సర్పయాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్పయాగం

మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం. పాండవుల అనంతరం పరీక్షిత్తు, పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు. అయితే మహాభారతం కథ ప్రారంభంలో ఆది పర్వములోనే సర్పయాగం ఉదంతం వస్తుంది. నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్పాడు. ఉదంకోపాఖ్యానంతో ఈ వృత్తాంతం ప్రారంభమౌతుంది.


పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. అందువలన అతను తక్షకుని పట్లా, నాగజాతిపట్లా కుపితుడయ్యాడు. జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేశాడు. జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. (ఇక్కడ భారతంలో గరుత్మంతుని వృత్తాంతం కూడా చెప్పబడింది.)


సర్పయాగం తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. "సహేంద్ర తక్షక స్వాహా" అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు.


వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జరత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్ధం కారణజన్ముడై జనించాడు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సయానికి ఆస్తీకుడు అక్కడికి వెళ్ళి, జనమేజయుని మెప్పించి, దక్షిణగా యాగాన్ని నిలుపు చేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు యాగాన్ని ఆపించేశాడు.



మహాభారతంలో ఈ యాగసందర్భంగా చెప్పబడిన సుపర్ణుని (గరుత్మంతుని) కథ విన్నవారికి శ్రీ సంపదలు కలుగుతాయని, పాపము నశిస్తుందని, సర్ప-రాక్షస బాధలు తొలగుతాయని ప్రతీతి. అలాగే ఆస్తీకుని కథ విని, ఆస్తీకుని స్మరిస్తే వారికి నాగజాతివలన ఎటువంటి ప్రమాదమూ కలుగదని, విషజ్వరాదికాలు సోకవని వాసుకి ఆస్తీకునికి వరమిచ్చాడు.ఈ అస్తీకుని కథ విన్న వారికి సకల పాపములు పటాపంచలు అవుతాయని మహాభారతంలో నన్నయ్య సెలవిచ్చారు. బ్రాహ్మణుల సర్పయాగ మంత్రాల యొక్క ప్రభావం చేత హోమకుండం లో సర్పరాజులు భీతి నొందుతూ పడ్డారు. మొత్తం సర్పరాజులందరూ నశించారు. వాసుకి కులంలో పుట్టిన వారునూ , తక్షక వంశంలో పుట్టిన వారున్నూ , ఐరావత సర్ప రాజ కులంలో పుట్టిన వారున్నూ, కౌరవ్యుడనే సర్పరాజ కులంలో పుట్టిన వారున్నూ ,ధృతరాష్ట్ర సర్పరాజ కులంలో పుట్టిన వారున్నూ లక్షలాది మంది సర్పాలు ఈ హోమ కుండంలో పడి నశించిరి. ఒక తక్షకుడనే సర్ప రాజు తప్ప మిగిలిన వారు నశించిరి. తక్షకుడు ఇంద్రుడి శరణు జొచ్చి ఎలాగైననూ ఈ సర్పయాగమును ఆపమని అర్థించాడు. తల్లి యైన కద్రువ శాపం గూడా ఈ సర్పయాగమునకు కారణము అయినది.అప్పుడు ఇంద్రుడు అస్తీక మహా మునిని పిలిపించి జనమేజయుడి చేత ఈ సర్ప యాగాన్ని ఎలాగైనా మానిపించమని కోరాడు. అస్తీకుని అభర్థన మేరకు జనమే జేయుడు ఈ సర్పయాగాన్ని విరమించాడు.


ఈ సర్పయాగం కథ ఆ సమయంలో కురువంశపు రాజులకు, నాగజాతి వారికి జరిగిన సంఘర్షణకు కథాకల్పితరూపమని కొందరి అభిప్రాయం.

మూలాలు

[మార్చు]


వనరులు

[మార్చు]
  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - వ్యవహారికాంధ్ర వచనము - రచన: బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి (2001)
"https://te.wikipedia.org/w/index.php?title=సర్పయాగం&oldid=3787951" నుండి వెలికితీశారు