Jump to content

మారీచుడు

వికీపీడియా నుండి
మరీచుడు
బంగారు లేడి రూపంలోఉన్న మారీచుడి వెంటపడుతున్న రాముడు
దేవనాగరిमारीच
సంస్కృత అనువాదంMārīca
అనుబంధంరాక్షసుడు
నివాసందండకారణ్యం
తోబుట్టువులుసుబాహుడు
పాఠ్యగ్రంథాలురామాయణం
తండ్రిసుందుడు
తల్లితాటకి

మారీచుడు రామాయణంలో ఒక రాక్షసుడు. ఇతను రాముడి చేతిలో మరణించాడు. ఇతను తాటకి కొడుకు. సుబాహునికి అన్న. మిక్కిలి జిత్తుల మారి. రామాయణంలో ప్రతినాయకుడైన రావణునికి అనుయాయుడు. రావణుడు సీతను అపహరించడానికి వేసిన పన్నాగంలో ఇతను బంగారు రంగు కలిగిన లేడి రూపంలో రామలక్ష్మణులను దారి మళ్ళించడంలో ఒక ముఖ్యపాత్ర పోషించాడు. ఇతని కొడుకు కాలనేమి హనుమంతుడి చేతిలో మరణించాడు.

ఇతను తల్లి తాటకి, సోదరుడు సుబాహునితో కలిసి శాపం కారణంగా మునులను హింసిస్తూ ఉండేవారు. విశ్వామిత్రుని కోరిక మేరకు శ్రీరాముడు వీరిని ఓడించాడు. ఇతను మరొక్కసారి రాముని చంపడానికి ప్రయత్నించాడు కానీ ప్రాణం కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. చివరకు బంగారు లేడి రూపంలో రాముని చేతిలో హతమైనాడు.

పురాణ గాథ

[మార్చు]

మారీచుడు రాక్షసుడైన సుందుడు, యక్షిణి అయిన తాటకికి జన్మించిన వాడు. సుందుడు జంబ, ఝర్జల సంతానం. తాటకి యక్షరాజు సుకేతుని కుమార్తె. విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా మారీచ, సుబాహులు దానికి ఆటంకం కలిగించారు. అపుడు విశ్వామిత్రుడు అయోధ్యకు పోయి, దశరథుని అడిగి రామలక్ష్మణులను పిలుచుకొనివచ్చి తన యాగమునకు విఘ్నం కలిగించేవారిని సంహరించమన్నాడు. రాముడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించి సుబాహుని చంపి, శీతేషాస్త్రమును ప్రయోగించి మారీచుని సముద్రంలో పడేటట్లు చేశాడు. మారీచుడు రాముని పరాక్రమము తెలిసి అతని జోలికి వెళ్ళక దక్షిణసముద్రతీరమున ఆశ్రమము ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేయుచు ఉండెను. అనంతరము వనవాసము చేయవచ్చిన రాముడు దండకారణ్యమున ఉండగా, రావణుడు అతని భార్య సీతను ఎత్తుకొని పోవుటకు ఇతని సహాయము కోరాడు. అప్పుడు మారీచుడు రాముని పరాక్రమమును గురించి రావణుడికి చెప్పి ఆ పని వద్దని పలు విధాలుగా నచ్చజెప్పాడు. అయినా రావణుడు వినకపోయినందున ఎట్టకేలకు రావణుని మాటకు కట్టుబడి, తాను ఒక బంగారు జింక అయి, రాముని ఆశ్రమమునకు ఎదుట పచ్చిక మేస్తూ ఉన్నాడు. సీత దానిని చూచి దాని రూపరేఖాలావణ్యాది గుణములకు సంతోషించింది, వెంటనే రామునకు తెలిపి దానిని తనకు పట్టి ఇయ్యవలయును అని ప్రార్థించింది. రాముడు దానిని పట్టబోయి అది తనకు చిక్కక పరుగెత్తగా దానిని తఱుముకొని బహుదూరము పోయి మాయామృగము అని తెలిసికొని బాణప్రయోగము చేయగా మారీచుడు నిజరూపమును పొంది "హా ........ సీత హా ....... లక్ష్మణ" అని అఱచుచు ప్రాణములు విడిచాడు. ఆ అరుపు విని సీత దిగులుపడి రామునకు ఏమో ఆపద వాటిల్లినట్లున్నది, నీవు పోయి ఆ ఆపద తొలగించి పిలుచుకొని రమ్మని లక్ష్మణుని పంపింది. అదే సమయంలో ఒంటరిగా ఉన్న ఆమె వద్దకు రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఆమెను ఎత్తుకొని పోయాడు. ఇలా మారీచుడు రామాయణంలో మారీచుడిది ఒక ప్రధానమైన పాత్ర.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Taraka (Thataka)". Encyclopedia for Epics of Ancient India. Dowson's Classical Dictionary of Hindu Mythology. Retrieved 12 December 2012.
  2. Sehgal 1999, pp. 200–2.
  3. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic- and Puranic Literature. Delhi: Motilal Banarsidass. pp. 486–7. ISBN 0-8426-0822-2.
  4. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic- and Puranic Literature. Delhi: Motilal Banarsidass. p. 787. ISBN 0-8426-0822-2.
  5. Āi Pāṇḍuraṅgārāva (1994). Valmiki: Makers of Indian Literature. Sahitya Akademi. pp. 71–72. ISBN 978-81-7201-680-7.
"https://te.wikipedia.org/w/index.php?title=మారీచుడు&oldid=4426748" నుండి వెలికితీశారు