కేశవ చంద్ర సేన్
కేశవ్ చంద్ర సేన్ (1838 నవంబరు 19 - 1884 జనవరి 8) హిందూ తత్వవేత్త, సంఘ సంస్కర్త. అతను హిందూ ఆలోచనా చట్రంలోకి క్రైస్తవ వేదాంతాన్ని చేర్చడానికి ప్రయత్నించాడు. బ్రిటీష్ ఇండియా లోని బెంగాల్ ప్రెసిడెన్సీలో హిందువుగా జన్మించిన అతను 1856 లో బ్రహ్మ సమాజం సభ్యుడయ్యాడు.[1] కానీ 1866 లో దాని లోంచి విడిపోయి "భరతవర్షీయ బ్రహ్మ సమాజం"ను స్థాపించాడు.[2] బ్రహ్మ సమాజం మాత్రం దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో కొనసాగింది. (1905 లో మరణించే వరకు ఆయనే నాయకత్వం వహించాడు).[3] 1878 లో, అతని కుమార్తెకు బాల్య వివాహం చెయ్యడంతో అతని అనుచరులు అతనిని విడిచిపెట్టారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అతడు చేసిన ప్రచారం లోని డొల్లతనాన్ని బయట పెట్టింది. తరువాత తన జీవితంలో అతను రామకృష్ణ పరమహంస ప్రభావానికి లోనయ్యాడు. క్రైస్తవ మతం, వైష్ణవ భక్తి, హిందూ ఆచారాలచే ప్రేరణ పొందిన సమకాలీన "క్రొత్త వ్యవస్థ"ను స్థాపించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]కేశవ్ చంద్ర సేన్ 1838 నవంబరు 19 న కలకత్తా లోని సంపన్న కాయస్థ కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబం మొదట హుగ్లీ నది ఒడ్డున ఉన్న గారిఫా గ్రామానికి చెందినది. తన తాత రామ్‌కమల్ సేన్ (1783-1844), సతీ సహగమనాన్ని సమర్ధించే వ్యక్తి. తన జీవితాంతం రామ్ మోహన్ రాయ్ను వ్యతిరేకించాడు [4] రాయ్ అతడికి పది సంవత్సరాల వయస్సులో తండ్రి పియరీ మోహన్ మరణించడు. దాంతీ సేన్, తన మామయ్య వద్ద పెరిగాడు. బాలుడిగా, అతను బెంగాలీ పాఠశాలలో చదివాడు. తరువాత 1845 లో హిందూ కళాశాలలో చేరాడు.[5]
ఉద్యోగ వ్యవహారాలు
[మార్చు]1855 లో అతను శ్రామికుల పిల్లల కోసం ఒక సాయంకాల పాఠశాలను స్థాపించాడు. ఇది 1858 వరకు కొనసాగింది. 1855 లో, అతను గుడ్విల్ ఫ్రెటర్నిటీకి కార్యదర్శి అయ్యాడు.[6] ఇది యూనిటారియన్ రెవ. చార్లెస్ డాల్ అనే క్రిస్టియన్ మిషనరీ, రెవ. జేమ్స్ లాంగ్ లకు చెందిన మాసోనిక్ [7] లాడ్జి. రెవ. జేమ్స్ లాంగ్ అదే సంవత్సరం "బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్"ను స్థాపించడానికి సేన్‌కు సహాయం చేసాడు. [8] ఈ సమయంలో అతను బ్రహ్మ సమాజం ఆలోచనల పట్ల ఆకర్షితుడయ్యాడు. [9]
కేశవ్ సేన్ 1854 లో కొంతకాలం పాటు ఏషియాటిక్ సొసైటీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు. కొంతకాలం తర్వాత సేన్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ లో గుమస్తాగా కూడా పనిచేశాడు. కాని సాహిత్యం, తత్వశాస్త్రాలకు పూర్తిగా అంకితమయ్యేందుకు తన పదవికి రాజీనామా చేశాడు. [10] ప్రొఫెసర్ ఓమన్ ఇలా రాసాడు, "భావావేశ పూరితుడై, భక్తి సమన్వితుడై,,ధారగా ప్రసంగించగల శక్తి గల కేశవ్ నిస్సారమైన బ్యాంకు క్లర్కు పనిని భరించలేకపోయాడు. కొద్ది కాలం లోనే తన సామర్ధ్యాలకు సరిపడే, మరింత అనుకూలమైన క్షేత్రాన్ని కోరాడు." అని అన్నాడు. 1859 లో అధికారికంగా బ్రహ్మ సమాజంలో చేరాడు. [11]
బ్రహ్మ సమాజం
[మార్చు]1857 లో సేన్ మళ్ళీ క్లర్కు ఉద్యోగం తీసుకున్నాడు. ఈసారి బ్రహ్మ సమాజం అధ్యక్షుడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రైవేట్ కార్యదర్శిగా. ఆ విధంగా బ్రహ్మ సమాజంలో కూడా చేరాడు. 1859 లో, సేన్ బ్రహ్మ సమాజం యొక్క సంస్థాగత పనులకు అంకితమయ్యాడు. 1862 లో, హేమేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పనిచేసాడు. హేమేంద్రనాథ్ ఠాగూర్ బ్రాహ్మణేతరుడు అయినప్పటికీ (గతంలో శూద్ర అంటరానివాడు అయినప్పటికీ) దాని ఆరాధనా గృహాలలో ఒకదానికి ఆచార్యుడిగా నియమితుడయ్యాడు.[12]
1858 లో, కుటుంబ పెద్ద ఇంట్లో లేని సమయంలో, కూలూటోలాలోని తన ఇంటిని విడిచిపెట్టి, ఠాగూర్ కుటుంబానికి చెందిన జోరాసంకో హౌస్‌లో ఆశ్రయం పొందాడు. 1862 లో సేన్ ఆల్బర్ట్ కాలేజీని స్థాపించడంలో సహాయపడ్డాడు. కలకత్తా బ్రహ్మ సమాజపు వారపత్రిక అయిన ఇండియన్ మిర్రర్ కోసం వ్యాసాలు రాశాడు. దీనిలో సామాజిక, నైతిక విషయాలను చర్చించేవారు.[10]
1863 లో ఆయన బ్రహ్మ సమాజం విండికేటెడ్ రాశాడు. అతను క్రైస్తవ మతాన్ని తీవ్రంగా విమర్శించాడు. ప్రాచీన హిందూ వనరులను ఉపయోగించడం ద్వారా, వేదాల అధికారం ద్వారా హిందూ మతాన్ని పునరుజ్జీవింపచేయడానికి బ్రహ్మ సమాజం ఉద్దేశించినట్లు ఉపన్యాసాలు చేస్తూ దేశమంతా పర్యటించాడు.[10] అయితే, 1865 నాటికి, క్రైస్తవ సిద్ధాంతం మాత్రమే హిందూ సమాజానికి కొత్త జీవితాన్ని తీసుకురాగలదని సేన్ నమ్మాడు.[13]
1865 నవంబరు లో, బ్రహ్మ మతంలో క్రైస్తవ పద్ధతులపై "దాని వ్యవస్థాపకుడు దేబేంద్రనాథ్ ఠాగూర్‌తో బహిరంగంగా విభేదించి" బ్రహ్మ సమాజం నుండి బయటపడ్డాడు. తరువాతి సంవత్సరం (1866) యూనిటారియన్ బోధకుడు చార్లెస్ డాల్ ప్రోత్సాహంతో అతను మరొక కొత్త సంస్థ భరతవర్షీయ బ్రహ్మ సమాజంలో, దాని కార్యదర్శిగా (దానికి అధ్యక్షుడు "దేవుడు") చేరాడు. బ్రహ్మ సమాజం లోకి సేన్ చొప్పించిన క్రైస్తవ బోధనల నుండి ఠాగూర్ ప్రక్షాళన చేసాడు. సేన్ సంస్థ నుండి వేరుగా కనబడేందుకు గాను దానికి ఆది బ్రహ్మ సమాజం అని వర్ణించడాన్ని ప్రోత్సహించాడు.[14]
క్రైస్తవం
[మార్చు]1866 లో సేన్ "యేసుక్రీస్తు, యూరప్, ఆసియా" అనే విషయంపై ఒక ప్రసంగం చేసాడు. దీనిలో "ఇప్పటికే భారతదేశాన్ని జయిస్తున్న క్రీస్తుకు వశమౌతుంది" అని ప్రకటించాడు. దీంతో అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించబోతున్నాడనే అభిప్రాయం వ్యాపించింది.[15] [14]
ప్రొఫెసర్ ఒమన్ ఇలా రాశాడు "తన స్వంత సమాజం నుండి విడిపోయినప్పటి నుండి, కేషుబ్ తన రచనల ద్వారా, బహిరంగ ఉపన్యాసాల ద్వారా వైస్రాయ్, సర్ జాన్ లారెన్స్ సానుభూతిని పొందాడు. అతను స్థానిక సంస్కర్త చేస్తున్న పనిపైన లోతైన ఆసక్తిని కనబరిచాడు. ముఖ్యంగా కేషుబ్ క్రీస్తు గురించి బహిరంగంగా మాట్లాడిన దాన్ని బట్టి, అతను క్రైస్తవుడనే నమ్మకానికి సమర్థత కలుగుతుంది. కాకపోతే అతడు ఈ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించలేదు, అంతే." [16]
బ్రిటిషు పాలనపై ప్రేమ
[మార్చు]1870 లో కేశవ్ తన చర్చి "లవ్ ఫర్ ది సావరిన్"లో ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. క్రైస్తవ మతం భారతీయులు నేర్చుకోవాల్సిన ఆదర్శవంతమైన సంప్రదాయంగా భావించిన కేశవ్, భారతదేశంలో బ్రిటిష్ ఉనికి భారతదేశ ప్రజలకు దైవికమైన ప్రయోజనాన్ని కలిగిస్తుందని భావించాడు. 1870 లో బ్రిటిషు రాణితో జరిగిన చారిత్రిక సమావేశంలో అతను బ్రిటిష్ పాలనను అంగీకరించాడు. ఇది బ్రిటిషు వారికి సంతోషాన్నిచ్చింది. భారతీయ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఈ వేదాంత వైఖరి పట్ల కేశవ్ స్వదేశంలో తీవ్ర విమర్శలకు గురయ్యాడు.[17]
బ్రహ్మ సమాజంలో అసమ్మతి
[మార్చు]1872 లో ప్రత్యేక వివాహాల చట్టం ఆమోదించడం, బ్రహ్మోస్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సేన్ మహర్షి దేబేంద్రనాథ్ సంకలనం చేసిన బ్రహ్మో ధర్మం నుండి చీలిపోయాడు. కేశవ్ కంటే ఆధునికమైన భావాలతో, ముఖ్యంగా మహిళల విద్య, అభ్యున్నతిపై సంస్కరణవాద అభిప్రాయాలతో, "బ్రహ్మ సమాజంలోని బ్రహ్మ సమాజం" యొక్క శక్తివంతమైన విభాగం ఏర్పడింది. 1873 లో, సేన్ వారిపై తన కక్షను ఈ క్రింది ప్రసంగం ద్వారా తీవ్రంగా ఎదుర్కొన్నాడు
దేవుడి స్ఫూర్తి ఎక్కడికి పోతోంది? బ్రహ్మ సమాజం వైపా? నేను కాదంటాను. స్వర్గ రాజ్యం వైపు భారత్ నడుస్తోందన్న దాన్ని తిరస్కరించకండి. కానీ బ్రహ్మ సమాజం దేవుడి పవిత్ర చర్చి కాదు. దానిలో స్వర్గ రాజ్యపు అంశ లేశమాత్రం కూడా లేదు. ఈ బ్రహ్మసమాజం దేవుడి చర్చి యొక్క వికట రూపం మాత్రమే. [18]
అన్నెట్ అక్రోయిడ్, స్త్రీ విముక్తి వివాదం
[మార్చు]1875 లో సేన్ ఒక ప్రముఖ స్త్రీవాద, సామాజిక సంస్కర్త అన్నెట్ అక్రోయిడ్‌తో బహిరంగ వివాదంలో చిక్కుకున్నాడు. ఆమె 1872 అక్టోబరులో భారతదేశానికి చేరుకుంది. సేన్‌తో చర్చలు జరిపాక అక్రోయిడ్ షాక్ అయింది. ఇంగ్లాండ్లో మహిళల విద్య గురించి తెగ మాట్లాడిన సేన్, ఇక్కడ ఒక సాధారణ హిందూ ఛాందవాదిగా తోచాడు. మహిళలను విజ్ఞానం అందకుండా ప్రయత్నిస్తున్నాడు. ఈ వివాదం స్థానిక పత్రికలలో వచ్చింది. బేథూన్ పాఠశాలపై దాని ప్రభావం పడింది. బ్రిటిష్ ఇండియాలో మహిళల విద్యను ప్రతిఘటిస్తున్న సేన్ సహచరులైన బిజోయ్ కృష్ణ గోస్వామి, అఘోర్ నాథ్ గుప్తా, గౌర్ గోవింద రేలను చూసి అక్రోయిడ్ విస్తుపోయింది.
రామకృష్ణ పరమహంస ప్రభావం
[మార్చు]1876 లో అప్పటికి అంతగా తెలియని రామకృష్ణ పరమహంస సేన్ కోసం వెతుకుతూ మొదట అతనిని సాధన కానన్ వద్ద కలిశాడు. రామకృష్ణ యొక్క పేద, కఠినమైన, అసాధారణమైన వ్యక్తిత్వం రామకృష్ణుడిని అంతకుముందే కలిసిన దేబేంద్రనాథ్ ఠాగూర్ వంటి ఇతర బ్రహ్మ సమాజ ప్రముఖులకు నచ్చలేదు; [19] సేన్ కూడా మొదట్లో రామకృష్ణ ఆధ్యాత్మికత పట్ల ఎటువంటి అనుబంధాన్ని చూపించలేదు. అతడి పట్ల కటువుగా ప్రవర్తించాడు. అతడు, రామకృష్ణ పట్ల ఆకర్షితుడవడానికి అతడి బోధనల కంటే అతడి ప్రవర్తనే ఎక్కువ కారణం. అతడి ప్రవర్తన ఒక సాధువు ప్రవర్తన లాగా ఉంటుందని భావించాడు.[20] రామకృష్ణ ఆయనను కలిసినప్పటికే కేశవ్ క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. బ్రహ్మ సమాజం నుండి విడిపోయాడు. అంతకు పూర్వమే, కేశవ్ తన కుటుంబం పాటిస్తున్న విగ్రహారాధనను తిరస్కరించాడు. కాని రామకృష్ణ ప్రభావంలోకి వచ్చాక అతను మళ్ళీ హిందూ బహుదేవతారాధనను అంగీకరించాడు. "కొత్త వ్యవస్థ" ( నవ విధాన ) అనే మత ఉద్యమాన్ని స్థాపించాడు. ఇది రామకృష్ణ చెప్పిన "దేవుడిని తల్లిగా ఆరాధించడం", "అన్ని మతాలు నిజం" [21] అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. విగ్రహారాధనను ఆయన అంగీకరించడం అతని సంస్థలో విభజనకు దారితీసింది, వర్గాలను సృష్టించింది. అతను అనేక సంవత్సరాల పాటు న్యూ డిస్పెన్సేషన్ జర్నల్‌లో రామకృష్ణ బోధలను ప్రచారం చేశాడు, [22] ఇది రామకృష్ణను విస్తృత ప్రేక్షకుల దృష్టికి - ముఖ్యంగా భద్రలోక్, భారతదేశంలో నివసిస్తున్న యూరోపియన్లు- తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.[23] [24] రామకృష్ణకు కూడా కేశవ్ పట్ల తీవ్ర గౌరవం ఉండేది. రామకృష్ణ తన మరణానికి కొంతకాలం ముందు "గులాబీ చెట్టును ఎందుకు నాటాలంటే తోటమాలి తన అందమైన గులాబీలను కోరుకుంటాడు" అని చెప్పాడు. తరువాత, "నాలో సగ భాగం కోల్పోయాను" అని అన్నాడు.[25]
వ్యక్తిగత విశేషాలు
[మార్చు]కేశవ్ చంద్ర సేన్ జగోన్మోహినిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు పది మంది పిల్లలు ఉన్నారు: ఐదుగురు కుమారులు - కరుణ చంద్ర సేన్, నిర్మల్ చంద్ర సేన్, ప్రఫుల్ల చంద్ర సేన్, సరళ్ చంద్ర సేన్, [26] డాక్టర్ సుబ్రోతో సేన్; ఐదుగురు కుమార్తెలు - సునితి దేవి (కూచ్ బెహార్ మహారాణి), సాబిత్రి దేవి, సుచారు దేవి (మయూరభంజ్ మహారాణి), మోనికా దేవి, సుజాతా దేవి. అతని మనవరాళ్ళలో ఒకరు, సరళ్ సేన్ కుమార్తె, నైనా దేవి (1917-1993) ప్రసిద్ధ శాస్త్రీయ గాయని.[27] అతని మనవళ్ళలో ఒకరైన ఎర్రోల్ చుందర్ సేన్ (c.1899 - c.1942) మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ ఫ్లయింగ్ కార్ప్స్, రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన ఒక తొలితరం భారతీయ ఏవియేటర్.
సేన్ రవీంద్రనాథ్ ఠాగూర్కు స్నేహితుడు.
మూలాలు
[మార్చు]- ↑ Carpenter, Mary Lant (1907) Life of Keshub Chunder Sen
- ↑ Sastri, p. 276
- ↑ Sastri, p. 16
- ↑ Sharma, H. D. Ram Mohun Roy – the Renaissance man. p. 26. ISBN 81-89297-70-8
- ↑ Müller, Friedrich Max (1884). Biographical Essays. C. Scribners̓ Sons. pp. 51–53.
- ↑ under the Danish Grand charter for the missionaries of Danish settlement at Serampore, lodge De L’amour Fraternelle (for Brotherly Love) whose motto then was "Fatherhood of God and Brotherhood of Man".
- ↑ "Grand Lodge of India". masonindia.org. Archived from the original on 2015-08-17. Retrieved 2020-07-02.
- ↑ Sastri, p. 114
- ↑ Müller, Friedrich Max (1884). Biographical Essays. C. Scribners̓ Sons. pp. 51–53.
- ↑ 10.0 10.1 10.2 Chisholm 1911, p. 759.
- ↑ Oman, p. 117.
- ↑ Sastri
- ↑ EB staff (6 March 2015). "Keshab Chunder Sen". Britannica Encyclopaedia.
- ↑ 14.0 14.1 EB staff 2015.
- ↑ Chisholm 1911, p. 760.
- ↑ Oman, p. 118.
- ↑ Uddin, Sufia M. (2006) Constructing Bangladesh: Religion, Ethnicity, and Language in an Islamic Nation. UNC Press. p. 85 ISBN 978-0-8078-3021-5
- ↑ Parekh, p. 69
- ↑ Parekh, p. 74
- ↑ Rolland, Romain (1929). "Ramakrishna and the Great Shepherds of India". The Life of Ramakrishna. pp. 110–130.
- ↑ Masih, Y. (2000). A Comparative Study of Religions. Motilal Banarsidass. pp. 198–199. ISBN 978-81-208-0815-7.
- ↑ Mukherjee, Jayasree (May 2004). "Sri Ramakrishna's Impact on Contemporary Indian Society". Prabuddha Bharata. Archived from the original on 24 సెప్టెంబరు 2008. Retrieved 4 September 2008.
- ↑ Muller, Max (1898). "Râmakrishna's Life". Râmakrishna his Life and Sayings. pp. 56–57.
- ↑ Debarry, William Theodore; Ainslie Thomas Embree (1988). Sources of Indian Tradition: From the Beginning to 1800. Stephen N. Hay. Columbia University Press. p. 63. ISBN 978-0-231-06415-6.
- ↑ Rolland, Romain (1929). "The River Re-Enters the Sea". The Life of Ramakrishna. p. 202.
- ↑ See the Career Section
- ↑ "A Tale Of Two Women: In search of their own songs". The Telegraph. 11 March 2012. Retrieved 6 June 2013.