కౌశికుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  1. 1. కౌశికుడు అనగా విశ్వామిత్రుడు.
  2. 2. కౌశికుడు ఒకప్పుడు ప్రతిష్ఠానపురమునందు ఉండిన ఒక విప్రుఁడు. ఇతఁడు కుష్టు వ్యాధిచే నీరుగాఱుచు అసహ్యమైన శరీరముతో ఉండఁగా అతని సతి రోఁతపడక పతికి సతతము భక్తియుక్తయై సేవ కావించుచు ధన్యురాలు అని అనిపించుకొనుచు ఉండెను. అట్టి నికృష్టదశను ఉండియు అతఁడు ఒకనాఁడు ఒక వేశ్యను చూచి మోహించి దానిని పొందకోరి ఆకోరికను తన పత్నితో చెప్పఁగా ఆపతివ్రత మతిని ప్రతిభావము ఉంచక ఆరాత్రియే, వలసినధనమును కొని తన పెనిమిటిని మూఁపుపై నిడుకొని ఆవెలయాలి యింటికి పోవుచు ఉండ, దైవయోగమున అపుడు గగనము మేఘములచే కప్పఁబడి ఉండుటఁజేసి మార్గము చొప్పడక ఉండెను. ఆగాఢాంధకారమున దారిని కొఱుతవేయఁబడి ఉండిన మాండవ్యుని, ఆ కౌశికునికాలు ఎట్లో సోఁకెను. అందులకు అతఁడు ఎవనికాలు తనపై సోఁకెనో వాఁడు సూర్యుఁడు ఉదయించుడును చచ్చుఁగాక అని ఉచ్చరించెను. అంత ఆపతివ్రత, కౌశికుఁడు చచ్చిన పక్షమున తనకు వైధవ్యము సంప్రాప్తించును అని ఎంచి, సూర్యుఁడు ఉదయింపక ఉండెడుఁగాక అని పలికెను. దానంచేసి సూర్యుని పొడగానరాక లోకమునకు మిక్కిలి అలజడిపుట్టిన దేవతలు ఎల్లను నలువపాలికి ఏగి మొఱపెట్టుకొనిరి. అపుడు అతఁడు వారలతో మీరు భూలోకమునకు పోయి అత్రిపత్ని అగు అనసూయను ఆశ్రయించితిరేని ఆవిడ ఈ ఆపదను పాపును పొండు అనెను. వారును అట్ల ఆమెచెంతకు పోయి ప్రార్థించిరి. అంతట ఆమె కౌశికుని సదనమునకు ఏతెంచి అతని భార్యను బహువిధముల స్తుతించి నీభర్త మృతిచెందినను నవయౌవనాంగుఁడై మరల బ్రతుకును అని వరము ఒసఁగి సూర్యుఁడు ఉదయింపను అనుగ్రహింపవలయును అని వచింపఁగా ఆమె అట్ల కానిమ్ము అనియెను. అప్పుడు సూర్యుఁడు ఉదయింప లోకముల అలజడి పాసెను. కౌశికమునియు మృతుఁడై అనసూయాదేవి మహిమవలన పునర్జీవితుఁడు అయ్యెను. ఇది పాతివ్రత్యమువలని మహిమ.
  3. 3. ఒకానొక ముని. ఇతఁడు నారాయణ కవచమంత్రమును జపించి నిర్మలచిత్తుఁడై యోగధారణను ఒక మరుభూమియందు తనువు విడువఁగా ఆదేహము జీర్ణించి అస్థిమాత్రము అచట పడి ఉండెను. ఆయస్థులకు సరిగా ఉపరిభాగము నందు చిత్రరథుఁడు అను ఒక గంధర్వుఁడు తన విమానముమీఁద పోవుచుండి, తన నీడ ఆయస్థులమీఁద సోఁకినందున, అతఁడు విమానముతోకూడ తలక్రిందుగ క్రింద పడెను. అది వాలఖిల్యముని చూచి ఆగంధర్వునితో నీవు ఈ పుణ్యశల్యములను సరస్వతీ జలముల నిక్షేపణము చేసి కృతస్నానుఁడవుకమ్ము; అట్లయిన నీకు ఊర్ధ్వగమనశక్తి కలుగును అని చెప్పఁగా అతఁడు అట్ల చేసి విమానారూఢుఁడై దేవలోకమునకు చనియెను.

మూలాలు[మార్చు]

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య), 1879.
"https://te.wikipedia.org/w/index.php?title=కౌశికుడు&oldid=2182219" నుండి వెలికితీశారు