Jump to content

స్మృతులు

వికీపీడియా నుండి

స్మృతులు అనగా ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి దొడ్డగ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పఁబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీపుంధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలుగాఁగల హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియు వచింపఁబడి ఉండును. మఱియు స్మృతులు వేదముల వలెనే గౌరవింపఁబడును. కలియుగమునకు విహితములు అగు ధర్మములు పరాశర స్మృతియందు చెప్పఁబడి ఉన్నాయి. వెండియు పురాణముల వలె స్మృతులును పదునెనిమిది. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణు స్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి అనునవి. ఇవికాక ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి అనబఁడును.

మూలం: పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wikipedia.org/w/index.php?title=స్మృతులు&oldid=3691930" నుండి వెలికితీశారు