Jump to content

శతానంద మహర్షి

వికీపీడియా నుండి

శతానంద మహర్షి గౌతమ మహర్షి, అహల్యకి జన్మించిన నలుగురు పుత్రులలో జేష్టుడు.

జననము

[మార్చు]

గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యమును గడిపిన పిమ్మట అహల్యను ఆదరించి వలసిన కోరిక కోరుమనెను. ఆమె స్త్రీసహజమగు మాతృత్వాన్ని కాంక్షించింది. గౌతముడానందించి యోగబలమున నవయువకుడై అహల్యాకాంత నిండు యౌవనమునకు పండువెన్నెలయై సర్వలోకములందలి మనోహర కేళీవనముల నూరుచోట్ల నూరువిధములగు రత్యానందము నామెను అనుభవింపజేసి ఆమె కోరికను తీర్చెను. ఫలితముగా ఆమె గర్భము ధరించి నవమాసములు మోసి పుత్రరత్నమును పొందెను. అహల్యాగౌతముల శాతవిధానందఫల మగుటచేత అతనికి గౌతముడు "శతానందుడు" అని సార్థక నామకరణము చేసెను.

జీవిత విశేషాలు

[మార్చు]

శతానందుడు తండ్రి గౌతముని వద్దనే సమస్త వేదశాస్త్రాది విద్యలు అభ్యసించి బ్రహ్మచర్యాశ్రమము పాటించుచు మహా తపశ్శాలి అయ్యెను. ఈతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, శీలగౌరవము, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా వుండుమని అర్ధించెను. గౌతమ మహర్షి ఆనందించి, గుణశీలవతి అయిన కన్యామణితో వివాహమొనరించి భార్యాసహితునిగా శతానందుని జనక చక్రవర్తికి కులగురువుగా మిథిలా నగరమునకు పంపెను.

తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించుట, శ్రీరాముని జననము, వనవాసము, యాగ రక్షణ కొరకు విశ్వామిత్రుని వెంట జనుట, శతానందుని తల్లిని శాపవిమోచనము జరిగి శ్రీరాముడు మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతము పలికెను. శ్రీరాముడు శివధనుర్భంగము గావించి సీతను వివాహమాడునపుడు దశరథుని వైపు వశిష్ఠుడు, జనకుని వైపు శతానందుడు గోత్రప్రవరాదులు చెప్పి సీతారామ కల్యాణమును జరిపించిరి.

అతనికి సత్యధృతి అను కుమారుడు కలిగెను. అతడు పుట్టగానే చేత బాణము వుండిన కారణమున ఆతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము విడువక అతని మనస్సు వేదశాస్త్రాది విద్యలందు కంటే ధనుర్వేదమందే లగ్నము కాజొచ్చెను. సత్యధృతి మహాతప మొనరించి ధనుర్వేదమును, వివిధాస్త్రములను సాధించెను. ఇతని తపోభంగమును చెరప, ఇంద్రుడు జాలవతి అను దేవకన్యను పంపెను. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడెను. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందుండి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించిరి. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొనెను. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడిరి కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించెను. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను నేర్పెను. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్థనమున కౌరవ పాండవులకు గురువు అయ్యెను.

మూలాలు

[మార్చు]