జాబాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబాలి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో కనుపించే ఒక పాత్ర. త్రేతాయుగంలో జాబాలి లేదా జాబాలి ఋషి, అనే వ్యక్తి హిందూ మతములోని ఒక పుణ్యాత్ముడు. ఇతను నది ఒడ్డున ధ్యానంతో అనేక సంవత్సరాలు గడిపాడు. తను నివసించిన ప్రదేశానికి, తరువాత కాలములో ప్రస్తుత జబల్పూర్గా నామకరణం చేశారు. జాబాలి జబల్పూర్లో పాలరాతి శిలలు గల గుహ వద్ద తన ఆశ్రయాలలో ఒకటిగా చేసుకున్నాడు.

జననము[మార్చు]

పుణ్యాత్ములు, మహర్షుల జన్మములు చాలా విచిత్రముగా ఉంటాయి. జబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వరప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి.

విద్యాభ్యాసం[మార్చు]

జాబాలికి యుక్త వయసు రాగానే ఇతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది. కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే సంకల్పముతో అతని కుల గోత్రములు అడుగగా, అవి తనకు తెలియవనుట వలన, మీ తల్లిని అడిగి తెలుసుకుని రావలసినదని పంపుతాడు. ఆ సందర్భములో ఇంటి దగ్గర తన తల్లిని అడుగగా, తనకు భర్త లేని విషయము తెలుపుతూ, మన గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా యౌవనంలో దాసిగా అనేక చోట్ల తిరిగి పనిచేసాను. అనేక మందికి సేవలు చేసి, నిన్ను కన్నాను. కానీ నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం సత్యం. నా పేరు జాబాల. ఇంక నుండి తన (నీ) పేరు సత్యకాముడు అను జాబాలి అని చెప్పమని కుమారునితో చెప్పి గురువు దగ్గరకు తిరిగి పంపుతుంది. గురువు తన దివ్య దృష్టితో అతని జన్మకథను తెలుసుకొని గాయత్రీ మంత్ర ఉపదేశము చేస్తాడు. తదుపరి కాలములో "సత్యకామ జాబాలి" అని కూడా ప్రసిద్ధి చెందుతాడు.

గోవుల సేవ[మార్చు]

బ్రహ్మ విద్యను అభ్యసించు అర్హత సంపాదించే వరకు గురువు జాబాలిని తన గోవులను మేపుతూ ఉండమని ఆదేశిస్తాడు. గురుభక్తితో సత్య సంధుడై జాబాలి గురుగోవులను తోలుకొని వనమునకు వెళ్ళేవాడు. ఇతని గురుభక్తికి, గోపూజపరతకు దేవతలు మెచ్చుకొని ఉపకారము చేయాలని సంకల్పిస్తారు. ఒకనాడు వాయుదేవుడు ఒక వృషభములోనికి ప్రవేశించి, "నీవు సత్యనిష్టతో మమ్ములందరిని కాపాడుట వలన వేల మందిమి అయితిమి. గురుగృహమునకు మమ్మల్ని తోలుకొని వెళ్ళితే, మేము నీకు చేతనయినంతా సహాయము చేస్తాము" అని అనుట వలన జాబాలి గోవులతో గురుగృహమునకు బయలు దేరాడు. మార్గమధ్య దారిలో వృషభరూపములో ఉన్న వాయుదేవుడు జాబాలికి బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించిన ఒక దివ్యమైన మంత్రపాదము చెప్పగా, అదేవిధముగా ఇంకొక వృషభరూపములో ఉన్న అగ్నిదేవుడు నేర్పించగా, మరొక వృషభములోనికి ప్రవేశించి సూర్యదేవుడు, చివరగా " మద్గియ " అను పక్షి కూడా మంత్రపాదములు బోధించగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు.

గురుభక్తి[మార్చు]

గురువైన హరిద్రుమతుడు దివ్య తేజస్సుతో బ్రహ్మజ్ఞానము పొందిన జాబాలిని చూసి, నీవు ఇంక ఒక స్వంత ఆశ్రమము నిర్మించుకొని దివ్య జీవితము గడుపు మనగా, జాబాలి నిరాకరిస్తాడు. గురుముఖముగా బ్రహ్మజ్ఞానము పొందినదే శాశ్వతమని తలంచి, ఆ సంగతి గురువుకు తెలియజేయగా, గురుభక్తితో ఉన్న అతనికి బ్రహ్మజ్ఞానమును గురువు తన ఆశ్రమము నందే యుక్తవయసు కాలమునకు ఉపదేశించి పంపాడు.

జాబాలి తీర్థం[మార్చు]

జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతంతిరుపతి సమీపంలోని ప్రదేశానికి " జాబాలి తీర్థం " [1] అని పిలుస్తారు. జాబాలి తీర్థము. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు, వాయవ్యభాగమున ఈ తీర్థము ఉంది. అనేక మంది ప్రజలు, తమ తీవ్రమైన గ్రహా దోషాలను పరిష్కరించ బడతాయని హనుమంతుడు, వినాయకుడు విగ్రహాలను కూడా పూజించడంతో పాటుగా ఈ జాబాలి తీర్థం సందర్శించు కుంటారు.

జాబాల్యుపనిషత్తు[మార్చు]

చిత్రకూట పర్వత ప్రాంతమున జాబాలి ఒక ఆశ్రమము నిర్మించుకొని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలను ఎన్నింటినో గ్రహించాడు. పరమ పవిత్ర జ్ఞానమునకు అర్హుడు అయిన పిప్పలాద మహర్షికి, జాబాలి మహర్షి సర్వము బోధించిన బ్రహ్మజ్ఞానమే "జాబాల్యుపనిషత్తు".

"జాబాల ఉపనిషత్తు" [2] అనేది జాబాలి మహర్షి [3] బోధనము. అదేవిధముగా, ఇతని సత్యకామ జాబాలి కథ సామవేదము - చాందోగ్య ఉపనిషత్తులో [4] చిత్రీకరించబడింది.

జాబాలి గోత్రం[మార్చు]

జాబాలి గోత్రం క్లుప్తంగా దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు మధ్య ఉపయోగిస్తారు.[5]

జాబాలి నాటకం[మార్చు]

ఇదే పేరు మీద నార్ల వెంకటేశ్వర రావు ఒక నాటకం వ్రాశాడు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో కనిపించే జాబాలిని ఒక నిరీశ్వరవాదిగా చిత్రించాడాయన. జాబాలిది చాలా పిరికి పాత్ర.. వశిష్టుణ్ణి ఎదిరించే ధైర్యం లేదతనికి. రాముణ్ణి అడవికి వెళ్ళకుండా ఆపటానికి విఫల ప్రయత్నం చేస్తాడు. అంతలో వశిష్ఠుడు అక్కడికి రావటం చూసి అదంతా తను రాముడి నిశ్చయాన్ని పరీక్షించటానికే చేస్తున్నానని చెప్పి అక్కణ్ణుంచి పారిపోతాడు. రాముడితో అతని సంభాషణ ద్వారా రాజసభలో ఋషుల కుట్రలు, మోసాలు, అసూయలు బయటకు వస్తాయి.

సూచనలు[మార్చు]

  1. http://jabalitheertham.blogspot.in/
  2. http://www.dharmicscriptures.org/Jaabaali%20Upanishad.pdf
  3. http://www.celextel.org/upanishads/atharva_veda/
  4. http://vedaravindamu.wordpress.com/2011/09/23/satyakaamuni-katha-the-story-of-satyakaama-jaabaali/
  5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-03-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-12-29. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=జాబాలి&oldid=2824098" నుండి వెలికితీశారు