Jump to content

వానప్రస్థాశ్రమం

వికీపీడియా నుండి

వానప్రస్థం అంటే "అడవికి ప్రయాణం" అని అర్ధం. ఇది హిందూమతం లోని ఆశ్రమ వ్యవస్థలో మూడవ దశ. ఇది మానవ జీవితంలోని నాలుగు దశల్లో మూడవది. మిగిలిన మూడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. [1]

వానప్రస్థం అనేది వైదిక ఆశ్రమ వ్యవస్థలో భాగం. వ్యక్తి ఇంటి బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించి, సలహాదారు పాత్రను స్వీకరించి, క్రమంగా ఐహిక బంధాల నుండి వైదొలిగడంతో ప్రారంభమవుతుంది. [2] [3] ఈ దశ సాధారణంగా గృహస్థాశ్రమాన్ని అనుసరిస్తుంది. కానీ బ్రహ్మచర్య దశ నుండి గృహస్థ దశను తప్పించి నేరుగా వానప్రస్థాన్ని స్వీకరించవచ్చు. ఇది సన్యాసాశ్రమానికి, ఆధ్యాత్మిక సాధనలకూ నాందిగా ఉంటుంది. [4] [5]

వానప్రస్థ దశ అనేది అర్థ, కామాలకు (సంపద, భద్రత, ఆనందం, లైంగిక కోరికలు) ప్రాధాన్యత ఉండే గృహస్థ జీవితం నుండి మోక్షానికి (ఆధ్యాత్మిక విముక్తి) ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దశగా పరిగణిస్తారు. [6]

వ్యుత్పత్తి

[మార్చు]

వానప్రస్థం అంటే "అడవికి ప్రయాణం" అని అర్ధం. [7]వనం అంటే అడవి, ప్రస్థ అంటే "వెళ్లడం, నివసించడం, ప్రయాణం" అనే రెండు మూలాలతో కూడిన మిశ్రమ పదం. [8] మిశ్రమ పదానికి అక్షరాలా "అడవికి ప్రయాణం" అని అర్థం. [9]

మానవ జీవితంలోని నాలుగు దశలను చర్చిస్తూ చారిత్రక భారతీయ సాహిత్యంలో వానప్రస్థ అనేది అరణ్యకానికి పర్యాయపదమని విడ్గేరీ [10] పేర్కొంది.

వివరం

[మార్చు]

వానప్రస్థం అనేది చతురాశ్రమ అని పిలువబడే ప్రాచీన భారతీయ భావనలో భాగం. జీవితంలో మొదటి దశ బ్రహ్మచర్యం. ఇది సుమారు 25 సంవత్సరాల పాటు ఉంటుంది. రెండవ దశ గృహస్థాశ్రమం, సుమారు 50 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. [11] వానప్రస్థం మూడవ దశ. సాధారణంగా మనుమలు పుట్టడం, తరువాతి తరానికి గృహస్థ బాధ్యతలను అందించడం, సన్యాసి లాంటి జీవనశైలికి మారడం, సమాజ సేవలు ఆధ్యాత్మిక సాధన వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. [11] [12] వానప్రస్థ దశ చివరికి సన్యాసంగా పరివర్తన చెందుతుంది.

వైదిక ఆశ్రమ విధానం ప్రకారం, వానప్రస్థం 50 - 74 సంవత్సరాల వయసులో ఉంటుంది. 

భారతదేశంలోని అనేక ప్రాచీన, మధ్యయుగ గ్రంథాలు మానవుని నాలుగు దశలను చర్చిస్తాయి. ప్రతి ఒక్కటి విభిన్న దృక్కోణాన్ని అందిస్తుంది. కొన్ని కఠినమైనవి, సాహిత్యపరమైనవి, మరికొన్ని సందర్భోచిత, రూపక పరంగా భావనను చర్చిస్తాయి. ఉదాహరణకు, మనుస్మృతి 6.21వ శ్లోకంలో అడవికి చేరిన వ్యక్తి ఏమి తినాలో వివరిస్తూ విశదమైన సూచనలను అందిస్తుంది. [13] దీనికి విరుద్ధంగా, మహాభారతం వానప్రస్థం అనేది ఒక సంకేత రూపకం అని చెబుతుంది. ఒక రాజు అడవిలోకి విరమించకుండా, కొన్ని చర్యల ద్వారా "వానప్రస్థ వస్తువు"ని సాధించవచ్చని ప్రకటించింది. ఉదాహరణకు, శాంతి పర్వం (శాంతి పుస్తకం) ఇలా పేర్కొంది:

యుధిష్ఠిరా తన బంధువులను, మిత్రులను, సేవకులనూ కష్టాల నుండి రక్షించే మహారాజు వానప్రస్థాశ్రమ లక్ష్యాలను సాధిస్తాడు. అత్యుత్తమమైన పురుషులను ప్రతీ సందర్భం లోనూ గౌరవించే మహారాజు వానప్రస్థాశ్రమ లక్ష్యాలను సాధిస్తాడు. పార్థా, మానవులతో పాటు ప్రతీ జీవికీ దానధర్మాలు చేసే మహారాజు వానప్రస్థాశ్రమ లక్ష్యాలను సాధిస్తాడు. ధర్మాత్ములను రక్షించేందుకు ఇతర రాజ్యాలను ధ్వంసం చేసే మహారాజు వానప్రస్థాశ్రమ లక్ష్యాలను సాధిస్తాడు. యుద్ధభూమిలో తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడం గానీ, అందుకోసం వీరమరణం పొందడం గానీ చేసే మహారాజు వానప్రస్థాశ్రమ లక్ష్యాలను సాధిస్తాడు.

—మహాభారతం, శాంతి పర్వం, LXVI అధ్యాయం[14]

గృహస్థు తన సంతానం, తన తల్లిదండ్రులు, తన సంప్రదాయాలను జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, తన మనస్సును శుద్ధి చేసుకున్న తర్వాత జీవితంలోని మూడవ దశ లేదా వానప్రస్థలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాడని మార్కండేయ పురాణం చెబుతుంది. అతను ఈ దశలో పొదుపైన జీవితాన్ని గడపాలి, నేలపై పడుకోవాలి, పండ్లు, దుంపలు మాత్రమే తింటాడు. ప్రాపంచిక ఆనందాలను ఎంత ఎక్కువగా వదులుకుంటాడో, ఆత్మ జ్ఞానానికి దగ్గరగా ఉంటాడు. అతను నాలుగవదైన సన్యాస దశకు మరింత సిద్ధంగా ఉంటాడు. సన్యాసాశ్రమంలో అతను ప్రతిదీ త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెడతాడు.

ప్రాచీన భారతదేశం లోని అనేక ప్రధాన సాహిత్య రచనలలో వానప్రస్థం కనిపిస్తుంది. ఉదాహరణకు, హిందూ ఇతిహాసం రామాయణంలోని అనేక అధ్యాయాలు, మహాభారతం లో లాగానే, వానప్రస్థ, సన్యాసి జీవితాన్ని వివరిస్తాయి. [15] అదేవిధంగా, అభిజ్ఞానశాకుంతలం, అడవిలో సన్యాసి జీవనశైలి చుట్టూ తిరుగుతుంది. వివిధ సంస్కృత రచనలలో పేర్కొనబడిన అనేక పురాణ అటవీ ఆశ్రమాలు, తరువాతి కాలంలో ప్రధాన దేవాలయాలు, హిందూ తీర్థయాత్రలకు స్థలాలుగా మారాయి. [16]

మూలాలు

[మార్చు]
  1. RK Sharma (1999), Indian Society, Institutions and Change, ISBN 978-8171566655, pages 28, 38–39
  2. Ralph Tench and William Sun (2014), Communicating Corporate Social Responsibility: Perspectives and Practice, ISBN 978-1783507955, page 346
  3. Albertina Nugteren (2005), Belief, Bounty, And Beauty: Rituals Around Sacred Trees in India, Brill Academic, ISBN 978-9004146013, pages 13–21
  4. Sahebrao Genu Nigal (1986). Axiological approach to the Vedas. Northern Book Centre. p. 112. ISBN 81-85119-18-X.
  5. Manilal Bose (1998). Social and cultural history of ancient India. Concept Publishing Company. p. 68. ISBN 81-7022-598-1.
  6. Albertina Nugteren (2005), Belief, Bounty, And Beauty: Rituals Around Sacred Trees in India, Brill Academic, ISBN 978-9004146013, pages 13–21
  7. vana Koeln University, Germany
  8. prastha Koeln University, Germany
  9. vanapastha Koeln University, Germany
  10. Alban G. Widgery (1930), The Principles of Hindu Ethics, International Journal of Ethics, 40(2): 232–245
  11. 11.0 11.1 Sahebrao Genu Nigal (1986). Axiological approach to the Vedas. Northern Book Centre. pp. 110–114. ISBN 81-85119-18-X.
  12. What is Hinduism? (Editors of Hinduism Today), Two noble paths of Dharma గూగుల్ బుక్స్ వద్ద, Family Life and Monastic Life, Chapter 10 with page 101, in particular,
  13. Albertina Nugteren (2005), Belief, Bounty, And Beauty: Rituals Around Sacred Trees in India, Brill Academic, ISBN 978-9004146013, pages 13–21
  14. KM Ganguli (Translator), Santi Parva The Mahabharata, Section LXVI, pages 211–214
  15. M Chatterjee (1986), The Concept of Dharma, in Facts and Values (Editors: Doeser and Kraay), Springer, ISBN 978-94-010-8482-6, pages 177–187
  16. NL Dey, The Geographical Dictionary of Ancient and Medieval India గూగుల్ బుక్స్ వద్ద, W Newman & Co, pages 2, 7, 9, 15, 18, 20, 30, 52, etc