Jump to content

రాఖీ పౌర్ణమి

వికీపీడియా నుండి
(రక్షాబంధనం నుండి దారిమార్పు చెందింది)
రాఖీ పౌర్ణమి
రాఖీ పౌర్ణమి
రాఖీలు
అధికారిక పేరురాఖీ పౌర్ణమి
యితర పేర్లురాఖీ
జరుపుకొనేవారుహిందువులు, జైనులు, సిక్కులు, ముస్లిం, బౌద్ధులు, క్రైస్తవులు
జరుపుకొనే రోజుపౌర్ణమి (శ్రావణ పౌర్ణమి)

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు.ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు .

రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే

[మార్చు]

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.[1]

రాఖీపౌర్ణమి చరిత్ర

[మార్చు]
తన సోదరునికి రాఖీ కడుతున్న పాప

ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం

[మార్చు]

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.[2]

శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి

[మార్చు]
సోదరుడుకు రక్షా బంధన్‌కు సందర్బంగా సోదరి బొట్టు పెడుతున్న చిత్రం.

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ " యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల" భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ

[మార్చు]

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు.అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు. [2]

హయగ్రీవావతారం

[మార్చు]

శ్రీ మహావిష్ణువు విజయగాథా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు.


రాఖీ కట్టే విధానం

[మార్చు]

రాఖీపౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు.ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి.అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు.కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితి.రాఖీ కట్టే ముందు యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు.రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదీస్తూ అక్షింతలు వేయాలి.రాఖీ కట్టిన తర్వాత సోదరీ హారతి ఇస్తారు.అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "రక్షా బంధం". Retrieved 3 August 2017.[permanent dead link]
  2. 2.0 2.1 స్త్రీశక్తి. "రాఖీ పౌర్ణమి చరిత్ర, విశిష్టత". www.sthrisakthi.com. Archived from the original on 4 ఏప్రిల్ 2017. Retrieved 3 August 2017.

ఇతర లింకులు

[మార్చు]