దశరథుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దశరథుడు
Kaikeyi demands that Dasharatha banish Rama from Ayodhya
పిల్లలుRama
Bharatha
Lakshmana
Shatrughna
తండ్రిAja
తల్లిIndumati
రాజవంశంRaghuvamsha-Suryavamsha
తరువాతి వారుRama
అంతకు ముందు వారుAja
పుత్రకామేష్టి యాగానంతరం అగ్నిదేవుడు అందజేస్తున్న పాయస పాత్రను స్వీకరిస్తున్న దశరధుడు. అతని వెనుక అతని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి.

దశరథుడు రామాయణం లోని ఒక పాత్ర పేరు. శ్రీరాముని తండ్రి. ఈయన అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు చాల మంచి రాజు. రఘు వంశమునకు చెందిన వాడు. ఈయనకు ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథునికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఆయన ఋష్యశృంగుడును ౠత్విక్కుగా వరించి పుత్రకామేష్టి నిర్వహించి నలుగురు కుమారులను పొందాడు. అందులో పెద్దవాడైన రామచంద్రుడు విష్ణుమూర్తి అవతారమని పురాణాలు వివరిస్తున్నాయి. వీరికి పుట్టిన నలుగురు పుత్రులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు. కౌసల్య కుమారుడు రాముడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ శతృఘ్నులు, కైకేయి కుమారుడు భరతుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

దశరథుడు, బ్రహ్మ మానసపుత్రుడైన స్వాయంభువ మనువుకు మరో అవతారంగా భావిస్తారు.

దశరథుడు కోసల దేశపు మహారాజైన అజమహారాజు, ఇందుమతిల పుత్రుడు.[2] అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నేమి. అతని రథం పది దిశల్లోనూ చరించగల శక్తి అవడం చేత, ఈ దిశలన్నిటి లోనూ యుద్ధ చేయగల నైపుణ్యం ఉన్నందున అతనికి దశరథుడు అనే పేరు వచ్చింది.

తండ్రి మరణం తరువాత దశరథుడి కోసల రాజ్యానికి రాజయ్యాడు. అతడు చుట్టుపక్కల రాజులను ఓడించడమే కాక, అనేకమంది రాక్షసులను కూడా సంహరించాడు.

దశరథునికి రాణులు ముగ్గురు.[3] పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. కౌశల్య కుమారుడు రామచంద్రుడు. సుమిత్ర కుమారులు లక్ష్మణుడు, శత్రుఙడు. కైకేయి కుమారుడు భరతుడు. నలుగురూ అల్లారు ముద్దుగా పెంచబడ్డారు.

విశ్వామిత్రుని రాక[మార్చు]

దశరథుని రాజ్యసభలోకి ఒక రోజు విశ్వామిత్రుడు ప్రవేశించి రామచంద్రుని తన యజ్ఞరక్షకునిగా పంపమని కోరాడు. దశరథుడు ముందుగా విశ్వామిత్రుని కోరిక తీర్చగలనని మాటిచ్చి, తరువాత పుత్రుని పంపలేక మాట వెనక్కి తీసుకుంటాడు. అయినప్పటికీ వశిష్ఠాదులు హితవు చెప్పిన తరువాత, రామచంద్రుని విశ్వామిత్రునితో పంపడానికి సమ్మతిస్తాడు. రామచంద్రుని అనుసరించి లక్ష్మణుడూ విశ్వామిత్రునితో వెళతాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను ప్రేమగా చూసుకుని, వారికి గురువుగా ఉండి, రామచంద్రునికి అనేక అస్త్రాలను ప్రసాదించి, అతడిని సాటిలేని మేటి వీరునిగా తీర్చిదిద్దుతాడు. యాగరక్షణ తరువాత మిథిలా నగరానికి తీసుకువెళ్ళి శివధనుర్భంగం చేయిస్తాడు.

కుమారుల వివాహం[మార్చు]

శివధనుర్భంగం తరువాత దశరథుని సమక్షంలో నలుగురు కుమారులకు వివాహం జరుగుతుంది. నలుగురు కోడళ్ళతో దశరథుడు అయోధ్యకు చేరుకుంటాడు. కొంతకాలం సుఖంగా జీవితం సాగిన తరువాత ఒకరోజు అస్మాకత్తుగా దశరథుడు రామునికి పట్టాభిషేకమని ప్రకటిస్తాడు. ప్రజలు రాజు నిర్ణయం విని హర్షిస్తారు. అయినప్పటికీ రామచంద్రుడంటే అకారణంగా ద్వేషం పెంచుకున్న మంథర అనే కైకేయి పుట్టింటి దాసి కైకేయికి దుర్బోధలు చేసి పట్టాభిషేకం ఆగిపోయేలా చేస్తుంది.

కైకేయి వరాలు[మార్చు]

దశరథుడు ఒకసారి యుద్ధానికి వెళుతూ చిన్నభార్య కైకను వెంట తీసుకువెళతాడు. యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథునికి రక్షణ కలిగిస్తుంది. దశరథుడు కృతఙ్నతగా ఆమెను మూడు వరాలను కోరుకొమ్మని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను కోరుకుంటానని చెప్తుంది. మంథర ఆ విషయాన్ని కైకకు గుర్తుచేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు విని అలాగే చేస్తుంది.

దశరథునికి శాపం[మార్చు]

దశరథుని చేతిలో ప్రమాదవశాత్తు మరణించిన శ్రవణ కుమారుని చూసి విలపిస్తున్న అతని తల్లిదండ్రులు.

దశరథుడు ఒకసారి వేటకు వెళ్ళిన సమయంలో అనుకోకుండా శ్రవణుడు అనే ముని కుమారుని జింక అనుకుని బాణంతో కొట్టి వధిస్తాడు. గుడ్డివారైన శ్రవణుని తల్లితండ్రిలు పుత్రశోకంతో మరణిస్తూ అందుకు కారణమైన దశరథుడు కూడా పుత్రశోకంతో మరణించగలడని శపిస్తారు. దశరథుడు అప్పటికి తనకు కుమారులు కలగడం తథ్యమని అనుకుని ఆ విషయం మరచిపోతాడు. అయినప్పటికీ తన ప్రియపుత్రుడైన రామచంద్రుడు భార్య సీత, తమ్ముడు లక్ష్మణునితో అడవులకు పోయిన తరువాత రామచంద్రుని వియోగం భరించలేక మరణిస్తాడు. దశరథుడు మరణించే సమయంలో భరత శత్రుఙలు సైతం అయోధ్యలో ఉండక కేకయరాజ్యం పోయి ఉంటారు. చక్రవర్తి అయిన దశరథుని పార్థివ దేహం నలుగురు కుమారులు ఉండీ శ్రాద్ధకర్మలు వెంటనే నోచుకోక తైలంలో భద్రపరచపడడం విచారకరం. విష్ణుమూర్తి కుమారుడుగా జన్మించినా పుత్రశోకంతో మరణించడం హృదయవిదారకమనిపిస్తింది. భరతుని ద్వారా తండ్రి మరణవార్తను విన్న శ్రీరాముడు అరణ్యంలో దశరథునికి యథావిధిగా శ్రాద్దకర్మలు ఆచరిస్తాడు.

దశరథుని జీవితంలో ముఖ్య ఘట్టాలు[మార్చు]

దశరథునికి శబ్దభేది విద్య తెలుసు. శబ్దభేది అంటే శబ్దం వినిపించిన వైపుకు గురి చూసి బాణాన్ని ప్రయోగించడం. ఒకరోజు దశరథ మహారాజు వేటలో ఉండగా జింక నీళ్ళు తాగుతున్నట్లు ఒకవైపు నుంచి శబ్దం వినవచ్చింది. దశరథుడు ఆలస్యం చేయకుండా శబ్దం వచ్చిన వైపుకు బాణాన్ని వదిలాడు. కానీ ఆ బాణం దురదృష్టవశాత్తూ తన అంధ తల్లి తండ్రులకు దాహార్తిని తీర్చడానికి నీళ్ళ కోసం వచ్చిన శ్రవణ కుమారునికి తగిలి దశరథునికి తానెవరో చెప్పి అక్కడికక్కడే మరణించాడు. తన చివరి కోరికగా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని కోరాడు. శ్రవణ కుమారుని వృద్ధ తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చిన పిదప, జరిగిన ఘోరాన్ని వారికి విన్నవించాడు. పుత్రశోకం తట్టుకోలేని ఆ తండ్రి దశరథుడు కూడా ఏదో ఒక రోజు పుత్రశోకం అనుభవించక తప్పదని శపించి ఆ పుణ్య దంపతులిద్దరూ ప్రాణాలు విడిచారు. ఆ శాపం ప్రకారమే దశరథుడు తన కుమారుడు రాముడు అడవికి వెళ్ళేటపుడు పుత్రశోకం భరించలేక కన్నుమూశాడు.

మూలాలు[మార్చు]

  1. Goldman, Robert P. (1984). The Rāmāyaṇa of Vālmīki: An Epic of Ancient India. Vol. I: Bālakāṇḍa. Princeton University Press. pp. 136–161.
  2. "Schistosomiasis: Schistosoma mansoni Tf/aja Alnassir and Charles H. King", Medical Parasitology, CRC Press, pp. 140–150, 2009-11-23, doi:10.1201/9781498713672-28, ISBN 9780429089657, retrieved 2022-01-13
  3. "Valmiki Ramayana - Ayodhya Kanda - Sarga 34". Archived from the original on 2022-08-12. Retrieved 2023-02-26.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దశరథుడు&oldid=4034392" నుండి వెలికితీశారు