Jump to content

అనంత పద్మనాభ వ్రతం

వికీపీడియా నుండి

అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.

ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి

ద్రౌపదితో పాండవులు - రాజా రవివర్మ చిత్రం.

ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.

ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

వ్రతవిధానము

[మార్చు]

శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

ఇవి కూడా చూడండి

[మార్చు]

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం