అష్టావక్రుడు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అష్టావక్ర మహర్షి | |
---|---|
![]() 19వ శతాబ్దపు తొలినాళ్లలో పాట్నాలో చిత్రించబడిన అష్టావక్రుని చిత్రం. | |
గురువు | ఆరుణి |
సాహిత్య రచనలు | అష్టావక్ర గీత |
ప్రముఖ శిష్యు(లు)డు | జనకుడు, యజ్ఞావ్యల్కుడు |
పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.
తండ్రి శాపం[మార్చు]
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ స్వరము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష[మార్చు]
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నెయ్యి, ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు. వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట[మార్చు]
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన[మార్చు]
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట[మార్చు]
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి[మార్చు]
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం[మార్చు]
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ[మార్చు]
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత.