చౌలము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చూడాకరణ - పుట్టు వెండ్రుకలు తీయించడం.

హిందూ మతములో గల 48 సంస్కారములలో చౌలము ఒకటి. ఇది షోడశ సంస్కారాలు లలో సప్తమ సంస్కారమును. దీనిని చూడాకరణమని కూడా అంటారు. ఇది బిడ్డకు మూడవయేడు వచ్చిన పిదప చేయుదురు. ఇందులో బిడ్డ యొక్క తలవెండ్రుకలు తీసివేయుట ప్రధాన క్రియ. శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడాకరణమొనర్చి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింపబడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట సూర్యుని ప్రార్థించుచు, "సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయుదేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము చేయుచున్నాను. నీకు ఆయుస్తేజోబలాభివృద్ధులు కలుగుగాక!" అన్న అర్థము గల మంత్రములు పఠించబడును. ఈ చూడాకరణమందు శిఖ మాత్రముంచి మిగిలిన కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా తొలగించుట వలన మనిషి బలహీనుడగును. శిఖతో పురుషునకు బలము, వీర్యము, స్థైర్యము, ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు వలన ఈ శిఖధారణము హిందువుల జాతీయ చిహ్నముగా పరిగణించబడింది. చూడాకరణము ఈ జాతీయ చిహ్నమునకు మొదటి సన్నివేశమగును.

పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=చౌలము&oldid=2328554" నుండి వెలికితీశారు