స్వామి వివేకానంద
వివేకానంద | |
---|---|
![]() 1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ , ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన , పవిత్రమైనది, ఆలోచనకి , నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను "[1] | |
జననం | నరేంద్రనాథ్ దత్తా 12 జనవరి 1863 కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) |
నిర్యాణము | 4 జులై 1902 బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం) | (వయస్సు 39)
జాతీయత | భారతీయడు |
స్థాపించిన సంస్థ | బేలూరు మఠం, రామకృష్ణ మఠం , రామకృష్ణ మిషన్ |
గురువు | రామకృష్ణ |
తత్వం | వేదాంత |
సాహిత్య రచనలు | రాజయోగ, కర్మయోగ, భక్తియోగ , జ్ఞానయోగ |
ప్రముఖ శిష్యు(లు)డు | స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత,స్వామి సదానంద |
ప్రభావితులైన వారు
| |
ఉల్లేఖన | "లేండి, మేల్కొనండి , గమ్యం చేరేదాక ఆగవద్దు" (మరిన్ని పలుకులువికీఖోట్ లో చూడండి) |
సంతకం | ![]() |
స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఇతనుే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతను జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.
బాల్యం
నరేంద్ర నాథుడు కలకత్తా, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వివెకనందునికి చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం,, ఔదార్య గుణాలు అలవడ్డాయి.
నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.
రామకృష్ణ పరమహంసతో పరిచయం
రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు అతను దగ్గరకు వెళితే వారు అతనుకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతనును కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతను మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు అతనును చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో అతనును తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు అతనును ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. అతను ఆ పాటలు వినగానే అదోవిధమైన తాద్యాత్మత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, అతనుతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.
అతను ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. అతనుకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, అతనుతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనుకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి అతనుకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం అతనును పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనుకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
తండ్రి మరణం
నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బి.ఎ పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.
తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. అతనుకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత అతను శిష్యులందరూ కలిసి బరనగూర్లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
వివేకానందుడిగా మార్పు
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా అతనుకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.
మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ , మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞానశాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.
తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనుకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది .
విదేశాలలో
ప్రధాన వ్యాసం: స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనం ప్రసంగం
జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. అతనుతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు అతను గొప్పతనమేమిటో అర్థం అయింది. అతను సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి , హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు అతనుకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు.[2] స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు అతను దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు.[3] అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు అతను వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు అతను ఆరాధ్యుడయ్యాడు. అతను మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ మూడు గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో అతనును గెలవగలిగిన వారు లేరు.అతను ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.అతనును సజీవంగా చూస్తూ అతను బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.
స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత అతను్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా అతనుకు ఆహ్వానం లభించింది. అతనుకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు అతనును ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది అతనుకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.
నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. అతను తిరిగి వచ్చేసరికి అతను కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 అతను కొలంబోలో దిగగానే అతనుకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి అతను అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.అతను దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో1897లో రామకృష్ణ మఠాన్ని[4] స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది.[5]
ముఖ్య సూత్రములు తత్త్వములు
వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములో నే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము) ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
- సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు.
- స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.
- గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగృతులు కండి.
- దీర్ఘ (?) అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
- ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
- మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.
- స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు
- మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
- ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
- కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు
- మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
- ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..
మరణం
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని అతను శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ అతను ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా అతను రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత అతనుకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అతను శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దు:ఖించారు.
ఉపయుక్త గ్రంథసూచి
- శ్రీ వివేకానంద జీవిత చరిత్ర- శ్రీ చిరంతనానందస్వామి, 4 వముద్రణ, 1978, రామకృష్ణ మఠం, చెన్నపత్నమ్, ముద్రణ నవభారత్ ప్రింటర్స్ & ట్రేడర్స్, మద్రాసు-600086
మూలాలు
- ↑ "World fair 1893 circulated photo". vivekananda.net. Retrieved 11 April 2012.
- ↑ Trip to America
- ↑ The Parliament of Religions
- ↑ రామకృష్ణ మఠము , రామకృష్ణ మిషన్ జాలస్థలి
- ↑ రామకృష్ణ మఠం ఆంధ్ర ప్రదేశ్ శాఖ జాలస్థలి
బయటి లింకులు
![]() |
Wikimedia Commons has media related to Swami Vivekananda. |
- శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె (గోతెలుగు)
- స్వామి వివేకానంద సంపూర్ణ రచనల సంకలనం - అన్లైన్లో
- స్వామి వివేకానంద జీవితం
- పాశ్చాత్య దేశాలలో స్వామి వివేకానంద పర్యటన క్రమం
- 1893లో ప్రపంచ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద - 3 ప్రసిద్ధ ప్రసంగాలు.
- స్వామి వివేకానంద చిత్రాలు
- వివేకానంద కేంద్రం, కన్యాకుమారి
- స్వామి వివేకానంద ప్రసంగాలతో ఉత్తిష్ఠత జాగ్రత్త అనువాద గ్రంథం
- భారతదేశం
- సంఘసంస్కర్తలు
- భారతీయ సంఘ సంస్కర్తలు
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- హిందూ మతము
- ప్రపంచ ప్రసిద్ధులు
- ఆధ్యాత్మిక గురువులు
- 1863 జననాలు
- 1902 మరణాలు
- పశ్చిమ బెంగాల్ వ్యక్తులు