త్రిజట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిజట

త్రిజట, రామాయణంలో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించి, ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు శ్రీరాముడు సముద్రము దాటివచ్చినట్లు, రావణుడు యుద్ధంలో చనిపోయినట్లు కల వస్తుంది. సుందర కాండలో త్రిజట స్వప్న వృత్తాంతం గురించి ఉంది. త్రిజట విభీషణుని కూతురు అని అంటారు గాని ఇది సరి కాదని గుంటూరు శేషేంద్ర శర్మ వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా విడదీయడం వలన ఈ అర్థం వచ్చిందని అతని భావన. (త్రిజట, మరియు విభీషణుని కూతురు అని ఇద్దరిని సూచించే వాక్యంగా ఈ శ్లోక భాగాన్ని అర్థం చేసుకోవాలి - అని రచయిత భావం). విభీషణుని కూతురు పేరు "నల". త్రిజట వృద్ధురాలైన వనిత గనుక విభీషణుని కూతురు కానేరదు. వాల్మీకి రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉంది.[1]

సుందరకాండలో[మార్చు]

కామాతురుడైన రావణుడు సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయంతో, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది. సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీత వంటి పుణ్య స్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత యున్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.

"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము ద్రావుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."

ఇలా చెప్పి, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు త్రిజట హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.

యుద్ధకాండలో[మార్చు]

మళ్ళీ త్రిజట ప్రస్తావన యుద్ధకాండలో వస్తుంది. ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్ధంలో తక్కిన సేనతోపాటు రామలక్ష్మణులు వివశులయ్యారు. నిశ్చేతనంగా పడి ఉన్నారు. వారిని సంహరించేశానని ఇంద్రజిత్తు తన తండ్రి రావణునితో చెప్పాడు. అప్పుడు రావణుడు రాక్షస కాంతలను పిలిచి, సీతకు నిర్జీవులై పడియున్న రామలక్ష్మణులను చూపమని ఆదేశించాడు. అలాగయితే ఆస వదలుకొని సీత తనకు వశురాలౌతుందని రావణుని ఆలోచన. అలా రావణుని చేత పంపబడిన రాక్షసాంగనలకు నాయకురాలు త్రిజట.

వారందరూ సీతను పుష్పక విమానంపై తీసుకొని వెళ్ళి యుద్ధరంగంపైన ఆపారు. దే్హమంతా బాణాలు కప్పివేయగా నేలపైబడియున్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది-

వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక రామ లక్ష్మణులు బ్రతికే ఉన్నారని కచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన చేతులు జోడించి నీ మాటే సత్యం కావాలి అంది.

ప్రస్తావన[మార్చు]

ర|| విభీషణుని కూతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు కాలమున ఈమె సీతకు మిగుల ఊఱటమాటలు చెప్పుచు ఉండెను. ఒకప్పుడు రావణుని నాశమునకు సూచకమైన కల ఒకటి కని రాక్షసస్త్రీలు చేయు నిర్బంధములచే మిగుల ఖిన్నురాలై ఉండిన సీతకు ఆస్వప్నవృత్తాంతము చెప్పి శీఘ్రకాలములో రాముఁడు రావణుని నశింపజేసి ఆమెను తోడుకొనిపోవును అని ఈమె సమాధాన పఱచెను.

విశేషాలు[మార్చు]

గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే రహస్యమున్నది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజటా శబ్దము గాయత్రీ దేవికి చెప్పబడిన వేయి నామములలో ఒక నామము ("త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః") [1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 గుంటూరు శేషేంద్ర శర్మ రచన షోడశి - రామాయణ రహస్యములు (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితఙయన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000

వనరులు[మార్చు]

  • వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
  • శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (2003)
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిజట&oldid=2182494" నుండి వెలికితీశారు