బ్రహ్మవైవర్త పురాణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మవైవర్త పురాణములో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యముగా పరబ్రహ్మ వ్యాప్తము గురించి చెప్పుచున్నది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణము అన్నారు. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది.

  1. బ్రహ్మ ఖండము - బ్రహ్మాండోత్పత్తి గిరించి, సృష్టి గురించి
  2. ప్రకృతి ఖండము - ఆదిశక్తి గురించి, ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి
  3. గణేశ ఖండము - గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము
  4. శ్రీకృష్ణ ఖండము - పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు

ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు.

బ్రహ్మ ఖండము

[మార్చు]

ఈ ఖండములో సృష్టి క్రమము వివరించబడింది. ప్రళయము సంభవించినపుడు ముల్లోకాలలోను బ్రహ్మతేజస్సు మాత్రం ఉంటుంది. ముల్లోకాళకు పైన గోలోకం ఉంటుంది. గోలోకం దిగువ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడైయుండి సృష్టికార్యం చేస్తాడు. వైకుంఠమునకు వామపార్శ్వమున కైలాసం ఉంటుంది. అందులో పార్వతీపరమేశ్వరులుంటారు

శుద్ధజ్యోతిర్మూర్తియైన పరమాత్ముడు గోలోకంనుండి సృష్టికావించవలెనని సంకల్పించెను. త్రిమూర్తులను, 65 తత్వములను పుట్టించెను. పిదప సృష్టియంతయును జరిగెను.

బ్రహ్మ ఆయుష్కాలమును కల్పము అంటారు. కల్పములు మూడు. 1. బ్రహ్మకల్పము 2. శ్వేతవరాహ కల్పము 3. పద్మ కల్పము. కల్పాంతమున అన్నీ నశించగా ఆదివిరాఠ్టు అయిన పరబ్రహ్మము ఒకడే మిగిలియుండును. మరల కల్పారంభమగును.

ఇంకా ఈ ఖండంలో ఉన్న విశేషాలు

  • ప్రకృత్యోత్పత్తి - శ్రీహరి, ఈశ్వర సంవాదము - శ్రీహరి ఇట్లనెను - "పరమేశ్వరా! ఎట్లు చూచినను నీకును, నాకును భేదమావంతయును లేదు. కావున నిన్నవమానించినవారు నన్నవమానించినట్లే యగును"
  • బ్రహ్మ నారదుని శపించుట - బ్రహ్మ శాపమున నారదుడు ఉపబర్హణుడను గంధర్వుడై జన్మించుట.ఉపబర్హణుని మరణాణంతరము అతని భార్యలు విలపించుట.
  • ఉపబర్హణుని భాఱ్య మాలావతికి శ్రీహరి ఆయుర్వేదమును చెప్పుట - ఆరోగ్య సాధనములు - వాతక్రోప కారణములు
  • నారదుడు శూద్రుని ఇంట పుట్టుట - శ్రీకృష్ణమంత్రమును ధ్యానించుట - తిరిగి బ్రహ్మకు జనించుట

ప్రకృతి ఖండము

[మార్చు]

ఈ ఖండములో తులసి, రమ, సరస్వతి, దుర్గ, రాధ మెదలైన స్త్రీ దేవతల వృత్తాంతాలు, పూజావిధి, వారికి సంబంధించిన ధ్యానము, కవచము మెదలైన విషయాలు చెప్పబడ్డాయి.

బ్రహ్మ, ఈశ్వరుడు, నారాయణుడు చేసిన ఉపదేశముల వలన నారదుడు ఈ సృష్టికంతకును ప్రకృతియే కారణమని తెలిసికొనెను. పరబ్రహ్మము సృష్టిచేయనెంచి తనను తాను రెండుగా విభజించుకొనెను. కుడిభాగము పురుషుడు. ఎడమభాగము స్త్రీయయిన ప్రకృతికాంత. ఆ ప్రకృతి శివునితో కలిసియున్నపుడు దుర్గ, విష్ణువుతో కూడియున్నపుడు లక్ష్మి, బ్రహ్మతో కూడియున్నపుడు సావిత్రి. ప్రకృతి అంశముననే మంగళ, చండి, కాళి, భూదేవి ఉద్భవించారు.

ఇంకా ఇతర విషయాలు

  • యాజ్ఞవల్క్య మహామునికి సరస్వతి వరమిచ్చుట
  • భూదేవికి పుత్రుడై కుజుడు జన్మించుట
  • తులసీ జన్మము - తులసీ శంఖచూడుల వివాహము - శంఖచూడుని మరణము - తులసీమహాత్మ్యము
  • సాలగ్రామ మహిమ
  • మనసోపాఖ్యానము - కశ్యపుని మనస్సునుండి ప్రభవించి బాలిక మనసాదేవి. ఆమెకు జరత్కారి అనే పేరు కూడా ఉంది. - ఆస్తీకుని జన్మవృత్తాంతము
  • దుర్వాసుడు ఇంద్రుని శపించుట
  • తారను చంద్రుడు అపహరించుట

గణేశ ఖండము

[మార్చు]

ఈ ఖండములో గణేశ జన్మ వృత్తాంతము చెప్పబడింది. అంతే కాకుండా పరశురామునికి కార్తవీర్యార్జునునికి మధ్య జరిగిన యుద్ధము వివరింపబడింది. ఈ ఖండములో గణేశ కవచము, దుర్గా కవచము, పుణ్యకవ్రతము మెదలైన విషయాలు చెప్పబడివవి. గణేశునికి గజ ముఖము రావడానికి కారణము, గణపతి ఏకదంతము పొందడానికి కారణము చెప్పబడింది.

శ్రీకృష్ణ ఖండము

[మార్చు]

ఈ ఖండములో శ్రీకృష్ణ జన్మవృత్తాంతము చెప్పబడింది.

బ్రహ్మవైవర్త పురాణములోని సంగ్రహవిషయాలు

[మార్చు]
  • ముందుగా గోలోకవర్ణన జరిగింది.
  • శ్రీకృష్ణుడి నుండి శ్రీమన్నారాయణుడు, మహాదేవుడు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, సరస్వతి, లక్ష్మి, మహాశక్తుల ఆవిర్భావము గురించి వర్ణించబడింది.
  • శ్రీకృష్ణుడి నుండి సావిత్రీదేవి, రతీ మనమధులు, అగ్నిదేవుడు, జలము, వరణదేవుడు, విరట్రూపుడు, మహావిష్ణువు నుండి మధుకైటభుల జననం, భూమి యొక్క ఆవిర్భావం గురించి వర్ణించబడింది.

బయటి లింకులు

[మార్చు]

మూలములు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • అష్టాదశ పురాణములు - వాడ్రేవు శేషగిరిరావు - సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)