పాణిని
ధారావాహిక లోని భాగం |
![]() ![]() |
---|
![]() |
హిందూమత పదకోశం |
సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణంగా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. ఈయన ముఖ్యశిష్యులలో కౌత్సుడు ఉన్నాడు. శిష్యులలో పూర్వ పాణీయులని, అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు. వెయ్యి శ్లోకాలతో అష్టాధ్యాయి శోభిస్తుంది. ఆయన ప్రతిభను పాశ్చాత్య యాత్రికులు చాలామంది ప్రశంసించారు. పాణినీయంలో మూడు రకాల పతక భేదాలున్నాయి. ధాతు పాఠం, గుణ పాఠం ఉపాది పాఠంలో ఇవి బాగా కనిపిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి, అష్టకం, శబ్దాను శాసనం, వృత్తి సూత్రం, అష్టికా అని అయిదు పేర్లున్నాయి. వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది.
జనన కాలం[మార్చు]
పాణిని ప్రస్తుత పాకిస్తాను లోని పంజాబు ప్రాంతం వాడు. ఇతని కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ చాలామంది అంగీకరించింది మాత్రం క్రీ.పూ.2,900 వ సంవత్సరం. ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమే కాదు, సమస్త ప్రాచీన వాజ్ఞయం, భూగోళం, ఆచార వ్యవహారాలూ, రాజకీయం, వాణిజ్యం, ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయనకు తెలిసినవి. పాణినీయంలో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యంలో చెప్పాడు.
ప్రభావం[మార్చు]
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు వార్తికాలు రాశారు. అందులో పతంజలి పేర్కొన్న వారు కాత్యాయనుడు, భరద్వాజుడు, సునాగుడు, క్రోస్ట, బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు. వృత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి అని అర్ధం. వార్తికం అంటే వృత్తికి వ్యాఖ్యానం. వార్తిక కారుడికే వాక్య కారుడు అనీ పేరుంది. ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది. కాత్యాయనుడికే వరరుచి, మేధాజిత్, పునర్వసు, కాత్యుడు అనే పేర్లున్నాయి. పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు. దక్షిణ దేశం వాడు. ఈ విషయాన్ని ఒక సూత్రంలో పతంజలి ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని మహా భాష్యం అంటారు. దీనికే పద అనే పేరు కూడా ఉంది. సూత్రంలో వార్తికంలో అభిప్రాయ భేదం వస్తే పాతంజలీయం మాత్రమే ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి. అందులో భర్తృహరి రాసినది ప్రాచీనమైనది.
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి. పాణిని మేన మామ వ్యాడి అనే ఆయన వ్యాడి సంగ్రహం అనే పేర వృత్తి రాశాడు. విక్రమార్కుని ఆస్థానంలో ఉన్న వరరుచి ఇంకో వృత్తి రాశాడు. జయాదిత్యుడు, వామనుడు కలిసి రాసిన వృత్తికి కాశికా వృత్తి అని పేరు. ఇదీ గొప్ప పేరు పొందినదే. వీరిద్దరూ కాశీలో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది. అతి ప్రధాన వృత్తిగా కాశికా వృత్తికి పేరుంది. దీని తర్వాత చెప్పుకో తగ్గది భర్తృహరి’ అనే పేరుతో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు విమలమతి రాసిన భాగ వృత్తి. 16వ శతాబ్దం వాడైన అప్పయ్య దీక్షితులు సూత్ర ప్రకాశిక అనే వృత్తి రాశాడు. దయానంద సరస్వతి అష్టాధ్యాయీ భాష్యం అనే ప్రసిద్ధ గ్రంథం రాసి సుసంపన్నం చేశాడు.
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు. అందులో కాతంత్ర కారుడు, చంద్ర గోమి, క్షపణకుడు, దేవా నంది, వామనుడు, అకలంక భట్టు, పాల్య కీర్తి, శివ స్వామి భోజ రాజు, బోపదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు. ఇందరు రాసినా పాణినీయానికి ఉన్న ప్రాచుర్యం దేనికీ రాలేదు. పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దంలో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషంగా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషల వ్యాకరణ అభివృధ్ధిలో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.
రచనలు[మార్చు]
తనకు ముందున్న వ్యాకరణ శాస్త్రవేత్తల మార్గంలో నడుస్తూ, బుద్ధి కుశలతతో కొత్త సంవిధానాలను కనిపెట్టాడు పాణిని. బోధనలో సౌకర్యం కోసం వృత్తి కూడా రాశాడంటారు. శబ్ద ఉచ్ఛారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రంథాన్నీ రాశాడు. ఇది కాల గర్భంలో కలిసి పొతే స్వామి దయానంద సరస్వతి మొదలైన వారు ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకొని పునరుద్ధరించారు. ఇందులో ఎనిమిది ప్రకరణలున్నాయి. పాణిని జాంబవతీ పరిణయం అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు. ద్విరూప కోశం అనే చిన్న పుస్తకం, పూర్వ పాణినీయం పేరుతో 24 సూత్రాల గ్రంథమూ రాశాడు. అష్టాధ్యాయిలో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రబద్ధం చేశాడు. ధాతు పాఠంలో క్రియల మూలాల గురించి వివరించాడు .
అష్టాధ్యాయి[మార్చు]
అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అంటారు. ఆ గ్రంథమున ఎనిమిది (8) అధ్యాయములు ఉన్నాయి. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు ఉన్నాయి.
మరణం[మార్చు]
ఒక సింహం ఇతని మీదికి దూకి చంపేసింది అని కథనం. ఏ సంవత్సరం ఏ నెల ఏ పక్షంలో మరణించాడో తెలీదు కానీ మరణించిన తిథి మాత్రం త్రయోదశి. అందుకే అది పాణినీయ అనధ్యాపక దినంగా తర తరాలుగా వస్తోంది. అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి పాఠం చెప్పడు.
భారత ప్రభుత్వం 2004 వ సంవత్సరంలో పాణిని గౌరవార్ధం ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది. కాశీలో పాణిని జన్మ స్థలం నుండి తెచ్చిన మట్టితో కట్టిన పాణిని దేవాలయం ఉంది.
మూలాలు[మార్చు]
- హిందూ మత సంస్కారాలు
- హిందూ మతము
- హిందూ సాంప్రదాయాలు
- భారతీయ గణిత శాస్త్రవేత్తలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- భారతీయులు