్ఞ విధానం

[మార్చు]

వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "హోత" ఈయన ఆహుతికి పూర్వం మంత్రాల్ని పఠించి దేవతల్ని యజ్ఞాభూమికి తీసుకొస్తాడు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. ఇంకొకరు "బ్రహ్మ" హోతాద్వర్యుల కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే ఈయనపని.పొరపాటు వస్తే సరిదిద్దుతాడు. ఇంకొకరు "అగ్నీత్తు"-బ్రహ్మకు సహకారి. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.

యాగశాల (వనస్థలిపురం)

ఈక్రింద ఇష్టియాగం అను యాగ క్రతువును అనుసరించి వివరించబడింది. ఈ యాగము పౌర్ణము నాడు గాని, అమావాస్యనాడు గాని ప్రతీ గృహస్తుడు చేయవచ్చును. పౌర్ణమినాడు చేయబడితే అది పూర్ణమాసయాగాం, అమావాస్యనాడు చేయబడితే దర్శయాగం.

  • పురోడాశం

ఇది ఒక ప్రధానఅహుతి. అనగా అగ్నికి వేయు ఆహుతి ఇయ్యబడే ద్రవ్యం. ఇది యవలతో (Barley) గాని, బియ్యంతోగాని చెయ్యబడే రొట్టెముక్క; రుబ్బి నిప్పులో కాలుస్తే ఇది తయారవుతుంది. దీన్ని అద్వర్యుడు చేయాలి. ఇది అర్ధవృత్తాకారంలో ఉంటుంది. దీనిని పలు భాగాలుగా ఆహుతి ఈయుటుక విభజిస్తారు. వాటినే చతుష్కోణ కపాలం, ఏకాదశ కపాల భాగాలు అంటారు.

  • వ్రతగ్రహణం

ఇది యాగానికి పూర్వదినం అపరాహ్న (సాయంసంధ్యవేళ) పూర్నాహ్న (తెల్లవారుజాము) సమయములలో చెయ్యాల్సిన క్రియలు. ఇవి యాగానికి సంబంధించిన అగ్నిని ముందుగానే సిద్ధముగా ఉంచుట. ఇవి రెండు విధాలు. వ్రతగ్రహణ, అంవాధానాలు. పూర్వాహ్నంలో యజమాని గార్హపత్యం (శ్రోతగ్ని), ఆహవనీయ, దక్షిణాగ్నుల్లో క్రమంగా ఒక్కొక్క సమిత్తు వేసి, అగ్నిని యజ్ఞానుకూలం చేస్తాడు. నేను రేపు యాగం చేస్తాను సిద్ధంగా ఉండుసుమా అని అప్పుడే అగ్నికి చెప్పి ఉంచటము. అపరాహ్నం క్షుర కర్మచేసుకొని, స్నానం చేసుకొని కొంచెం ఏమైనా తింటాడు. తరువాత అగ్నికి పక్కగా నిల్చి, నేను సత్యాన్నే పలుకుతాను మొదలుగాగల కొన్ని నియమాల్ని పాలించటానికి ప్రతిజ్ఞ తీసుకొంటాడు. పత్నీ సహితంగా రాత్రి యజ్ఞసాలలోనే గడపాలి.

  • వరణం

మరునాడు నిత్యాగ్నిహోత్రకర్మానంతరం ఇది ఋత్విక్కులు వారి వారి దిక్కులను అనుసరించి అగ్నికి అనుకూలంగా కూర్చెడెడి విధానము. ఇందులో ప్రథమం బ్రహ్మ వరణం. వరణానంతరం బ్రహ్మ ఆహవనీయానికి (శ్రోతగ్ని) దక్షిణంగా ఆసనాన్ని స్వీకరించి, కర్మనంతటినీ పర్యవేక్షిస్తాడు. బ్రహ్మకు వామభాగమున యజమాని కూర్చుండే చోటు. యజమాని భార్య గార్హపత్యానికి దక్షిణంగా అధివసిస్తుంది. వేదికకి ఉత్తరంగా హోతా అగ్నీత్తులు ఉంటారు. అధ్వర్యుడు యాగకాలంలో కూర్చోటానికి వీలుండదు. దీనికీ దానికీ కదుల్టు ఉండాలి.

  • ప్రణీత

వరణానంతరం ప్రణీత- ప్రణయకర్మ - కాసిని నీళ్ళను పూర్వముఖంగా తీసుకువెళ్ళి, ఆహవనీయానికి (యజ్ఞవేదికకు తూర్పున చతురస్రంగా ఉండే కుండంలోని అగ్ని; శ్రౌతాగ్నులలో ఒకటి) పక్కగా ఉంచుట. ఈనీటిపేరు ప్రణీత. యాగం ముగిసే వరకు ఆనీరు అక్కడే ఉంచాలి. యజ్ఞ రక్షణార్ధం "జలం అసురులకీ, రాక్షసులుకీ వజ్రం. దీన్ని చూస్తే వాళ్ళు యజ్ఞభూమికి రారు" అని శతపధబ్రాహ్మణం చెబుతుంది.

  • ప్రధాన యజ్ఞవస్తువులు

1. సమింధనము లేదా సమిత్తులు- అనగా యజ్ఞకట్టెలు. అధ్వర్యుడు ఒక్కో సమిత్తును ఆహవనీయంలో వేస్తాడు. హోత ఒక్కో ఋక్-మంత్రాన్ని చదువుతాడు. 2. దర్భకలు-వైదిక కర్మకాండలో ఉపయోగ పడే రెల్లుజాతి తృణాలు. ఇవి పది రకాలు: కుశం, కాశం, యవం, దూర్వం, విశ్వా మిత్రం, ఉసీరం, కుందురం, గోధూమం, వ్రీహి, ముంజం. దర్భలను కృష్ణపక్షమి పాడ్యమినాడు మంత్ర పఠనం చేస్తూ సేకరిస్తారు. దర్భలు మంత్రాలను శక్తిమంతం చేస్తాయనీ, హానికరమైన కిరణాలను, తరంగాలను అడ్డుకుంటాయని కొందరు వైజ్ఞానిక పరిశోధన చేసి ప్రకటించాడు. 3. పురోడాశం 4.ఆవునేయి.

  • దేవతాహ్వానం

హోత సామాన్య మానవుడు. అతడు పిలిస్తే మటుకు దేవతలు ఎందుకు పలుకాలి? అగ్ని స్వయంగా దేవతల హోత. అందువల్ల ఆయన్ని ఆపనికి వినియోగించాలి. మళ్ళా, అగ్ని నెవరు పిలవాలి? హోతాద్వర్యురులు ఇద్దరు అగ్నిని పిలుస్తారు. వీళ్ళ ఆహ్వానన్ని మటుకు అగ్ని ఎందుకు అంగీకరించాలి? ఎందుకు వినాలి? ప్రాచీన ఋషులు మంత్రద్రష్టులు. అలౌకికశక్తి వల్ల లభించిన మంత్రాల్తో వాళ్ళు అగ్నిని పిలిచేవాళ్ళు. అది అగ్నికి వినిపించీ వినపించటంతోనే అగ్ని కదిలివచ్చేవాడు. ఎవరిమట్టుకు వాళ్ళు వారివారి అగ్నినే పిలిచేవాళ్ళు. ఆయా ఋషుల అగ్నిపేరు ఆర్షేయాగ్ని, ప్రవరాగ్ని అని ఇంకోపేరు. దేవతాహ్వానముకోసం చేసిన హోతృవరణం పేరు "ప్రవరణం". వరణానంతరం హోత వేదికకి ఉత్తరంగా కూర్చుంటాడు. హోత ఆసీనుడైన తరువాత యాగం ఆరంభం అవుతుంది.

  • ప్రయాజయాగం

ప్రధానయాగానికి ముందుగా చెయ్యల్సింది ప్రయాజయాగం. ఆహుతి ద్రవ్యం ఆజ్యం. అద్వర్యుడు ఘృతంద్వారా మొదట్లో ఆఘారహోమం చేసి దీనిని చేస్తాడు. 5గురు దేవతల్ని ఉద్దేశించి 5 ఆహుతులు. ఈ దేవతల పేర్లు- సమిత్, తనూనపాత్, ఇడా, బర్హి, స్వాహాకార.

  • ఆజ్యభాగం

ఈ పంచప్రయజానంతరము అగ్నిని ఉద్దేశించి ఒకసారి, సోముణ్ణి మరోసారి ఉద్దేశించి ఆజ్యాహుతి ఇవ్వాలి. దీని పేరు ఆజ్యభాగదానం.

  • ఉపాంశుయాగం

ఆజ్యభాగదానం తరువాత ప్రధానయాగం. అగ్నిని ఉద్దేశించి ప్రథమపురోడాశం. అగ్నిని, సోముణ్ణి ఉద్దేశించి ద్వితీయపురోడాశదానం. ఈ రెంటికీ మధ్య అగ్నిసోములకి కొంచెం ఘృతాహుతి. ఈఘృతాహుతి సమయంలో మంత్రపానం అనుచ్చస్వరంలో జరుగుతుంది.కాబట్టి దీనిపేరు ఉపాంశుయాగం.

  • స్విష్టకృత్తు

రెండు కపాలాల్లో ఉంచిన పురోడాశాన్ని అంతటినీ ఆహుతి వేయకుండా అగ్ని-స్వష్టకృత్తు నుద్దేశించి ఆహుతి నీయాలి.వీరు రుద్ర దేవాతకము. ఈ రుద్రదేవత అంటె ఎంతో భయం. ఇతని బాణాలంటే చెప్పలేనంత భయం. స్పష్టంగా ఇతనిపేరు ఉచ్చరించటానికికూడా జడుపేనట. ఉగ్ర, భీమ, కపర్ది శబ్దాలు ఈ భయానికే సూచనలు. ఇతన్ని సంతోషింపజేయుటకే శంకరుడనే పిలుపు. వేదంలోని ఇతర దేవతలకీ, ఇతనికే ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు దేవతలు ప్రార్ధిస్తే, ఈయన ప్రజాపతి అంతటివాడిమీద బాణాల్ని విసిరాడు. దానికి దేవతలెంతో సంతోషించి, పశుగణానికి ఈయన్ని అధిపతిగా చేశారు. పశుపతి అయినాడు. పూర్వం యజ్ఞభాగాల్లో పాలు ఉండేది కాదు. ఒకసారి ఈయన బలవంతంగా యజ్ఞ భాగాన్ని గ్రహించాడు. అప్పట్నుంచే ఈ స్విష్టకృత్ యాగం ఆరంభంఅయింది.

  • అనుయాజ

ప్రధానయాగానికి పూర్వం ప్రయాజయాగం ఉన్నట్టు, అనంతరం ఈ అనుయాజ.ప్రయాజకు పంచదేవతలు. కాని, అనుయాజకు దేవతలు ముగ్గురే. వీరి పేర్లు-బర్హి, నరాశంస, అగ్ని స్విష్టకృత్తులు.

  • సమాన్యనియమక్రమం

ఈ ప్రధాన యాగాల్ని చేసే కొన్ని నియమాలు. అధ్వర్యుడే యాగకర్త, హోత ఆహ్వానకారి.ఆహావనీయంలోనే ఆహుతిసమర్పణ. అద్వర్యుడి ఆసనం ఆహావనీయానికి ఉత్తరంగా. అక్కడ ఆయన నిలబడి ఉండాలి. ఏ యాగంలోనైనసరే, ఆయన దక్షిణహస్తంతో జుహువును (మోదుగు కర్రతో చేసిన పరికరం. ఆజ్యాన్ని హోమం చేయడానికి ఉపయోగపడే గరిట), వామహస్తంతో ఉపభృత్తు (యజ్ఞాంగ పాత్రము. రావికఱ్ఱతో చేసిన స్రుక్కు) పట్టుకొని వేదికకి ఉత్తరమ్నుండి దక్షిణంగా వస్తాడు.అక్కడ నిలబడి అగ్నీత్తును ఆదేశిస్తాడు : ఓం శ్వావయః. అంటే దేవతలని మంత్రాల్ని వినమని ప్రార్థించు.ఈ అగ్నీత్తు వేదికకి ఉత్తరంగా నిలబడతాడు, చేత్తో ఒక కర్రకాతిని పట్టుకొని. ఈ కర్రకత్తిపేరు "స్ఫ్యః" ఆయన జవాబిస్తాడు: అస్తు శ్రౌషట్. అంటె మంచిది దేవతలు వింటున్నారు అని. అప్పుడు అద్వర్యుడు హోతకాదేశిస్తాడు, దేవతల్ని ఆహ్వానించమని. హోత రెండు మంత్రాలు చదవాలి. ఒకటి అనువాక్యం-ఇది ఋక్ మంత్రం. ఈ మంత్రంవల్ల దేవతల్ని అనుకూలంగా చేసుకుంటారు.ద్వితీయ మంత్రం యాజ్యం. ఇది కొన్నిపట్ల ఋక్కును, కొన్ని పట్ల యజుస్సు. ఇదే యాగమంత్రం. కనుకనే యాజ్యం. హోత మంత్రపఠాన్ని యే యజామహే అగ్నిం దేవం అని ఆరంభిస్తాడు. దీని పేరు అగూః మంత్రం. తరువాత యాజ్యమంత్రాన్ని చదివి అగ్నే విహి ఔషట్ అగ్ని దీన్ని భక్షించి దేవతల దగ్గరకు వెళ్ళు అని అర్ధము. ఈ వషట్కారము ఉచ్చారితమవుతూ ఉన్నప్పుడే అధ్వర్యుడు ఆహుతి ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తాడు. యజమాని ఆహుత్యనంతరము ఇదం అగ్నయే న మమ ఇది నాదికాదు అనే త్యాగ మంత్రాన్ని ఉచ్చరిస్తాడు.

  • హవిర్భక్షణ

ఇది కాకపోతే ఏ యజ్ఞమూ సంపూర్ణంకాదు. పురోడాశాన్ని అంతా ఆహుతి ఇయ్యకూడదు. కొంచెం మిగిలేట్టు చూడాలి. యజమానీ, ఋత్విక్కులు దీన్ని భజిస్తారు. మిగిలిన పురోడాశాన్ని దీని నిమిత్తం కొన్ని ముక్కలుగా భాగిస్తారు. ఒకదాని పేరు ప్రాశిత్రం; దీని బ్రహ్మ భక్షిస్తాడు. ఇంకోదాని పేరు షడవత్తం -అగ్నీత్తుది. ఇంకో ఖండాన్ని మళ్ళా నల్లుగు ముక్కలు చేసి, అధ్వర్యు, హోత, బ్రహ్మ, అగ్నీత్తులు భక్షిస్తారు. ఇంకో రెండు ముక్కలు బ్రహ్మ, యజమానీ దాని భక్షిస్తారు.

  • ఇడాభక్షణ

ఈపురోడాశఖండాల్లో కొన్నిటిని ఘృతాక్తం చేయాలి. వీటిపేరు ఇడ. యజమాని, 4 ఋత్విక్కులు దీనిని భక్షిస్తారు. అసలు హవిస్సేష భక్షణే చాలా ముఖ్యం. అందులో మళ్ళీ ఇడా భక్షణ మరీ ముఖ్యం. ఈ ఇడలో ఒక భాగాన్ని హోత తింటాడు- అది అవాంతర ఇడ. ఈహవిశ్శేషభక్షణానుష్ఠానం స్విష్టకృత్తు యాగానికి తర్వాత, అనుయాగ-యాగానికి ముందు. కేవలం బ్రహ్మ, యజమాని లిద్దరు యజ్ఞం పూర్తికాగానే తింటారు.

  • సమాప్తిక్రమం

ప్రస్తర మనబడే దర్భకట్టతో యజమానశరీరాన్ని ఏకంగా భావించాలి. అనుయాజ యాగానంతరం ఈ ప్రస్తరాన్ని ఆహవనీయాగ్నిలో పడేయ్యాలి. ఇది కాలిపోతున్నప్పుడు యజమాని స్వర్గానికి వెళుతున్నట్టు. సంపూర్ణంగా దగ్ధమైతే, యజమాని స్వర్గలోకంలో దేవతల్తో ఐక్యమైనట్టు. ప్రస్తరం కాలిపోతున్నప్పుడు, హోత అధ్వర్యుడి అనుజ్ఞతో కొన్ని మంత్రాల్ని చదువుతాడు. వీటి పేరు సూక్తవాక్కు.పూర్తిగా కలిపోయినాక మరికొన్ని మంత్రాలని చదువుతాడు వీటి పేరు శంయూవాక్కు. ఇవి ఆశీర్వాద సుచకాలు.

పరిధి అనబడే సంత్కాష్ఠఖండత్రయంలో, మానవహోత దేవహోతను పిలుచుకువచ్చిన దానిని లిపిన దర్భ పేరు పరిధి. వీటిని కూడా అగ్నిలో వేయాలి. అప్పుడు దేవహోత యజ్ఞస్థలం నుంచి వెళ్ళిపోతాడు.

  • సంస్రవం

ఈ సమయంలో అధ్వర్యుడు విశ్వదేవతల నుద్దేశించి, కొంచెంగా ఆజ్యాన్ని ఆహుతి ఇచ్చి హోమం చేస్తాడు. దీని పేరు సంస్రవహోమం. ఇది యాగం కాదు, హోమం. దీంతో యజమాని అనుష్ఠానం సమాప్తం.

  • పత్నీకృత్యం

ఇంతవరకూ ఒపికగా గార్హపత్యాగ్ని ప్రక్కగా కూర్చున్న యజమాని భార్య దగ్గరకు బ్రహ్మ కాక మిగిలిన ముగ్గురు ఋత్విక్కులు వచ్చి, గార్హపత్యాగ్నిలో కొన్ని ఆహుతులు వేస్తారు. ఆహుతి ద్రవ్యం ఆజ్యం. దేవతలు: సోముడు, త్వష్ట, దేవపత్నీగణం, అగ్ని-గృహపతి. ప్రధానయాగానంతరం హవిర్భక్షణ జరిగినట్టే ఇప్పుడు కూడా జరగాలి.

  • సమష్టిహోమం

దక్షిణాగ్నిలో ఇంతవరకూ ఒక్క ఆహుతి కూడా పడలేదు. కనుక, అధ్వర్యుడు దక్షిణాగ్నిలో ఆజ్యహోమాన్ని చేస్తాడు. పురోడాశం చేయ్యగా మిగిలిన కొంచెం రుబ్బుడు పిండిని, విశ్వదేవతల నుద్దేశించి అగ్నిలో వేస్తారు. దేవహోత ఆహ్వానాన్ని అనుసరించి యజ్ఞక్షేత్రానికి వచ్చిన దేవతలందరూ ఇంకా వెళ్ళిపోలేదు. అధ్వర్యుడు వీళ్ళందరి నిమిత్తమూ ఆజ్యాహుతుల్ని ఆహనీయంలో వేస్తాడు. అప్పుడు వాళ్ళు సంతుష్టులై వెళ్ళిపోతారు. దీనిపేరు సమష్టియజుర్హోమం.

  • రాక్షసులకు

వేదికమీద పరచబడిన దర్భలనన్నిటినీ ఆహవనీయంలో పడవేస్తారు. ప్రణీతా-జలాన్ని వేదిమీద పొయ్యాలి. పురోడాశం తయారుచెయ్యటంలో వచ్చిన ఊక, తవుడు చిట్టు మొదలైనవి రాక్షసులకు ప్రాప్యం. దీంతోనే వాళ్ళు సంతోషిస్తారు. రాక్షసుల్ని ఉద్దేశించి వాటిని విసర్జించాలి.

దీంతో యజ్ఞం ముగుస్తుంది.

  • ప్రక్రమణ

ఈ యజ్ఞ నిర్వహణఫలంగా యజమాని దైవత్వాన్ని పొందాడు. అంతేకాదు దేవతల్లో సర్వశ్రేష్ఠుడైన విష్ణువుపదాన్ని పొదటానికే అతడిప్పుడు అభ్యర్థి. విష్ణువు త్రిపదవిన్యాసంతో మూడులోకాల్ని ఆక్రమించాడు అని భావించి యజమాని యజ్ఞస్థలంలో మూడు అడుగులు వేసి, తూర్పుగా ఆహవనీయం వరకు ప్రక్రమిస్తాడు. దీనిపేరు విష్ణుక్రమ ప్రక్రరణ. పూర్వదిక్కు దేవతల స్థానం. యజమాని తూర్పుగా తిరిగి చూస్తూ నేను జ్యోతిలో గమనమొనరుస్తున్నాను, జ్యోతిలో కలిశాను అనే అర్ధం గల మంత్రాన్ని జపిస్తాడు.

  • వ్రత విసర్జన

యజమాన్ని గార్హపత్య ఉపస్థానమూ, సూర్యోపస్థానమూ జరిపి గృహపతి అయిన అగ్నీ! నేను స్వగృహపతిని అవుతాను అగుగాక అని అంటాడు. తర్వాత, పుత్రుడు పేరు చెప్పి, నా ఈ పుత్రుడు ఈ కర్మనీకు అనుక్రమంగా విస్తరిల్లాజేస్తాడుగాక. అని ప్రార్ధిస్తాడు.

విసర్జనానంతరము యజమాని బ్రహ్మతో కలిపి యజ్ఞశాలకు బయటకు వచ్చి, తమకోసం అట్టేపెట్టిన పురోడాశాభాగాన్ని స్వీకరిస్తారు.

సర్వశేషంగా బ్రహ్మ ఆహవనీయంలో సమిత్ఖండాల్ని వేసి, పూర్ణమాసేష్టిని సమాప్తం చేస్తాడు. యజ్ఞాంతంలో ఋత్విక్కులకు దక్షిణ ఇవ్వాలి.

వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞము విష్ణు స్వరూపము.

యజ్ఞము, యాగము, హోమము, క్రతువు

[మార్చు]

యాగానికి, హోమానికి తేడా ఉంది. యాగంలో ఆహుతి ఇచ్చేది అధ్వర్యుడు; మంత్రాల్ని పఠించేది హోత. మంత్రాంతంలో ఉచ్చరించబడే వౌషట్ శబ్దమే వషట్కారం. ఈ వషట్కారోచ్చరణకాలంలోనే అధ్వర్యుడు అగ్నిలో ఆహుతుల్ని వ్రేలుస్తాడు. ఈ క్రమంతో కూడినది యాగం.

హోమరీతి ఇంతకంటేకూడా సంక్షిప్తం. దీనికి హోతతో పనిలేదు. అధ్వర్యుడు అగ్ని పార్స్వాన ఆసీనుడై, తనే యజుర్మంత్రాల్ని చదువుతాడు. మత్రాంతన స్వాహా శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. ఇదే స్వాహాకారం.ఇది ఉచ్చరిస్తున్నప్పుడు ఆహుతిని వేస్తాడు. ఇది హోమ క్రమము.

యజ్ఞాలలో రకాలు

[మార్చు]

యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు [1].

యజ్ఞం (వనస్థలిపురము)
  1. పాక యజ్ఞాలు - ఇవి మళ్ళీ ఏడు విధాలు
    1. ఔపాసన
    2. స్థాలీపాకము
    3. వైశ్వదేవము
    4. అష్టకము
    5. మాస శ్రాద్ధము
    6. సర్పబలి
    7. ఈశాన బలి
  2. హవిర్యాగాలు - వీటిలో కూడా ఏడు రకాలున్నాయి.
    1. అగ్నిహోత్రాలు
    2. దర్శపూర్ణిమాసలు
    3. అగ్రయణం
    4. చాతుర్మాస్యాలు
    5. పిండ, పితృ యజ్ఞాలు
    6. నిరూఢ పశుబంధము
    7. సౌత్రామణి
  3. సోమ సంస్థలు - వీటిలో ఏడు రకాలు
    1. అగ్నిష్ఠోమము
    2. అత్యగ్నిష్ఠోమము
    3. ఉక్థము
    4. అతిరాత్రము
    5. ఆప్తోర్యామం
    6. వాజపేయం
    7. పౌండరీకం

కొన్ని యజ్ఞాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. శ్రీ కైవల్య సారథి విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=యజ్ఞం&oldid=4010923" నుండి వెలికితీశారు