జిల్లెళ్ళమూడి అమ్మ
‘‘జిల్లెళ్ళమూడి అమ్మ" | |
---|---|
జననం | మార్చి 28, 1923 |
మరణం | జూలై 12, 1985 |
నివాస ప్రాంతం | జిల్లెళ్ళమూడి |
ఇతర పేర్లు | అనసూయ |
వృత్తి | తత్త్వవేత్త |
ప్రసిద్ధి | జిల్లెళ్ళమూడి అమ్మ |
భార్య / భర్త | నాగేశ్వర రావు |
తండ్రి | మన్నవ సీతాపతి శర్మ |
తల్లి | రంగమ్మ |
జిల్లెళ్ళమూడి "అమ్మ" (మార్చి 28, 1923 - జూలై 12, 1985) గా పేరొందిన వీరి అసలు పేరు అనసూయ.
జననం
[మార్చు]జిల్లెళ్ళమూడి అమ్మ మార్చి 28, 1923లో గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. వివాహానంతరం జిల్లెళ్ళమూడిలో స్థిరపడారు. జిల్లెళ్ళమూడి బాపట్ల నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది.
అమ్మని మీరెవరు అనిఅడిగితే "నేను అమ్మ ని మీరు నా బిడ్డలు" అనేవారు.అమ్మ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. అమ్మ, జిల్లెళ్ళమూడిలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలమీద ఉపదేశములు ఇచ్చుచుండెడివారు. భక్తులు వీరిని "అమ్మ" అని భక్తిగా పిలుస్తారు.
1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం ఎక్కడ ఉంచాలో తెలియచేశారు.అక్కడ అప్పుడే భక్తులు గుడి నిర్మాణం కొంతమేర చేపట్టారు. తరువాత 1985 లో అమ్మ నిర్యాణాంతరం పూర్తిస్థాయి గుడిని నిర్మించారు. ఆ గుడి పేరు "అనసూయేశ్వరాలయం". అమ్మ భౌతికంగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన భక్తులు అమ్మ పెళ్ళి రోజును ఘనంగా ఆ గుడిలో జరుపుకుంటున్నారు . గర్భ గుడిలో అమ్మకు పూజలు జరుగుతున్నాయ్ . అమ్మ 1985లో మరణంచిన తరువాత, అమ్మ భౌతిక కాయాన్ని, అమ్మ ఆదేశానుసారం ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఖననం చేసిన ప్రదేశంలో అమ్మ నల్ల రాతి విగ్రహం నెలకొల్పారు.
అమ్మ భర్త పేరు శ్రీ బ్రహ్మండం నాగేశ్వరరావు గారు. ఆయన తన భార్యలో ఒక దివ్య మూర్తిని చూసి, అమ్మ భక్తుడిగా మారారు. కాని, "అమ్మ" మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారు. భక్తులు, అమ్మ భర్తను "నాన్నగారు" అని పిలుచుకునేవారు. అయన, 1981లో మరణించారు.
వీరికి, ఒక కుమార్తె, పేరు హైమ. ఆమె, 1944లో జన్మించి, 1968లో మరణించారు. మొదటినుండి, "అమ్మ" తన కుమార్తె త్వరలోనే ఈ భూ ప్రపంచం వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. ఆమె తరువాత అనారోగ్యంతో మరణించారు. అమ్మ తన కూతురు మరణించినప్పుడు కన్నీరు పెట్టుకున్నారు . అమ్మ తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి, ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించారు. ఆ గుడి "హైమాలయం"గా పేరొందినది.
బాల్యం
[మార్చు]పసితనం గొల్ల నాగమ్మ పెంపకంలో గడిచింది. చిన్నప్పటి నుంచే అమ్మ అనేక మహిమలు చూపి అందరికి ఆశ్చర్యం కలిగించింది. తల్లి రంగమ్మ చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఏడవ వద్దని అమ్మ దేవుడి దగ్గరకే వెళ్లిందని ఓదార్చింది. ఒక సారి బాపట్ల భావనారాయణ స్వామి గుడికి వెడితే పూజారి గమనించకుండా గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోగా అక్కడే విచికిత్స చేసి అన్నిటికీ ఆధారం భూమి కనుక భూమి పూజ చేయాలని చెప్పింది. మర్నాడు ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ రాజ్యలక్ష్మీ అమ్మ వారుగా దర్శన మిచ్చింది. మరో సారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవటానికి ప్రయత్నిస్తే అమ్మే తీసి ఇచ్చింది. అతను ఆశ్చర్య పడి మళ్ళీ భక్తితో అమ్మ మెడకు అలంకరించి నమస్కరించి వెళ్లి పోయాడు. అమ్మ పై అందరికీ అనంత విశ్వాసం కలిగింది. ఆమెను సర్వ దేవత స్వరూపిణిగా భావించారు.
వివాహం
[మార్చు]పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావుతో 5-5-1936న బాపట్లలో వివాహం చేశారు కాపురం బాపట్లలో పెట్టారు. నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెళ్ళమూడికి ఆ దంపతులు చేరి అక్కడ కాపురమున్నారు. ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు.
సేవాకార్యక్రమాలు
[మార్చు]జిల్లెళ్ళమూడి లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి
అన్నపూర్ణాలయం
[మార్చు]జిల్లెళ్ళమూడిలో నిరంతరం అన్నదానకార్యక్రమం జరిగే ఆలయం.
1958 ఆగస్టు 15 న అమ్మ తన స్వహస్తాలతో అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. పేద, గోప్ప, కులం, మతం అనే తేడా లేకుండా ఎంత మంది వచ్చిన ఎప్పుడొచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తారు. 1958 లో అన్నపూర్ణాలయం ప్రారంభించక ముందు నుంచే అక్కడ ఈ కార్యక్రమం జరిగేది.
అందరిల్లు
[మార్చు]జిల్లెళ్లమూడి లో అమ్మ కుల మత వర్ణ వర్గ విచక్షణా భావం లేకుండా తాను నివసించే స్థలాన్ని అందరి ఇల్లు గా పేరు పెట్టింది.అమ్మ డ్రెస్సు అడ్రస్సు భేదం లేకుండా ఆకలే అర్హత గా కలిగిన వారు ఎవరైనా అందరింటిలో సమానమే అని అమ్మ చాటి చెప్పింది.
విద్యాలయాలు
[మార్చు]అమ్మ దివ్య ఆశీస్సులతో "మాతృశ్రీ విద్యా పరిషద్" 1971 ఆగస్టు 6 న జిల్లెళ్ళమూడిలో ప్రారంభమైంది. పరిషద్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం ముగ్గురు లెక్చరర్లు, 25 పిల్లలతో ప్రారంభించారు. నేడు, పరిషద్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, సంస్కృత పాఠశాలలను నడుపుతోంది.
మాతృశ్రీ మెడికల్ సెంటర్
[మార్చు]మాతృశ్రీ మెడికల్ సెంటర్ 1978 వ సంవత్సరంలో జిల్లెళ్ళమూడిలో ప్రారంభించబడింది.
ప్రముఖుల సందర్శన
[మార్చు]అమ్మను జీవితకాలంలో సందర్శించిన ప్రముఖులలో రఘువర దాసు, ఆత్మానంద స్వామి లక్ష్మణ యతీంద్రులు, నరసింహ యోగి, ప్రభాకర ఉమా మహేశ్వర పండిట్, కుర్తాలం పీఠాధిపతి శివ సదానంద భారతీస్వామి ప్రసాద రాయ కులపతి, కరుణశ్రీ, జటావల్లభుల పురుషోత్తం, జమ్మలమడక మాధవ రామ శర్మ, ఎక్కిరాల కృష్ణమాచార్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యులు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి, గుడిపాటి వెంకట చలం వంటి వారు ఆమెను దర్శించారు.
అమ్మ బోధలు
[మార్చు]- దుఃఖమే చైతన్యం
- ప్రతిరోజూ మనకు అనుభవంలోకి వచ్చే విషయం ఏమంటే, కొన్ని పనులు అనుకుని చేస్తాము, మరికొన్ని పనులు అనుకోకుండా చేస్తాము. ఇలా జరిపించే దానికి "శక్తి" అని పేరు పెడదాము..............దేవుడున్నాడా అని అనుమానం పట్టుకున్నప్పుడు, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నీ మీద నీకు నమ్మకం లేనపుడు, దేవుని మీద నమ్మకం పెంచుకో."
- మీరు గమనించే ఉంటారు, మీరెంత ఆత్మ విశ్వాసంతో పనిచేసినా, కొన్ని సార్లు ఆ పని మీరనుకున్నట్లుగా కాదు. అటువంటప్పుడు, మీ గురించి మీకు అనుమానం కలిగి, అసహాయులయి, సహాయం కొరకు, మీరు దేవుని వైపు మళ్ళుతారు. మీరు పూర్తి విశ్వాసంతో మీ పనిని, మిమ్మల్ని దేవుని వద్ద ఉంచుతారు. కాని, వేచి చూసినా, ఏమీ కాదు. అప్పుడు మళ్ళీ ఆ పనులను మీ చేతుల్లోకి తీసుకంటారు. ఈ మొత్తం చక్ర భ్రమణాన్ని, సవ్యంగా ఎందుకు అర్థం చేసుకోరు? మీలో ఉన్న అంతరాత్మ , భగవంతుడు ఒకే సూత్రానికి సంభందించిన రెండు ధ్రువాలని!!
- ఒకరోజు 60 ఏండ్ల స్త్రీ ఒకామె అమ్మ వద్దకు వచ్చి, "అమ్మా! నాకు ఏదైనా మంత్రోపదేశం చెయ్యండి, రోజూ దానిని శ్రద్ధగా చదువుకుంటాను." అని ప్రార్థించిందట. అందుకు, అమ్మ, "నాకే మంత్రమూ రాదు తల్లి, ఇంక నీకేమి బోధిస్తాను." అంటూ ఆమెను కుశల ప్రశ్నలు వేసే సందర్భంలో, "తల్లీ! నీకు కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చారా?" అని అడిగింది. అందుకు ఆమె, "వచ్చారు, అమ్మా!" అని చెప్పింది. వెంటనే జిల్లెళ్ళమూడి అమ్మ ఆమెతో ఇలా అన్నది, "కూతుళ్ళనూ, కోడళ్ళనూ ఒకే రకంగా చూసుకో! అదేవిధంగా కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే రకంగా చూసుకో! ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే. అద్వైతం అంటే కూడా ఇదే!" అని ఉపదేశించింది.
నిర్యాణం
[మార్చు]1985, జూలై 12 న అరవై మూడవ ఏట అమ్మ నిర్యాణం చెందారు
మూలాలు
[మార్చు]- https://web.archive.org/web/20080405112039/http://www.self-developmentindications.com/jillellamudiAmma1.htm
- https://web.archive.org/web/20191111050343/http://www.viswajanani.org/
- https://web.archive.org/web/20080429190146/http://www.motherofall.org/