చికాగో

వికీపీడియా నుండి
(షికాగో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

షికాగో అమెరికాలోని ఇల్లినాయ్ [1] రాష్ట్రంలో ఒక నగరం. అమెరికాలో 3వ అతిపెద్ద నగరం. ఇల్లినాయ్, విస్కాన్సిన్, ఇండియానా లతో కలిపి షికాగో నగరపాలిత ప్రాంత జనాభా 9.7 మిలియన్లు. అంతర్జాతీయంగా షికాగోకు కల ప్రాముఖ్యత, ఈ నగరాన్ని అల్ఫా వరల్డ్ సిటీ జాబితాలోకి చేర్చింది. 1837 నుండి షికాగో నగరాల జాబితాలోకి చేరింది. మిసిసీపీ నది తీరాన ఉండటం వలన వ్యాపారానికి అనువైన జలమార్గాలు, సరస్సులు మొదలైన నీటి వనరులు షికాగోను అతి త్వరితగతిన అభివృద్ధి పథానికి నడిపాయి. సాంస్కృతిక, ఆర్థిక, రవాణా రంగంలో మిడ్‌వెస్ట్ (మధ్య పశ్చిమ ప్రాంతం) ప్రాంతానికి చికాగో ప్రముఖ కేంద్రం.

షికాగో డౌన్‌టౌన్
షికాగో డౌన్‌టౌన్ ఆకాశదృశ్యం

నగర చరిత్ర

[మార్చు]

షికాగో నగరానికి ఈ పేరు ఫ్రెంచ్ భాషా పదమైన "షికాక్వా"కు రూపాంతరం. షికాక్వా మయామీ-ఇల్లినాయ్‌ (రెండ్ ఇండియన్ తెగ) ప్రజలలో వాడుకలో ఉన్న పదం. షికాక్వా అంటే ఆంగ్లంలో వైల్డ్ లీక్ (అడవి ఉల్లి). మయామీ-ఇల్లినాయ్‌ భాషలో షికాక్వా వ్యహారనామం. దీనికి శాస్త్రీయ నామం స్ట్రిప్డ్ స్కంక్. ఇది ఎర్రగడ్డ వాసనతో ఉండే ఆహారపదార్ధంగా ఉపయోగపడే మొక్క. ఈ పేరుని ప్రారంభంలో నదికి పెట్టారు. తరువాత ఆపేరు నదీతీరంలో రూపుదిద్దుకున్న షికాగో నగరానికి వచ్చింది. ఫ్రెంచ్ మిషనరీకి చెందిన ఫాదర్ లూయిస్ హెన్నెపిన్ ఉచ్ఛారణ భేదంవలన వచ్చింది. 1663లో ఫాదర్, అన్వేషకుడు అయిన లూయిస్ హెన్నెపిన్ ఒక పటంలో దీనిని షికాగోగా పేర్కొన్నాడు.

18వ శతాబ్దంలో మయామీ, షక్, ఫాక్స్ ప్రజల ప్రదేశాన్ని ఆక్రమించుకుని పొటావతోమీస్ ఇక్కడ స్థిరపడ్డారు. హైతీకి చెందిన జీన్ బాప్టిస్ట్ పాయింట్ డ్యూ సేబుల్ 1770లో ఇక్కడకు మొదటి సారిగా వచ్చి పొటావతోమీస్ స్త్రీని వివాహమాడి మొదటి వర్తక కేంద్రాన్ని స్థాపించాడు. 1803లో అమెరికా ప్రభుత్వం ఇక్కడ ఫోర్ట్ డియర్‌బార్న్ రేవుని నిర్మించారు. 1812లో జరిగిన ఫోర్ట్ హత్యాకాండలో ధ్వంసం అయింది.

1816లో జరిగిన ట్రీటీ ఆఫ్ లూయిస్ ఒప్పందం ద్వారా ఒట్టావా, ఒజిబ్వే, పొటావతోమీస్ నుండి అమెరికా ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుంది. 1833 లోఆగస్టు 12లో ఈ నగర జనాభా 350. తరువాతి 7 సంవత్సరాలలో నగర జనాభా 4,000కు చేరింది. 1837లో షికాగో నగరాల జాబితాలోకి చేరింది. అమెరికా తూర్పు పడమటి సరుకుల రవాణాలకు షికాగో నగరం ముఖ్య కేంద్రం. 1836లో ప్రారంభించిన గలీనా షికాగో యూనియన్ రైల్ రోడ్ 1838లో తన నిర్మాణం పూర్తి చేసుకొని పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరం ఇల్లినాయ్ మిచిగన్ల మధ్య కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆవిరియంత్రంతో నడిచే మరపడవలను, ప్రయాణీకులను చేరవేసే పడవలను గ్రేట్ లేక్స్ ద్వారా మిసిసీపి నదిలోకి ప్రవేశించడానికి వీలు కలుగచేసింది. విస్తారంగా అభివృద్ధి చెందిన ఆర్థిక పరిస్థితులు, ఆదాయపు మార్గాల వలన ఆకర్షింపబడిన ప్రజలు ఇక్కడ నివాసమేర్పచుకోవడం ప్రారంభించారు. వీరిలో సమీప ప్రాంతాలనుండి పలు సమూహాల నుండి వచ్చిన ప్రజలేకాక విదేశాల నుండి వచ్చినవారూ ఉన్నారు. ఇక్కడి ఉత్పత్తులు, చిల్లర వ్యాపార రంగం మిడ్‌వెస్టులో ఆధిక్యతను సంపాదించటమే కాక అమెరికా ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసింది. యూనియన్ స్టాక్ యార్డుకు ఇది కేంద్రంగా ఉండటమూ, రిఫ్రిజిరేటర్, రైళ్లు, కార్ల రాక ఇందుకు ముఖ్య కారణం.

భౌగోళికం

[మార్చు]

షికాగో నగరం ఇల్లినాయ్ రాష్ట్రం యొక్క ఈశాన్య భాగంలోనూ, మిచిగన్ సరస్సుకు ఆగ్నేయంలోనూ ఉంది. ఈ నగరం మిచిగన్ సరసు, షికాగో నది, మిసిసిపి నది మధ్యలో ఉంది. నగరానికి దూరంగా దక్షిణంలో కాల్యుమెట్ (Calumet River) నది ఉంది. షికాగో ఉత్తర తీరంలో ప్రవహిస్తున్న డెస్‌ప్లెయిన్స్ నదిని షికాగో సెయిన్‌టరీ కాలువ షికాగో నదితో కలుపుతుంది. 1830 కాలం ఈ నగరం ఆరంభదశలో అధిక భాగం భవనాలు షికాగో నది ముఖద్వారంలో నిర్మించారు. అమెరికా ప్రభుత్వ అధికారిక గణాంకాలను అనుసరించి షికాగో 240 చదరపు మైళ్ళలో విస్తరించి ఉంది. దీనిలో 227.1 చదరపు మైళ్ళు భూభాగము, 6.9 చదరపు మైళ్ళు జల భాగము. మొత్తం మీద షికాగో నగరం చదునైన ప్రదేశం. నగరంలో ఎత్తైన ప్రదేశం సముద్రమట్టంకంటే 599 ఎత్తు మాత్రమే ఉంటుంది. సరస్సు తీరం వెంట ఉండే లోతైన ప్రదేశం సముద్రమట్టం కంటే 577 అడుగుల ఎత్తు ఉంటుంది.

మిచిగాన్ సరసు

[మార్చు]

షికాగో ఆర్థికాభివృద్ధి మిచిగాన్ సరసుతో ముడిపడి ఉంటుంది. షికాగో నగర జలరవాణా ఎక్కువగా షికాగో నదిపై జరుగుతున్న కాలంలో, ఇప్పటి పెద్దసంస్థ అయిన లేక్ ఫ్రైటర్స్ మాత్రం నగరానికి దక్షిణ తీరంలో ఉన్న లేక్ కల్మెట్ హార్బర్‌ని వాడుకుంటూ వచ్చింది. సరసు కారణంగా షికాగో వాతావరణం అనుకూలంగా కొంత హాయిని కొల్పేదిగా ఉంటుంది. వెచ్చని శీతాకాలం, చల్లని ఎండా కాలం ఇక్కడి ప్రత్యేకం. మిచిగాన్ సరసు వెంట వేసిన రోడ్డు అధిక భాగం నగరంలోని సరసు తీరాన్ని తిలకించే వీలు కలిగిస్తుంది. సరసు తీరాన లింకన్ పార్క్ , గ్రాంట్ పార్క్ , బర్న్ హమ్ పార్క్‌, జాక్‌సన్ పార్కు లు (ఉద్యాన వనాలు) ఉన్నాయి. 29 బీచ్ ‌ (సరసు తీరాలు) లు ఉన్నాయి. షికాగో నగరం డౌన్ టౌన్ సమీపంలో జార్డాన్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ , నేవీ పియర్ , ది మ్యూజియమ్ కాంపస్ , సోల్జర్ ఫీల్డ్ , అధికభాగం మెక్ కార్మిక్ ప్లేస్ (McCormick Place) నిర్మాణాలు సరసు తీరంలో లాండ్ ఫిల్ అనే పద్ధతిలో భూభాగాన్ని కొంత అభివృద్ధి చేశారు. అధిక భాగం నగర వాణిజ్య నిర్మాణాలు సరసు తీరంలోనే ఉంటాయి.

భవన నిర్మాణం

[మార్చు]
షికాగో అగ్ని ప్రమాదం చిత్రం

షికాగో నగరం ఎదుర్కొన్న భయంకర అగ్ని ప్రమాదం నగరంలో అత్యంత అధునాతన భవన నిర్మాణ విప్లవవానికి నాంది పలికింది. చరిత్ర జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసిన ఈ అగ్ని ప్రమాదం దేశం గర్వించదగిన భవనాలు ఈ నగరంలో రూపుదిద్దుకోవడానికి దోహదమైంది. 1893లో షికాగో నగరంలో నిర్వహించిన వరల్డ్ కొలంబియన్ ఎక్స్‌పొసిషన్ కొరకు న్యూ ఇంగ్లాండ్ నుండి భవన నిర్మాణ నిపుణులను రప్పించడం ఒక విశేషం. బర్న్‌హమ్ , రూట్ , అడ్లర్, సుల్లివన్ లాంటి ప్రముఖ భవన నిర్మాణ నిపుణులు ఎక్స్పోజిషన్ కోసం ఇక్కడకు వచ్చి నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1885లో మొదటి స్టీల్ ఫ్రేమ్ ఆధారిత ఆకాశ హర్మ్యం (స్కై స్కేపర్) శకానికి పునాది వేసింది. మొట్టమొదటి ప్రజలు స్థిరపడిన మిచిగాన్ సరస్సు తీరంలోఉన్న లూప్లో షికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ బిల్డింగ్ ఉంది. ఇది ఒకప్పుడు ప్రపంచంలోని ఎత్తైన భవానాల జాబితాలో ప్రథమ స్థానంలోనూ, ప్రస్తుతము ఆరవస్థానంలోనూ ఉంది. ఉత్తర దక్షిణ నదీతీరాల నడుమ మర్చండైస్ మార్ట్ భవనం ఉంది. పూర్వపు స్టాండర్డ్ ఆయిల్ బిల్డింగ్ నామాంతరం చెంది ఆన్ సెంటర్ (Aon centar), జాన్ హాన్‌కాక్ సెంటర్, విల్లిస్ టవర్ (మునుపటి పేరు: సియర్స్ టవర్) ఇవి మూడు షికాగో నగరంలోని ఎత్తైన భవనాలు. సరోవర తీరంలోని ఎత్తైన భవనాలు, సాధారణ నివాస గృహాలు, లోతట్టు ప్రాంతాలలో ఉన్న భవనాలు, ప్రత్యేక నివాస భవనాలు, ఇండియానా సరిహద్దులలో ఉన్న నిర్మాణరంగ సంస్థలకు చెందిన భవనాలు,, మిడ్‌వే విమానాశ్రయం లాంటి భవన సమూహాలతో నగరం నిండి ఉంది. సూపర్ టాల్ వాటర్ వ్యూ టవర్ , షికాగో స్పైర్, ట్రంప్ ఇంటర్నేషనల్ టవర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాయి. 20వ శతాబ్దపు ఆరంభంలో నిర్మించబడిన 'బంగళాస్' అనబడే పోలిష్ కెథీడ్రల్ చర్చి శైలిలో నిర్మించబడిన నివాస గృహాలు మిచిగాన్ సరస్సుకు కొంచెం దూరంలో ఉంటాయి.

డౌన్ టౌన్

[మార్చు]

షికాగో నగర డౌన్‌టౌన్ తూర్పు డివిజన్ స్ట్రీట్, ఉత్తరంలో మిచిగన్, దక్షిణంలో రూజ్వెల్ట్, పడమట డెస్‌ప్లెయిన్స్ అవెన్యూల మధ్య ఉంటుంది. నగర వ్యాపార సంబంధిత వ్యవహారాలకు ఇది కేంద్రం. షికాగో డౌన్‌టౌన్‌ని లూప్ అంటారు. దీని చుట్టూ వలయంలా ఒకప్పుడు ఇక్కడ కేబుల్ కార్ మార్గం ఉండటం ఇందుకు కారణం. ప్రస్తుతం నగరంలోని ఎలివేషన్ ట్రెయిన్ లూప్ పేరులోని లూప్ ఈ కారణంగానే చేర్చబడింది. ఎలివేషన్ ట్రైన్ లూప్ ట్రైన్ మార్గాలు నగరమంతా సిటిఎ రాపిడ్ ట్రైన్ మార్గాలతో నేరుగానూ ఇతర మార్గాలుగానూ కలుస్తూ ఉంటాయి. ఆర్థిక, వ్యాపార, సాంస్కృతిక సంస్థలు డౌన్‌టౌన్లో ఉంటాయి.

ఉత్తర ప్రాంతం

[మార్చు]

మిచిగన్ సరస్సు తీరం వెంట విస్తరించిన ఈ ప్రాంతంలో అధిక జనసాంద్రత కలిగిన పెద్దపెద్ద అపార్టుమెంటులు, నివాస గృహాలు ఉన్నాయి. సుదూరంగా విస్తరించిన ఉద్యానవనాలు, సరస్సు తీరం (బీచులు) ఉత్తర తీరంలో ఉన్నాయి. ఇది నగరంలోని బాగా ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతం. 1990 నుండి ఇక్కడ ఆర్థికాభివృద్ధి ప్రారంభం అయింది. ఉత్తర మిచిగన్ తీరం నివాసాలకు, వినోదాలకు వ్యాపారాభివృద్ధికి కేంద్రం. ప్రముఖ కళాప్రదర్శన శాలలు ఇక్కడ చోటు చేసుకున్నాయి.

దక్షిణప్రాంతం

[మార్చు]

మిచిగన్ సరస్సు దక్షిణ ప్రాతంలో విస్తరించి ఉన్న డౌన్‌టౌన్లో సరస్సు తీరంలో ఉద్యానవనాలు, "బంగ్లాస్" అనబడే ప్రత్యేక నివాసాలు అధికంగా ఉంటాయి. దక్షిణ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతం విశాలంగా ఉండటం కారణంగా నగరంలో జరిగే రెండు పెరేడ్‌లు ఇక్కడ జరపడం ఆనవాయితీ. ఆగస్టు రెండవ వారంలో జరిగే, బడ్స్ బిల్లికెన్ డే పెరేడ్ పిల్లలు శలవులు పూర్తిచేసుకొని పాఠశాలలకు తిరిగి వెళ్ళే దినాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సెయింట్ పాట్రిక్స్ డే సందర్భంగా సౌత్ సైడ్ ఐరిష్ పేరేడ్ పేరుతో రెండవ పేరేడ్ నిర్వహిస్తారు. ఈ పేరేడ్లను అందరూ చూడటానికి వీలుగా శలవుదినమైన ఆదివారాలలో నిర్వహిస్తారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న జాక్సన్ పార్క్‌"లో '1883లో వరల్డ్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మ్యూజియమ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ వస్తు ప్రదర్శనశాల ఉంది. ఈ పార్క్ హైడ్ పార్క్, సౌత్ షోర్, వాషింగ్టన్ పార్క్, మిడ్వే ప్లైసెన్స్ విశ్వవిద్యాలయం.

పడమటి ప్రాంతం

[మార్చు]

షికాగో నగర పడమటి భాగంలో డగుల్స్ పార్క్, ఆస్టిన్, లాండేల్, గార్‌ఫీల్డ్ పార్క్, వెస్ట్ టౌన్ (పడమటి నగరం) , హంబోల్ట్ పార్క్ మొదలైనవి ముఖ్యమైన ప్రాంతాలు. లాండేల్, గార్‌ఫీల్డ్ పార్క్ ప్రాంతాలు సంఘవిద్రోహ కార్యక్రమాలకు, నేరాలకు పేరుపడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా తక్కువే. మిగిలిన పడమటి ప్రాంతాలలలో ఆస్తి విలువలు క్రమంగా అధివృద్ధి చెందుతున్నాయి. గార్ ఫీల్డ్ కన్సర్వేటరీ పార్క్ అమెరికాలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అన్ని జాతుల వృక్షాల సమాహారం. ఇక్కడ అనేక జాతుల వృక్షాలను చూడచ్చు. ప్యూట్రో రకాన్ డే పేరేడ్ పడమటి భాగంలో జరిపే సాంస్కృతిక ఉత్సవాలలో ఒకటి. పిల్సన్ లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ మెక్సికన్ ఆర్ట్ సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి.

ఉద్యానవనాలు(పార్కులు)

[మార్చు]
పోర్టేజ్ పార్క్

షికాగో నగరంలోని షికాగో పార్క్ డిస్ట్రిక్ లో 552 ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాల కోసం కేటాయించిన స్థలం 7.300(30 చ.కిమీ) ఎకరాలు. 33 బీచులు, 9 మ్యూజియమ్‌లు, రెండు అంతర్జాతీయ ప్రమాణాలతో వన సంరక్షణాలయాలు, చారిత్రక ప్రసిద్ధి చెందిన 16 లాగూన్స్ (భూభాగంలో చొచ్చుకొని వచ్చిన సముద్ర భాగం), 10 పక్షుల , అడవి జంతువుల తోటలతో షికాగో పార్కుల మధ్య ఉన్న సుందర నగరం. ఈ పార్కులను సందర్శించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య సంవత్సరానికి సుమారుగా 2 కోట్లు. పర్యాటకులను ఆకర్షించడంలో న్యూయార్కు లోని సెంట్రల్ పార్కు మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానం షికాగో పార్కులదే. మిచిగాన్ సరస్సు తీరంలో (షికాగోలో) మాత్రం 9 రేవులు (హార్బర్లు) ఉన్నాయి. ఇది దేశంలోనే పెద్ద మునిసిపల్ హార్బర్స్‌ (రేవు)వ్యవస్థ. ప్రస్థుతం ఉన్న పార్కులను అభివృద్ధి , సుందరంగా తీర్చి దిద్దటమే కాక మిలేనియమ్ పార్క్, పింగ్ పాంగ్ మెమోరియల్ పార్క్ , డ్యూసబుల్ పార్క్ లాంటి నూతన పార్కులను అధునాత రీతిలో నిర్మించడం లాంటి పనులకు షికాగో నగరం అధికంగా వ్యయం చేస్తుంది. నగర సరిహద్దులలో షికాగో బొటానికల్ గార్డెన్ , బ్రూక్ ఫీల్డ్ జూ ఉన్నాయి. షికాగో నగర పచ్చదనానినికి పరిసరాలు చక్కగా సహకరిస్తాయి. నగర సరిహద్దులలో ఉన్నకుక్ కంట్రీ ఫారెస్ట్ ప్రిజర్వ్స్, అడవులు, మైదానాలు, సెలయేర్లు , చిత్తడి నేలలు నగర సౌందర్యానికి వనసంపదకు ప్రభల కారణం.

నగర సంస్కృతి

[మార్చు]

చికాగో జలాశయ తీరాలు స్థానికులను, పర్యాటకులను ఒకటిగానే ఆకర్షించడం విశేషం. నగరంలోని జనాభాలోని మూడవ భాగం ఈ కారణంగానే ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా ఉత్తర తీరంలోని రోజర్ పార్క్ ప్రాంతం దక్షిణ తీరంలోని హైడ్ పార్క్‌ల మధ్య జన సాంద్రత కొంచెం అధికం. చికాగో నగరం అధునిక శైలిలో, ఉన్నత ప్రమాణాలతో అదే సమయంలో వివిధ దేశాలసంప్రదాయ రీతులలో నడుపుతున్న ఆహారశాలలు (హోటల్స్) కు ప్రసిద్ధి. సౌత్ హాల్స్‌టెడ్ లో గ్రీక్ టౌన్ టౌన్, టైలర్ స్ట్రీట్‌లో లిట్టిల్ ఇటలీ, సౌత్ సైడ్లో (దక్షిణ ప్రాంతంలో) చైనా టౌన్ , లారెన్స్ అవెన్యూలో లిట్టిల్ సియోల్, ఆర్జిల్ స్ట్రీట్‌లో అనేక వియత్నామీ ఆహారశాలలు , దక్షిణ ఆసియా శైలిలో డెవాన్ అవెన్యూ లో ఇండియా/పాకిస్తానీ వీటిలో ముఖ్యమైనవి. లేక్‌వ్యూ , ఆండర్సన్‌ వెల్లీ ప్రాంతాలు చికాగోయిన్లచే బాయిస్ టౌన్ గా గుర్తింపు పొందిన ఎల్‌జిబిటి(LGBT) సమూహాల నివాసాలు ఉంటాయి.

పర్యాటక రంగం

[మార్చు]
నేవీ పియర్

2006 లో దేశవిడేశాల నుండి 4,41,70,000 పర్యాటకులు చికాగో నగరాన్ని సందర్శించినట్లు అంచనా. మ్యాగ్నిఫిషియంట్ మైల్ ఖరీదైన షాపింగ్ సెంటర్లు, వేలకొలది ఆహారశాలలు (రెస్టారెంటులు), ఆకర్షణీయమైన భవనాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించడం నిజం. వాణిజ్య సమావేశాలు, ఇతర కూటములు జరపడానికి అనువైన ప్రదేశాలలో చికాగో నగరం అమెరికాలోమూడవ స్థానంలో ఉంది. సోల్జర్ ఫీల్డ్‌కు దక్షిణ ప్రాంతంలో ఉన్న మెక్ కార్మిక్ ప్లేస్ (McCormickPlace)లో ఇవి చాలా జరుగుతుంటాయి. 3000 అడుగుల పొడవున్న నేవీ పియర్, రెస్టారెంట్లు, మ్యూజియమ్‌లు (వస్తు సంగ్రహాలయం), వస్తు ప్రదర్శన శాలలు , అడిటోరియమ్‌లు 150 అడుగుల రంగుల రాట్నం (ఫెర్రీ వీల్) , మిచిగాన్‌ తీరాన ఉన్న గ్రాంట్ పార్క్ మొదలైనవి మాత్రం సంవత్సరానికి 80లక్షల ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

చారిత్రాత్మక సిటీ సెంట్రల్ హాల్ (ఒకప్పుడు ఇది ప్రభుత్వ గ్రంథాలయంగా ఉండేది) ఇప్పుడు పర్యాటకుల విచారణ కేంద్రంగానూ,గ్యాలరీలు,వస్తు ప్రదర్శనశాలలు మొదలైన ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షణీయ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉన్న 38 అడుగుల ఎత్తు 11 మీటర్ల పొడవు కలిగిన ప్రిస్టన్ బ్రాడ్లీ హాల్ టిఫానీ గ్లాస్ డూమ్ మరియొక ప్రత్యేకత.

20వ శతాబ్దపు ఆరంభంలో తెరవాలని ప్రారంభించి కొన్ని సంవత్సరాల ఆలస్యంగా జూలై 16 2004 లో తెరచిన మిలేనియమ్ పార్క్ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.ఈ పార్క్ ముఖద్వారంలో ఉన్న ప్రతి ఫలించే క్లౌడ్ గేట్ (స్థానికులు దీనిని ది బీన్ అంటారు). మిలేనియమ్ పార్క్ రెస్టారెంట్ ఆవరణని శీతాకాలంలో ఐస్ రింక్ తయారు చేస్తారు. రెండు గాజు శిలా ఫలకాలతో చేసిన గోపురాలు (గ్లాస్ టవర్) ది క్రౌన్ ఫౌంటెన్. ఈ గోపురాలు విద్యుత్ సహాయంతో ప్రసారంచేసే చికాగోయియన్ ముఖాలను ప్రదర్శిస్తాయి. ముఖాలలో పెదవుల నుండి నీరు ఫౌంటెన్ లా చిమ్ముతూ ఉంటుంది. ఫ్రాంక్ గెహ్రీ రూపకల్పనలో స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేసిన ప్రతిద్వనించే ప్రిత్జ్కర్ పవలియన్ (వేదిక)లో ఫెస్టివల్ కన్సర్ట్ (పండుగ కాల పాట కచేరీ) కచేరీలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ వేదికకు వెనుక వైపు హరీస్ దియేటర్ ఆఫ్ మూజిక్ అండ్ డాన్స్సంగీత , నృత్య ప్రదర్శన శాల ఉంది.ఇందులో చికాగో ఒపేరా దియేటర్ , మ్యూజిక్ ఆఫ్ బరోక్యూ ఉన్నాయి.

1988 లో చికాగో నగరం అధికారపూర్వకంగా మ్యూజియమ్ (పురాతన వస్తు ప్రదర్శన శాల)లను 10 ఎకరాల విస్థీర్ణంలో ఉద్యాన వనం(పార్క్)లకు ప్రారంభోత్సవం చేసారు. ఈ ఆవరణలో నగర ప్రధాన మ్యూజియమ్లు 3 చోటు చేసుకున్నాయి.అవి వరసగా ఆడ్లర్ పెంటారియమ్ , ఫీల్డ్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ , షెడ్ అక్వేరియమ్ . మ్యూజియ సముదాయం 'గ్రాంట్ పార్క్ దక్షిణ ప్రాంతంలో కలుస్తాయి. గ్రాంట్ పార్క్ లో ముందు భాగంలో ఉన్న మిచిగాన్ సరస్సులో ఆకర్ష్ణీయమైన బకింగ్ హామ్ ఫౌంటెన్ , ఆర్ట్ ఇష్టిట్యూట్ ఆఫ్ చికాగో'లు ఉన్నాయి. సవిలో ప్రభుత్వంచే నిర్వహించబడే కూల్ గ్లోబ్స్:హాటర్ ఐడియాస్ ఫర్ అ కూలర్ గ్లోబ్స్ కళా ప్రదర్శన మొదలైనవి ప్రత్యేక ఆకర్షణలు. యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో భాగమైన ది ఓరియంటల్ ఇస్టిట్యూట్ కు స్వంతమైన పురాతన వస్తు ప్రదర్శనశాలలో ప్రాచీన ఈజిప్ట్, తూర్పు ప్రాంత నిర్మాణ కళాఖండాలు ఉన్నాయి. చికాగో చారిత్రక మ్యూజియమ్, డ్యూసేబుల్ మ్యూజియమ్ ఆఫ్ ఆఫ్రికా-అమెరికన్ హిస్టరీ, మ్యూజియమ్ ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్, పోలిష్ మ్యూజియమ్ ఆఫ్ అమెరికా ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని లెమోంట్‌లో చికాగో హిందూ దేవాలయం ఉంది.

ప్రభుత్వం

[మార్చు]
చికాగో సిటీ హాల్

చికాగో కుక్‌కౌంటీ యొక్క కౌంటీ స్థానం (సీట్). నగర ప్రభుత్వం మేయర్, లెజిస్లేచర్ అని రెండు భాగాలుగా విభజిస్తారు. మేయర్ నగర నిర్వహణ బాధ్యతలు చూసుకుంటాడు. ప్రజలచే ప్రతి నాలుగు సంవత్సరాకు ఒకసారి ఎన్నుకొనబడతాడు. కోశాధికారి, నిర్వహణ అధికారులు (క్లర్క్) కూడా ప్రజలచే ఎన్నుకొన బడతారు. ఇతర బాధ్యతలకు మేయరు అధికారులను (కమీషనర్లు) లను నియమిస్తాడు. ప్రజలచే ఎన్నుకొన బడిన 50 ఆల్డర్‌మెన్లతో కౌన్సిల్ విభాగం పనిచేస్తుంది. ఒక్కొక్క వార్డ్ నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. కౌన్సిల్ నగరం లోని కొన్ని ప్రత్యేక చట్టాలు, ఆర్థిక ప్రణాళిక (బడ్జెట్) బాధ్యతలు నిర్వహిస్తారు. నవంబరు నెలలో నూతన ఆర్థిక ప్రణాళిక (బడ్జెట్) వివరాలను ప్రకటిస్తారు. కౌన్సిల్ అధికార పూర్వమైన నిర్ణయాలనూ చర్యలనూ తీసుకుంటుంది. 19వ శతాబ్దం నుండి చికాగో రాజకీయాలపై డెమాక్రటిక్కుల ప్రభావం ఎక్కువగా ఉంటూ వచ్చింది. సాంప్రదాయక వార్డ్‌ల నాయకులపై డెమాక్రటిక్ పార్టీకి చెందిన సంస్థలు ఆధిక్యత సాధించడం దీనికి కారణం. 20వ శతాబ్ద ఆరంభానికి చికాగో డెమాక్రటిక్‌ల బలమైన స్థానంగా మారింది. 1992 వరకు చికాగోలో డెమాక్రటిక్ పార్టీ బలం కొనసాగింది. 1927 తరువాత చికాగో రిపబ్లికన్ మేయర్ రాలేదు. పల్లె ప్రాంతంపై రిపబ్లికన్ల ఆధిక్యత నగర ప్రాంతంపై డెమాక్రటిక్ ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది.

నేరాలు చట్టాలు

[మార్చు]

1990 నుండి చికాగో నగరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 1974 లో ఇక్కడ నేరాలు మొట్ట మొదటిగా శిఖరాన్ని తాకాయి. 1970 లో నగర జనాభా 30 లక్షలు ఉన్నప్పడు హత్యలు 970.1 అనగా లక్షకు 29 లెక్కన హత్యలు జరిగాయి. తరువాత 1992లో 943 హత్యలు జరిగాయి. ఇది 1 లక్షకు 34 హత్యల స్థాయికి పెరిగింది. 2004 నుండి నేరలను తగ్గించడానికి లాస్ ఏంజలెస్, న్యూయర్క్ సిటీ పోలిస్ డిపార్ట్‌మెంట్ సలహాలను అనుసరించి చేపట్టిన చర్యల కారణంగా 448 గృహంతర హత్యలు స్థాయికి తగ్గించారు. 1965 నుండి ఇది అతి తక్కువ. ఈ పరిస్థితి 2005లో 449,2006లో 452, 2007లో 435 హత్యలు జరిగాయి. 2006 నాటికి నేరాల స్థాయి బాగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం చేపట్టిన నేరనిరోధక చర్యలు విజయవంతం అయ్యాయి.

వినోద కార్యక్రమాలు కళలు

[మార్చు]
  • థియేటర్లు - ఇంప్రూవైసేషనల్ దియేటర్
  • కామెడీ ట్రూపులు - ది సెకండ్ సిటీ, (ఇంప్రోవ్‌ఒలింపిక్)
  • థియేటర్ కంపెనీలు - స్టెప్పెన్ వుల్ఫ్ దియేటర్ (నగర ఉత్తర భాగంలో), గుడ్‌మాన్ దియేటర్, బ్రాడ్ వే స్తైల్-ఫోర్డ్సెంటర్ ఫర్ పెర్‌ఫార్ర్మింగ్ ఆర్ట్స్ ఓరియంటల్ దియేటర్, రూజ్వెల్ట్ విశ్విద్యాలయంలో ఉన్న అడిటోరియం బిల్డింగ్, లాసల్లే బ్యాంక్ దియేటర్ కాడిలాక్ ప్యాలెస్ దియేటర్, డ్రూరీ లేన్ దియేటర్ (వాటర్ టవర్ ప్యాలె).
  • పోలిష్ భాష తయారీలు - గేట్‌వే దియేటర్ (జఫర్సన్ పార్క్) ఇక్కడ 1968 నుండి జోసెఫ్ జఫర్సన్ అవార్డులను నటనలో ప్రావీణ్యత చూపిన వారికి అందిస్తారు.
  • సంగీత కారులు - చికాగో సింఫోనీ ఆర్కెస్ట్రా.వీరు సింఫోనీ సెంటర్లో ఎక్కువగా కచ్చేరీలు చేస్తారు. వేసవిలో మిలేనియం పార్క్, గ్రాంట్ పార్క్, రవీనా పార్కులలో ఇతర బహిరంగ ప్రదేశాలలో కూడా ప్రదర్శనలు ఇస్తారు. ఇవి శ్రోతల అభిమానాన్ని విశేషంగా చూరగొంటున్నాయి.'లిరిక్ ఒపేరా ఆఫ్ చికాగో' హరీస్ దియేటర్, సివిక్ ఒపేరా హౌస్ లో అందించే సంగీతం చికాగోవాసులకు అభిమాన పాత్రమే.
  • మిలేనియం పార్క్‌లో ఉన్న హరీస్ దియేటర్లో ప్రదర్శించే జఫరీ బ్యాలే, చిగాగో ఫెస్టివల్ బ్యాలేలు ఆకర్షణీయమైనవే.'హబ్బర్డ్ స్టీల్ డ్యాన్స్ చికాగో' అందించే జాజ్ డ్యాన్స్ చికాగో ప్రత్యేకం. ఇవి కాక చికాగో బ్లూస్, చికాగో సౌల్, జాజ్ మైయు గోస్పెల్ ఇక్కడి సంగీత సంస్కృతికి ప్రతీకలు.

ప్రముఖులు

[మార్చు]
  1. జీన్‌ డీచ్: వ్యంగ్య చిత్రకారుడు, దర్శకుడు.[2][3][4]
  2. బాబ్ ఫోస్సే: సినిమా-నాటకరంగ దర్శకుడు, నటుడు, నృత్యదర్శకుడు.

ఆహార రంగం

[మార్చు]
పోలిష్ దుకాణం

చికాగో నగరం విధ విధమైన వంటకాలకు ప్రసిద్ధి. ఇక్కడ స్థిరపడిన ప్రజల విభిన్న జాతీయతే ఇందుకు కారణం. చికాగోలో దేశమంతా ప్రబలమైన డీప్ డిష్ పీజా ఎంత ప్రసిద్దమో చికాగో నగర ప్రత్యేకమైన తిన్‌క్రస్ట్ పీజా కూడా అంత ప్రసిద్దమే. చికాగో ప్రత్యేక శైలిలో హాట్‌డాగ్, ఇది వియన్నా బీఫ్ (గొడ్డు మాంసం) కూరి చికాగోలో పసుపు ఆవాలు, మిరపకాయ ఊరగాయతో, దిల్ ఊరగాయ వేసి సెలరీ సాల్ట్‌తో అలంకరించి ప్రత్యేకంగా తయారు చేసే రిలిష్‌ అనే ఊరగాయతో వాడుకదారులకు అందిస్తారు. నగరమంతా ఆహారశాలలో కనిపించే రెండు రకాల శాండ్‌విచ్‌లు ఇక్కడి ప్రత్యేకమే. పలుచగా కత్తిరించిన బీఫ్ (గొడ్డు మంసం) కు అజూస్ (ఫ్రెంచ్ సాస్) ను పూసి ఇటాలియన్‌ రోల్‌పై పెట్టి తీపి మిరియాలు లేక ఇటాలియన్ అమెరికన్ ఊరగాయతో కానీ వాడుకదారులకు అందిస్తారు. వియన్నా బీఫ్ కంపెనీ లేక బోబేక్ సాసేజ్ కంపెనీ తయారీలైన పసుపు ఆవాలు, మిరియాలు, గ్రిల్డ్ ఆనియన్స్ (కాల్చిన ఎర్రగడ్డ ముక్కలు) చేర్చి దుకాణాలలో లభిస్తాయి.

చికాగో నగరంలో లభించే నోరూరించే ఆహారాలు వీధులకు మాత్రమే పరిమితం కాదు చార్లీట్రాట్లర్ , రిక్ ట్రొమాంటో , జీన్ జోహో , గ్రాంట్ అచాట్స్ , రిక్ బేలెస్ లాంటి చేయితిరిగిన పాకశాస్త్రజ్ఞులతో అంతర్జాతీయంగా ప్రత్యేకత సాధించింది. గ్రాంట్ పార్క్‌ లో ప్రతి సంవత్సరం జూన్ ఆఖరి వారాంతంలో టేస్టాఫ్ చికాగో అనే పేరుతో నోరూరించే వంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ది టేస్ట్అని చికాగోయిన్లచే అభిమానంగా పిలవబడే ఈ ఉత్సవంలో అనేక దుకాణాలు నిర్వహిస్తారు.ఇది నగరంలో జరిగే పెద్ద ఉత్సవాలలో ఒకటి.ఆహారమే కాక జానపద గీతాలతో కచేరీలు (కన్‌సర్ట్స్), ఫైర్ వర్క్స్ (fireworks) వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉచితంగా నిర్వహిస్తారు.ఈ ఉత్సవం లక్షలకొద్దీ ప్రజలను ఆకర్షిస్తుంది.

ప్రసార సాధనాలు

[మార్చు]

న్యూయార్క్, లాసేంజలెస్‌ల తరువాత పర్యాటక రంగంలో చికాగో 3వ స్థానంలో ఉంది. అమెరికా ప్రభుత్వానికి స్వంతమైన యునైటెడ్ స్టేట్స్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చికాగో నుండి తమ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. "ట్రిబ్యూన్" కంపెనీకి స్వంతమైన డబ్ల్యూజిఎన్ (WGN-TV) టి.వి కేబుల్ ద్వారా సూపర్‌స్టేషను డబ్ల్యూజిఎన్ లాంటి కార్యక్రమాలను ప్రసారంచేస్తారు. ఒపరాయ్, విన్ ఫ్రే షో, జెర్రీ స్ప్రింగర్ కార్యక్రమాలు చికాగో నుండి ప్రసారమౌతాయి. ప్రభుత్వ రేడియో "పిఆర్ఐ" యొక్క "దిస్ అమెరికన్ లైఫ్" "ఎన్‌పిఆర్" యొక్క "వెయిట్ వెయిట్...డోంట్ టెల్ మి" కార్యక్రమాలు ప్రసిద్దం.

చికాగో నగరంలో అధిక ప్రతులు అమ్ముడయ్యే రెండు వార్తాపత్రికలు. చికాగోట్రిబ్యూన్ , చికాగో సన్ టైమ్స్ . ఇంకా చికాగో రీడర్ , చికాగో డిఫెండర్, చికాగో స్పోర్ట్స్, డైలీ సౌత్ టౌన్, డైలీ హెరాల్డ్, విండీ టైమ్స్, స్ట్రీట్ వైజ్ లాంటి ప్రాతీయ వార్తా పత్రికలు ప్రజలకు సమాచారాన్ని అందిస్తాయి.

ఆర్ధిక రంగం

[మార్చు]

ప్రపంచంలో ధనిక నగరాలలో చికాగో 10 వ స్థానంలో ఉంది. వాణిజ్య కేంద్రాలలో ప్రంచంలో చికాగో 4 వ స్థానంలో ఉంది. గడచిన ఆరు సంవత్సరాలుగా చికాగో వ్యాపార వసతులను అభివృద్ధి చేసింది. అమెరికాలో ఇది రెండవ ప్రముఖ వ్యాపార కేంద్రం. చికాగోలో వరసగా చికాగో బోర్డ్ అండ్ ఆప్షన్స్ (CBOE) చికాగో స్టాక్ ఎక్ష్ఛేంజ్', చికాగో మెర్కాంటిల్ ఎక్స్చేంజ్ లాంటి షేర్ మార్కెట్లకు ఇది కేంద్రం. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 42.5లక్షలు. సాంకేతిక నిపుణులు ఎక్కువగా పనిచేస్తున్న నగరం చికాగో.

వస్తు తయారీ, ప్రచురణ, ఆహార పరిశ్రమ నగర ఆర్థిక రంగంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. చికాగోలో 1840లో ధాన్యాల వ్యాపారం, 1850 నుండి 1860లో బీఫ్, పోర్క్ వ్యాపారం అభివృద్ధిని సాధించాయి. మాంసం వ్యాపారం, మాసం ప్యాకింగ్ చికాగో నగరానికి ప్రధాన ఆర్థిక వనరులలో ఒకటి. చికాగో వస్తు రవాణా వస్తు వినియోగంలో ప్రధాన కేంద్రం. రైల్‌మార్గాలు, మిచిగాన్ సరస్సు జల మార్గాలు ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.

చికాగో వ్యాపార సంబంధిత సభలు జరగటానికి అనువైన ప్రదేశం. మిక్ కార్మిక్ ప్లేస్ (McCormick Place) వాణిజ్య సభలకు అనుకూలమైన ప్రముఖ భవనం. లోలోపల ఒకదానితో ఒకటి అనుసంధించబడిన నాలుగు భవనాల సముదాయం ప్రంపంచంలోనే పెద్దది. అంతర్జాతీయంగా గుర్తించిన పత్రిక ఫార్చ్యూన్చే ఎన్నుకోబడిన మొదటి 500 పరిశ్రమలలో 12 చికాగోలో, నగర పరిసరాలలో 21 పరిశ్రమలు ఉన్నాయి అంటేనే ఈ నగర ప్రశస్తి, ప్రాముఖ్యత తెలుస్తుంది. డౌ 0 ఆర్థిక సంస్థ అలాగే ఎయిరో స్పేస్ పరిశ్రమలలో ప్రధానమైన బోయింగ్ 2001లో సీటిల్ (Seattle) నుండి చికాగోకు వచ్చింది.

జనాభా

[మార్చు]

2006 జనాభా లెక్కల ననుసరించి చికాగో నగర జనాభా 28,33,321 ఉన్నట్లు అంచనా. 10,61,928 కుటుంబాలు ఉన్నట్లు అంచనా. 6,32,909 కుటుంబాలు నగర సరిహద్దులో నివసిస్తున్నట్లు అంచనా. ఇల్లినోయీ రాష్ట్ర సగంజనాభా చికాగోలో నివసిస్తున్నట్లు అంచనా. సరాసరి జన సాంద్రత ఒక చదరపు కిలోమీటర్‌కు 12,750.3. చదరపు మైల్‌కు సరాసరి 5,075.8 నివాస గృహాలున్నట్లు అంచనా.

చికాగోలో ఉన్న శ్వేతజాతీయులు 42%, ఆఫ్రికన్ అమెరికన్లు 36.8%, హిపానిక్/లాటినోలు 26%,4.3% ఆసియన్లు/పసిఫిక్ ద్వీపవాసులు 2.9% మిశ్రమ దేశ వాసులు, దేశవాసులు 0.4% స్థానికులు, 13.6% ఇతర దేశీయులు. ఒక చదరపు మైలు జనసాంద్రత .అమెరికాలో ఎక్కువ జనసాంద్రత ఉన్న నగరాలలో చికాగో నగరం ఒకటి.

చికాగోలో నివసిస్తున్న నివాసాలు 1,061, వీరిలో 928.18 సంవత్సరాల లోపు పిల్లలతో నివసిస్తున్న కుటుంబాలు 28.9%. జంటగా నివసిస్తున్న వివాహిత కుటుంబాలు 35.1%. ఒంటరిగా నివసిస్తున్న స్త్రీలు 18.9%. కుటుంబం లేకుండా నివసిస్తున్న నివాసాలు 40.4%. 30.6%ఒంటరి జీవితం గడుపుతున్న వారు. 65 సంవత్సరాలు పైబడి ఒంటరి జీవితం గడుపుతున్న వారు 8.7%. సరాసరి ఒక నివాస జనాభా 2.67. సరాసరి కుటుంబ జనాభా 3.5.

నగర జనాభాలో 26.2% ప్రజలు 18 సంవత్సరాల లోపున్న వారు. 11.2% ప్రజలు 19 నుండి 24 సంవతరాల వారు. 33.4% ప్రజలు 25 నుండి 44 వయసు వారు. 18.9% మంది 45 నుండి 64 వయసువారు. 10.3% ప్రజలు 65 వయసు పైబడిన వారు. సరాసరి వివాహ వయసు 32 సంవత్సరాలు. 100 మంది స్త్రీలకు 94.2 పురుషులు. 18 సంవత్సరాలకు పైబడిన 100 స్త్రీలకు 91.1 పురుషులు.

ఒక ఇంటి సరాసరి ఆదాయం $38,625. ఒక కుటుంబ సరాసరి ఆదాయం $46,748. పురుషుల సరాసరి ఆదాయం $35,907. స్త్రీల సరాసరి ఆదాయం $30,536. తలసరి సరాసరి ఆదాయం $20,175. దారిద్య రేఖకు దిగువున ఉన్న ప్రజలు 19.6%. దారిద్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాలు 16.65%. మొత్తం జనాభాలో 18 సంవత్సరాలకు లోపు ప్రజలు 28.1% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారిలో 15.5% దారిద్య రేఖకు దిగువున ఉన్నారు.

చికాగోలో నివసిస్తున్న వారిలో సాంప్రదాయక ప్రజలలో అధిక సంఖ్యాకులు జర్మనీ పూర్వీకంగా కలిగిన వారు. 1830 నుండి 1840 లలో జరిగిన ఒప్పందాల వలన ఏర్పడిన అనుకూల వాతావరణం పని నైపుణ్యం ఉన్న పనివాళ్ళకున్న ఆవశ్యకత జర్మనీ నుండి వలస వచ్చిన ప్రజలను చికాగో నగరానికి తీసుకు వచ్చింది. ఈ కారణంగా జర్మనీ వలస ప్రజలు తమ సంపాదనకు ముఖ్య ప్రదేశంగా చికాగోను ఎన్నుకున్నారు. పనికోసం ఇక్కడకు వచ్చిన ప్రజలు ఇక్కడ కొంతకాలం ఉండవలసిన అవసరం కలిగిన తరువాత 1850 సంవత్సరానికి ఇక్కడ స్థిరనివాసాలను ఏర్పరచుకున్నారు. 1850 నాటికి నగరంలోని ఆరవ వంతు జనాభా జర్మనులే. శతాబ్దం ముగిసే కాలానికి చికాగోలో జర్మన్ సాంప్రదాయక ప్రజల సంఖ్య మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఐరిష్, పోలండ్ వాళ్ళు, స్వీడన్లు ఉన్నారు. 1900 సంవత్సరంలో 470,000గా ఉన్న చికాగో జనసంఖ్యలో నలుగురిలో ఒకరు జర్మనీలో పుట్టిన వాళ్ళు కానీ లేక జర్మనీ పూర్వీకులకు పుట్టిన వాళ్ళే. 1920 నుండి జర్మనుల వలస పై విధించిన నిషేధం కారణంగానూ, జర్మనులని చెప్పుకోవడానికి ప్రోత్సాహం లేని కారణంగా ఈ సంఖ్య క్షీణిస్తూ వచ్చింది. 22% చికాగోయన్లు ఇప్పటికీ తాము జర్మను పూర్వీకులమని చెప్పుకోవడానికి ఇష్టపడరు.

చికాగో దక్షిణ ప్రాంతంలో ఐరిష్ అమెరికన్లు ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. నగరంలోని రాజకీయ నాయకులలో చాలా మంది వీరినుండి వచ్చిన వారే. చికాగో నగర అగ్నిమాపక దళం, రక్షకదళం (పోలీస్) లో అధిక భాగం ఐరిష్ వాళ్ళు ఉన్నారు. ఇటాలియన్-అమెరికన్లు అధికంగా నివసిస్తున్న నగరాలలో చికాగో ఒకటి. చికాగో నగరపాలిత ప్రాంతంలో 5 లక్షల ఇటాలియన్-అమెరికన్లు నివసిస్తున్నారు. అమెరికాలో ఇటాలియన్-అమెరికన్లు అధికంగా కలిగిన నగరాలలో ఇది మూడవది. మొదటి స్థానంలో న్యూయార్క్, రెండవస్థానంలో ఫిలడెల్ఫియా ఉన్నాయి. ఇటాలియన్ ప్రజలు ఎక్కువగా టైలర్ స్ట్రీట్, గ్రాండ్ అవెన్యూలలో నివసిస్తుంటారు. నగరమంతా చెదురు మదురుగా ఉంటారు. వీరిలో అల్ కాఫోన్ చికాగోయన్ల మధ్య ప్రాముఖ్యత సంపాదించుకున్న ఇటాలియన్. ఇటాలియన్-అమెరికన్లు సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో చికాగోలో గట్టి పట్టు సాధించుకున్నారు.

తరువాత ప్రాముఖ్యత యురోపియన్ సాంప్రదాయక ప్రజలు. దక్షిణ పడమటి ప్రాంతాలు ఆఫ్రికన్‌-అమెరికనులు అధికంగా నివసిస్తున్న ప్రాంతం.న్యూయర్క్ తరువాత ఆఫ్రికన్‌-అమెరికనులు అధికంగా నివసిస్తున్న నగరం చికాగో.స్వీడిష్ అమెరికన్లు అధికంగా నివసిస్తున్న నగరాలలో చికాగో ప్రథమ స్థానంలోఉంది. స్వీడిష్‌-అమెరికన్ల సంఖ్య సుమారు 1,23,000.ఉత్తర భాగంలో కొంచం దూరంగా ఉన్న ఆండర్సన్ వెల్లీ స్వీడిష్ అమెరికన్లు అధికంగా నివసిస్తున్న ప్రాంతం.చికాగోలో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదం తరువాత స్వీడిష్-అమెరికన్‌ వడ్రంగి వాళ్ళు (కార్పెంటర్లు) నగర పునర్నిర్మాణంలో అధికంగా పాల్గొన్నారు. ఈ కారణంగా స్వీడన్లు నిర్మించిన చికాగోగా ప్రజలు చెప్పుకుంటారు.

వార్సా తరువాత పోలాండ్ దేశీయులు అధికంగా నివసిస్తున్న ప్రదేశం చికాగో. పోలాండ్ చికాగోని వారి ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా భావిస్తారు. ఈ కారణంగా చికాగోలోని జాక్సన్ పార్క్‌లో వారాంతపు శ్రామిక దినం (లేబర్ డే), "టేస్ట్ ఆఫ్ పొలోనియా" ఉత్సవాన్ని జరుపుకుంటారు. నగర నైరుతీ భాగంలో పోలాండ్ దేశీయులు అధికంగా నివసిస్తుంటారు. నగర ఆగ్నేయ భాగంలో ఐరోపా తరువాత గోరల్స్ (కార్పాతియన్ కొండజాతీయులు) అధికంగా నివసిస్తున్నారు. ఇక్కడ "పోలాండ్ హైలాండర్స్ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా" ఉంది.

ప్రపంచంలోనే బల్గేరియన్లు, లూధియానియన్లు అధికంగా నివసిస్తున్న నగరం చికాగో. సైబీరియన్లు అధికంగా నివసిస్తున్న నగరాలలో చికాగో రెండవ స్థానంలో ఉంది. గ్రీకులు అధికంగా నివసిస్తున్న నగరాలలో చికాగో మూడవస్థానంలో ఉంది. రోమన్లు (1లక్ష) అధికంగా నివసిస్తున్న నగరం చికాగో. ఆసిరియన్లు (80వేలు) అధికంగా నివసిస్తున్న నగరం చికాగో, ఈ కారణంగా ఇక్కడ ఆసిరియన్ చర్చ్ ఆఫ్ ఈస్ట్ , మార్ దిన్ఖా, ది ఎవాన్జలికల్ కాన్వెంట్ , ఎవాన్జలికల్ లూథర్న్ చర్చ్ ఇన్ అమెరికా ఉన్నాయి.

అమెరికాలోనే అధికంగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్న నగరాలలో చికాగో మూడవ స్థానంలో ఉంది. ప్రత్యేకంగా ఇండియన్లు, పాకిస్తానీలు. నగరానికి ఉత్తరప్రాంతంలో ఉన్న "దివాన్‌ అవెన్యూ" దక్షిణాసియన్లు అధికంగా నివసిస్తున్న ప్రాంతం. న్యూయార్క్ తరువాత ప్యూర్టో రేషియన్ ప్రజలు అధికంగా నివసిస్తున్న నగరాలలో చికాగోది రెండవ స్థానం. లాసేంజలెస్ తరువాత మెక్సికన్లు అధికంగానివసిస్థున్న నగరం చికాగో. పాలస్తీనియన్లకు, జోర్డానియన్లకు అమెరికాలోనే చికాగో ప్రధాన కేంద్రం. కుక్ కంట్రీలో నివసిస్తున్న అరబ్బులు 1,85,000, చుట్టుపక్కల ఇతర కౌన్టీ లలో నివసిస్తున్న అరబ్బులు 75,000.

ఆరోగ్యం

[మార్చు]
నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ వారి మెడికల్ సెంటర్

'యూనివర్శిటీ చికాగో'చే నడపబడుతున్న 'యూనివర్శిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్ ' దేశంలోనే 14వ స్థానంలో ఉన్న ఆసుపత్రిగా 'యు.ఎస్ న్యూస్‌ & వరల్డ్ రిపోర్ట్ 'పేర్కొంది.ఇల్లినోయిస్ లో పత్రికలచే గుర్తింపబడిన ఆసుపత్రి ఇది ఒకటే.

వైద్య కళాశాలలు

[మార్చు]
  • యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినోయిస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్. (1300 విద్యార్థులు) ఇది అమెరికాలోనే పెద్ద వైద్య కళాశాల.
  • రష్ మెడికల్ కాలేజ్.
  • ప్రిట్జ్కర్ మెడికల్ కాలేజ్ (యూనివశిటీ ఆఫ్ చికాగో).
  • ఫెయిన్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ (నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ).
  • చికాగో మెడికల్ స్కూల్ (నార్త్ చికాగో).
  • స్ట్రిచ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ (లయోలా యూనివర్శిటీ చికాగో) (ప్రదేశం మేవుడ్).

చికాగోలో ఉన్న మెడికల్ అసోసియేషన్స్

[మార్చు]
  • అమెరికన్ మెడికల్ అసోసియేషన్.
  • అమెరికన్ ఆస్టియోపాథిక్ అసోసియేషన్.
  • అమెరికన్ డేంటల్ అసోసియేషన్.
  • అకాడమీ జనరల్ ఆఫ్ డెంటిస్ట్రీ.
  • అమెరికన్ డైటిటిక్ అసోసియేషన్.
  • అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్.
  • అమెరికన్ సొసైటీ ఆఫ్ పాథాలజీ.
  • అమెరికన్ కాలేజ్ ఆఫ్ హెల్థ్ కేర్ ఎగ్జిక్యూటివ్స్.
  • అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్.

విద్య

[మార్చు]

పబ్లిక్‌స్కూల్ (ప్రభుత్వ పాఠశాల)

[మార్చు]

స్కూల్ డిస్టిక్ ఆద్వర్యంలో పనిచేసే పాఠశాలలు నగరమంతా కలిపి 600 ఉన్నాయి.

  • 2005 వ సంవత్సరం గణాంకాలను అనుసరించి విద్యార్థుల సంఖ్య 40,000. పాఠశాల విద్యార్థుల సంఖ్యలో చికాగోది దేశంలోనే మూడవ స్థానం.

ఇతర పాఠశాలలు

[మార్చు]
  • లయోలా అకాడమీ (రోమన్ కాథలిక్)
  • సెయింట్ ఇగ్నేషియస్ ప్రిపరేటరీ స్కూల్ (రోమన్ కాథలిక్)
  • ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చికాగో (లింకన్ పార్క్ సమీపం)
  • లాటిన్ స్కూల్ (లింకన్ పార్క్ సమీపం)
  • ఫ్రాన్సిస్ డబ్ల్యూ .పార్కర్ స్కూల్ (లింకన్ పార్క్ సమీపం)
  • యూనివర్శిటీ ఆఫ్ చికాగో లాబరేటరీ స్కూల్ (హైడ్ పార్క్)
  • ఇడా క్రౌన్ జ్యూయిష్ అకాడమీ (వెస్ట్ రోజర్స్ పార్క్)

కళాశాలలు - విశ్వవిద్యాలయాలు

[మార్చు]

1890 నుండి చికాగో ఉన్నత విద్యకు పరీశోధనలకు అనువైన నగరంగా అంతర్జాతీయ ప్రసిద్ధి చెందింది.చికాగోలో ఉన్న ముఖ్యమైన 3 విశ్వవిద్యాలయాలు

  • యూనివర్శిటీ ఆఫ్ చికాగో (హైడ్ పార్క్) : ఇక్కడ చదివిన విద్యార్థులు 81 మంది నోబుల్ బహుమతి గ్రహీతలు.డౌన్ టౌన్ లో ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచే 'స్కూల్ ఆఫ్ బిజినెస్' కళాశాల ఉంది.
  • యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినోయిస్ ఎట్ చికాగో : ఇది చికాగోలో ఉన్న ప్రభుత్వానికి స్వంతమైన పెద్ద విశ్వవిద్యాలయం.దేశీయంగా గుర్తింపు పొందిన పరిశోధనకి సంబంధించిన విద్యాసంస్థ.
  • నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ (ఎవాన్‌స్టన్) : డౌన్ టౌన్ లో ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచే 'ఫియిన్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్', 'స్కూల్ ఆఫ్ లా' కళాశాలలు ఉన్నాయి.
ఇతర ఉన్నత విద్యాలయాలు
  • ఇల్లినోయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్రోంఝ్ వెల్లీ)
  • లయోలా యూనివర్శిటీ (కాథలిక్) : ఈ విశ్వవిద్యాలయానికి చెందిన మెడికల్ కాంపస్ మేవుడ్లో ఉంది.
  • డీ పౌల్ యూనివర్శిటీ (కాధలిక్)

వాటికన్ తరువాత యూదుల (జ్యూయిష్) ఆధ్యాత్మిక పాఠశాలలు చికాగోలో అధికంగా ఉన్నాయి.అవి వరసగా

  • కాధలిక్ దియోలాజికల్ యూనియన్
  • చికాగో దియోలాజికల్ సెమినరీ
  • లూధరన్ స్కూల్ ఆఫ్ థియోలజీ ఎట్ చికాగో
  • మెక్ కార్మిక్ దియోలాజికల్ సెరిమనీ
  • మీడ్‌విల్లే లాంబర్డ్ దియోలాజికల్ స్కూల్
  • నార్త్ పార్క్ దియోలాజికల్ సెరిమనీ
  • మూడీ బైబిల్ ఇన్స్‌టిట్యూట్ (యూనివర్శిటీ ఆఫ్ చికాగో)
  • చికాగో స్టేట్ ఆఫ్ యూనివర్శిటీ
  • నార్త్ ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్శిటీ
  • కమ్యూనిటీ కాలేజ్
  • "రూజ్వెల్ట్ కాలేజ్" : ఇది ప్రెసిడేంట్ డ్.రూజ్వెల్ట్ జ్ఞాపకార్ధం ఆయన పేరు మీద స్థాపించిన కళా సంబంధిత శాస్త్రాలను అభ్యసించే కళాశాల.ఇది చికాగో కాలేజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్థాపించ బడింది.
  • రష్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో నడిచే రష్ మెడికల్ కాలేజ్

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

చికాగో ప్రధాన వస్తురవాణా కేంద్రాలలో ఒకటి. సింగపూర్, హాంకాంగ్‌ల తరువాత అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన రేవు (హార్బర్) చికాగో హార్బరే.మొదటి తరగతి చెందిన ఆరు రైలు మార్గాలు చికాగోలో కలుస్తాయి.

ప్రయాణీకుల రైళ్ళుకు చికాగో బృహత్తర కేంద్రం. అమ్‌ట్రాక్ సంస్థచే నడపబడే అనేక రైళ్ళు ఇక్కడి యూనియన్ స్టేషను నుండి ప్రయాణీకులను దూరప్రాంతాలకు సహితం తీసుకు వెళతాయి. ఇక్కడి నుండి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డి.సి లకు రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. తక్కువ దూరాలకూ ఇక్కడి నుండి అనేక సర్వీసులను ఇల్లినోయిస్ ద్వారా డెట్రాయిట్, ఇండియానా మొదలగు ప్రాంతాలకు అమ్‌ట్రాక్ అందిస్తుంది.

తొమ్మిది ఇంటర్‌స్టేట్ హైవే లు నగరాన్ని సమీప ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఉంటాయి. వీటికి అమెరికా మునుపటి ప్రెసిడెంట్ పేర్లను పెట్టారు.ది రీజనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అధారిటీ ఆద్వర్యంలో సిటిఎ (CTA, మెట్రా, పేస్ సర్వీసులు నడుస్తుంటాయి. ది చికాగో ట్రాన్సిస్ట్ అధారిటీ (CTA) నగరంలోనూ సమీప ప్రాంతాలకూ సర్వీసులను, ప్రభుత్వ బస్ సర్వీసులను నడుపుతుంటాయి. స్థానికులు ఎల్ (L) అని వ్యవహరించే రాపిడ్ ట్రాన్సిస్ట్ చాలా మార్గాలలో నడుపుతుంటారు. వీరు నడిపే బస్సులకు ఒక్కో మార్గానికి ఒక్కో రంగు బస్సులు ఉంటాయి. మిడ్వే ఎయిర్ పోర్ట్, ఓ.హేర్ ఎయిర్ పోర్ట్ లకు బస్సులలో చేరుకునే వీలుంది. ది సిటీఎ (CTA) హెవీ రైళ్ళు ఒక్కోమార్గానికి ఒక్కో రంగును ఉపయోగిస్తారు. ఈ రైళ్ళకూ మార్గాలకూ ఎరుపు, నీలం, ఆకుపచ్చ, ఆరంజ్, మట్టిరంగు, వైలెట్, గులాబీ, పసుపు రంగులను ఉపయోగిస్తారు. ఎరుపు, నీలం మార్గాలలో 24 గంటలూ సర్వీసు రైళ్ళు ఉంటాయి. కొత్తగా సర్కిల్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పేస్ నగర పరిసర 200 ప్రాంతాలకు సర్వీసులను నడుపుతూ ఉంది. ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉండే సమయంలో సిటిఎ మెట్రా రైళ్ళలో సైకిళ్ళనూ తీసుకు పోవచ్చు. బస్సులలో 24 గంటలూ సైకిల్స్ తీసుకుపోవచ్చు. మెట్రా ఉద్యోగుల కోసం నగరంలోనూ సమీప్రాంతాల నుండి సర్వీసులు నడుపుతుంది. ది మెట్రా ఎలెక్ట్రిక్ లైన్ దక్షిణ ఉత్తర ప్రాంతాలను కలుపుతూ ఉద్యోగుల కోసం రైళ్ళను నడుపుతుంది.

ఓ'హేర్ విమానాశ్రయం

చికాగో నగరం సైకిల్ ప్రయాణీకులను విశేషంగా ఆదరిస్తుంది. నగరంలో 100 మైళ్ళ పొడవున సైకిల్ మార్గాలు ఉన్నాయి. సెంట్రల్ పార్కులో 10.000 ర్యాకులతో ఉద్యోగుల కోసం సైకిల్‌స్టాండ్ ఉంది.

చికాగో నగరంలోని దక్షిణ ప్రాంతంలో మిడ్ వే ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ (అంతర్జాతీయ విమానాశ్రయం)నగరానికి వాయవ్యంలో ఓ హేర్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ (అంత్ర్జాతీయ విమానాశ్రయం)లు ఉన్నాయి. ఈ రెండు విమాశ్రయాలు నగర ప్రభుత్వానికి స్వంతం.ఇండియానా గ్రే ప్రాంతంలో గ్రే/చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (అంతర్జాతీయ విమానాశ్రయం) మూడవ చికాగో విమానాశ్రయంగా వ్యవహరిస్తారు. గతంలో గ్రేటర్ రాక్ఫోర్డ్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్‌ గానూ ప్రస్తుతం చికాగో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ గానూ వ్యవహరిస్తున్న విమానాశ్రయాన్ని వస్తు రవాణాకు ఉపయోగిస్తారు. యునైటెడ్ ఎయిర్ లైనుకు చికాగో అంతర్జాతీయ కేంద్రం. విమాన ప్రయాణ ఆదాయంలో అంతర్జాతీయంగా చికాగో రెండవ స్థానంలో ఉంది. అమెరికన్ ఏయిర్ లైన్ కు చికాగో రెండవ పముఖ కేంద్రం. అంతర్జాతీయంగా చౌకైన విమాన సంస్థలలో పెద్దదైన సౌత్ వెస్ట్ విమానాశ్రయం 'ఫోకస్ సిటీ' చికాగో.

మూలాలు

[మార్చు]
  1. Illinois at inogolo.com
  2. "Gene Deitch". Lambiek Comiclopedia. Archived from the original on 12 May 2019. Retrieved 23 April 2020.
  3. Lenburg, Jeff (2006). Who's Who in Animated Cartoons (Illustrated ed.). New York City: Applause Theatre and Cinema Books. pp. 62–64. ISBN 978-1-55783-671-7.
  4. "Gene Deitch (born Eugene Merril Deitch), 1924". National Czech and Slovak Museum. Archived from the original on 12 September 2015. Retrieved 23 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=చికాగో&oldid=4077766" నుండి వెలికితీశారు