అంగదుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావణుని కిరీటమును తీసుకు వస్తున్న అంగదుడు.
నరాంతకుడిని చావగొడుతున్న అంగదుడు

రామాయణంలో అంగదుడు ఒక ముఖ్య పాత్ర. ఇతను వానరుడైన వాలి కుమారుడు. ఇతని తల్లి తార. వాలిని రాముడు చంపాక సుగ్రీవుడు రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. అంగద రాయబారం రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అనే రాక్షసుని చంపాడు. జగన్నాధ మహాత్మ్యం అనే కావ్యంలో శ్రీరాముని ఆజ్ఞ వల్ల అంగదుడు ద్వాపర యుగం లో కృష్ణావతార కాలంలో బోయ వాడుగా పుట్టాడు. ఇతడు వేసిన బాణం ములికి పాదం లో గుచ్చుకొని శ్రీ కృష్ణ నిర్యాణం జరిగింది. వాలిని నిష్కారణంగా చంపిన పాపం శ్రీ రాముడికి కృష్ణావతారంలో ఈ రకంగా శాపమైంది.[ఆధారం చూపాలి]

వాల్మీకి రామాయణంలో అంగదుని పాత్రను ఎంతో వీరుడు, శూరుడు, కార్య నిర్వాహకుడు, కర్తవ్య దీక్షాపరునిగా చిత్రించాడు. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాధి మహావీరుల బృందానికి అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రం నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శిస్తాడు. అది తప్పితే మిగిలిన అన్ని సందర్భాలలోను అతని రాజ భక్తి, రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు.

అంగద రాయ బారం[మార్చు]

యుద్ధానికి ముందు చివరి యత్నంగా రావణుని వద్దకు రాయబారిగా రాముడు అంగదుని పంపాడు. సీతను రామునికి అప్పగించి యుద్ధం మానుకొని తన వంశాన్ని రక్షించుకోమని అంగదుడు రావణునికి చెప్పాడు కాని రావణుడు సమ్మతించలేదు. నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకొనబోగా అంగదుడు వారిని తన బాహువులలో బిగబట్టి వారితో సహా పైకెగిరి, రావణుని సౌధాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి కపిసేన మధ్యకు వచ్చిపడ్డాడు.దీనినే అంగద రాయబారం అంటారు.

లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు. రెండవరోజు యుద్ధంలో వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానరసేనపైబడి వారిని చంపేయసాగాడు. అపుడు అంగదుడు అతనిని నిలువరించాడు. వారిద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుని తల నరికేశాడు.

కుంభకర్ణుడు యుద్ధం చేసేటపుడు వానరసేన కకావికలై పోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు కాని అంతలోనే తేరుకొని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పిపడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తరువాత త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదునిచేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తరువాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదునిచేతనే మరణించాడు. రామ రావణ సంగ్రామం లో అంగదుడు వీరోచితంగా పోరాడాడు. రావణ సేనాధి పతిని మహా కాయుడిని అంగదుడు హత మార్చాడు. సైన్యం బలహీనమై పోతుండగా రావణుడు మహా హోమం చేయటం ప్రారంభించాడు. ఇది తెలుసుకొన్న రాముడు అంగదుడు మొదలైన వారిని హోమ భంగం చేయమని పంపాడు. రావణుని అంతఃపురానికి వెళ్ళిన అంగదుడు అతిగా దుఃఖిస్తున్న రావణ పత్ని మండోదరి జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చి రావణుని ముందు పడేశాడు. విచలితుడైన రాక్షస రాజు హోమం మానేసి భార్యను రక్షించుకోవాలన్న తపనతో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణ సంహారం అయిన తర్వాతా సుగ్రీవుడు శ్రీరాముని తో అయోధ్యకు వెళ్లాడు అప్పుడు అంగదుడే కిష్కింధకు రాజైనాడు .

"https://te.wikipedia.org/w/index.php?title=అంగదుడు&oldid=3846093" నుండి వెలికితీశారు