కణ్వుడు

వికీపీడియా నుండి
(కణ్వ మహర్షి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మేనక విశ్వామిత్రుల కుమార్తె శకుంతలను పెంచిన తండ్రిగా కణ్వ మహర్షి ప్రసిద్ధుడు. కణ్వస అనే గోత్రీకులకు మూలపురుషు డితడు.

పురాణ గాథ[మార్చు]

కణ్వ మహర్షి తపోవనం

కణ్వుడు అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు. కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు. తన తపస్సు నిరాటంకంగా సాగేందుకు అతను మాలిని అనే నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఈ మాలినీ నది హరిద్వార్‌కు దగ్గరలో ఉందని అంటారు. అక్కడ కోట్‌ ద్వారా అనే ఊరిలో కణ్వుడి పేర ఇప్పటికీ ఓ ఆశ్రమం ఉంది. మరికొందరేమో మహారాష్ట్రలోని కణాల్ద (జల్‌గావ్) అనే ప్రాంతంలో ఉన్న గుహలే ఆనాటి కణ్వుడి ఆశ్రమం అని నమ్ముతారు.

అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు దర్శించిన మంత్రాలు మన చతుర్వేదాలలో అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడుగా ‘కణ్వస్మృతి’ పేరుతో ఈయన రచించిన ధర్మశాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంది.[1]

ఇలా మాలినీ తీరాన ఉన్న ఆశ్రమంలో ధార్మిక జీవనాన్ని గడుపుతున్న కణ్వుడి జీవితం ఒక రోజు అనుకోని మలుపు తిరిగింది. అతనికి పక్షుల నీడన పెరుగుతున్న ఓ చిన్న బిడ్డ కనిపించింది. మేనక, విశ్వామిత్రులకు జన్మించిన ఆ బిడ్డకు తన ఆశ్రమానికి తెచ్చుకుని, ఆమెను పెంచి పెద్దచేశాడు కణ్వుడు. ఆమెకు శకుంతల అని నామకరణం చేసాడు. ఆ శకుంతలని ఒకరోజు దుష్యంతుడు అనే రాజు చూసి మోహిస్తాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోతాడు. దుష్యంతుడు తనని సకలలాంఛానాలతో అతని రాజ్యానికి తీసుకుని వెళ్తాడని కలలలో తేలిపోతుంటుంది శకుంతల. అదే మైమరపులో ఆశ్రమంలోకి అడుగుపెట్టిన దుర్వాస మహర్షిని సరిగా గమనించుకోదు. శకుంతల పరధ్యానానికి కోపగించుకున్న దుర్వాసుడు, దుష్యంతుడు ఆమెను మర్చిపోతాడంటూ శపిస్తాడు. ఆ తరువాతి కాలంలో శాపవిమోచనం కారణంగా శకుంతలా దుష్యంతులు కలుసుకోవడం జరుగుతుంది. వారిరువురికీ జన్మించిన భరతుడు దుష్యంతుని రాజ్యానికి వారసుడు అవుతాదు

కణ్వుడు ఈ తీరున ఒక వంశం ఏర్పడేందుకే కాదు, మరో వంశం నిర్మూలం అయ్యేందుకు కూడా కారణం అయ్యాడు. అదెలాగంటే- కణ్వుడు ఒకనాడు విశ్వామిత్రుడు, నారదుడు వంటి మహర్షులతో కలిసి కృష్ణుని పాలనలో ఉన్న ద్వారకకు చేరుకున్నారు. ఈ మహర్షులను చూసిన యాదవ కుర్రకారుకి వారిని కాసేపు ఆటపట్టాలని అనిపించింది. వెంటనే సాంబుడు అనే యాదవుని దుస్తులలో ఒక ముసలం (రోకలి) పుడుతుందనీ, ఆ సంఘటన తరువాత యాదవ వంశం నిర్మూలం అవుతుందనీ శపిస్తాడు కణ్వుడు. శాపవశాన నిజంగానే సాంబుడి కడుపున ముసలం జన్మిస్తుంది. ఆ సంఘటన తరువాత యాదవులంతా తాగి ఒకరితో ఒకరు కలియబడి చంపుకుంటారు. అదే సమయంలో కృష్ణుడు సైతం ఒక వేటగాడి బాణం తగిలి తన తనువుని చాలించాలని నిర్ణయించుకుంటాడు.

మూలాలు[మార్చు]

  1. "కణ్వ మహర్షి ఎవరంటే..." TeluguOne Devotional (in english). 2020-04-11. Retrieved 2020-04-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కణ్వుడు&oldid=3830055" నుండి వెలికితీశారు