Jump to content

కేనోపనిషత్తు

వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
కేన ఉపనిషత్తు రాతప్రతి శ్లోకాలు 1.1 నుండి 1.4, సామవేదంనుండి

ముక్తికోపనిషత్తు పేర్కొన్న ఉపనిషత్తులలో కేనోపనిషత్తు రెండవది. కేన అనగా ఎవరు ? అని అర్ధము. భగవానుడు ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది .

"కేనేషితం పతతి..." అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందుకే దీనికి "కేనోపనిషత్తు" అని పేరు వచ్చింది. ఇది నాలుగు భాగములుగా విభజింపబడి, మొదటి భాగమునందు 9 మంత్రములు, రెండవ భాగమునందు 5 మంత్రములు, మూడవ భాగమునందు 12 మంత్రములు, నాలుగవ భాగమునందు 9 మంత్రములు ఉన్నాయి.

శాంతి మంత్రం

[మార్చు]

ఈ ఉపనిషత్తుకు రెండు శాంతి మంత్రాలున్నాయి. గురుశిష్యులిరువురూ ఏకకాలంలో పఠిస్తారు.

ఓం
సహనావవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవా వహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషా వహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

రెండవ శాంతి మంత్రాన్ని ఆకాంక్షా మంత్రాలు అంటారు. అంటే తాము ఏ విధంగా ప్రవర్తించాలో సంకల్పం చెప్పుకునే కోర్కెల వంటి మంత్రాలు.

ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్‌ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణిచ సర్వాణి|
సర్వం బ్రహ్మౌపనిషదం మాఌ హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మే ఌ స్తు|
తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తేమయిసన్తు తేజమయి సన్తు||

నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్ళు, చెవి, అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక. నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మ నిరాకరణం కనీసం నాలో లేకుండు గాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమ గుణాలు ఆత్మ నిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకల ధర్మములు నెలకొనుగాక!

ప్రథమ భాగము

[మార్చు]
కేనేషితం పతతి ప్రేషితం మనః
కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః |
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయుదక్తి || 1

మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది?[1]

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః |
చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి || 2

ఆత్మ శక్తి వలననే చెవి వింటుంది. కన్ను చూస్థుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పని చేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.

నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్ గచ్చతి నోమనః |
న విద్యో న విజానీయో యథైవ దనుశిష్యాత్ || 3

ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతికూడా మాకు తెలియదు.

అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |
ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే || 4

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. తరువాత అది తెలియనిదానికంటే అతీతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం.

యత్ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5

మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.

యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే|| 6

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 7

కన్నులు చూడజాలనిదికాని దృష్టిని చూసేది - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 8

మానవుడు చెవిద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుచున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే|
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 9

మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

ద్వితీయ భాగము

[మార్చు]
యది మనస్యే సువేదేతి దభ్రమేవాపి
నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ |
యదస్యత్వం యదస్య దేవేష్యథను
మీమాంస్య మేవతే మన్యే విదితమ్||

గురువు: బ్రహ్మ తత్వాన్ని గురించి బాగానే తెలుసుకున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నువ్వు తెలుసుకున్నది చాలా స్వల్పం. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మం యొక్క రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మాన్ని గూర్చి నువ్వు ఇంకా తెలుసుకోవలసి ఉంది.

శిష్యుడు: (మళ్ళీ చింతన చేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని ) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను.

నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ|
యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతొ వేద చ|| 2

నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా. నా తోటి విద్యార్థులలో అది తెలియనిది కాదు అనీ, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు.

యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః|
అవిజ్ఞాతాం విజానతాం విజ్ఞాత మవిజానతామ్|| 3

ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలియదని భావించునో వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో వాడు దాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మవేత్తలు రెండు తెగలు. బ్రహ్మము తెలిసినది అనుకొన్నవారు. వీరికి బ్రహ్మము తెలియనిది. కాని రెండవ తెగవారు బ్రహ్మము తెలియదు అనుకొనువారు. వీరికి బ్రహ్మము తెలియును.

ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విదన్తే|
ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతే మృతమ్|| 4

మనస్సు చెందే ప్రతీ వికారంద్వారా దాన్ని స్ఫూర్తిగోచరం చేసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు. జ్ఞానంద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

ఇహ చేద వేదీ దథ సత్యమస్తి
న చేదిహావేదీ న్మహతీ వినష్టిః |
భూతేషు భూతేషు విచిత్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి || 5

ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్న్ట్లట్లయితే ఆపైన నిజమైన జీవితం ఉంది. ఇక్కడ సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షించుకుంటూ ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.

తృతీయ భాగము

[మార్చు]
బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే తస్యహ
బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త |
త ఐక్షన్తాస్మాకమేవాయం విజయో
స్మాకమేవాయం మహిమేతి || 1

ఆచార్యుడు: బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు (రాక్షసులపైన) విజయం సాధించిపెట్టిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా దానివలన దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం, మాదే ఘనత అని దేవతలు తలపోసారు.

తద్దైషాం విజజ్ఞౌ తేభ్యోహ ప్రాదుర్భభూవ |
తన్న వ్యజానత కిమిదం యక్షమితి || 2

దేవతల ఈ గర్వాన్ని బ్రహ్మం తెలుసుకున్నది. వారి ఎదుట దివ్యతేజమై సాక్షాత్కరించింది.కాని ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు.

తేఌగ్ని మబ్రువన్, జాతవేద; ఏతథ్ |
విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి || 3

దేవతలు అగ్నిదేవునితో "ఓ జాతవేదుడా (సర్వజ్ఞుడు) ఆ అపురూపమయిన శక్తి ఏమిటో తెలుసుకో" అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు.

తదభ్యద్రవత్, తమభ్యవదత్ కోఌ సీతి, అగ్నిర్వా |
అహమస్మీతస్య బ్రవీజ్ఞాతవేదా వా అహమస్మీతి || 4

అగ్ని ఆ దివ్యశక్తి వద్దకు వేగంగా వెళ్ళాడు. నీవెవరివని ఆ శక్తి అతణ్ణి ప్రశ్నించింది. "నేను అగ్నిని. సర్వజ్ఞుణ్ణి" అని అగ్ని బదులిచ్చాడు.

తస్మిం స్వ్యయి కింవీర్య మిత్యపీదం సర్వం |
దహేయం యదిదం పృథి వ్యామితి|| 5

ఐతే నీలో ఏ శక్తి ఉంది అని ఆ దివ్యశక్తి అడిగింది. "భూమిమీద ఏమి ఉందో దానినంతటినీ నేను దహించివేయగలను" అన్నాడు అగ్ని.

తస్మైతృణం నిదధావేతద్ దహేతి
తదుపప్రేయాయ సర్వ జవేనతన్న|
శశాకదగ్ధుం స తత ఏవ నివవృతే నైత
దశకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి || 6

ఆ దివ్య శక్తి అగ్ని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి కాల్చు అన్నది. అగ్ని తన యావచ్ఛక్తితో ప్రయత్నించాడు. కాని ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు దేవతల వద్దకు మరలిపోయి "ఆ అపురూపమయిన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను" అన్నాడు.

అథవాయు మబృవన్, వాయువేతద్|
విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి|| 7

అప్పుడు దేవతలు వాయువుతో "ఓ వాయుదేవా ఈ అసాధారణ శక్తి ఏమిటో కనుక్కో" అన్నారు. అతడు దానికి అంగీకరించాడు.

తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోఌసీతి |
వాయుర్వా అహ మస్మీత్యబ్రవీన్మాతరిశ్వా వా అహమస్మీతి|| 8

వాయువు ఆ అసాధారణ శక్తివద్దకు వేగంగా పోయాడు. ఆ శక్తి "నీవెవరు" అని అడిగింది. "నేను వాయువును. గాలికి ప్రభువును" అని అతడు సమాధానం చెప్పాడు.

తస్మిం స్త్వయి కిం వీర్యమిత్యపీదం|
సర్వమాదదీయ యదిదం ఫృథివ్యామితి|| 9

"ఐతే నీలో ఎ శక్తి ఉంది?" అని ఆ దివ్యశక్తి అడిగింది. "భూమిమీద ఉన్నదేదయినా నేను ఎగురగొట్టగలను" అన్నాడు వాయుదేవుడు.

తస్మైతృణం నిదధాతే తదాదత్త్వే తి
తదుపప్రేయాయ సర్వజవేన, తన్న శశా|
కాదాతుం, స తత ఏవ నివవృతే నై తద
శకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి || 10

ఆ దివ్య శక్తి వాయువు ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు తన సర్వశక్తినీ ప్రయోగించాడు కానీ ఆ గడ్డిపోచ కదలలేదు. అందుచేత దేవతల వద్దకు మరలిపోయి "ఆ అపురూపమయిన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను" అన్నాడు.

అథేంద్రమబ్రువన్, మఘవన్నే
తద్విజానీహి, కిమేతద్|
యక్షమితి; తథేతి; తదభ్య
ద్రవత్; తస్మాత్ తిరోదధే|| 11

అప్పుడు దేవతలు ఇంద్రుడితో "ఓ దేవేంద్రా! ఈ అపురూపయిన శక్తి ఏమిటో తెలుసుకో" అన్నారు. ఇంద్రుడు సరేనన్నాడు. ఆ శక్తివద్దకు త్వరత్వరగా వెళ్ళాడు. కాని దివ్యశక్తి అతని ఎదుటనుండి అంతర్ధానమైంది.

స తస్మిన్నే వాకేశే స్త్రియ
మాజగామ బహుశోభమానాముమాం|
హైమవతీం; తాం హోవాచ
కిమేతద్ యక్షమితి|| 12

ఆకాశ స్థలంలోనే ఇంద్రుడు అత్యంత అద్భుత సౌందర్యవతియైన ఒక యువతిని, హిమవంతుని కుమార్తెను చూసాడు. ఆమెను అడిగాడు ఈ దివ్యశక్తి ఏమిటని.

చతుర్థ భాగము

[మార్చు]
సా బ్రహ్మేతి హోవాచ
బ్రహ్మణో వా ఏతద్ విజయే|
మహియధ్వమితి; తతోహైవ
విదాఞ్చాకార బ్రహ్మేతి|| 1

ఆచార్యుడు: అది బ్రహ్మం అనీ, బ్రహ్మం విజయంవలన కదా మీరు మహిమాన్వితులయ్యారు అని ఉమాదేవి అన్నది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు.

తస్మాద్ వా ఏతే దేవా అతితరా
మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా|
యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే
హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి || 2

అందుచేతనే కదా ఈ దేవతలు - అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించింది. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు.

తస్మాద్ వా ఇంద్రోఌ తితరా
మివాన్యన్ దేవాన్; సహ్యేనన్నే|
దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్
ప్రథమో విదాంచకార బ్రహ్మేతి|| 3

ఇంద్రుడు ఈ బ్రహ్మాన్ని సమీపంలో స్పృశించాడు. అందుచేతనే కదా ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించింది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో అతడే ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.

తస్త్వైష ఆదేశః యదేతద్ విద్యుతో వ్యద్యుతదా|
ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్|| 4

బ్రహ్మం వర్ణన ఇది: అహో! మిరుమిట్లు గొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే.మనిషిని రెప్పలు ఆర్పేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది.

అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ|
మనోఌనేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్పః|| 5

ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుంచి దాని వర్ణన గురించి; ఆ బ్రహ్మం వలననే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం ఉంచుకుంటుంది. వస్తువులను ఊహించుకుంటుంది.

తద్ధ తద్వనం నామ
తద్వనమిత్యుపాసితవ్యం|
సమ ఏతదేవం వేదాభిహైనం
సర్వాణి భూతాని సంవాచ్ఛంతి|| 6

బ్రహ్మం తద్వనం అనీ, అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధింపదగినదనెఎ ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి.

ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్|
బ్రాహ్మీం వవ త ఉపనిషదబ్రూమేతి|| 7

శిష్యుడు: ఆచారవర్యా! నాకు ఉపనిషత్తుని ఉపదేశించండి. ఆచార్యుడు: నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గూర్చిన ఉపనిషత్తు నీకు ఉపదేశించాం.

తస్త్వై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా|
వేదాః సర్వాంగాని సత్య మాయతనమ్|| 8

తపస్సు, నిగ్రహం, నిష్ఠాపూర్వకమైన సర్మ - ఇవి దానికి (ఉపనిషత్తులోని బ్రహ్మ జ్ఞానానికి) మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం.

యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన|
మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి|| 9

నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకొన్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతమూ, మహోన్నతమూ, ఆనందమయమూ అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును దానిలో ప్రతిష్ఠితుడౌతాడు.

మూలాలు

[మార్చు]
  1. నండూరి, రామమోహనరావు (2015). విశ్వదర్శనం - భారతీయ చింతన. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్. p. 19.

బయటి లింకులు

[మార్చు]